Friday, April 19, 2024
Friday, April 19, 2024

గవర్నర్ల పాత్ర వివాదాస్పదం

చాలా కాలంగా అనేక రాష్ట్రాలలో గవర్నర్ల పాత్ర వివాదా స్పదమవుతోంది. కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉన్నంత కాలం గవర్నర్ల విధి నిర్వహణ సజావుగానే సాగింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు గవర్నర్లు నడుచుకోవడం, తమకు అనుకూలమైన వారిని గవర్నర్లుగా నియమించడంతో వివాదాలు ఉండేవి కాదు. 2014లో బీజేపీ నాయకత్వంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి దేశంలో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ల పాత్ర సంప్రదాయాలకు, నియమ నిబంధనలకు అనుగుణంగా లేక తీవ్ర విమర్శలకు లోనవుతోంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను వేధింపులకు గురిచేసేందుకే ప్రయత్నిస్తున్నారని విమర్శలు ఎక్కువగా వచ్చాయి. కారణం… రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అసెంబ్లీలలో తీర్మానించిన బిల్లులకు సకాలంలో తమ ఆమోదం తెలియజేయకుండా తొక్కి పెడుతున్నారు. తాజాగా తమిళనాడు గవర్నరు వ్యవహారసరళి తరచుగా రాష్ట్రంలోని డిఎంకె ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. గవర్నరు కలిగిస్తున్న ఆటంకాలను మోదీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నప్పటికీ ప్రయోజనం కలగడం లేదు. అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లులను గవర్నరు పరిశీలించి ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయవచ్చు. ప్రభుత్వం ఒకవేళ అదే బిల్లును మళ్లీ గవర్నరుకు పంపినట్లయితే తప్పనిసరిగా ఆమోదించవలసి ఉంటుంది. ఏ విషయం తేల్చకుండా నెలల కాలం గవర్నరు తొక్కిపెట్టి ఉంచినప్పుడే సమస్య ఏర్పడుతుంది. అప్పుడే గవర్నరుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. మోదీ ప్రభుత్వ కనుసన్నల్లో నడుచుకోవడం వల్లనే గవర్నర్లు విమర్శలకు గురవుతున్నారు. తమిళనాడు గవర్నరు రవి ఈ విషయంలో అనేకసార్లు వివాదాస్పదంగా వ్యవహరించారు. తాజాగా ఆన్‌లైన్‌ జూదాలను నిషేధించడానికి సంబంధించిన బిల్లును గవర్నరుకు పంపినప్పటికీ ఆయన తన వద్దనే ఉంచుకొని ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్‌ విమర్శించారు. బిల్లులను ఆమోదించి తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడానికి గడువు విధించాలని రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం తీర్మానించింది. ఈ విషయంలో రాష్ట్రపతి, కేంద్రం సముచిత నిర్ణయం తీసుకున్నట్లయితే చాలావరకు వివాదాలు తరచుగా జరగకుండా నివారించే అవకాశం ఉంటుంది. గవర్నరు చర్యను వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం గతంలో ఒక తీర్మానం ఆమోదించి పంపింది. అయినప్పటికీ కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదు. మోదీకి బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బందుల పాలు చేయడం, వీలయితే ఆ ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రభుత్వాలను నెలకొల్పడం అలవాటుగా మారిందని చాలా రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి సంఘటనలు తార్కాణంగా నిలుస్తాయి.
1967లో ఎన్నికల తర్వాత పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రాలలో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి సజావుగా సాగింది. 1967 ఎన్నికల తర్వాత ఎనిమిది రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఓడిపోయి ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆనాటి నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకొని గవర్నర్ల అధికారాలపై ఆంక్షలు విధించింది. అంతవరకు స్వతంత్రంగా పనిచేసిన గవర్నర్లు తమ పని విధానాన్ని మార్చుకోవలసి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సూచనల మేరకు గవర్నర్లు పని చేయవలసి వచ్చింది. ఒకవేళ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నరు సిఫారసు చేస్తే దానిని కోర్టులు పరిశీలించి నిర్ణయాలు తెలిపే వీలు కలిగింది. అయితే రాజకీయ వాతావరణం తీవ్ర మార్పునకు గురైంది. బీజేపీయేతర రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లుల విషయంలో, అలాగే విశ్వవిద్యాలయాల పాలన వ్యవహారాలలో దీర్ఘకాలం అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయాలను గవర్నర్లు ఉల్లంఘిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మంచి సలహాలు ఇవ్వవలసిన గవర్నరు ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం పెరిగింది. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తగినన్ని ఆధారాలు లేకపోయినప్పటికీ గవర్నరు ఆమోదించడాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తప్పుపట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ గవర్నర్లు తమ వ్యవహార సరళిని మార్చుకోకపోవడం శోచనీయం.
గవర్నరును తొలగించడానికి మార్గం లేనప్పుడు, వివాదం మరింత ముదిరినప్పుడు ప్రజలు నిరసనలు, ఆందోళనలు చేస్తారు. గవర్నరు చర్యలను ఖండిరచడానికి సభలు, సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. గవర్నరు రాజ్యాంగ నియమ నిబంధనలు పాటించనప్పుడు, రాజ్యాంగాన్ని ప్రశ్నించినప్పుడు కోర్టు జోక్యంతో గవర్నరును తొలగించవచ్చు లేదా తగిన చర్య తీసుకోవలసిందిగా కేంద్రాన్ని ఆదేశించే అవకాశం ఉంటుందని న్యాయనిపుణులు విశ్లేషించారు. ఆర్టికల్‌ 361 కింద గవర్నర్లు కోర్టులకు జవాబుదారీగా ఉండవలసిన అవసరం లేదన్న అంశం ఉన్నప్పటికీ…గవర్నరు రాజ్యాంగంపై విశ్వాసం లేదని చెప్పినప్పుడు ఆయనకు ఉన్న 361 ఆర్టికల్‌ కల్పించిన రక్షణ ఉండదని కూడా న్యాయ నిపుణులు వివరిస్తున్నారు. అయితే నేటి పరిస్థితి వేరుగా ఉంది. మోదీ ప్రభుత్వం దిల్లీ ఆప్‌ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందిపాలు చేస్తున్నదీ నిత్యం తెలుస్తూనే ఉన్నది. ఇప్పుడు దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అనుభవిస్తున్న అధికారాలను లెఫ్టినెంట్‌ గవర్నరుకు కట్టబెట్టింది. ఆప్‌ ప్రభుత్వ కార్యకలాపాలన్నింటికీ లెఫ్టినెంట్‌ గవర్నరు అడ్డుపడుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. ఈ వివాదాలకు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కారణం కాదా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img