Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గవర్నర్ల రాజ్యాంగోల్లంఘన

ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న జగ్దీప్‌ ధన్కర్‌, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, తమిళనాడు ప్రస్తుత గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి, అంతకు ముందు అదే రాష్ట్ర గవర్నరుగా పని చేసిన భన్వరి లాల్‌ పురోహిత్‌ గవర్నర్లుగా వ్యవహరించిన తీరు చూస్తే వీరంతా ఒకే తానులోని ముక్కలేనని తేలుతుంది. రాజకీయ నిరుద్యోగులను గవర్నర్లుగా నియమించడం మోదీ సర్కారు ఏర్పడిన తరవాత మాత్రమే వ్యక్తమైన రుగ్మత ఏమీ కాదు. కాంగ్రెస్‌ హయాంలోనూ చాలా మంది గవర్నర్ల నియామకం ఇలాగే జరిగింది. కానీ బీజేపీ ఏలుబడిలో నియమితులవుతున్న గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరించడం కాకుండా తమ పరిధి దాటి రాష్ట్రాల ప్రభుత్వంతో జగడం పెట్టుకుంటున్నారు. కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ గురువారం కూడా అక్కడ అధికారంలో ఉన్న వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వం దొంగ రవాణాను ప్రోత్సహిస్తోంది అనే దాకా వెళ్లారు. ఇటీవలే ఆయన కేరళలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్లను రాజీనామా చేయమని ఆదేశించి భంగ పడ్డారు. విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్లను రాష్ట్ర ప్రభుత్వ సలహా మేరకు గవర్నర్‌ నియమించాలి. కానీ వారిని తొలగించే హక్కు చట్ట ప్రకారం గవర్నరుకు లేదు. అయినా ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆ సాహసం చేశారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి వ్యవహారం ఆయనను వెనక్కు పిలవాలని రాష్ట్రపతిని కోరే దాకా ముదిరింది. ఈ అభ్యర్థనపై తమిళనాడులోని అన్ని పార్టీలు సంతకాలు చేశాయి. గవర్నరును తొలగించాలన్న అభ్యర్థనపై తమిళనాడులోని ఎంపీల చేత సంతకాలు చేయించడంలో లోకసభలో సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి టి.ఆర్‌.బాలు నిమగ్నమై ఉన్నారు. నీట్‌ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని డి.ఎం.కె. ప్రభుత్వం చాలా రోజులనుంచి కోరుతోంది. దీనికోసం శాసనసభ బిల్లు కూడా ఆమోదించింది. కానీ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించడానికి గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి మొరాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ సంవత్సరాది సందర్భంగా గవర్నర్‌ ఇచ్చిన విందును అధికారంలో ఉన్న డి.ఎం.కె., దాని మిత్రపక్షాలు బహిష్కరించాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నరుకు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థితి ఉంది. మొదట ఆర్‌.ఎన్‌.రవిని గవర్నరుగా నియమించడాన్ని స్టాలిన్‌ స్వాగతించారు. కానీ ఆయన తత్వం తెలిసినందువల్ల డి.ఎం.కె. మిత్రపక్షాలు వ్యతిరేకిస్తూనే వచ్చాయి. అంతకు ముందు ఆర్‌.ఎన్‌.రవి నాగాలాండ్‌, మేఘాలయ గవర్నరుగా పని చేశారు. నాగాలాండ్‌ లో కూడా ఆయనకు తీవ్ర వ్యతిరేకతే ఎదురైంది. ఈ పేచీకోరు గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా తాము నిర్వర్తించవలసిన విధులను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వంతో జగడాలు పెట్టుకోవడం మీదే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. రోజు వారీ పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారు. వీరి ధోరణి చూస్తుంటే రాష్ట్రం కాని రాష్ట్రం దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఎంత వివాదాస్పదంగా వ్యవహరించారో వీరూ అంతే వివాదాస్పదంగా ఉన్నారని తేలిపోతోంది.
2022 మే 31 నాటికి తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన 21 బిల్లులను గవర్నర్‌ రవి తొక్కి పెట్టారు. చట్టసభలు ఆమోదించిన బిల్లులలో తమకు అభ్యంతరకరమైన అంశాలు ఉంటే ఒక సారి వాటిని తిప్పి పంపే అధికారం గవర్నరుకు ఉంటుంది. అలాంటి సందర్భంలో శాసనసభ గవర్నర్‌ అభ్యంతరాలు సవ్యమైనవని భావిస్తే తగిన సవరణలు చేసి మళ్లీ బిల్లు ఆమోదించి పంపవచ్చు. ఏ మార్పు చేయకుండా అదే రూపంలో బిల్లును పంపితే ఆమోదించడం తప్ప గవర్నరుకు గత్యంతరం లేదు. కానీ ఆర్‌.ఎన్‌.రవి వాటిని ఆమోదించకుండా తొక్కి పెడ్తున్నారు. ఈ వ్యవహార సరళి రాజ్యాంగ విరుద్ధమైంది. అది ప్రజాభిప్రాయాన్ని తృణీకరించడమే అవుతుంది. ఏ గవర్నరు అయినా చివరకు రాష్ట్రపతి అయినా మంత్రివర్గ సలహా ప్రకారం నడుచుకోవలసిందే తప్ప శాసనసభ ఆమోదించిన బిల్లులను, తీర్మానాలను ఆమోదించకపోవడం రాజ్యాంగ నిర్దేశాలకు విరుద్ధం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గ సలహా మేరకు నడుచుకోవడం మినహా గవర్నరుకు మరో మార్గమే లేదు. డి.ఎం.కె. నాయకత్వంలోని సెక్యులర్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌కు చెందిన వారందరూ గవర్నరును వెనక్కు పిలిపించాలని కోరడంతో ఈ వివాదం మరింత ముదిరి నట్టయింది. అధికారంలో ఉన్న ప్రభుత్వంతో గవర్నరు పేచీకి దిగడంలో ఆంతర్యం ప్రజలను గందరగోళ పరచడం అయినా కావాలి. లేదా ఏదో ఒక రకంగా వివాదాలు రేకెత్తించి వార్తల్లోకి ఎక్కి తమ అస్తిత్వాన్ని చాటుకునే దురుద్దేశమైన అయి ఉండాలి. గవర్నర్‌ పదవిలో ఉన్న రవి సనాతన ధర్మం, ద్రావిడ సంస్కృతిపై విముఖత, షెడ్యూల్డ్‌ కులాలపైన, తిరుక్కురళ్‌ పైన విమర్శనాస్త్రాలు సంఫ్‌ు పరివార్‌ ఎజెండాను ప్రచారం చేయడానికి, అమలు చేయడానికి ఉద్దేశించినవే. ఒక వేపు సంఫ్‌ు పరివార్‌ ఈ జాతి రక్తంలోనే సెక్యులరిజం ఉంది అని అంటుండగా గవర్నర్‌ రవి మాత్రం ఈ దేశం ఎప్పుడూ సెక్యులర్‌ దేశం కాదు అంటున్నారంటే ఆయన భావజాలం ఎంత అభ్యంతరకరమైందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏ దేశమూ సెక్యులర్‌ కాదని ఆయన వాదిస్తున్నారు. ఐక్య రాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న 195 దేశాలలో కేవలం 30 మాత్రమే మత రాజ్యాలు. మొన్నమొన్నటిదాకా ఏకైక హిందూ రాజ్యంగా ఉన్న నేపాల్‌ కూడా ఇప్పుడు తమది సెక్యులర్‌ రాజ్యమే అంటోంది.
అసలు రాజ్యాంగం గురించి, ప్రపంచ చరిత్ర గురించి తమిళనాడు గవర్నరుకు ఉన్న అవగాహనే ప్రశ్నార్థకంగా తయారైంది. తన ప్రవర్తన ద్వారా ఆయన సంపూర్ణంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుదురుకు చెందిన వారని తేలిపోతోంది. అధికారంలోకి రావడానికి ఏ రాజకీయ పార్టీ అయినా కొన్ని వాగ్దానాలు చేస్తుంది. చేసిన వాగ్దానాలన్నింటినీ ఏ ప్రభుత్వమూ నెరవేర్చకపోవచ్చు. కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు చేసే శాసనాలు తమ వాగ్దానాలు నెరవేర్చడానికి ఉపకరించాలని ప్రభుత్వాలు అభిలషిస్తాయి. ఇలాంటి స్థితిలో చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలియజేయకుండా ఉండడం అంటే ఏదో దురుద్దేశం ఉండి ఉండాలి. పాషండులైన వారు మాత్రమే ఇలా ప్రవర్తించగలరు. ఇది వ్యక్తిగత నడవడిక అయితే సరిపెట్టుకోవచ్చునేమో కానీ రాజ్యాంగ విధులను నిర్వర్తించవలసిన గవర్నర్‌ పదవిలో ఉన్న వారు మొండికేస్తే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మోకాలడ్డినట్టే లెక్క. అసలు గవర్నర్ల వ్యవస్థే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అనవసరం అన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది. రాజకీయ ప్రయోజనాలకోసం గవర్నర్లను నియమిస్తున్నంత కాలం గవర్నర్ల వ్యవస్థే దండగా అన్న వాదనకు బలం చేకూరుతుంది. అక్టోబర్‌ 14 నుంచి 18 దాకా విజయవాడలో జరిగిన సీపీఐ 24వ మహాసభలో గవర్నర్ల వ్యవస్థ ఆవశ్యకతపై కూలంకశంగా చర్చ జరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో గవర్నర్ల వ్యవస్థ అనవసరం అన్న అభిప్రాయం వ్యక్తమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img