Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కరోనాకన్నా రాహులే ఎక్కువ ప్రమాదకారి?!

సెప్టెంబర్‌ ఏడున కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఇంతవరకు తొమ్మిది రాష్ట్రాల గుండా సాగింది. వీటిలో బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలూ ఉన్నాయి. భారత్‌ జోడో యాత్ర ఏ రాష్ట్రంలో సాగినా ఆ రాష్ట్ర వ్యవహారాలను ప్రస్తావించడంతో పాటు మోదీ హయాంలో బీజేపీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర, విద్వేష పూరిత అంశాలనే రాహుల్‌ ప్రస్తావిస్తూ వచ్చారు. ఆయా రాష్ట్రాల నాయకుల నుంచి రాహుల్‌ కు ప్రశంసలూ వచ్చాయి. కొన్ని చోట్ల విమర్శలూ ఎదురయ్యాయి. మహారాష్ట్రలో ఈ యాత్ర సాగినప్పుడు రాహుల్‌ వీర సావర్కర్‌ను ప్రస్తావించడం సంఫ్‌ు పరివార్‌ వారికి అభ్యంతరకరమైంది. ఇది సహజమే. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలగుండా యాత్ర సాగినప్పుడు అక్కడి అవినీతి ప్రస్తావనకు వచ్చింది. ఒక రకంగా ఆయన సైద్ధాంతిక పోరాటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్‌ రాజకీయాలకు మూల ధాతువు అయిన సెక్యులరిజం పరిరక్షణనే ఆయన ఎక్కువగా ప్రస్తావించారు. ఈ యాత్ర దిల్లీ పొరుగు రాష్ట్రంలోకి ప్రవేశించేదాకా మోదీ ప్రభుత్వం ఈ యాత్రను పెద్దగా పట్టించుకోలేదు. అయితే అడపాదడపా బీజేపీ నాయకులు చౌకబారు విమర్శలు చేశారు. రాహుల్‌ టీ షర్ట్‌ 30-40 వేలు ఉంటుందని విమర్శించారు. కానీ మోదీ వేసుకునే ఒక సూటు ఖరీదు పది లక్షల రూపాయలని వీరికి తట్టనే లేదు. అద్దాలమేడలో కూర్చుని రాళ్లు విసరడం అంటే ఇదే. కాంగ్రెస్‌తో సంబంధం లేని అనేకమంది, సామాజిక కార్యకర్తలు ఎక్కడికక్కడ ఈ యాత్రలో భాగస్వాములు కావడం బీజేపీకి కంటగింపైంది. గుజరాత్‌ అభివృద్ధికి అడ్డుతగిలిన మేధాపాట్కర్‌తో కలిసి నడుస్తారా అని సాక్షాత్తు ప్రధానమంత్రే నిలదీశారు. ఈ మాట అన్నప్పుడు మోదీ నోట మంత్రంలా వినిపించే పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యలాంటి మాటలు ఎందుకు గుర్తు రాలేదో! నిజానికి భారత్‌ జోడో యాత్ర ప్రభావం రాజకీయాలకు అతీతంగా చూడగలిగితే నేరుగా కేంద్ర ప్రభుత్వం చెప్పడానికి ఏమీఉండదు. కానీ ఈ యాత్ర శనివారం(డిసెంబర్‌ 24) దిల్లీలో ప్రవేశించనుండడం బీజేపీ వెన్నులో ఒణుకు పుట్టిస్తోంది. రాహుల్‌ యాత్రకు జనంనుంచి స్పందన ఉంది కానీ గోదీమీడియా పెద్దగా పట్టించుకోనేలేదు. యాత్ర దిల్లీ చేరినప్పుడు మాత్రం జాతీయమీడియా పట్టించుకోకుండా ఉండలేదు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులూ దిల్లీలోనే ఉంటారు. వారు మోదీకి అనుకూలురు కావచ్చు, వ్యతిరేకులూ కావచ్చు. కచ్చితంగా గోదీ మీడియాలో భాగం అయితే కాదు. రాహుల్‌యాత్ర దిల్లీలో ప్రవేశించక ముందే ఆపేయాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుంది. దీనికోసం కొత్తగా విజృంభిస్తున్న కరోనాను సాకుగా చూపిస్తున్నారు. చైనా, బ్రెజిల్‌, కొరియా, అమెరికా, జపాన్‌ లాంటి దేశాలలో ఈ విడత కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మనదేశంలో అంత పెద్ద ప్రమాదం ఏమీలేదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధినేత అధర్‌ పూనావాలా, ఇతర నిపుణులు అంటున్నారు. మోదీ ప్రభుత్వం అసలు దృష్టి యాత్రను ఎలా ఆపాలన్నదే కనక కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌ సుఖ్‌ మాండవియా రాహుల్‌ గాంధీకి ఓ లేఖ రాశారు. దేశ శ్రేయస్సు దృష్ట్యా ఈ యాత్రను నిలిపివేయాలని కోరారు. ఇది పైకి కోరికలాగే ఉన్నా ఆదేశ స్వరమే వినిపిస్తోంది. కొత్తగా వ్యాపిస్తుందంటున్న కరోనా గురించి మాట్లాడవలసిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి నోరే మెదపలేదు. ఇదివరకు రెండు మూడు విడతల్లో కరోనా ఎదురైనప్పుడు సూచనలు, సలహాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించ వలసిన నియమాలు అన్నీ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి నోటంటే వినే వాళ్లం. యాత్ర నిలిపివేయాలని మాండవియా రాహుల్‌కు లేఖ రాసే నాటికి తాజా విడత కరోనా భయంకరమైన స్థితిలో ఏమీ లేదు. కరోనాను కేంద్రం ఒక సాకుగా తీసుకుంది అంతే.
సైద్ధాంతికపోరాటంలో భాగంగా రాహుల్‌ సెక్యులరిజానికి కలుగుతున్న విఘాతం, రాజ్యాంగాన్ని విరూపం చేస్తున్న తీరును దుయ్య బట్టడం మోదీ సర్కారు గుండెల్లో గునపాలతో గుచ్చినట్టు అవుతోంది. రాహుల్‌ యాత్ర ప్రస్తుతం హర్యాణాలో ఉంది. కరోనా నిబంధనలను పాటించకపోతే ప్రమాదం అంటున్నారు మాండవీయ. ఈ ప్రమాదం కేవలం భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటున్న వారి నుంచే ఉందా? కేవలం మూడుడోసులు టీకాలు తీయించుకున్న వారినే ఈ యాత్రలో అనుమతించాలని, యాత్రలో మొదటినుంచి పాల్గొంటున్న 120 మంది ఒకే చోట బస చేయకూడదని అంటున్నారు. మరి రాహుల్‌కు లేఖ రాసే సమయానికన్నా ముందో లేదా అదే సమయంలోనూ రాష్ట్రాలన్నింటినీ ఎందుకు హెచ్చరించలేదు. ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఏం చేస్తున్నట్టు? ఆయన రాష్ట్రాలకు లేఖ రాశారు కానీ పాటించవలసిన నిబంధనల ప్రస్తావనే లేదు. అలాంటప్పుడు నిబంధనలు భారత్‌ జోడోయాత్రకు మాత్రమే వర్తింపచేయడంలో ఆంతర్యం సులభంగానే అర్థమవుతోంది. పార్లమెంటు సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి. ఇందులోనూ కోవిడ్‌ జాగ్రత్తలు పాటించనేలేదు. పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో ఆ ఆవరణలో సభ్యులు, వారి మంది, మార్బలం, సిబ్బంది, భద్రతా దళాలు, సందర్శకులు కలిసి కనీసం పదివేలమంది సంచరిస్తుంటారు. మరి అప్పుడు నిబంధనలు ఎందుకు గుర్తు రాలేదో! నిజానికి ఈ నిబంధనలను తొలగించి ఏడాది దాటింది. భారత్‌ జోడో యాత్ర దిల్లీ పొలిమేరల్లో ఉన్నప్పుడే ఇవన్నీ మోదీ సర్కారుకు గుర్తొచ్చాయి. ఇటీవలే హిమాచల్‌ ముఖ్యమంత్రి అయిన సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు హిమాచల్‌ ప్రదేశ్‌లో భారత్‌ జోడొ యాత్రలో పాల్గొన్నందువల్లే ఆయనకు కరోనా సోకిందని మాండవీయ వింత తర్కానికి దిగారు. కొత్త కరోనా అంటున్న బి.ఎఫ్‌`7 ఆనవాళ్లు జులై, సెప్టెంబర్‌, నవంబర్‌ నెలల్లో గుజరాత్‌, ఒరిస్సా రాష్ట్రాలలో కనిపించాయి. పంజాబ్‌, దిల్లీ ముఖ్య మంత్రులు తాజా పరిస్థితిని సమీక్షించిన తరవాత ప్రధానమంత్రి మోదీ నింపాదిగా గురువారం సమీక్ష మొదలుపెట్టారు. గుజరాత్‌ శాసనసభ ఎన్నికలకుముందే ఈ ఛాయలుకనిపిస్తే మోదీ గుజరాత్‌ ఎన్నికలప్రచారంలో దాదాపు 15 రోజులు తలమునకలైనప్పుడు ఒక్క రోజూ కోవిడ్‌ నిబంధనలు పాటించనే లేదుగా. బెంగాల్‌ శాసనసభ ఎన్నికలు జరిగిన సందర్భంలో కరోనాభయం పీడిస్తూనే ఉన్నా మోదీ, షా తామే విధించిన నిబంధనలను తుంగలోతొక్కి భారీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు గదా. ఆ సమయంలో రాహుల్‌గాంధీ స్వచ్ఛందంగా ర్యాలీలు ఉపసంహరించు కున్నారు. బిహార్‌లో ప్రశాంత్‌ భూషణ్‌ పాద యాత్రలకు, రాజస్థాన్‌, కర్నాటకలో బీజేపీ తలపెట్టిన ఆక్రోశ్‌యాత్రలకు కరోనా దూరంగాఉంటుందా? మోదీని కరోనాకన్నా రాహుల్‌భయంఎక్కువగా పీడిస్తున్నట్టుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img