Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఒకడుగు ముందుకేసిన ప్రతిపక్ష పార్టీలు

ఇటీవల నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికలు జరిగాయి. బెంగాల్‌ లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న బీజేపీ ప్రయత్నం బెడిసికొట్టడంతో మోదీని ఓడిరచగలమన్న ధీమా ప్రతిపక్షాలలో కనిపిస్తోంది. బెంగాల్‌ లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ను ఎలాగైనా ఓడిరచాలని మోదీ, అమిత్‌ షా చేసిన సాము గరిడీలన్నీ పిల్లి మొగ్గలుగా మిగిలిపోయాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో అధికారం దక్కుతుందన్న ఆశ బీజేపీకి ఎటూ లేదు. కానీ బెంగాల్‌ లో మమతను ఓడిరచడానికి మోదీ, అమిత్‌ షా ద్వయం పన్నని కుట్ర లేదు. వేయని ఎత్తు లేదు. చేయని దుష్ప్రచారమూ లేదు. తిరగని ఊరూ లేదు. చివరకు వీరికి మిగిలింది బొప్పికట్టిన తల మాత్రమే. బెంగాల్‌ లో బీజేపీ కసిపూనినట్టు ప్రవర్తించడం సామాన్య ప్రజలకు కూడా రోత పుట్టించింది. తృణమూల్‌ వరసగా మూడవ సారి కూడా విజయ ఢంకా మోగిస్తుందని, కేరళలో రెండవ సారి గెలిచి వామపక్ష ఫ్రంట్‌ నూతన చరిత్ర లిఖిస్తుందని అందరూ ముందే ఊహించారు. ఈ విజయాలు ప్రతిపక్షాలలో నూతనోత్సాహం నింపాయి. మోదీని ఓడిరచడం అసాధ్యం కాదన్న ధైర్యాన్ని నింపాయి. బెంగాల్‌ లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్‌ కిశోర్‌ ఆ తరవాత కొద్ది రోజులకే నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ను ఒకటికి రెండు సార్లు కలవడం, ఆ తరవాత పవార్‌ తదితరులు ప్రతిపక్షాల సమావేశాలు ఏర్పాటు చేయడం ప్రతిపక్షాల ఐక్యత దిశగా తొలి అడుగులు వేయడానికి తోడ్పడిరది. ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షా కాల సమావేశాలు సజావుగా జరగకపోవడానికి ప్రతిపక్షాల నిరసనలే కారణం కాదు. ప్రధానంగా అధికార పక్షం మొండి వైఖరి దృష్ట్యా సభ సవ్యంగా జరగనే లేదు. రోజూ రభసే. వాయిదాల మీద వాయిదాలే. కానీ ప్రతిపక్షాలు లేని అవకాశాన్ని తీసుకుని, ఎవరైనా ఉంటే వారిని సస్పెండ్‌ చేసి అధికార పక్షం చర్చల బాదరబందీ లేకుండా 30బిల్లులను ఆమోదింప చేసుకుంది. మరో పక్క వర్షాకాల సమావేశాలు ఫలవంతంగా జరగకపోయినప్పటికీ ఈ సమావేశాల కాలంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకులు తరచుగా సమావేశమై సమన్వయంతో పని చేశారు. పెగాసస్‌ వ్యవహారం, వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, ముండుతున్న ధరలతో పాటు ప్రజా సమస్యలేవీ అధికార పక్షం చర్చకు రానివ్వలేదు. పార్లమెంటులో తమకున్న మెజారిటీ ఆసరాగా పార్లమెంటరీ సంప్రదాయాలతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా అధికార పక్షం వ్యవహరించడం ప్రతిపక్షాలనే కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఊహతెలియంగల ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇవన్నీ ప్రతిపక్షాల ఐక్యత ఆవశ్యకతను పదే పదే గుర్తు చేశాయి. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకపోవడానికి ప్రతిపక్షాలే విలన్‌ పాత్ర పోషించాయని అధికార పక్షం చేసిన ప్రచారం కూడా ప్రతిపక్షాలను ఆలోచనలో పడవేసింది.
ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాల ఐక్యత కోసం అనేక వైపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మమతా బెనర్జీ, శరద్‌ పవార్‌ లాంటి వారు ప్రతిపక్షాలను ఏక తాటిమీదకు తీసుకోచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్ని పాట్లు పడ్డా ఉన్నంతలో అతి పెద్ద ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ పాత్ర లేకుండా ప్రతిపక్ష ఐక్యత నిష్ప్రయోజనకరమే అవుతుందని ప్రతిపక్ష పార్టీలన్నీ గుర్తించాయి. కాంగ్రెస్‌ కు పార్లమెంటులో ఉన్న బలం తక్కువే అయినప్పటికీ అన్ని రాష్ట్రాలలో అస్తిత్వం ఉన్న పార్టీ అదొక్కటే. అందువల్ల కాంగ్రెస్‌ లేని ప్రతిపక్ష ఐక్యతవల్ల ఫలితం ఉండదు. ప్రాంతీయ పార్టీల మీద, కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన పార్టీల విషయంలో కాంగ్రెస్‌ ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలని చూస్తుంది. అసలు కాంగ్రెస్‌లోనే నికరమైన నాయకులెవరూ లేకపోవడం కాంగ్రెస్‌ కు కూడా సమస్యే. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ శుక్రవారం ఆన్‌ లైన్లో ప్రతిపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు జరగడానికి రెండున్నరేళ్ల వ్యవధి ఉంది. కానీ ఈ లోగా మోదీ ప్రజా వ్యతిరేక పాలనను నిలవరించవలసిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది. సోనీయా గాంధీ ఈ వాస్తవాన్ని గుర్తించినట్టున్నారు. ఇటీవల జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశాలకు హాజరు కాని కాంగ్రెస్‌ ఇప్పుడు తానే ముందుకొచ్చి సమావేశం ఏర్పాటు చేసింది. 19 పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ తమ చుట్టే మూగాలన్న ధోరణిని కాంగ్రెస్‌ ఈ సారి ప్రదర్శించకపోవడం సానుకూల పరిణామం. మమతా బెనర్జీ, ఎం.కె.స్టాలిన్‌, శరద్‌ పవార్‌, శరద్‌ యాదవ్‌, సీతారాం ఏచూరి, డి.రాజా, ఉద్ధవ్‌ ఠాక్రే, తేజస్వీ యాదవ్‌ లాంటి వారందరూ హాజరు కావడం విశేషం. బి.ఎస్‌.పి. హాజరు కాలేదు. సమాజ్‌ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ కారణాంతరాల వల్ల రాలేదు. ఆం ఆద్మీ పార్టీని, శిరోమణి అకాలీ దళ్‌ ను ఆహ్వానించలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షానికి సన్నిహితంగా మెదలుతున్న బిజూ జనతా దళ్‌, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితి హాజరు కాలేదు. అయితే ఇటీవలి పార్లమెంటు సమావేశాలలో కీలకమైన అంశాలపై కేంద్రం చర్చకు నిరాకరించడం ఈ పార్టీలకు కూడా మింగుడు పడలేదు. మోదీ పలుకుబడి మసకబారుతోందన్న వార్తలు వస్తున్నాయి. ప్రజలలోనూ వ్యతిరేకత పెరుగుతోంది. కానీ 2024 ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని బీజేపీని ఓడిరచే మంత్ర దండం ఏమీ ఉండదు. ప్రతిపక్షాలకు సంకల్పబలం, ప్రజా సమస్యల మీద ఉమ్మడి స్పందనకు పరిమితం కాకుండా ఐక్య కార్యాచరణ అత్యవసరం. శుక్రవారం నాటి సమావేశంలో ఉమ్మడిగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం మంచి పరిణామమే. మోదీ విచ్ఛిన్నకర పాలనకు వ్యతిరేకంగా జనసమీకరణ ద్వారానే ప్రతిపక్షాలు ముందడుగు వేయగలవు. మోదీని ఓడిరచాలనో, ఎలాగైనా అధికారం సంపాదించలనో ఎంత బలమైన కోరిక ఉన్నా ఒరిగేదేమీ ఉండదు. మోదీని సవాలు చేయాలంటే ప్రజాస్వామ్యం, సెక్యులరిజం మీద విశ్వాసం ఉన్న పార్టీలన్నీ ఏకం కావాలి. ఉమ్మడి ప్రతిపక్షానికి నాయకులెవరు అన్న చర్చ ప్రస్తుతానికి అనవసరం. అధికార పక్షం ఓడిపోయినప్పుడల్లా ప్రత్యామ్నాయ నాయకుడు సిద్ధంగా ఉండనవసరం లేదు. విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ నాయకత్వంలో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం, దేవెగౌడ నాయకత్వంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడడం చూస్తే పరిస్థితులనుబట్టి నాయకులు ఎదిగి వస్తారని రుజువు అవుతోంది. ఆ మాటకొస్తే జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ముందు మొరార్జీ ప్రధాని అభ్యర్థి ఏమీ కాదు. వివిధ పార్టీల మధ్య విభేదాలు ఉండవచ్చు. కొన్ని రాష్ట్రాలలో మైత్రి, మరి కొన్ని రాష్ట్రాలలో వైరం కూడా ఉండవచ్చు. కానీ ప్రధాన లక్ష్యం మోదీ దుష్పరిపాలనను నిలవరించడం, ఆ తరవాత 2024లో గద్దె దించడం అన్నవే ప్రతిపక్షాల లక్ష్యం కావాలి. ఇది ప్రతిపక్షాల అవసరం కాదు. జాతి జనుల అవసరం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img