Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎన్‌.ఐ.ఏ. వితండవాదానికి కళ్లెం

మోదీ ప్రభుత్వం బీమా కోరేగావ్‌ కేసును రాను రాను న్యాయమార్గ పాలనను తుంగలో తొక్కడానికే ఉపయోగించు కుంటున్నట్టు రుజువు అవుతోంది. 2018 నాటి బీమా కోరేగావ్‌ కేసులో అనేకమంది రచయితలను, న్యాయవాదులను, మేధావులను, పౌర హక్కుల కోసం పాటుపడే వారిని నాలుగేళ్లుగా నిర్బంధంలో ఉంచి వేధిస్తున్నారు. తాజాగా ఈ కేసులో ఆనంద్‌ తెల్తుంబ్డేకు బొంబాయి హైకోర్టు బెయిలు మంజూరు చేయడం సంతోషకరమైన అంశం. కానీ అంతకు ముందు పౌరహక్కుల కార్యకర్త గౌతం నవలఖాను జైలులో కాకుండా గృహ నిర్బంధంలో ఉంచడానికి సుప్రీం కోర్టు గత పదో తేదీననే ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ.ఏ.) అమలు చేయకుండా తాత్సారం చేసింది. సుప్రీంకోర్టు నవలఖాకు బెయిలు మంజూరు చేసినప్పుడు విధించిన అనేకానేక షరతుల్లో బొంబాయిలోనే గృహ నిర్భంధంలో ఉండాలన్న షరతు ఉంది. ఆయన ఉండడానికి ఒక చోటు చూశారు. అందులో ఆయన ఉండడానికి వీలు లేదని ఎన్‌.ఐ.ఏ. వాదించింది. సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించకుండా ఉండడానికి అనేక సాకులు చూపించింది. దాదాపు వారం రోజులు 73 ఏళ్ల నవలఖాను గృహ నిర్బంధంలోకి మార్చనేలేదు. అందువల్ల ఆయన మళ్లీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పలేదు. ఆయన అర్జీని విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కె.ఎం.జోసఫ్‌, హృషీ కేశ్‌ రాయ్‌ శుక్రవారం నాడు జాతీయ దర్యాప్తు సంస్థ నడవడికను తీవ్రంగా తప్పుబట్టారు. 24 గంటలలోగా నవలఖాను గృహ నిర్బంధంలోకి మార్చాలని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పవలసి వచ్చింది. సుప్రీంకోర్టు ఉత్తర్వును అమలు చేయకుండా ఉండడానికి ఎన్‌.ఐ.ఏ. సాకులు వెతకడం చూస్తే మోదీ ప్రభుత్వానికి న్యాయ మార్గ పాలన మీద, న్యాయ వ్యవస్థ మీద బొత్తిగా గౌరవం లేదని తేలిపోయింది. నవలఖా బొంబాయిలోనే ఉండాలి కనక ఆయనకోసం ఒక ఇల్లు చూశారు. ఆ భవనంలోనే సీపీఐ కార్యాలయం ఉన్నందువల్ల, అందులో ఒక గ్రంథాలయం ఉంది కనక, ఆ ఇంటి వంటగదికి ఉన్న తలుపు సరిగ్గా లేదు కనక, ప్రవేశ ద్వారం వద్ద సీసీ కెమెరా లేదు కనక ఆయన అక్కడ ఉండడానికి వీలు లేదని, అసలు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచవలసిన అవసరమే లేదని ఎన్‌.ఐ.ఎ. వితండవాదానికి దిగింది. ఈ కారణాలన్నీ నిజమే అనుకున్నా నవలఖా మీద ఉన్న ఆరోపణల్లో ప్రధానమైంది ఆయన మావోయిస్టు అన్నదే. ఆయన మీద ఘనత వహించిన మోదీ ప్రభుత్వం తీవ్రవాది అన్న ముద్రా వేసింది. ఆయనకోసం చూసిన ఇల్లు సీపీఐ కార్యాలయం అయితే కావచ్చు. కానీ తుషార్‌ మెహతా లాంటి ‘‘న్యాయకోవిదుడి’’కి మావోయిస్టుల మీద సీపీఐ వైఖరి ఏమిటో బొత్తిగా తెలిసినట్టు లేదు. నవలఖా మావోయిస్టు అయినా కాకపోయినా సీపీఐకి చెందిన వారు మాత్రం కాదు. మహా అయితే ఆయన వామపక్ష వాది అయి ఉంటారు. రాజకీయాల దగ్గరికి వస్తే మావోయిస్టులను సీపీఐ సమర్థించిన సందర్భమే లేదు. ఈ మాత్రం కూడా తుషార్‌ మెహతా లాంటి ‘‘ఉద్దండుల’’కు ఎందుకు అర్థం కాదో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తమ ఉత్తర్వును అమలు చేయడానికి ఇష్టం లేని ఎన్‌.ఐ.ఎ. ఆంతర్యం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సవ్యంగానే గ్రహించారు కనక ఎన్‌.ఐ.ఏ. పని తీరును తూర్పారబట్టారు. ఈ వ్యవహారం అంతా చూస్తే కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యం చట్టబద్ధంగా వ్యవహరించడానికి ఇవ్వదు అని రుజువు అయి పోయింది. వయసు మళ్లిన నవలఖా తప్పించుకు పోకుండా చూడవలసిన బాధ్యత పోలీసులదే. ఎన్‌.ఐ.ఏ. సాకులన్నీ విన్న సుప్రీం కోర్టు 73 ఏళ్ల వ్యక్తి పారిపోకుండా చూడలేరా అని నిలదీసింది. ఇది అమిత్‌ షా నాయకత్వంలో పని చేసే ఎన్‌.ఐ.ఏ.కే తలవంపులు మాత్రమే కాదు. ఇందులో కేంద్ర హోం శాఖను నిర్వహిస్తున్న అమిత్‌ షా కక్ష సాధింపు ధోరణి ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎన్‌.ఐ.ఏ. నేరుగా ఆయన పర్యవేక్షణలోనే ఉంటుంది.
ఈ కేసులో సుప్రీంకోర్టు సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను నిలదీసిన తీరు న్యాయవ్యవస్థ ఇంకా మోదీకి సంపూర్ణంగా దాసోహం కాలేదన్న భరోసా కలుగుతోంది. ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులు ఇవ్వడానికి ఒకరితో ఒకరు పోటీ పడ్తున్న న్యాయమూర్తులు ఉన్న దశలో న్యాయమూర్తులు జోసఫ్‌, హృషీ కేశ్‌ రాయ్‌ ఎన్‌.ఐ.ఏ. ధోరణిని ఎండగట్టడం భవిష్యత్తు మీద ఆశలు పూర్తిగా ఆవిరి కాలేదన్న నమ్మకం కలుగుతోంది. నవలఖా ఉండడానికి ఏర్పాటు అయిన చోట సీపీఐ కార్యాలయం ఉందన్న సోలిసిటర్‌ జనరల్‌ వాదన ఎంత అసంబంద్ధమైందో చెప్పడానికి న్యాయమూర్తులు సీపీఐ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదా అని నిలదీయవలసి వచ్చింది. ఎన్‌.ఐ.ఏ. వితండవాదం అక్కడితో ఆగలేదు. నవలఖా ఆరోగ్యం గురించి ఇచ్చిన వైద్యుల నివేదిక పక్షపాతంతో కూడుకున్నదని ఎన్‌.ఐ.ఏ. తరఫున వాదిస్తున్న సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా విచిత్రమైన అభ్యంతరం లేవదీశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వునే ఖాతరు చేయకూడదన్న దృఢ సంకల్పంతో ఉన్న మోదీ ప్రభుత్వం వైద్య నివేదికను తప్పుపట్టడంలో వింతేమి ఉంది? అన్నింటికన్నా మించి నవలఖాను గృహ నిర్బంధంలో ఉంచాలన్న ఉత్తర్వును రద్దు చేయాలని ఎన్‌.ఐ.ఏ. సాక్షాత్తు సుప్రీంకోర్టునే కోరడం మోదీ ప్రభుత్వం చట్టాన్ని వికృతీకరించడానికి ఏ స్థాయికి దిగజారగలదో స్పష్టం అవుతోంది. భీమా కోరేగావ్‌ కేసులో ప్రభుత్వం కక్ష సాధించినట్టు వ్యవహరిస్తోందన్న వాస్తవం సుప్రీంకోర్టుకు ఇప్పటికే అనేక సార్లు అర్థమైంది. ఎన్‌.ఐ.ఏ. అధికారులు లేదా వారి వెనక ఉన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని కొందరి వ్యవహార సరళినీ సుప్రీంకోర్టు గ్రహించకపోలేదు. భీమా కోరేగావ్‌ కేసులో ఇప్పటికే సుధా భరద్వాజ్‌, వరవర రావు, ఆనంద్‌ తెల్తుంబ్డేకు బెయిలు మంజూరు అయింది. కానీ ఈ కేసులో అనేకమందిని అరెస్టు చేసి నాలుగేళ్లు దాటినా విచారణ ఎందుకు ప్రారంభం కావడం లేదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం నిరాశనే మిగులుస్తోంది. నిర్బంధమే పెద్ద శిక్షగా మారుతున్న దశలో సుప్రీంకోర్టు ఈ ప్రశ్న అడిగితే న్యాయమార్గ పాలనకు అత్యున్నత న్యాయస్థానం అపారమైన విలువ ఇచ్చినట్టు అయ్యేది. మోదీ ప్రభుత్వానికి మానవహక్కుల మీద ఎలాంటి గౌరవమూ లేదు. ఎవరి మీద అయినా ముందూ వెనక ఆలోచించకుండా మావోయిస్టూలు, అర్బన్‌ నక్సలైట్లు అన్న ముద్ర వేయడానికి లేశ మాత్రం కూడా ఈ ప్రభుత్వం ఆలోచించదు. మావోయిస్టుల కార్యకలాపాల మీద నిషేధం ఉంటే ఉండొచ్చు. ఒక ఆలోచనా ధోరణిని ప్రభుత్వాలు ఎలా నిరోధించగలవు? వక్ర మార్గంలో గల ఆలోచనా ధోరణులను నియంత్రించడానికి మోదీ ప్రభుత్వం పన్నుతున్న ఉచ్చులను సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకోవడం పౌర హక్కులకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తాయి. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు పట్టించుకోవలసిన అగత్యం ఉందన్నది నిరాకరించదగినంత చిన్న విషయం కాదు. ప్రభుత్వాలు న్యాయమార్గ పాలనను ఖాతరు చేయనప్పుడు నిలదీయడం సుప్రీంకోర్టు బాధ్యత.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img