Friday, April 26, 2024
Friday, April 26, 2024

కాళ్లీడుస్తున్న అదానీ కంపెనీలు

అదానీ వ్యాపార లొసుగులు బయటపడ్డ తరవాత ప్రధానమంత్రి మోదీ విచారణకు ఆదేశించకుండా మొండికేసి తన సన్నిహిత మిత్రుడిని కాపాడడానికి సకల ప్రయత్నాలూ చేస్తూ ఉండొచ్చు. హిండెన్‌బర్గ్‌ అదానీ మోసాలను బయట పెట్టిన తరవాత ఆయన ఆస్తులు సగం కరిగిపోయాయి. ఆయన కంపెనీల షేర్ల ధరలు రోజు రోజుకూ పతనమవు తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రేటింగ్‌ కంపెనీలు అదానీ సామ్రాజ్యానికి గతంలో ఉన్న రేటింగులను గణనీయంగా తగ్గించి వేశాయి. పార్లమెంటులో ప్రతిపక్షాలు అదానీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని ఎంత గగ్గోలు పెట్టినా మోదీ పెదవి విప్పకపోయి ఉండొచ్చు. కాలమే ఈ వివాదాన్ని మరుగున పరుస్తుందని ఆయన ఆశ కావచ్చు. కానీ హిండెన్‌బర్గ్‌ 106 పేజీల నివేదిక విడుదల చేసి అదానీ వ్యాపార సామ్రాజ్యం డొల్లతనాన్ని బైటపెట్టిన తరవాత వ్యాపారం నడపాల్సింది అదానీనే. ఆయన ప్రతిష్ఠ భారీగా పడిపోయిన నేపథ్యంలో ఆయన అధీనంలోని అన్ని కంపెనీలూ కాళ్లీడుస్తున్నాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, బంగ్లాదేశ్‌లో నిర్మించ తలపెట్టిన విద్యుత్‌ కేంద్రం, చత్తీస్‌గఢ్‌ లోని డి.బి.పవర్‌, రోడ్ల నిర్మాణ పథకాలూ అన్నీ మందగించాయి. స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ అనే రేటింగ్‌ సంస్థ అదానీ ట్రాన్స్‌మిషన్‌ మీద కన్నేసి ఉంచింది. అదానీ వ్యాపార సరళిమీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినందువల్ల, దాని నిర్వహణ తీరువల్ల నిధులు సమకూర్చేవారు, వ్యాపార భాగస్వాములు వెనుకడుగువేసే అవకాశం ఉందని స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ తేల్చింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌ ఆర్థిక పరిస్థితి, నిర్వహణ ప్రమాదకరస్థాయికి చేరాయని స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌ భావిస్తోంది. ఈ సంస్థ అదానీ సామ్రాజ్యం పర్యావరణ, సామాజిక, నిర్వహణపై చేస్తున్న అధ్యయనం వచ్చేనెల పూర్తి కావచ్చు. అదానీ మీద వెల్లువెత్తిన ఆరోపణలు నిధులు సమకూర్చే వారిని బెదరగొడ్తున్నాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ మీద పూర్తి ఆధిపత్యం ఆయన కుటుంబానిదే. 75శాతం వాటా ఆ కుటుంబానిదే. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 2023 ఆర్థిక సంవత్సరంలో 18,795 సర్క్యూట్‌ కిలోమీటర్ల విద్యుత్‌ సరఫరా నిర్వహిస్తోంది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ కూడా తమ గ్రూపుకు చెందని కంపెనీలకు రుణాలు ఇవ్వగూడదని నిర్ణయించింది. ఈ సంస్థ గత సంవత్సరం రూ. 12,687 కోట్ల మేర రుణాలిచ్చింది. రుణాలు ఇవ్వడానికి బదులు తమకున్న రూ. 44,000 కోట్ల అప్పులు తీర్చేస్తే మేలు అని అదానీ భావిస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థల మధ్య డిపాజిట్లు ఉండవని ఏ కంపెనీకి రుణాలు ఇవ్వబోమని అదానీ పోర్ట్స్‌ ప్రధాన కార్య నిర్వహణాధికారి కరణ్‌ అదానీ గత ఏడోతేదీన చెప్పారు. గౌతం అదానీ పెద్ద కొడుకే కరణ్‌ అదానీ. అదానీ పోర్ట్స్‌ లో 65.13శాతం వాటా ఆ కుటుంబానిదే. దీనిలో 13 శాతం వాటాలు తాకట్టులో ఉన్నాయి. డిసెంబర్‌ ఆఖరు నాటికి అదానీ పోర్ట్స్‌ విభాగం ఇతర కంపెనీలకు దాదాపు రూ.1,000కోట్ల అప్పులిచ్చింది. ఈ కంపెనీ నగదు బాగా సంపాదిస్తోంది కనక ఆ మొత్తాన్ని అప్పులు తీర్చడానికి వినియోగిస్తామని అదానీ సంస్థల అధికార ప్రతినిధి చెప్పారు.
బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ సరఫరా ఒప్పందం కూడా రద్దయ్యే సూచనలున్నాయి. ఈ ఒప్పందం కుదరడానికీ బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా మీద మోదీ ఒత్తిడి చేయడమే కారణం అంటారు. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని బంగ్లాదేశ్‌ ఆలోచిస్తోంది. జార్ఖండ్‌లో అదానీ విద్యుత్‌ పథకంలో ఉత్పత్తిఅయ్యే విద్యుత్తు బంగ్లాదేశ్‌కు సరఫరా చేయాలనుకున్నారు. ఈ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై బంగ్లాదేశ్‌లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమైనాయి. ఈ ఒప్పందం ఏకపక్షమైంది, బంగ్లాదేశ్‌ ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్న అనుమానాలున్నాయి. బంగ్లాదేశ్‌లో విద్యుత్‌ సరఫరా చేసే వారికి చెల్లించే మొత్తం కన్నా అదానీకి రెట్టింపు రేటు చెల్లించడానికి అంగీకరించడం హసీనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. బంగ్లా దేశ్‌కు, అదానీకి మధ్య విద్యుత్‌ సరఫరా కోసం కుదిరిన ఒప్పందమే చట్టరీత్యా చెల్లదన్న వాదనా ఉంది. మన దేశంలో ఉన్న నియమాల ప్రకారం మన దగ్గర థర్మల్‌ విద్యుత్తు మన అవసరాలకన్నా మించి ఉంటేనే ఎగుమతి చేయాలి. కానీ భారత్‌లో విద్యుదుత్పాదనలో మిగులు ఏమీలేదు. అందుకని నిబంధనలను ఉల్లంఘించి జార్ఖండ్‌ ప్రభుత్వం ఒప్పందానికి సహకరించడం చట్టవిరుద్ధమే అవుతుంది. మనదేశం నుంచి విద్యుత్తు దిగుమతి చేసుకోవాలంటే బంగ్లాదేశ్‌ విద్యుత్‌ సంస్థ ఎక్సైజ్‌ సుంకం, కస్టమ్స్‌ సుంకం, సేవా పన్ను, కృషి కల్యాణ్‌ పన్ను, కేంద్ర అమ్మకం పన్ను, పరికరాల మీద విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) ఇలా అనేక ఇతర పన్నులు చెల్లించాలి. కానీ అదానీతో బంగ్లాదేశ్‌ ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందే మన దేశంలో వస్తు, సేవల పన్ను అమలులోకి వచ్చింది. అయినా ఈ పన్నులు చెల్లించడానికి అయ్యే ఖర్చంతటినీ బంగ్లాదేశ్‌ మీద రుద్దాలని అదానీ ప్రయత్నిస్తున్నారు. అందువల్ల కూడా ఇది చట్ట విరుద్ధంకనక బంగ్లాదేశ్‌ అసలు విద్యుత్‌దిగుమతి ఒప్పందమే రద్దు చేసుకోవచ్చు. దీనికితోడు బంగ్లాదేశ్‌ తో అదానీ ఒప్పందం కుదిరిన పదిహేను నెలలకు అంటే 2019లో గొడ్డా విద్యుత్‌ కేంద్రాన్ని సెజ్‌ కింద ప్రకటించి అనేక పన్ను రాయితీలు ఇచ్చారు. అయినా ఆ ఖర్చులనూ అదానీ బంగ్లాదేశ్‌ నెత్తిన వేయాలని చూస్తున్నారు. చత్తీస్‌గఢ్‌ లోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం డి.బి.పవర్‌ ను గత సంవత్సరం అదానీ రూ.7,017 కోట్లకు కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఈ ఒప్పందం గడువు నాలుగోసారి పెంచినా అదీ ముగిసింది.
మార్కెట్‌ పరిస్థితి ఎగుడుదిగుడుగాఉంది కనక కొత్త ఒప్పందాలేమీ చేసుకోమని అదానీ సామ్రాజ్యం ప్రకటించింది. అంటే డి.బి. విద్యుత్‌ పథకం కూడా అటకెక్కినట్టే. రహదార్ల నిర్మాణ లక్ష్యాలను కూడా అదానీ చేరుకోలేక పోతున్నారు. 12 వేల కిలోమీటర్ల రహదార్లు నిర్మించాలని లక్ష్యం నిర్దేశించారు. కానీ అది ఈ ఆర్థిక సంవత్సరంలో పదివేల కిలో మీటర్లకు కూడా చేరేట్టులేదు. జనవరి ఆఖరునాటికి 6,803 కిలోమీటర్ల రహదారి మాత్రమే నిర్మించగలిగారు. ఎంత వేగంగా పని చేసినా 2023 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మహా అయితే 9,000 కిలోమీటర్ల రహదారి నిర్మిస్తే అదేగొప్ప. దీన్నిబట్టి హిండెన్‌బర్గ్‌ బైటపెట్టిన అంశాల్లో పసఉన్నట్టేగా. దర్యాప్తు జరిపించే దమ్మే మోదీకి లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img