Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కూలుతున్న అదానీ పేక మేడ

స్టాక్‌ మార్కెటే ఒక మాయ. అందులో అదానీ లాంటి మహా మాయగాళ్లు ఎన్ని కుప్పిగంతులైనా వేయగలరు. కానీ అడుగులేని ముంతలు ఎల్లకాలం నిలబడడం అసాధ్యం అన్న అంశం అదానీ విషయంలో రుజువైంది. అదానీ అధీనంలోని కంపెనీల బండారాన్ని అమెరికాలోని హిండెన్‌బర్గ్‌ పరిశోధనా సంస్థ ఇటీవలే బయటపెట్టింది. అదానీ కంపెనీల వాటాల ధరలను 85శాతం దాకా ఎక్కువచేసి చూపిస్తున్నారని ఈ పరిశోధక సంస్థ తేల్చేసిన తరవాత అదానీ కంపెనీల వాటాల పతనం ప్రారంభమైంది. ఆయన కంపెనీల వాటాల ధరలు శుక్రవారం 20శాతం దాకా పడిపోయాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌షేర్ల ధరలు 19.65శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌ వాటాల ధరలు 19శాతం, అదానీ గ్రీన్‌ఎనర్జీ వాటాలు 15.50శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వాటాల ధరలు 6.19శాతం తగ్గిపోయాయి. అదానీ రేవుల కంపెనీ, ప్రత్యేక ఆర్థిక మండళ్ల విభాగం వాటాల ధరలుకూడా గణనీయంగా తగ్గాయి. అదానీ పవర్‌ వాటాలు 4.99శాతం తగ్గాయి. అన్ని కీలకమైన రంగాలు మోదీ దయవల్ల అదానీ గుప్పెట్లో ఉన్నాయి. రేవులు, ఖనిజాల తవ్వకం, విమానయానం మొదలైన సకల రంగాలలో అదానీ గాలే వీస్తోంది. అదానీ అధీనంలోని ఏ కంపెనీల వాటాలు కుప్పకూలుతున్నాయన్న అంశంతో సంబంధం లేకుండా, దేశంలోకెల్లా కుబేరుడు అనుకుంటున్న ఆసామీ కాళ్లకింద నేలజారిపోవడం భారత ఆర్థికవ్యవస్థకే విఘాతం కలిగించే ప్రమాదం పొంచిఉంది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తరవాత గుజరాత్‌కు చెందిన అదానీ సకల వ్యాపార, పారిశ్రామిక రంగాలపై ఆధిపత్యం సంపాదించారు. అతి కొద్ది కాలంలోనే దేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేశ్‌ అంబానీ సంపదను తలదన్నే స్థితికి అదానీ చేరుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ గబగబా అనేక మెట్లు ఎక్కేశారు. హిండెన్‌బర్గ్‌ పరిశోధనా సంస్థ వెల్లడిరచిన అంశాలలో నిజం ఎంతో తెలియదు కానీ, ఆ నివేదిక మాత్రం అదానీ వ్యాపార సామ్రాజ్యానికి శరాఘాతం అయింది. అదానీ కంపెనీలు బలహీన పడడంతో బొంబాయి స్టాక్‌ఎక్స్‌చేంజిలో అగ్రగామి 30వాటాలు 1.84శాతం లేదా 1,106పాయింట్ల మేర పడిపోయాయి. దీని ప్రభావం ఆర్థిక కంపెనీలు, బ్యాంకింగ్‌, చమురు, సమాచార, సాంకేతిక కంపెనీల వాటాల ధరలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో మాత్రమే కొంతమేరకు ఈ పతనాన్ని తట్టుకుని నిలబడ్డట్టు కనిపిస్తోంది. తమ బండారం బయట పెట్టిన హిండెన్‌బర్గ్‌ పరిశోధనా సంస్థపై సహజంగానే అదానీ కంపెనీల సముదాయం కారాలు మిరియాలు నూరుతోంది. హిండెన్‌బర్గ్‌ సంస్థపై చర్య తీసుకునే మార్గాలు అన్వేషిస్తున్నామని చెప్తోంది.
గత మూడు రోజుల కింద వెలువడిన హిండెన్‌బర్గ్‌ సంస్థ నివేదికకు ఏ పరిశోధనా ప్రాతిపదిక లేదని, అది దురుద్దేశంతో కూడిరదని దీనివల్ల తమ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడిరదని, వాటాదార్లు, పెట్టుబడి పెట్టేవారు విచలితులవుతున్నారని, స్టాక్‌మార్కెట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని అదానీ గ్రూప్‌ కంపెనీల ఉన్నతాధికారి జలంధ్‌ వాలా ఆక్రోశిస్తున్నారు. హిండెన్‌ బర్గ్‌ సంస్థ ఏ మాత్రం తొణకడం లేదు. తమ నివేదికలో పేర్కొన్న విషయాలకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తోంది. అదానీ షేర్‌ మార్కెట్లో మాయచేసిన విషయం వాస్తవం అంటోంది. అదానీ కంపెనీల వాటాల విలువ తగ్గిపోతే హిండెన్‌ బర్గ్‌ కంపెనీకి ప్రయోజనం కలుగుతుందన్న వాదనా వినిపిస్తోంది. ఈ విదేశీ సంస్థ పరిశోధించి రూపొందించామని చెప్తున్న నివేదిక పెట్టుబడిపెట్టే వారిని గందరగోళంలో పడేస్తోందని, తమ కంపెనీలమీద ఉన్న విశ్వాసం సడలేట్టు చేస్తోందని, తమ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని జలంధ్‌ వాలా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అమెరికా, భారత చట్టాల ఆధారంగా హిండెన్‌ బర్గ్‌ కంపెనీ మీద ఏం చర్య తీసుకోవడానికి వీలుందో పరిశీలిస్తున్నామని జలంధ్‌ వాలా అంటున్నారు. అదానీ, హిండెన్‌బర్గ్‌ మధ్య వివాదం అంతిమ ఫలితం ఏమైనా చాలాకాలం నుంచి అదానీ షేర్‌ మార్కెట్లో మాయ చేస్తున్నారని మాత్రం స్పష్టంగా రుజువు అవుతూనే ఉంది. ఏ మాయ లేకపోతే మోదీ అధికారంలోకి వచ్చే దాకా ఊరు, పేరు లేని అదానీ ఒక్క సారి కీర్తిశిఖరాలు ఎలా అధిరోహిస్తారన్న ప్రశ్న సహజంగానే ఎదురవుతుంది.
హిండెన్‌ బర్గ్‌ సంస్థ అదానీ గురించి నిర్ఘాంతపోయే సమాచారం వెల్లడిరచిన 36గంటల తరవాత కూడా అదానీ గ్రూపు పెదవివిప్పలేని స్థితిలో పడిపోయింది. మరో వేపు తమమీద ఏ చర్య తీసుకున్నా అది వృథా ప్రయాసేనని, చట్టపరంగా అమెరికాలో ఏ కేసు మోపినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని హిండెన్‌ బర్గ్‌ సంస్థ ధీమాగా ఉంది. తాము చేసిన ఆరోపణలలో ఒక్కదానికి కూడా అదానీనుంచి తగిన సమాధానం ఏదీ రాలేదంటోంది. హిండెన్‌ బర్గ్‌ కంపెనీ నివేదికలో చివర 88ప్రశ్నలు సంధించామని వీటిలో ఒక్కదానికీ సమాధానం లేదంటోంది. ప్రపంచంలోకెల్లా సంపన్నుల్లో మూడవస్థానంలో ఉన్న అదానీపై హిండెన్‌బర్గ్‌ ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసిందంటే అవి పూర్తిగా నిరాధారమైనవని అనుకోలేం.
తమను సంప్రదించకుండానే హిండెన్‌బర్గ్‌ సంస్థ నిరాధార ఆరోపణలు గుప్పించిందన్న అదానీగ్రూపు వాదనచూస్తే ఆ సంస్థ దిక్కుతోచనిస్థితిలో పడిపోయినట్టే కనిపిస్తోంది. అదానీ ఆస్తులు ఎంతఎక్కువైనా, సంపద ఎంత ఎక్కువ అనుకున్నా ఆయన అప్పులూ తక్కువేమీ లేవు. ఈ అప్పులన్నీ ఎక్కువగా బ్యాంకుల దగ్గర తీసుకున్న రుణాలే అయిఉంటాయి కనక వచ్చిన ఆరోపణలు నిజమైతే అప్పులిచ్చిన బ్యాంకుల గతి ఏమిటన్నది అసలు ప్రశ్న. హిండెన్‌ బర్గ్‌ చేసిన ఆరోపణల నిగ్గు తేలాలంటే సెబి, రిజర్వుబ్యాంకు లోతైన దర్యాప్తు చేయవలసిన అవసరమైతే ఉంది. రెండేళ్లకింద కరోనా కాటేసిన స్థితిలో జరిగిన ఆర్థికనష్టం నుంచి దేశ ఆర్థికవ్యవస్థ ఇప్పటికీ తేరుకోలేదు.
ఆర్థిక వ్యవస్థ ఇంత శాతం పుంజుకుంటోంది, అంత శాతం పుంజుకుంటోంది అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ చెప్తున్నమాట వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉంది. జనం కరోనాతో అల్లాడిపోతున్నప్పుడు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోయినప్పుడు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నీరుగారినప్పుడు అదానీ, అంబానీల ఆస్తులు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. ఈ రెండు వ్యాపార సంస్థలకు మోదీ ప్రభుత్వం అండగా ఉందన్న విషయంలో అనుమానమే అక్కర్లేదు. మోదీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలు సామాన్యజనాన్ని కుదేలు చేసేశాయి. సంపద కొద్ది మంది చేతుల్లో పోగుపడకుండా చూడవలసిన బాధ్యత రాజ్యవ్యవస్థదే అన్న రాజ్యాంగ ఆదేశికసూత్రాన్ని మోదీ ప్రభుత్వం బేఖాతరు చేస్తూనేఉంది. అదానీ నష్టం దేశ వాసులను కలవరపరచక మానదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img