Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కుంగదీస్తున్న ప్రైవేటీకరణ

దాదాపు రెండు శతాబ్దాలపాటు బ్రిటిష్‌ వలసవాదులు మన ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన తరవాత 1947లో స్వాతంత్య్రం వచ్చినా దేశ పునర్నిర్మాణం చిక్కుముడిగానే ఉండిపోయింది. అప్ప టికి అంతర్జాతీయంగా రెండు ప్రధానమైన వ్యవస్థలు ఉన్నాయి. ఒక వేపు సోవియట్‌ యూనియన్‌ నాయకత్వంలోని సోషలిస్టు వ్యవస్థ. మరో వేపు బ్రిటన్‌, అమెరికా తదితర పశ్చిమ దేశాలు అనుసరి స్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ. నెహ్రూకు సోషలిజం మీద అభిమానం ఉన్న మాట ఎంత నిజమైనా సోషలిస్టు విధానాలను అనుసరించే వెసులుబాటు ఆ నాటికి లేదు. పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిద్దా మన్నా అప్పటికి మన ప్రైవేటు రంగం ఇప్పుడు ఉన్నంత పటిష్ఠంగా లేదు. దేశ పునర్నిర్మాణ ఆశయం నెరవేరాలంటే భారీ స్థాయిలో పారిశ్రామికీకరణే శరణ్యం అన్న వాస్తవం నెహ్రూకు తెలుసు. కానీ ఈ భారాన్ని మోయడానికి ప్రైవేటు రంగానికి అంత శక్తి లేదు. అందువల్ల నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అన్న కొత్త సూత్రాన్ని ఆవిష్కరించారు. ఈ విధానం ప్రకారం భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం నిర్వహించాలనీ, అనువైన చోట ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని అనుకున్నారు. చాలాకాలం పాటు ఈ విధానం క్రమంగా మన ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఉపకరించింది. భారీ పరిశ్రమల ఏర్పాటువల్ల, ప్రధానంగా వ్యావసాయిక దేశం అయినందువల్ల భారీ నీటిపారుదల ప్రాజె క్టులు చేపట్టినందువల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. 2008లో ప్రపంచ మంతటా ఆర్థిక మాంద్యం తాండవిస్తున్న దశలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం మన ఆర్థిక వ్యవస్థ పునాదులు పదిలంగానే ఉన్నాయి కనక భయపడాల్సిన అవసరం లేదు అని భరోసా ఇచ్చారు. అది ఆచ రణలో నిజమేనని తేలింది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయినా మనం నిలబడగలిగాం. అప్పుడు ఆదుకున్నది ప్రభుత్వ రంగమే. సరిగ్గా 53 ఏళ్ల కిందట 1969 జులై 19న 14 బ్యాంకుల జాతీయకరణకు ఆర్డినెన్సు జారీ చేశారు. 1969కన్నా ముందూ తక్కువ స్థాయిలో బ్యాంకుల జాతీయ కరణ జరగకపోలేదు. స్వాతంత్య్రం తరవాత రిజర్వు బ్యాంకును జాతీయం చేశారు. 1955లో ఇంపీరియల్‌ బ్యాంకుని జాతీయం చేశారు. అదే ప్రస్తుతం ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. 1980లో మరో ఆరు బ్యాంకు లను జాతీయం చేశారు. బ్యాంకుల్లో ఉండే డబ్బు ఎప్పుడైనా సామాన్యులది, దేశవాసులదే. అయినా ఆ నిలవలు సామాన్య జనానికి ఉపయోగపడక పోవడం వల్ల బ్యాంకులను జాతీయం చేయవలసి వచ్చింది. వికలాంగు లకూ ఉపాధి అవకాశాలు వచ్చాయి. లాభాల వేటలో మాత్రమే నిమగ్నమై ఉండే ప్రైవేటు రంగం తరతరాలుగా వెనుకబడి ఉన్న వర్గాలకు, దివ్యాంగు లకు ఉద్యోగాలివ్వడానికి ఇష్టపడదు. ప్రభుత్వ రంగానికి ప్రోత్సాహం, బ్యాంకుల జాతీయకరణవల్ల ఇది సాధ్యమైంది. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసినప్పుడు సమర్థించిన వారు ఉన్నట్టే కొన్ని ప్రతిపక్షాలు, న్యాయవ్యవస్థ దీన్ని వ్యతిరేకించాయి. 1970 ఫిబ్రవరిలో 11 మంది న్యాయ మూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచిలో 10 మంది బ్యాంకుల జాతీయ కరణ చెల్లదని తీర్పు చెప్పారు. కానీ ఇందిరాగాంధీ మరో ఆర్డినెన్సు తేవడంతో పాటు 1970 మార్చిలో బ్యాంకింగ్‌ సంస్థల బిల్లు ఆమోదింప చేశారు. మూడేళ్ల కిందట బ్యాంకుల జాతీయకరణ స్వర్ణోత్సవ సంవత్సరంలో 2019-20 ఆర్థిక సర్వేలో గ్రామీణ బ్యాంకులు పది రెట్లు పెరిగాయని, 1969తో పోలిస్తే 1980 నాటికి గ్రామీణ ప్రాంతాలవారికి రుణ సదు పాయం రూ. 115 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లకు పెరిగినట్టు తేలింది. అదే సమయంలో వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం 40 రెట్లు పెరిగిందని మోదీ ప్రభుత్వం తయారు చేసిన ఆర్థిక సర్వేలోనే పేర్కొన్నారు. దీనికి మరో పార్శ్వమూ ఉంది. 2019 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోయిన నిరర్థక ఆస్తులు (అప్పు తీసుకుని చెల్లించని మొత్తం) రూ. 7.4 లక్షల కోట్లకు చేరుకున్నాయి. నిరర్థక ఆస్తులకు కారణం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న సామాన్య ప్రజలు కాదు. వారు చెల్లించని మొత్తం నామమాత్రమైందే. బడా పారిశ్రామికవేత్తలే ఉద్దేశ పూర్వకంగానే తీసుకున్న అప్పులు ఎగవేశారు.
1991లో ఏర్పడిన ఆర్థిక సంకటంవల్ల ప్రభుత్వ రంగాన్ని ప్రక్షాళన చేసి పరిస్థితిని చక్కదిద్దడానికి బదులు ప్రైవేటీకరణకు ఊతం ఇచ్చారు. దీనితో 1991-92లో మొత్తం బ్యాంకుల ఆస్తులలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 88.5 శాతం అయితే ప్రైవేటు రంగ బ్యాంకుల వాటా కేవలం 4.2 శాతమే. కానీ 2020-21 నాటికి ప్రైవేటీకరణ మంత్ర జపంవల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆస్తులు 50.8 శాతానికి పడిపోయాయి. ప్రైవేటు రంగ బ్యాంకు ల వాటా 32.8 శాతానికి పెరిగింది. 1991నాటి నూతన ఆర్థిక విధానాలు ప్రభుత్వ రంగాన్ని కుంచింప చేయడానికి తోడ్పడ్డాయి. వాజపేయి హయాంలో అయితే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహ రించడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు. ‘‘ప్రభుత్వం వ్యాపారం చేయవలసిన అగత్యం లేదు’’ అని ఆనాడు వాజపేయి అన్న మాట ప్రస్తుతం మోదీ సర్కారుకు తారకమంత్రమైంది. ప్రభుత్వం వ్యాపారం చేయనక్కర్లేని మాట నిజమే కావొచ్చు. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద పేదరికం, అసమానతలు, సామాజిక వివక్ష తగ్గించే బాధ్యతÑ అవ కాశాలు లేని వారిని ఆదుకునే బాధ్యత కూడా ఉంటుంది. ప్రజా సంక్షేమా నికి ప్రభుత్వం పూచీ పడాల్సిందే. ఇదివరకు జాతీయం చేసిన బ్యాంకులను, ప్రభుత్వ అధీనంలోని జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలను ప్రైవేటీకరిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బాహాటంగానే చెప్తున్నారు. పీవీ నరసింహా రావు ఏలుబడిలో మొదలైన ఈ పెడధోరణికి ఆర్థిక సంస్కరణలన్న ముద్దు పేరు పెట్టారు. అంటే మౌలికమైన పరి భాషకే పెడార్థాలు ఆపాదించారు. ఈ క్రమంలో బ్యాంకులను ప్రైవేటీకరించడమే కాదు మొత్తం ప్రభుత్వ రంగాన్నే ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్నారు. దీనితో సంపద కొద్దిమంది చేతిలో పోగుపడ్తోంది. ప్రైవేటు రంగం ప్రతిభ అన్న మిషతో షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ జాతుల, ఇతర వెనుకబడిన తరగతుల, ఇతర మైనారిటీవర్గాల, దివ్యాంగుల సంక్షే మాన్ని పట్టించుకోదు. ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తూ, ఉద్యోగాలు ఊడుతున్న దశలో ప్రైవేటీకరణకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రైవేటీకరణ విరాట్రూపం ధరించే కొద్దీ సమానత్వం, అవకాశాలు లేనివారిని ఆదు కోవడం, దివ్యాంగులకు ఉపాధి కల్పించడం తెరమరుగు అవుతోంది. ఒకప్పుడు బాగా విస్తరించిన గ్రామీణ బ్యాంకులు ఇప్పుడు కనుమరుగైనాయి. 2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తరవాత మోదీ ప్రభుత్వం ఒట్టి పోతున్న ప్రభుత్వ ఖజానాను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నింపుకోవాలను కుంటోంది. ఇప్పుడు వినిపిస్తున్న కొత్తమాట ప్రభుత్వ రంగ సంస్థలను నగదు రూపంలోకి మార్చడం. ఇది దొడ్డి దారిన ప్రైవేటీకరణే. ప్రభుత్వ రంగాన్ని సంరక్షించుకోవడానికి సిబ్బంది చేసే ప్రయత్నాలు మీడియాలో అరుదుగా కూడా ప్రస్తావనకు రావు. ఉద్యోగుల తొలగింపు ముమ్మరమైంది. ప్రభుత్వ రంగ బ్యాంకులలో లక్షమంది ఉద్యోగాలు కోల్పోయారు. మోదీ ఏలుబడిలో అమ్మేయడమే తప్ప ఒక్క ప్రభుత్వ రంగ సంస్థనూ నెలకొల్పలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img