Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కొత్త రూపులో ఫిరాయింపులు

మహారాష్ట్రలో రెండు శివసేన వర్గాలలో ఏది అసలైన శివసేనో ఎన్నికల కమిషన్‌ శుక్రవారం తేల్చేసింది. ముఖ్యమంత్రి షిండే వర్గమే అసలైన శివసేన అని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. ఇందులో ఆశ్చర్య పడవలసింది ఏమీ లేదు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఎన్నికల కమిషన్‌ మోదీ సర్కారుకు పరిచారికగా మారిపోయింది. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్‌ ఠాక్రేను గద్దె దించి ఏక్‌నాథ్‌ షిండే బీజేపీ సహాయంతో అధికారం చేపట్టినప్పుడే నిజానికి ఉద్ధవ్‌ ఆట కట్టయింది. అసలైన రాజకీయ పార్టీ ఏదో నిర్ణయించడానికి రెండు పార్టీల్లో ఆధిపత్యం ఎవరిదో తేల్చడం ఒకటైతే చట్టసభల్లో ఆధిపత్యం ఏ వర్గానిది అన్నది మరో కొలమానం. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే పార్టీపై ఆధిపత్యం అన్న అంశాన్ని పట్టించుకోకుండానే ఎన్నికల కమిషన్‌ చట్ట సభ సభ్యుల సంఖ్యాబలం ఆధారంగా అసలైన శివసేన షిండే వర్గానిదేనని, విల్లంబుల ఎన్నికల చిహ్నం కూడా ఆ వర్గానికే చెందుతుందని తీర్పు చేప్పేసింది. షిండే వర్గంలో 40 మంది శాసన సభ్యులు ఉన్నారు కనక, లోక సభలోని 19 మందిలో 13 మంది ఆయన వర్గంలో ఉన్నారు కనక వారికి పడ్డ ఓట్ల ఆధారంగా ఎన్నికల కమిషన్‌ అసలైన శివసేన వర్గం ఏదో తేల్చేసింది. ఈ విధానం సరైందో కాదో సుప్రీంకోర్టే స్పష్టం చేయవలసి ఉంటుంది. సుప్రీంకోర్టులో ఈ అంశం విచారణలో ఉండగానే ఎన్నికల కమిషన్‌ నిర్ణయం ప్రకటించడం విచిత్రంగానే ఉంది. పాక్షిక కొలమానాల ఆధారంగా ఎన్నికల కమిషన్‌ అసలు శివసేన ఏదో తేల్చడంలో మతలబు లేకపోలేదు. షిండే వర్గంలో 40 మంది శాసన సభ్యులు ఉన్నారు కనక అది పార్టీని చీల్చడం కాదనీ, కేవలం శాసనసభా పక్షం నాయకుడు మారిపోయాడని షిండే ఎన్నికల కమిషన్‌ ముందు వాదించారు. ఎన్నికల కమిషన్‌ ఈ వాదనకు తలూపింది. పార్టీ నాయకత్వం ఎవరి చేతిలో ఉందో ఎన్నికల కమిషన్‌ పట్టించుకోనే లేదు. ఉద్ధవ్‌ ఠాక్రే వర్గంలో 15 మంది శాసనసభ్యులు, 12 మంది శాసన మండలి సభ్యులు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు మాత్రమే మిగిలారు. తమ వర్గమే అసలైన శివసేన అని ఎన్నికల కమిషన్‌ నిర్థారించడం ప్రజాస్వామ్యానికి విజయం అనీ, తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేల, ఎంపీల, పార్టీ కార్యకర్తల విజయం అని షిండే ప్రకటించారు. ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని మరో వర్గం నాయకుడైన ఉద్ధవ్‌ ఠాక్రే అంటున్నారు. షిండే వర్గం తమ ఎన్నికల చిహ్నమైన విల్లంబులను దొంగతనంగా కాజేసిందని ఉద్ధవ్‌ ఠాక్రే వాదిస్తున్నారు. ఈ దొంగతనాన్ని ప్రజలు సహించరని కూడా ఆయన అంటున్నారు. పోరాటం ఆపకూడదని ఆయన తన వర్గం కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. అయితే తన వర్గంలో మిగిలింది తక్కువ మంది శాసనసభ్యులేనని, లోకసభలో ఎవరూ మిగలలేదని ఉద్ధవ్‌ ఠాక్రే గ్రహించకపోవడం వాస్తవాన్ని నిరాకరించడమే. ఎన్నికల కమిషన్‌ శివసేన పార్టీ నిబంధనావళి మూలాలనే ప్రశ్నించింది. దీనితో పార్టీ నిబంధనావళే తమ వర్గాన్ని ఆదుకుంటుందన్న ఉద్ధవ్‌ విశ్వాసానికి గండి కొట్టినట్టయింది. శివసేన నిబంధనావళిని 2018లో సవరించారు. కాని ఆ విషయాన్ని రికార్డులలో చేర్చలేదు. అసలు ఈ సవరణలే ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్‌ వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్‌ రికార్డులలో ఉన్న 1999 నాటి నిబంధన ఆధారంగానే ఆ కమిషన్‌ తీర్పు చెప్పింది. 

ఎన్నికల కమిషన్‌ నిర్ణయం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ వర్గాన్ని అసలైన శివసేన అని ప్రజలు ఆమోదిస్తారా లేదా అన్న విషయం తేలవలసి ఉంది. ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టుకు వెళ్తానంటున్నారు కనక అసలైన శివసేన ఏదన్న విషయం ఎన్నికల కమిషన్‌ నిర్ణయంవల్లే తేలుతుందా లేక సుప్రీంకోర్టులో తేలుతుందా, ఇవన్నీ జరిగినా షిండే వర్గాన్ని అసలైన శివసేనగా జనం భావిస్తారా అన్నది ప్రస్తుతానికి జవాబులేని ప్రశ్నే. శివసేన వారసత్వ రాజకీయాలు అనుసరించే పార్టీ అనడంలో సందేహం అక్కర్లేదు. బాలసాహెబ్‌ ఠాక్రే వారసుణ్ని గద్దె దించి అధికారం సంపాదించిన షిండే బాలాసాహెబ్‌ వారసత్వం కూడా తనదేనని నిరూపించుకోవడానికి బాగానే కష్టపడవలసి ఉంటుంది. కానీ ఎన్నికల కమిషన్‌ నిర్ధారణ మహారాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ప్రధానమైన అంశం. శివసేన ఐక్యంగా ఉన్నప్పుడు అధికారంలోకి రావడంకోసం ఉద్ధవ్‌ ఠాక్రే సైద్ధాంతికంగా ఎలాంటి పొంతనాలేని శరద్‌ పవార్‌ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌.సి.పి.), కాంగ్రెస్‌తో కలిసి మహావికాస్‌ అగాధీ ఏర్పాటు చేశారు. పార్టీని చీల్చినప్పుడు ఏక్‌నాథ్‌ షిండే ఎన్‌.సి.పి., కాంగ్రెస్‌ తో కలిసి ఫ్రంట్‌ కట్టడం శివసేన ఇంతవరకు అనుసరించిన సిద్ధాంత ప్రాతిపదికకు విరుద్ధం అని ఆరోపించారు.
శివసేన లేదా బాలా సాహెబ్‌ ఠాక్రే అనుసరించిన తీవ్ర హిందుత్వ విధానం ప్రకారం అయితే భారతీయ జనతా పార్టీతోనే పొంతన కుదురుతుందని షిండే అన్నారు. సైద్ధాంతికంగా చూస్తే ఇది సవ్యమైన వాదనగానే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవిమీద ఆశలు పెంచుకోనప్పుడు ఆయనకు ఈ వైపరీత్యం గుర్తుకే రాలేదు. ఇందులో షిండే అధికార వ్యామోహం, అవకాశవాద రాజకీయాలే ప్రధానపాత్ర పోషించాయి. శాసనసభలో బీజేపీనే అతి పెద్ద రాజకీయ పక్షం అయినప్పటికీ షిండే ఆసరాతో మళ్లీ అధికారంలోకి రావడానికి కమల దళం షిండే వెనక ఉండి కథంతా నడిపించింది. నిజానికి ఈ నాటకంలో బీజేపీనే అసలు సూత్రధారి. స్వయంగా అధికారం సంపాదించడం, అది వీలుకానప్పుడు డబ్బు సంచులు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొనడం, లేదా పార్టీలను చీల్చడం మోదీ హయాంలోని బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం. మహారాష్ట్రలో కూడా అదే పని చేసింది. ఈ నాటకంలో షిండే బీజేపీకి బాగా తోడ్పడ్డారు. మరోవేపు మహా వికాస్‌ అగాధీ ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు ఉద్ధవ్‌ ఠాక్రే కూడా సైద్ధాంతిక నిబద్ధత కనబరిచిన దాఖలాలేమీ లేవు. ఆయనకూ అధికారమే పరమావధి అయింది. పోనీ ఉద్ధవ్‌ ఠాక్రే మతతత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పి సెక్యులర్‌వాదిగా మారిపోయారా అంటే అదీలేదు.
ఇప్పుడు ఉద్ధవ్‌ చిక్కుకున్న పరిస్థితి ఆయనను సైద్ధాంతికంగా ఆలోచించే అవకాశమే ఇవ్వడం లేదు. బాలాసాహెబ్‌ ఠాక్రే వారసుడిని కనక శివసేన తనదేనని నిరూపించుకోవడానికే ఆయన సమయం అంతా వృథా అవుతోంది. పార్టీ ఫిరాయింపులు కొత్తరూపు సంతరించు కుంటున్నాయి. ప్రజలతీర్పును ఒకసారి ఎన్నికైనవారు అంగట్లో అమ్మే స్తున్నారు. ఆ తీర్పుకు ఎలాంటి విలువాలేదు. ఈ మొత్తం వ్యవహారంలో బలయ్యేది ప్రజాస్వామ్య ప్రక్రియ. మన రాజకీయ పార్టీలలో లోపిం చిందల్లా అంతర్గత ప్రజాస్వామ్యమే. మరి రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య బద్ధంగా నడుస్తాయని ఎలా ఆశించగలం!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img