Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

చట్టసభల్లో నేరచరితులు

చట్ట సభలకు ఎన్నికవుతున్న నేరచరితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నదే కానీ తరగడంలేదు. అయితే వీరి జాబితాలో నమోదవుతున్న కేసులకంటే కేసులు కూడా నమోదుకాని వారు అనేక వేలమంది ఉంటారు. అంటే నేరం రాజకీయ రంగంలో ఊహించలేని స్థాయిలో పెరిగింది. వీటిలో హత్యలు, అక్రమార్జన, లైంగికదాడులు తదితర కేసులున్నాయి. ఏళ్ల తరబడి పెండిరగ్‌లో ఉన్న కేసుల వివరాలను సీనియర్‌ న్యాయవాది, కోర్టుకు సహకరించడానికి పనిచేసిన అమికస్‌ క్యూరి విజయ్‌ హన్సారియా తన17 వ నివేదికను సుప్రీంకోర్టుకు వారం క్రితం సమర్పించారు. వీరిలో 51మంది ఎమ్మెల్యేలు, 71 మంది ఎంపీలు ఉన్నారు. వీరంతా నిధులు దుర్వినియోగంచేసి అక్రమాస్తులను పెంచుకున్నారని కేసులున్నాయి. అయితే ప్రస్తుతం చట్ట సభలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంత మంది, మాజీలు ఎంతమంది అన్న వివరాలు పేర్కొనలేదు. కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రస్తుత నేరస్థుల జాబితా ఆధారంగా నివేదిక తయారైంది. 2021 డిసెంబరు నాటికి విచారణ పెండిరగ్‌లో ఉన్న కేసులు 4,984. వీటిలో ఐదేళ్లకుపైగా పెండిరగ్‌లో ఉన్నవి 1,899. రెండు`ఐదేళ్ల మధ్యలో 1475 కేసులు, 2018 అక్టోబరు 4 నాటికి రెండేళ్లలోపు పెండిరగ్‌లో ఉన్నవి 1,599. కాగా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ ద్వారా పరిష్కారం అయినవి 2,775 అని నివేదిక పేర్కొంది. ఇదే అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా గత ఫిబ్రవరిలో ఇచ్చిన నివేదికలో క్రిమినల్‌ కేసులున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య ఐదువేలకుపైగా ఉందని, చట్టసభలకు ఎన్నికవుతున్న నేరస్థుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఏడాదిలోపే విచారించాలని 2011లోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఎందుకు విచారణ జరిపి పరిష్కరించలేదన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల పలుకుబడి, డబ్బు ప్రభావం చూపుతున్నాయి. లేనిపోని కారణాలతో విచారణ వాయిదావేయడం, సాక్షులను ఒత్తిడిచేయడం, బెదిరించడంలాంటి అంశాలు విచారణ వేగంగా పూర్తికావడానికి అడ్డుపడుతున్నాయి. ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన 16 మందిలో 8మంది అనినీతిపరులని మాజీ న్యాయమూర్తి, సీనియర్‌ న్యాయవాది శాంతిభూషణ్‌ 2010లో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక దిగువస్థాయి కోర్టుల్లో పనిచేస్తున్నవారు ఎలా వ్యవహరిస్తారని ఊహించలేని విషయం కాదు. నేడు పరిస్థితులు కోర్టులను ప్రభావితం చేసి పాలకులు తమ పనులు నెరవేర్చుకుంటున్నారనేది రహస్యమేమీ కాదు. ఈ స్థితిలో దశాబ్దిక్రితం గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.జె ముఖోపాధ్యాయ విభ్రాంతిగొలిపే వ్యాఖ్య చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవ్యవస్థలో ఎవరినైౖనా కొనుగోలు చేయవచ్చునని అన్నారు. ఈ నేపధ్యంలో రాజకీయ నాయకులు తమపైనగల ఎంతటి తీవ్రమైన నేరాల నుండి అయినా తప్పించుకోవచ్చు. విచారణను ఎన్ని నెలలు, సంవత్సరాలైనా సాగదీయవచ్చు. సుప్రీంకోర్టులో సైతం అత్యవసరంగా విచారణ చేపట్టవలసిన పిటిషన్ల జాబితాను తయారుచేయడంలోనూ కావాలని ఆలస్యం చేస్తున్న సిబ్బంది ఉన్నారని ప్రధాన న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించిన విషయం తెలిసింది. ప్రస్తుతం ఎంతటి నేరస్థుడైతే అంత ఎక్కువగా రాజకీయాలలో చేరడం, పాలకుల ఆశ్రయం, రక్షణ పొందుతున్నారు. తీవ్రమైన నేరారోపణలు ఉన్నప్పటికీ బీజేపీలో చేరితే కేసులు మాయమవుతాయని ప్రజల్లో విస్తృతంగా ఉన్న అభిప్రాయం.
ఈడీ, సీబీఐ కేసులకు అజమాయిషీ కమిటీని నియమించాలని హన్సారియా తన నివేదికలో సిఫారసు చేశారు. అయితే ఈ కమిటీని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని అయన సూచించారు. ఇది డైరెక్టరు లేదా అదనపు డైరెక్టరు స్థాయికితగ్గని అధికారిని డైరెక్టరు నామినీగా కమిటీని ఏర్పాటు చేయవచ్చు. అలాగే కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేదా ఆయా సంయుక్త కార్యదర్శిస్థాయికి తగ్గని అధికారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయవచ్చు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల కాలంలో సైతం ప్రజాప్రతినిధులలో నేరచరితలున్నప్పటికీ బీజేపీ పాలనలో వీరి సంఖ్య అపారంగా పెరిగిందనేది మనకు కనిపిస్తున్న దృశ్యమే. నేర చరిత జాబితాను తయారుచేస్తున్న హన్సారియా చేతికి ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘర్‌, ఉత్తరాఖండ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి అందలేదు. అయా రాష్ట్ర ప్రభుత్వాల అలక్ష్యం కావచ్చు లేదా కావాలని పాలకులు తొక్కిపెట్టి ఉండవచ్చు.
కర్ణాటకలో అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువగా కేసులు పెండిరగ్‌లో ఉన్నాయని గత ఫిబ్రవరిలో అమికస్‌ క్యూరీ సుప్రీం కోర్టుకు అందించిన నివేదిక పేర్కొంది. కర్ణాటకలో యావజ్జీవ శిక్ష పడదగిన కేసులు 58 ఉండగా, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపైనే 14 ఉన్నాయి. ఇక ఓబుళాపురం బొగ్గుగనుల తవ్వకం కేసుకు సంబంధించిన కేసు చాలా కాలంగా పెండిరగ్‌లో ఉంది. ఇందుకు కారణం బీజేపీ నేతలేనన్న ఆరోపణలు ఉన్నాయి. చట్టబద్దపాలన లోపించి మతరాజకీయాల ప్రభావం వేళ్లూనుకుపోయిన పరిస్థితుల్లో మంత్రులతో సహా అక్రమార్జనకు పాల్పడటం, హత్యలు చేయడం, అత్యాచారాలు చేసి చంపివేయడం లాంటి రాజకీయ నాయకులు అనేకమంది కేసులు లేకుండా ముందే తప్పించుకుంటున్నారు. పోలీసు వ్యవస్థలో బ్రిటీషుపాలనలో అమలు చేసిన క్రూర చట్టాలకు మరింతగా పదునుపెట్టి అమాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్న ధోరణి పెరిగిపోయింది. లఖింపూర్‌ ఖేరిలో రైతుల మరణాలకు కారణమైన కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడిని అరెస్టు చేయడానికే చాలా రోజులు పట్టింది. ఇందుకు కారణం అక్కడి బీజేపీ ప్రభుత్వం, పోలీసులు కాదా? బీజేపీ ప్రతినిధులు ఎలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినవారైనా, అక్రమార్జన పరులు, హత్యాకేసుల ఆరోపణలున్న నేరచరితులు చట్టసభల్లో ప్రవేశిస్తున్నారు.
రాజ్యాంగ పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులపైన నేరచరితులన్న ముద్రపడినప్పటికీ తిరిగి వారే చట్టసభలకు ఎన్నిక కావడం నేటి వైచిత్రం, విషాదం. సమూలంగా ఎన్నికల సంస్కరణలు తీసుకువస్తేనే నేరస్థులను రాజకీయాలకు దూరంగా ఉంచేందుకు అవకాశం కలుగు తుంది. బహుశా అలాంటి సంస్కరణలు, ప్రజానుకూల మార్పులు, చట్టబద్దపాలనను ఆశించడం కష్టమే. రాజ్యాంగం సక్రమంగా అమలుచేసే ప్రజాస్వామ్యం మనుగడ సాగించుకోవలసింది ప్రజలే. నిజాయితీ పరులను, నేరారోపణలు లేని వారిని, రాజనీతిజ్ఞతగల వారిని ఎన్నుకోవడం మంచి పరిష్కారం అవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img