Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కొలిక్కి రాని ‘మహా’ సంక్షోభం

మహారాష్ట్ర సంక్షోభం చివరకు సుప్రీంకోర్టుకు ఎక్కినందువల్ల మరో పదిహేను రోజుల్లోగా పరిష్కారం కుదిరే అవకాశం లేదు. ఈ లోగా ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు మద్దతిచ్చే శివసైనికులు అనేక చోట్ల తిరుగుబాటుదారు శాసనసభ్యుల ఆస్తులు ధ్వంసం చేస్తు న్నారు. దీనివల్ల శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే మీద కొద్దిపాటి సానుభూతి కూడా ఆవిరైపోయేట్టు ఉంది. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే కుమారుడిగా ఆ పార్టీ కార్యకర్తలకు ఇంకా ఆయన మీద అభిమానం మిగిలి ఉంది. కాని సంఖ్యా పరంగా చూస్తే ముఖ్య మంత్రి కచ్చితంగా మైనారిటీలో పడిపోయారు. తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఉద్ధవ్‌ ఠాక్రే తిరుగుబాటుదార్లతో చేరిన తొమ్మిది మంది మంత్రులను వారి శాఖల నుంచి తొలగించారు. మరో వేపు 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ శివసేన నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి సమాధానం చెప్పడానికి సుప్రీంకోర్టు వారికి జులై 12 దాకా గడువిచ్చింది. అంటే ఆ లోగా సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేనట్టే. శివసేనకు శాసనసభలో మొత్తం 55 మంది సభ్యులు ఉంటే తమ శిబిరంలోనే 39 మంది ఉన్నారని తిరుగుబాటు వర్గం నాయకుడి ఏక్‌ నాథ్‌ షిందే వాదిస్తున్నారు. ఇండిపెండెంట్లను, ఇతరులను కలిపితే తమకు 50 మంది సభ్యుల మద్దతు ఉందని షిందే అంటున్నారు. అనర్హతకు గురైన నాయకులు హైకోర్టుకు ఎక్కకుండా ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది కూడా. ముంబైలో తమకు భద్రత లేదని వారు సమాధానమిచ్చారు. తిరుగుబాటు దార్లు ఇప్పటికీ గువాహటిలోనే మకాం వేసి ఉన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌, చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు, శాసనసభా పక్షం నాయ కుడు అనిల్‌ చౌదరితో పాటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. గత వారం శివసేన నాయకత్వం షిందేతో పాటు 15 మంది ఎమ్మెల్యేలకు అనర్హులని నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం హిందుత్వ అగ్రనాయకుడు బాలా సాహెబ్‌ ఠాక్రే సిద్ధాంతానికి, ధర్మవీర్‌ ఆనంద్‌ దిగే ఆలోచనా ధోరణికి విజయం అని షిందే అంటు న్నారు. షిందే ఒక వేపు తిరుగుబాటు ఎమ్మెల్యేలను గంప కింద కమ్మి ఉంచడంతో పాటు మరో వేపు హిందుత్వ శివసేన సిద్ధాంతం కనక ఉద్ధవ్‌ ఠాక్రే కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ కూటమి నుంచి బయటికి వచ్చి బీజేపీతో కలవాలని కోరుతున్నారు. అంటే ఆయన తిరుగుబాటుకు సైద్ధాంతిక ఆసరా కూడా చూసుకుంటున్నారు. ఇంకో వేపు ఈ సమస్యలన్నీ తేలే దాకా విశ్వాస తీర్మానానికి అవకాశం ఉండకూడదని ఉద్ధవ్‌ ఠాక్రే వాదిస్తున్నారు. కావా లంటే తిరుగుబాటుదార్లు కోర్టుకెక్కవచ్చునంటున్నారు. ఈలోగా ఏక్‌ నాథ్‌ షిందే తన శిబిరంలోని శాసనసభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని సుప్రీం కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. అనర్హులని నోటీసులు ఇచ్చిన వారికి కూడా భద్రత కల్పిస్తామని కోర్టు చెప్పింది. షిందే మద్దతుదార్లు థానేలో సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించి ఆయనకు మద్దతు తెలియ జేశారు. శివసేన నుంచి విడిపోయి మహారాష్ట్ర నవనిర్మాణ సేన నెలకొల్పిన రాజ్‌ ఠాక్రేతో కూడా ఏక్‌ నాథ్‌ షిందే మంతనాలు జరిపారు. ఏక్‌ నాథ్‌ షిందే, ఆయన మద్దతుదార్లు రాజకీయ తిరుగుబాటు సృష్టించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు పౌరులతో కూడిన బృందం సోమవారం ముంబై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. తిరుగుబాటుదార్లు రాష్ట్రానికి తిరిగి వచ్చి తమ విధులు నిర్వర్తించాలని ఆదేశించాలని ఈ పిటిషన్లో అభ్యర్థించారు.
తమదే అసలైన శివసేన అని చెప్పుకోవడానికి షిందే శిబిరం కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు ఆ వాదనను అమలు చేయ డానికి అనువుగా ఉన్నట్టు లేవు. ఉద్ధవ్‌ ఠాక్రేకు శివసైనికుల మద్దతు ఉంది కనక ముంబై రావడానికి షిందే వర్గం వెనుకాడుతున్నట్టుంది. ఆధిపత్యాన్ని రుజువు చేసుకోవడానికి, బాలాసాహెబ్‌ ఠాక్రే పేరు చెప్పి మద్దతు సమీక రించడానికి ఉద్ధవ్‌ ఠాక్రే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోగా తిరుగుబాటుదార్ల బలం అంతకంతకు పెరుగుతోంది. ఉద్ధవ్‌ ఠాక్రే నాయ కత్వంలోని మహా వికాస్‌ అగాధీ కూటమి పునాదులు సడలిపోతున్న దశలో ఆ కూటమిలో ప్రధాన పాత్ర ఉన్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు శరద్‌ పవార్‌ భాగస్వామ్య పక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. ఐక్యంగా పోరాడితే విజయం మనదేనని భరోసా ఇచ్చారు. కొందరు సభ్యులను అనర్హులుగా శివసేన ప్రకటించిన తరవాత ఈ అనర్హతా నోటీసులపై నిర్ణయం తీసుకోవడానికి డిప్యూటీ స్పీకర్‌కు అధికారం ఉందని, ఈ విషయాన్ని గతంలోని అనేక తీర్పులు బలపరుస్తున్నాయని శివసేన తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఫ్వీు అంటున్నారు. శాసనసభ ఈ అంశాన్ని పరిశీలించవలసి ఉన్న దశలో న్యాయస్థానం జోక్యం చేసు కోవడం కుదరన్నది ఆయన వాదన. శివసేన ఎమ్మెల్యేలలో మూడిరట రెండువంతుల మంది షిందే వేపే ఉన్నారు. ఈ పరిస్థితిని చూస్తే జరుగు తున్న పరిణామాలకు ప్రజలతో ఎలాంటి సంబంధం లేదని రుజువు అవుతోంది. ఉద్ధవ్‌ ఠాక్రేకు సేన కార్యకర్తల మద్దతు ఉన్న మాట నిజమే అయినా అది వ్యక్తి ఆరాధనలో భాగం తప్ప సిద్ధాంత పరమైన కట్టుబాటు ఏదీ లేదు. అందుకే ఎక్కువ మంది శాసనసభ్యుల మద్దతు ఉందంటున్న షిందే వర్గం ప్రజల మధ్యకు రావడానికి జంకుతోంది. ఇంత సంక్షోభం లోనూ ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. మహా వికాస్‌ అగాధి కూటమి నేతలు ఆయన రాజీనామాకు సిద్ధపడ్డ రెండు సందర్భాలలోనూ నిరోధించారంటున్నారు. ముఖ్యమంత్రి అధికార నివా సాన్ని వదిలేసిన ఠాక్రే రాజకీయంగా తాను కోల్పోయిన మద్దతును మళ్లీ సంపాదించలేక నిశ్చేష్టంగా ఉండి పోతున్నారు. ఠాక్రేకు నాయకత్వం వంశ పారంపర్యంగా అబ్బిందే తప్ప ఆయన రాటు దేరిన రాజకీయ నాయకుడు కాడు. తిరుగుబాటు వర్గం నాయకుడు షిందే దీనికి పూర్తిగా విరుద్ధం. కూటమిని రద్దు చేసి బీజేపీతో చేతులు కలపాలని షిందే కోరడంలోనే ఆయన చాతుర్యం ఇమిడి ఉంది. దీనికి ఉద్ధవ్‌ ఠాక్రే అంగీకరించారు. అయితే తిరుగుబాటుదార్లు పార్టీ శిబిరంలోకి తిరిగి రావాలని షరతు పెట్టారు. కేవలం హిందుత్వను ఆశ్రయించకపోవడమే షిందే ఫిర్యాదు కాదు. ఆయన అసలు ఆగ్రహం ఠాక్రే పని తీరు మీద. అసమ్మతి శిబిరంలోని అనేకమంది ఎమ్మెల్యేలకు కూడా ఠాక్రే వ్యవహార సరళి నచ్చలేదు. కార్య కర్తల మద్దతు ఠాక్రేకు ఉన్నట్టు వీధుల్లో రుజువు అవుతోంది. అయినా ఆయన సుడిగాలిలో చిక్కుకున్న ప్రభుత్వ నావను దరి చేర్చలేక పోతున్నారు. ఎమ్మెల్యేల మద్దతు దండిగా ఉన్నా షిందే వర్గం వీధుల్లోకి రావడానికి భయపడ్తూనే ఉంది. అంటే ఈ మొత్తం పరిణామాలతో జనానికి ఎలాంటి సంబంధమూ లేదు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఇలాంటి సందర్భాలలో ఎందుకూ కొరగాకుండా పోతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img