Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గోడ దెబ్బ చెంప దెబ్బ

కేంద్ర దర్యాప్తు సంస్థ, ఆదాయపు పన్ను శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ లాంటి వ్యవస్థలను మోదీ ప్రభుత్వం ఎడా పెడా దుర్వినియోగం చేసి తమకు వ్యతిరేకులనుకునే వారి మీద ప్రయోగించడం పరిపాటి అయిపోయింది. సీబీఐ పని తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ ఇటీవలే ప్రతికూల వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. తమను విమర్శించే రాజకీయ నాయకుల మీదే కాకుండా రచయితలు, పత్రికా రచయితలు, సామాజిక కార్యకర్తలు మొదలైన వారిని వేధించడానికి ఈ వ్యవస్థలను దుర్వినియోగం చేయడం బాగా పెచ్చరిల్లింది. అయితే మోదీ సర్కారు ఈ నడవడికకు గత వారం రోజుల్లో రెండు సార్లు చుక్కెదురైంది. మార్చి 29న లండన్‌లో ప్రసంగించడానికి వెళ్లాల్సిన ప్రసిద్ధ పత్రికా రచయిత రాణా అయూబ్‌ను ముంబైలో విమానం ఎక్కకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ ఆదేశాల మేరకు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆపేశారు. ఆమె కోర్టుకెక్కితే విదేశాలకు వెళ్లకుండా ఆమెను నిరోధించడం కుదరదని న్యాయమూర్తి చంద్రధారి సింగ్‌ అనుమతి మంజూరు చేశారు. ఈ చేదు అనుభవం ఎదురై వారం అయినా తిరక్కుండానే మరో ప్రసిద్ధ పత్రికా రచయిత ఆకార్‌ పటేల్‌ అమెరికా వెళ్లడానికి బెంగుళూరు విమానాశ్రయానికి వెళ్తే సీబీఐ లుక్‌ ఔట్‌ ఉత్తర్వు ఉందన్న సాకుతో ఆయన ప్రయాణించకుండా చేశారు. ఆయన దిల్లీలోని చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయ స్థానంలో అర్జీ పెట్టుకుంటే ఆయనను విదేశాలకు వెళ్లకుండా నిరోధించడం కుదరదని చెప్పడమేగాకుండా సీబీఐ జారీ చేసిన లుక్‌ అవుట్‌ ఉత్తర్వును తక్షణం ఉపసంహరించాలని మెట్రో పాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి పవన్‌ కుమార్‌ ఆదేశించారు. అక్కడితో ఆగినా తమకు గిట్టని వారి మీద కక్ష తీర్చుకోవడానికి సీబీఐని వినియోగించుకుంటున్న వారికి పరువైనా మిగిలి ఉండేది. కానీ ఆకార్‌ పటేల్‌ విషయంలో అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డందుకు సీబీఐ డైరెక్టర్‌ స్వయంగా లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలని కూడా దిల్లీ కోర్టు న్యాయమూర్తి పవన్‌ కుమార్‌ ఆదేశించారు. అంటే ఈ రెండు కేసుల్లోనూ కేంద్ర ప్రభుత్వానికి గోడ దెబ్బ చెంప దెబ్బ ఒకే సారి తగిలాయి. ఈ రెండు సందర్భాలలోనూ వేర్వేరు న్యాయమూర్తులు లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌.ఓ.సి.) రద్దు చేయాలని ఆదేశించడం విశేషం. రాణా అయూబ్‌ కేసులో అయితే ఆమెను విదేశాలకు వెళ్లకుండా నిలిపివేయడం ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. విచారణకు హాజరు కావాలని దర్యాప్తు సంస్థలు ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించిన వారి విషయంలో మాత్రమే ఎల్‌.ఓ.సి.లు జారీ చేయాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ రెండు సందర్భాలలోనూ ఈ ఎల్‌.ఓ.సి. లు న్యాయస్థానానికి వెళ్తే నిలబడేవి కావని అనడం ప్రభుత్వానికి మరింత అవమానకరం. బెయిలుకు వీలు లేని వారెంట్‌ జారీ చేసినా న్యాయస్థానం ఎదుట హాజరు కానప్పుడు మాత్రమే ఇలాంటి ఆదేశాలు జారీ చేయాలని కూడా ఇద్దరు వేర్వేరు న్యాయమూర్తులు చెప్పడం ఇంకా న్యాయం అడుగంటలేదన్న ఆశ మిగులుస్తోంది. ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌ విచారణకు హాజరు కావాలని కోరినప్పుడల్లా రాణా అయూబ్‌ హాజరవుతూనే వచ్చారు. అందువల్ల ఆమె విచారణకు హాజరు కాకుండా తప్పించుకునే అవకాశం ఎక్కడిదని న్యాయమూర్తి మందలించే ధోరణిలో మాట్లాడారు. అయితే రాణా అయూబ్‌ విదేశాలకు వెళ్లదలచుకుంటే తాను ఎప్పుడు ప్రయాణించేది, ఏయే ప్రాంతాలకు వెళ్లేది తెలియజేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. అయితే రాణా అయూబ్‌ లక్ష రూపాయలు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరొక్టరేట్‌ దగ్గర జమ చేయా లని ఏప్రిల్‌ 11వ తేదీలోగా తిరిగి రావాలని న్యాయమూర్తి ఆదేశించారు. తిరిగి వచ్చిన తరవాత ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టొరేట్‌ అధికారులు ఎప్పుడు విచారణకు రమ్మన్నా హాజరు కావాలని కూడా న్యాయస్థానం చెప్పింది.
రాణా అయూబ్‌ అక్రమ సంపాదనను చెలామణిలో పెడ్తున్నారన్నది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ వాదన. రాణా అయూబ్‌ మీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేటు, ఆకార్‌ పటేల్‌ మీద సీబీఐ కత్తిగట్టినట్టు ప్రవర్తించడానికి కారణం ఈ ఇద్దరు పత్రికా రచయితలూ బీజేపీ సర్కారు అనుసరిస్తున్న మతతత్వ విధానాలను ఎండగట్టిన వారే. గుజరాత్‌ మారణ కాండ జరిగిన తరవాత కొన్నేళ్లకు రాణా అయూబ్‌ ఆ మారణ హోమంపై లోతైన పరిశోధన చేశారు. దీనికోసం ఆమె దాదాపు కొన్ని నెలలపాటు మారు వేషంలో, మారు పేరుతో గుజరాత్‌లో సంచరించవలసి వచ్చింది. అయితే ఆమె చేపట్టిన పరిశోధనాత్మక పత్రికా రచన మతతత్వ శక్తుల దురాగతాలను ఎండగట్టింది. విచిత్రం ఏమిటంటే ఆ సమయంలో ఆమె తెహల్కా పత్రికలో పని చేసేవారు. అయితే ఆమె రాసిన వార్తలను ఆ పత్రిక ప్రచురించలేదు. ఆందువల్ల ఆమె ‘‘గుజరాత్‌ ఫైల్స్‌’’ పేర ఓ గ్రంథమే ప్రచురించారు. ఆమె కొనసాగించిన పరిశోధనలో దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వ్యక్తమైనాయి. అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు, బీజేపీ స్థానిక నాయకులు తాము చేసిన ‘‘ఘన కార్యాలను’’ అంగీకరించారు. వీటినన్నింటినీ రాణా అయూబ్‌ ‘‘గుజరాత్‌ ఫైల్స్‌’’ గ్రంథంలో పూసగుచ్చినట్టు వివరించారు. అదువల్ల బీజేపీ సర్కారు ఆమెను వేధించే మార్గాలు అన్వేషించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. రాణా అయూబ్‌ అక్రమ సంపాదనను చెలామణిలోకి తీసుకొచ్చారన్న ఆరోపణల దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేటు ఆమె బ్యాంకు ఖాతాలోని రూ. 1.77 కోట్లను స్తంభింప చేసింది. అడిగిన అన్ని పత్రాలు అందజేసినా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ మాత్రం వేధించడం ఆపలేదు. ఆమె విదేశాలకు వెళ్తే తిరిగి రారు అన్న అధికార వర్గాల తరఫున వాదించిన అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి. రాజా వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘‘అయూబ్‌ మీద వెయ్యి కోట్లు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలైతే లేవుగా! మహా అయితే ఆ మొత్తం పది కోట్లో, ఇరవై కోట్లో కావచ్చు. ఇప్పటికే మీరు ఆమె బ్యాంకు ఖాతా స్తంభింప చేశారుగా?’’ అని న్యాయమూర్తి నిలదీశారు. ఆకార్‌ పటేల్‌ కేసులో ఉత్తర్వు జారీ చేసిన న్యాయమూర్తి వ్యాఖ్యలు, ఆదేశాలు సీబీఐకి తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయి. సమయానికి అమెరికా వెళ్లలేనం దువల్ల కలిగిన ఆర్థిక నష్టానికి పరిహారం పొందడానికి పటేల్‌ తగిన అధికార వ్యవస్థను సంప్రదించ వచ్చునని న్యాయమూర్తి అన్నారు. ఆకార్‌ పటేల్‌కు ఆర్థిక నష్టం మాత్రమే కలగలేదు. అపారమైన మానసిక క్షోభ అనుభవించారు అని న్యాయమూర్తి అన్నారు. ఈ వ్యవహారంలో సీబీఐ డైరెక్టర్‌ స్వయంగా లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్తే ఆ సంస్థ మీద కొంతైనా గౌరవం మిగులుతుందని కూడా న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు. పటేల్‌కు వ్యతిరేకంగా జారీ చేసిన ఎల్‌.ఓ.సి. న్యాయపరీక్షకు ఎటూ నిలబడేది కాదని కూడా న్యాయమూర్తి నిర్మొహ మాటంగానే చెప్పారు. ఆయనకు క్షమాపణ చెప్పినట్టు న్యాయస్థానానికి నివేదిం చాలని కూడా ఆదేశించారు. తమ చేతిలో ఉన్న వ్యవస్థలను ప్రభుత్వం ఎంతగా దుర్వినియోగం చేస్తోంది అని చెప్పడానికి ఈ రెండు ఉదంతాలు చాలుగదా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img