Friday, April 19, 2024
Friday, April 19, 2024

కన్వర్‌ యాత్రకు అనుమతిపై సుప్రీం సీరియస్‌

తీవ్రమైన ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ మంత్రులు రాజీనామా చేసిన కాలం వెళ్లిపోయింది. ప్రజలను గురించి పట్టించుకోకుండా తమ అజెండాలను అమలు జరుపుతూ నిరంకుశంగా వ్యవహరించే పాలకులు ఇప్పుడున్నారు. ప్రపంచాన్ని, ముఖ్యంగా మనదేశాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి కొనసాగుతున్న సందర్భంలోనూ ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో ఉంచి ప్రజా సమూహాలు చేరే యాత్రలకు అనుమతించడం ద్వారా మహమ్మారి విస్తరణకు దోహదం చేస్తున్న పాలకులకు అంకుశం కావలసిందే. సుప్రీంకోర్టు గడచిన రెండు నెలల కాలంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగిస్తోంది. ప్రధాన న్యాయమూర్తిగా ఎన్‌వి రమణ సర్వోన్నత న్యాయస్థానంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా ప్రజానుకూల నిర్ణయాలు వెలువడి ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం కన్వర్‌ యాత్రకు అనుమతించడాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుంది. దీనిపై వివరణను కోరుతూ జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను ఆదేశించింది. బుధవారం ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం శుక్రవారం ఉదయానికి అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోరింది. భారత ప్రభుత్వ కార్యదర్శి, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రధాన కార్యదర్శులు అఫిడవిట్లు సుప్రీంకు సమర్పించాలి. ధర్మాసనం కన్వర్‌ యాత్ర అంశాన్ని పత్రికల ద్వారా తెలుసుకొని తీవ్రంగా స్పందించడం శుభపరిణామం. కరోనా మహమ్మారి విజృంభించి జనజీవితాలను అల్లకల్లోలం చేసిన స్థితిలో యాత్రల పేరిట ఎన్నికల్లో ప్రయోజనం పొందే ఉద్దేశం దాగి ఉంది. కోర్టు ప్రజా క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని స్పందించింది. కోర్టులు జోక్యం చేసుకొని ప్రభుత్వాలను దారికి తీసుకురావలసిన పరిస్థితులు నెలకొన్నాయి.
కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి యోగి అనుసరించిన విధానాలపైన దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. బాధితులకు చికిత్స అందించడంలో, టీకా పంపిణీ విషయంలో వివక్ష పాటించారన్న బలమైన ఆరోపణలున్నాయి. హరిద్వార వద్ద కుంభమేళాకు సర్వ ఏర్పాట్లు చేసింది యోగి ప్రభుత్వమే. 40 లక్షల మంది గంగానదిలో స్నానాలకు వస్తారనుకుంటే కోటి 20 లక్షల మంది వచ్చారని అంచనా వేశారు. ఈ ప్రాంతంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‌ కేసులు వేలాదిగా నమోదయ్యాయి. స్నానాలు ముగించుకొని ఇతర ప్రాంతాలకు చేరుకున్న సాధువులు, సంతుల ద్వారా మహమ్మారి విస్తరించింది. దీనిపైన పాలకులకు ఎలాంటి విచారం లేదు. ఇంతమంది జనాభా ఒక చోటకు చేరకుండా చర్యలు తీసుకోవాలన్న స్పృహ కూడా లేదు. ఎన్నికల ప్రచార సభలనూ అట్టహాసంగా నిర్వహించారు. కన్వర్‌ యాత్రలోనూ దేశం నలుమూలల నుండి కొన్ని పదుల వేల మంది శివభక్తులు పాల్గొని హరిద్వారకు వెళ్లి అక్కడ గంగనీళ్ళను తీసుకొంటారు. ఈ నీటిని ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలతో పాటు దేశంలోని శివాలయాల ప్రాంతాల్లో చల్లుతారు. పవిత్ర గంగ నీరంటూ ప్రచారం చేసుకొనే యోచన దీని వెనుక ఉంటుంది. లక్షల మంది కుంభమేళాకు ఒకచోట చేరి అమాయకులకు చేటు కలిగించిన విషయాన్ని పాలకులు ఎందుకు పట్టించుకోరు? ఉత్తరప్రదేశ్‌లో మరో ఎనిమిది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి వీలైన అన్ని మార్గాలను అనుసరించాలన్న యోగి వ్యూహంలో భాగమే ఈ చర్య.
ఇటీవలనే ఛార్‌ధామ్‌ యాత్రకు అనుమతించిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా కన్వర్‌ యాత్రకు అనుమతించి రాష్ట్ర హైకోర్టు జోక్యంతో యాత్రను రద్దు చేసింది. యాత్ర ఈ నెల 25 నుంచి ప్రారంభం కావలసి ఉంది. కరోనా మహమ్మారి వల్ల గత ఏడాది కన్వర్‌ యాత్ర జరగలేదు. కుంభమేళాకు ముందు ఉత్తరాఖండ్‌లో 1863 ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న తీవ్రమైన కేసులుండగా కుంభమేళా తర్వాత క్రమంగా పెరుగుతూ, ఇప్పటికి 49,492కు చేరుకున్నాయి. కన్వర్‌ యాత్ర సైతం కుంభమేళా లాంటిదే. రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకొని కన్వర్‌ యాత్రను రద్దు చేయగా ప్రభుత్వం గతవారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎట్టకేలకు ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు పనిచేశాయి. యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండురోజుల క్రితమే కరోనా మూడవ దశను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరోధించాలని, ప్రజలు కరోనా విధి విధానాలను పాటించాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. మోదీ హెచ్చరికలు తమకు కాదని భావించారేమో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ప్రజలకు చెప్పేందుకే నీతులు తాము పాటించడానికి కాదని పాలకులు భావిస్తారు. కుంభమేళా సమయంలో ఆరోగ్య నిపుణులు, వైద్య నిపుణులు, మేధావులు చేసిన హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో జరగరాని నష్టం జరిగింది. అప్పుడు కూడా కరోనా నిబంధనలు తప్పనిసరిగా అమలు చేస్తామని ప్రకటనలు చేశారు. యాత్రను రద్దు చేస్తూ విశ్వాసాల ఆధారిత రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తింటాయన్నదే పాలకుల ఆలోచన. ఇలాంటి చర్యలు కులాలు, మతాల మధ్య విభజనకు దారితీస్తాయి.
రాజకీయ సమీకరణలు కూడా మతాలు, కులాల ఆధారంగా జరుగుతాయి. ఉత్తరప్రదేశ్‌లో గాఢంగా మెజారిటీ ప్రజల అనుకూల వాతావరణాన్ని ఇప్పటికే సృష్టించారు. సంకుచిత ప్రయోజనాలకు ప్రజల ప్రాణాలు బలిపెట్టడం దుర్మార్గమే. సంకుచిత భావజాలాన్ని వదిలిపెట్టి బహుళ సమాజం వర్ధిల్లే చోట ప్రజలందరికీ తాము పాలకులమన్న విశ్వాసం కల్పించాలి. సంకుచిత ప్రయోజనాలతో కరోనాలాంటి మహమ్మారులను నియంత్రించడం కష్టమవు తుంది. ఈ సత్యాన్ని నేటి పాలకులు గ్రహించాలి. ఈ అధికారం శాశ్వతమని భ్రమపడే నిరంకుశ పాలకులెందరో కాలగర్భంలో కలిసి పోయారు. ఇప్పటికైనా పాలకులు తమ విధానాలను మార్చుకోవాలి. దేశద్రోహ చట్టం బ్రిటీషు వలస పాలకులు దేశభక్తులపై ప్రయోగించారని 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఈ దుర్మార్గచట్టం ఎందుకని సుప్రీంకోర్టు తాజాగా ప్రశ్నించడం ప్రజలు హర్షించవలసిన అంశం. మతాధారిత వైరస్‌ను మట్టుపెట్టవలసిందీ ప్రజలే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img