Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

గులాం నబీ గురువింద తత్వం

గురువింద గింజలు పైకి ఎర్రగానే కనిపిస్తాయి. కొంత నలుపూ ఉంటుంది. దాన్ని గురువింద గింజలు ఎటూ గుర్తించ లేవు కానీ గ్రహించగలిగినంత జ్ఞానం ఉన్న వారు తమలో ఉన్న నలుపును అంగీకరించలేరు. కాంగ్రెస్‌ నుంచి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్‌ అలాంటి వారే. పదవి లేకపోతే బతకలేని తత్వం చాలా మంది రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా కాంగ్రెస్‌ నేతల్లో అపారం. ఆ తత్వం ఆజాద్‌ లోనూ ఉంది. గత ఫిబ్రవరిలో ఆయన రాజ్యసభ సభ్యత్వ గడువు ముగిసింది. 2009 నుంచి 2021 ఫిబ్రవరి దాకా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజ్యసభ సభ్యత్వం ముగిసినప్పుడు ఆయనకు 72 ఏళ్లు. కాంగ్రెస్‌ మళ్లీ ఆయనను రాజ్యసభకు పంపిస్తుందని, పంపించాలనీ ఆయన అనుకున్నారు. అది కుదరలేదు. ఆ విషయం ఆయనకు ముందే తెలుసు. అందుకే రాజ్యసభలో ఆఖరి ప్రసంగంలో గులాం నబీ ఆజాద్‌ కంట తడి పెట్టుకున్నారు. ప్రధానమంత్రి మోదీ కూడా కంటతడి పెట్టి తన ప్రత్యర్థి పార్టీ నాయకుడికి సంఫీుభావం ప్రకటించారు. మోదీ కన్నీళ్లు కేవలం భావోద్వేగ పూరితమైనవి కావు. లాభం లేకుండా ఆయన ఏ పనీ చేయరు. గులాం నబీ ఆజాద్‌ ను తమ పార్టీ వేపు ఆకర్షించాలని మోదీ అనుకున్నారు. తమ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం ఇస్తామన్నారు. ఎందుకనో ఆజాద్‌ సమ్మతించలేదు. కానీ ఆరు నెలల పదవీ వియోగాన్ని భరించలేకపోయారనిపిస్తుంది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అక్కడితో ఆగకుండా తాను ఇన్నాళ్లు నమ్ముకున్న, అభిమానించిన, లబ్ధి పొందిన సోనియా గాంధీ కుటుంబం మీద అనేక విమర్శలు చేశారు. ఆ విమర్శలన్నీ వాస్తవమే అయి ఉండొచ్చు. కాంగ్రెస్‌ లో వ్యక్తి ఆరాధన పెరిగిపోతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం మృగ్యం అని ఆజాద్‌ రాజీనామా చేయాలనుకున్నప్పుడే గుర్తుకు రావడం ఏదో కొత్త విషయం కనిపెట్టినట్టు భ్రమింప చేయడానికే. కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించి అనేక పదవులు అనుభవించిన వ్యక్తికి ఆ లోపాలతో సంబంధం లేదంటే ఎలా నమ్మగలం! కాంగ్రెస్‌ లో ఆజాద్‌ పేర్కొన్న రుగ్మతలన్నీ ఉన్నాయి. కాదనలేం. అవి ఆయనకు ఇంత ఆలస్యంగా గుర్తుకు రావడమే ఆశ్చర్యం. గులాం నబీ ఆజాద్‌ ఆ వ్యక్తి ఆరాధనా తత్వం వల్లే లబ్ధి పొందారు. సంజయ్‌ గాంధీని ఆశ్రయించి నాయకుడిగా అవతరించారు. వ్యక్తి ఆరాధనకు పేరుమోసిన వారిని రాహుల్‌ గాంధీ హయాంలో గానీ, ఆయన ఆధిపత్యం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలోనూ ఆజాద్‌ను పక్కన పెట్టి ఉంటే ఆయన పేరును జనం ఎప్పుడో మరిచిపోయి ఉండేవారు. రాజీవ్‌ గాంధీ హయాంలోనూ వ్యక్తి ఆరాధన, ఇందిరా గాంధీ కుటుంబంపట్ల విశ్వాస పాత్రతే ఆజాద్‌ ను రాజకీయాల్లో కొనసాగేలా చేసింది. ప్రజా బలం అంతగా లేకపోయినా కాంగ్రెస్‌ అగ్ర నాయకుల్లో ఒకడిగా చెలామణి అయ్యారు. ఆయన కీలకమైన జమ్మూ-కశ్మీర్‌కు 2005 నుంచి 2008 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న మాట వాస్తవమే. అదీ కాంగ్రెస్‌ అధిష్ఠానం చలవ వల్లే. ఆయన జమ్మూ కశ్మీర్‌ నుంచి ఒకే ఒక్క సారి ఉద్ధం పూర్‌ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014లో మళ్లీ పోటీ చేసినా గెలవలేదు. 1980-89 మధ్య మహారాష్ట్రలోని వసిం నియోజక వర్గం నుంచి లోకసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తరవాత రెండు దఫాలు రాజ్యసభ సభ్యుడే.
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌ లో ఆజాద్‌ కు దక్కని పదవే లేదు. కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఐ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శి హోదాలో అనేక రాష్ట్రాల కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్ష కుడిగా ఉన్నారు. ఆయన సొంత రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు జమ్మూ-కశ్మీర్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న వికార్‌ రసూల్‌ వని ఆజాద్‌ కు ప్రియశిష్యుడే. ఆజాద్‌ ప్రోద్బలం మీదే వనీ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యారు. ఆజాద్‌ కాంగ్రెస్‌ కు రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే మాజీ మంత్రులు జి.ఎం.సరూరి, ఆర్‌.ఎస్‌.చిబ్‌బీ నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎమ్మెల్సీలు హాజీ అబ్దుల్‌ రషీద్‌, మహమ్మద్‌ అమీన్‌ భట్‌, గుల్జార్‌ అహమద్‌ వనీ, చౌదరీ మహమ్మద్‌ అక్రం కూడా కాంగ్రెస్‌ నుంచి తప్పుకున్నారు. మరో మాజీ మంత్రి జుగల్‌ శర్మ, మాజీ ఎమ్మెల్సీ నరేశ్‌ గుప్తా తామూ ఆజాద్‌ వెంటే అంటున్నారు. మరి కొంత మంది కూడా రాజీనామా చేయవచ్చు. కశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న గందరగోళ పరిస్థితిని చక్క దిద్దే సామర్థ్యం ఆజాద్‌కే ఉందని వారి విశ్వాసం. ఆజాద్‌ బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు సాగుతున్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేయడం మీదే మొగ్గు చూపుతున్నారు. మోదీ దయదలిచి నప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న మునుపటి జమ్మూ-కశ్మీర్‌లో ఎన్నికలు జరగకపోవు. అప్పటికి అందులో ఒక ముక్కలో అయినా అధికారం సంపాదించాలన్నది ఆజాద్‌ ప్రయత్నంలా ఉంది. ఆజాద్‌ కాంగ్రెస్‌ నుంచి బయట పడతారన్న సంకేతాలు ఇటీవలే కనిపించాయి. జమ్మూ-కశ్మీర్‌లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీకి, రాజకీయ వ్యవహారాల కమిటీకి అధిపతిగా నియమించిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేసి తన అసంతృప్తి ప్రదర్శించారు. ఇప్పుడు సోనియా గాంధీకి రాసిన అయిదు పేజీల లేఖలో ఆ అసంతృప్తినే ఆగ్రహ రూపంలో వెళ్లగక్కారు. ఆయన ఎత్తి చూపిన లోపాలన్నీ కాంగ్రెస్‌ లో నాటుకు పోవడానికి ఇందిరా గాంధీ కుటుంబం బాధ్యత ఎంత ఉందో వారి భక్తుడిగా చాలా కాలం నుంచి మెలగుతున్న ఆజాద్‌ ఖాతాలో కొంతైనా ఉండదా! అయితే జమ్మూ-కశ్మీర్‌ లో ఆజాదే కాంగ్రెస్‌ కు దిక్కు అన్నది కూడా నిజమే. ఆయన జమ్మూ ప్రాంతానికి చెందిన వాడైనా కశ్మీర్‌ లో కూడా కొంత పలుకుబడి ఉంది. జమ్మూలో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. అక్కడ గుజ్జర్లు, బకర్వాలాల సంఖ్య ఎక్కువ. వారిలో ఆజాద్‌ కు ఆదరణ ఉంది. నేషనల్‌ కాన్‌న్ఫరెన్స్‌, పి.డి.పి. లాంటి పార్టీల ప్రభావం కశ్మీర్‌ లోయలోనే ఎక్కువ. జమ్మూ, ఇతర ప్రాంతాల్లో ఈ పార్టీలకు ఉన్న కొద్ది పాటి పలుకుబడి బీజేపీ పుణ్యమా అని హరించుకు పోయింది. పాంథర్స్‌ పార్టీ లాంటివి ఆమ్‌ ఆద్మీ పార్టీ, అప్నీ పార్టీతో సఖ్యంగా ఉంటున్నాయి. ఆజాద్‌ కొత్త పార్టీ పెట్టొచ్చు. విజయం సాధించినా అది అంతిమంగా బీజేపీకే ఉపకరిస్తుంది. అంటే పంజాబ్‌ లో కెప్టెన్‌ అమరేంద్ర సింగ్‌ లాగానే పరోక్షంగా బీజేపీకి మేలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారన్న మాట.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img