Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గుప్త దానాల మర్మం?!

ఎన్నికల బాండ్ల డొంక మళ్లీ కదిలింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలలో అక్రమాలను నిరోధించడం కోసం 2017-18లో తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు ఒక్క బీజేపీ బొక్కసం నింపడానికే పరిమితమైనాయి అని ఆచరణలో రుజువైంది. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరే నిధుల్లో 99 శాతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఖాతాలోనే జమ పడ్తున్నాయి. 2017లో అమలులోకి వచ్చిన ఈ ఎన్నికల బాండ్ల విధానంవల్ల వ్యక్తులు, విదేశీ కంపెనీలు, రాజకీయ పార్టీలకు ఎవరు ఏ పార్టీకి ఎంత మొత్తం విరాళం ఇచ్చారో తెలియకుండా విరాళాలు గుమ్మరించే అవకాశం వచ్చింది. కార్పొరేట్‌ కంపెనీలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు వందలు వేల కోట్ల విరాళాలు ఇచ్చి తమకు అనుకూలమైన విధాన నిర్ణయాలు తీసు కునేట్టు చేస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలం నుంచే ఉన్నాయి. ఈ పద్ధతి ఎన్నికల్లో డబ్బు సంచుల ప్రభావం పెరిగిం దన్న ఆందోళననూ పెంచింది. దీనికి అడ్డుకట్ట వేసే నెపంతోనే అరుణ్‌ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న రోజుల్లో ఎన్నికల బాండ్ల విధానం తీసుకొచ్చారు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఎ.డి.ఆర్‌.) సవాలు చేసింది. అయితే అది ఇప్పటిదాకా విచారణకు నోచుకోలేదు. అదుగో ఇదుగో అనడంతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ పిటిషన్లను విచారిద్దామంటే కరోనావల్ల సాధ్యం కాలేదని ఇంతకు ముందు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎన్‌.వి.రమణ గత ఏప్రిల్‌లో అన్నారు. అయితే ఆయన హయాంలో అనేక ముఖ్యమైన కేసులను విచారించనే లేదు కనక చింతించి ప్రయోజనం లేదు. ఈ కేసును త్వరగా విచారణకు చేపట్టాలని ఎ.డి.ఆర్‌. తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన విజ్ఞప్తుల వల్లా ప్రయోజనం లేకుండానే పొయింది. గత సంవత్సరం అక్టోబర్‌లో కూడా ప్రశాంత్‌ భూషణ్‌ ఇదే అభ్యర్థన చేశారు. అప్పుడు ప్రధాన న్యాయ మూర్తి ‘‘చూద్దాం’’ అని దాట వేశారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళా లలో దాపరికం లేకుండా ఉండడానికే ఎన్నికల బాండ్లు ప్రవేశ పెట్టామని మోదీ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఈ బాండ్లను రాజకీయ పార్టీలు తమ బ్యాంకు ఖాతాల ద్వారా మాత్రమే మార్చుకోవచ్చు. అయితే ఈ బాండ్ల మీద దాతల పేరు ఉండదు. బాండ్లు ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఇస్తున్నారో కూడా ఉండదు. ఇదే దాపరికం లేని విధానం అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రం ద్వారా బోధపడే మహత్తర అంశం. పైగా ఇది గొప్ప ఎన్నికల సంస్కరణ అని ప్రభుత్వం నమ్మబలుకు తోంది. ‘‘నగదు రహిత-డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ’’ దిశగా ప్రయాణిస్తున్న దేశంలో ఇది నిస్సందేహంగా పెద్ద సంస్కరణ అని మోదీ సర్కారు నమ్మమని చెప్తోంది. డిజిటల్‌ లావాదేవీలు అవినీతిని నిరోధిస్తా యన్న హామీ ఎలా వస్తుందో అంతు పట్టదు. అధికారంలో ఉన్న పార్టీలకు కార్పొరేట్‌ సంస్థలు విచ్చల విడిగా విరాళాలు అందించడంవల్ల మూడుతున్న చేటేమిటో బహిరంగ రహస్యమే. పైగా రూ. 20,000 కన్నా తక్కువ విరాళం ఇచ్చే దాతలు కానీ ఆ విరాళాలు స్వీకరించే రాజకీయ పార్టీలు కానీ పాన్‌ కార్డు వివరాలలాంటివి అందజేయవలసిన పని లేదు. ఎన్నికల బాండ్లు రాజకీయ పార్టీలకు అందజేసే విరాళాలలో నల్లడబ్బు పాత్ర తొలగించడమే అసలు ఉద్దేశం అని కూడా ప్రభుత్వం నమ్మబలుకుతోంది. ఎన్నికల రంగంలో అక్రమ లావాదేవీలు లేకుండా చేయడంకోసం ఎన్నికల కమిషన్‌ నికరంగా తీసుకున్న చర్య కూడా ఇప్పటిదాకా ఏమీ లేదు. అయితే 2019లో ఎన్నికల కమిషన్‌ సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఈ బాండ్లు రాజకీయ పార్టీలకు ఇచ్చే గుప్త దానాలను చట్టబద్ధం చేయడమేనని తెగేసి చెప్పింది.
తాజాగా ఎన్నికల సంఘం ఈ అక్రమానికి అడ్డుకట్ట వేయడంకోసం చిరు ప్రయత్నం మొదలెట్టినట్టు కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్‌ ప్రధానాధి కారి రాజీవ్‌ కుమార్‌ కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్‌ రిజుజుకు ఓ ప్రతిపాదన పంపించారు. దాని ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనేక సవరణలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం 29 సి సెక్షన్‌ ప్రకారం రాజకీయ పార్టీలు రూ. 20,000 కన్నా ఎక్కువ విరాళాలిచ్చిన దాతల పేర్లే ఎన్నికల కమిషన్‌కు తెలియ జేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే రూ. 2,000 కన్నా మించి విరాళాలిచ్చే వారి పేర్లు ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాల్సి వస్తుంది. అయితే గుప్తదానాల మొత్తాన్ని రూ. 20,000 నుంచి రూ. 2000కు తగ్గించినంత మాత్రాన రాజకీయ పార్టీలకు కావలసినన్ని విరాళాలు అందడానికి ఎలాంటి అవాంతరమూ ఉండదు. మహా అయితే దీనివల్ల రాజకీయ పార్టీలకు లెక్కలు డొక్కలు రాసి చూపాల్సిన గుమాస్తాగిరి పెరుగుతుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు రూ. 2000 లోపు అయితే కూపన్ల ద్వారా విరాళాలు స్వీకరిస్తున్నాయి. ఈ పద్ధతి ఎన్నికల కమిషన్‌ కన్నుగప్పడానికి రాజకీయ పార్టీలకు ఉపకరిస్తోంది. అలాగే ఏడాదికి ఈ విరాళాలు రూ. 20 కోట్లు మించకూడదని ఎన్నికల కమిషన్‌ ఆంక్ష విధించా లనుకుంటోంది. ప్రస్తుతం కూపన్ల ద్వారా రాజకీయ పార్టీలు వందల కోట్ల విరాళాలు స్వీకరిస్తున్నాయి. 20 కోట్లు మించి విరాళాలు స్వీకరించకూడ దన్న ఆంక్ష అమలులోకి వస్తే రాజకీయ పార్టీలు ఇబ్బంది పడొచ్చు. నిజానికి ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదనల ప్రకారం చిన్న చిన్న మొత్తాల్లో స్వీకరించే విరాళాలు రూ. 20 కోట్లు మించకూడదంటే చిన్న పార్టీలకే ఎక్కువ నష్టం. బడా కంపెనీలు ఎటూ చిన్న పార్టీలకు విరాళాలివ్వవు. పైగా బడా కంపెనీలు ప్రతిపక్ష పార్టీలకు విరాళాలివ్వడానికి జడుస్తాయి. అలాంటి కంపెనీల మీద కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌ లాంటివాటిని ఎక్కడ ప్రయోగిస్తోందో అన్న భయం పీడిస్తూనే ఉంటుంది. బీజేపీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వార్షిక లెక్కల ప్రకారం 2017-18లో బాండ్ల ద్వారా 219 కోట్లు సమకూరాయి. అంటే బాండ్ల రూపంలో అందిన విరాళాల్లో 95 శాతం బీజేపీకే దక్కాయి. 2018-19లో బీజేపీకి బాండ్ల రూపంలో అందిన మొత్తం రూ.1,450.89 కోట్లు. అదే 2019-20లో రూ. 2555 కోట్లకు పెరిగింది. ఎన్నికల బాండ్లు బీజేపీకి గుప్త దానాల రూపంలో వరప్రసాదమై కూర్చు న్నాయి. ఈ ధోరణిని నివారించకుండా ధన ప్రభావానికి అడ్డుకట్ట వేయడం ఎలా సాధ్యమో తెలియదు. ఎన్నికల కమిషన్‌ తాజా ప్రతిపాదనలు ఎన్నికల బాండ్ల గురించి ప్రస్తావించడం లేదు. వేల కోట్ల రూపాయలు బీజేపీకి ఏ బడా వ్యాపారస్థుల నుంచి అందుతున్నాయో నికరంగా చెప్పడం కుదరదు కానీ ఊహించడానికి అతీతమైంది కాదు. అసలు అడ్డుకట్ట ఇక్కడ పడకపోతే అవినీతే రాజ్యమేలుతుంది. సుప్రీంకోర్టు ఎప్పుడు తీరిక చేసుకుని ఎన్నికల బాండ్ల కేసు తేలుస్తుందో ఎటూ తెలియదు. బడా కంపెనీలు ఇచ్చే విరాళాల ఆధారంగానే ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయని ఎన్నికల బాండ్ల పద్ధతే నిరూపిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img