Friday, April 19, 2024
Friday, April 19, 2024

కర్తవ్య పథం

‘‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి

‘‘నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు.’’ ఇది గీతాకారుడు శ్రీ కృష్ణ పర మాత్మ అర్జునిడికి చేసిన హితబోధ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రకమైన హిత బోధే చేస్తున్నారు. ప్రభుత్వం తన కర్త వ్యాన్ని నిర్వహించడంలో విఫలమైనప్పుడు ప్రజలకు తమ కర్తవ్యాలను బాధ్యతలను గుర్తు చేయడం మామూలే. అధికారంలో ఉన్న వారు తమ నిష్క్రియాపరత్వాన్ని గంప కింద కమ్మేయడానికి ఉన్న మార్గం ఇదొక్కటే కదా! గురువారం దిల్లీలోని రాజ్‌పథ్‌ పేరు రేపటి నుంచి కర్తవ్యపథంగా మోదీ మార్చేయబోతున్నారు. పేర్లు మార్చడంలో మోదీని మించినవారు ఎవరూ ఉండరు. దీన్ని గంభీరంగా చెప్పాలంటే నవ నామ్నీకరణం అనొచ్చు. ప్రస్తుతం రాజ్‌పథ్‌ అంటున్నది బ్రిటిష్‌ హయాంలో కింగ్స్‌ వేగా ఉండేది. ఆ సమీపంలో ఇంతకు ముందు క్వీన్స్‌ వే అని పిలిచే రోడ్డు పేరు స్వాతంత్య్రా నంతరం జనపథ్‌గా మారిపోయింది. సార్వభౌమాధికారం ప్రజలదే అని సూచించడానికి ఆ రెండు రోడ్ల పేర్లూ మార్చారు. ప్రజలకు సార్వభౌమాధికారం ఉంటుందని, ఉండాలని మోదీ అనుకోరు కనక రాజ్‌పథ్‌ పేరును కర్తవ్య పథ్‌గా మారుస్తున్నారు. ఈ పని చేయడానికి ముందు మోదీ శంఖంలో పోశారు. దిల్లీ మునిసిపల్‌ కౌన్సిల్‌ చేతా పేరు మార్పు కోసం ఓ తీర్మానం చేయిస్తున్నారు. ఈ మునిసిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికైంది కాదు. దాన్నిండా బీజేపీ వారే ఉన్నారు. ఆ సమావేశం బుధవారమే జరిగింది. రాజ్‌పథ్‌ పేరు కర్తవ్య పథ్‌గా మార్చడంలో ఆంతర్యం హక్కుల కన్నా బాధ్యతలే ముఖ్యం అని చెప్పడం. పేర్ల మార్పుతో తంతు ముగియదు. అక్కడ సంప్రోక్షణ (శుద్ధి చేయడం) కూడా ఉంటుంది. ఇందులో భాగంగా ఐస్‌క్రీంలు అమ్ముకునే లాంటి వారిని అక్కడికి రానివ్వరు. ఆ ప్రాంతాన్ని సరదా పర్యటనలకు కూడా వినియోగించుకోనివ్వరు. మోదీ ప్రభుత్వ పనితీరు వల్ల ఇది ఆశ్చర్యకరమైంది కూడా కాదు.
వీధుల పేర్లు మార్చడం లాంటి వాటి వెనక ఓ దురుద్దేశం కూడా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కులు ఉంటాయనుకుంటాం కనక ప్రజలు అవి సాధించుకోవడానికి పోరాడడం సహజం. ఈ హక్కుల్లో చాలా భాగం రాజ్యాంగం పూచీ పడ్డవే. ఆ హక్కు లేకుండా చేయడమే అసలు ఆంతర్యం. అందుకే బాధ్యతలను గుర్తు చేస్తున్నారు. పౌరులకున్న హక్కులను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అన్న అంశాన్ని మోదీ సర్కారు ఎటూ ఖాతరు చేయదు. ఆ హక్కులను పరిరక్షించాలన్న ఉద్దేశం, చిత్తశుద్ధి బొత్తిగా లేదు. మోదీ వ్యవహార సరళిని బట్టి చూస్తే 2014కు పూర్వం అంతా శూన్యమే. అసలు చరిత్ర తన పాలనతోనే ప్రారంభమైందని మోదీ జనాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ప్రజల హక్కుల కన్నా బాధ్యతల మీదే ఎక్కువ ఊనిక ఉండడంవల్ల ప్రభుత్వ బాధ్యతను విడనాడి ఆ భారం ప్రజల మీదే మోపాలన్న ప్రయత్నం సాగుతోంది. ఇదంతా వలసవాద పాలన చరిత్రను తుడిచి పెట్టడానికే కనక ఇది మంచి పనేగా అని వాదించే వారు అసలు లక్ష్యాన్ని పరిగణించరు. వీధుల పేర్లు మార్చే క్రమం నిజానికి 2016 లోనే మొదలైంది. ప్రధాన మంత్రి నివాసం ఉండే వీధి పేరు రేస్‌కోర్స్‌ రోడ్‌. కానీ దాన్ని లోకనాయక్‌ మార్గ్‌గా మార్చేశారు. బ్రిటిష్‌ పరిపాలనలో దిల్లీ రేస్‌కోర్సు అక్కడ ఉండేది కనక దానికి రేస్‌కోర్స్‌ రోడ్‌ అన్న పేరు వచ్చింది. దిల్లీ రేస్‌కోర్స్‌ క్లబ్‌ 1940లో ఏర్పడినప్పటి నుంచే అది రేస్‌కోర్స్‌ రోడ్‌ అయింది. వీధుల పేర్లు ముఖ్యంగా ప్రధాన మంత్రి నివాసం ఉండే వీధి పేరు మన సంస్కృతికి అనుకూలంగా ఉండాలని బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖీ దిల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ఒక లేఖ రాశారు. ఆమె సూచించిన కొద్ది రోజులకే రేస్‌కోర్స్‌ రోడ్‌ కాస్తా లోక్‌నాయక్‌ మార్గ్‌ అయిపోయింది. ఈ ఏడాది జనవరి 23న నేతాజీ సుభాశ్‌చంద్రబోస్‌ 125వ జన్మ దినం సందర్భంగా మోదీ ఇండియా గేట్‌ వద్ద బోస్‌ విగ్రహాన్ని ఆవిష్క రించారు. ఆ సమయంలో మోదీ మాట్లాడుతూ స్వాతంత్య్రం తరవాత జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని అన్నారు. పైగా దీనికి మును పటి ప్రభుత్వాల మీద విమర్శలు ఎక్కుపెట్టడానికి ‘‘అనేక మంది గొప్ప నాయకుల పేర్లు విస్మ రించారు’’ అన్న ఆరోపణ విసిరారు. దానితో పాటు జాతి వారసత్వాన్నీ, సంస్కృతిని తెరమరుగు చేశారని మోదీ అంటున్నారు. సుభాశ్‌చంద్రబోస్‌ రాసిన పుస్తకంలో చేసిన సూచన ఆధారంగా 2018 డిసెంబర్‌లో అండమాన్‌ నికోబార్‌లో మూడు దీవుల పేర్లు మార్చేశారు. అండమాన్‌ ద్వీపానికి షహీద్‌ ద్వీపం అనీ, నికోబార్‌ దీవులకు స్వరాజ్‌ ద్వీపం అన్న పేర్లు పెట్టాలని సుభాష్‌బోస్‌ 1943లో సూచించారు. ఆయన చేసిన సూచనను అమలు చేయ డానికి రాస్‌ ఐలాండ్‌ను సుభాష్‌బోస్‌ ద్వీపం అంటున్నారు. హావ్లాక్‌ ద్వీపాన్ని స్వరాజ్‌ ద్వీపం అంటున్నారు. పేర్ల మార్పు ప్రక్రియ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. అప్పుడు ఇర్విన్‌ ఆసుపత్రి ఇప్పుడు జై ప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రిగా వెల్లింగ్డన్‌ ఆసుపత్రి రాం మనోహర్‌ లోహియా ఆసుపత్రిగా మారిపోయాయి. జనతా పార్టీ ఏలుబడిలోనే రౌజ్‌ అవెన్యూ కాస్త దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌గా మారిపోయింది. ఉపా ధ్యాయ భారతీయ జనసంఫ్‌ు సిద్ధాంత కర్త. జనతా పార్టీలో ఆ సమ యంలో జనసంఫ్‌ు కూడా భాగస్వామి. ప్రస్తుతం ఎదురు లేకుండా ఉన్న బీజేపీ పేర్లు మార్చేటప్పుడు ఏ మాత్రం వెనకా ముందు ఆలోచించడం లేదు. మోదీ ఇజ్రాయిల్‌ పర్యటన సందర్భంగా దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ తీన్‌మూర్తి మార్గ్‌, తీన్‌మూర్తి చౌక్‌ పేరు మార్చి ఇజ్రాయిల్‌లోని హైఫా నగరం పేరును ఆ మార్గాలకు పెట్టేసింది. డల్హౌసీ రోడ్‌ దారా షికో రోడ్‌గా అవతార మెత్తింది. దారా షికో షాజహాన్‌ పెద్ద కొడుకు. దారా షికో అంటే సంఫ్‌ు పరివార్‌ వారికి చాలా ప్రీతిపాత్రమైంది. చరిత్ర లేని వారు పేర్లు మార్చి కొత్త చరిత్ర సృష్టించి సంతృప్తిపడుతూ ఉంటారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత కూడా పేర్లు మారినవి ఉన్నాయి. గాంధీజిని హతమార్చింది అల్బుఖరెఖ్‌ రోడ్‌ మీద కనక అది తీస్‌ జనవరి మార్గగా మారింది. 1960 లు, 1970లలో బ్రిటిష్‌ పాలన జ్ఞాపకాలను తుడిచేయడానికి అనేక పేర్లు మార్చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img