Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

చెప్పుకోదగ్గ విజయమే!

కనీవినీ ఎరుగనిరీతిలో అత్యంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న దిల్లీ మేయర్‌ ఎన్నికకు ఎట్టకేలకు హర్షాతిరేకాలు, చప్పట్ల నడుమ ప్రశాంతంగా తెరపడిరది. ప్రజాస్వామ్య హితైషుల ఆకాంక్షలకు ఈ ఎన్నిక నిలువుటద్దంగా నిలిచింది. దిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్‌ ఎన్నికయ్యారు. దేశ రాజధాని దిల్లీలో హోరా హోరీగా సాగిన పోరులో ఆమె విజయం సాధించారు. ఇది ఒక్క ఆప్‌ విజయం మాత్రమే కాదు.. లౌకిక, ప్రజాస్వామికవాదుల గెలుపు. ఎన్నో మలుపులు తిరిగిన ఎన్నికల ప్రక్రియ చివరకు పరిణతిచెందిన దిల్లీ ప్రజల ఆలోచనకు, సానుకూల తీర్పుకు సరైన ముగింపునిచ్చింది. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఆప్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ గెలవడంతో రెండు అతిపెద్ద ప్రమాదాలకు అడ్డుకట్ట వేసినట్లయింది. మొదటిది, గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణ పోకడలకు ఈ విజయం సవాల్‌ను విసిరింది. ఇక రెండవది, మోదీ ప్రభుత్వ అధికార దాహానికి తాత్కాలికంగానైనా అడ్డంకొట్టడం మనసుకు హాయిగా అనిపించింది.
మొత్తం 266 ఓట్లు పోల్‌ కాగా.. షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఓట్లు, రేఖా గుప్తాకు 116 ఓట్లు దక్కాయి. దీంతో దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఆప్‌ శ్రేణుల సంబరాలు అంబరాన్ని తాకుతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలోనే అత్యంత కట్టుదిట్ట మైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించిన ఈ ఎన్నికల్లో కొత్త మేయర్‌ను అభినందిస్తూ.. ‘ప్రజలు గెలిచార’ని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ చేసిన ట్వీట్‌ మోదీషా ద్వయానికి చిరాకుపుట్టించేదే.
పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీజేపీయేతర మేయర్‌ బాధ్యతలు చేపట్టడం శుభసూచకం. దిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగినప్పటి నుంచే వివాదం నడుస్తూనే వుంది. మేయర్‌ ఎన్నిక మూడుసార్లు వాయిదా పడిరది. నిజానికి ఇది కొత్త కార్పొరేషన్‌. దశాబ్ధకాలం క్రితం దిల్లీలో మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు వుండేవి. కేంద్రీకృత రాజకీయాలకు అలవాటుపడిన మోదీషా ఈ మూడు కార్పొరేషన్లను విలీనం చేసి, ఒకటిగా మార్చారు. ఈ మున్సిపోల్స్‌లో గెలవడం ద్వారా కేజ్రీవాల్‌కు పాన్‌ తినిపించాలని అమితంగా ఆశించారు. కానీ, గతేడాది డిసెంబర్‌లో జరిగిన దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలో అనూహ్యంగా ఆప్‌ ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్‌(126)ను దాటి.. ఏకంగా 134 స్థానాలను కైవసం చేసుకుంది. మెజారిటీ ప్రకారం, రాజ్యాంగ సూత్రాల ప్రకారం, మేయర్‌ పదవి ఆప్‌కే దక్కాలి. కాకపోతే అడ్డదారులు తొక్కి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అలవాటుపడిన మోదీషా అసాధ్యమైన ప్రక్రియను అనైతికంగా సుసాధ్యం చేయాలని తలంచింది. ఆ క్రమంలోనే నామినేటెడ్‌ పోస్టులద్వారా తమకు తాము రాసుకున్న అక్రమ సంఖ్యాశాస్త్రాన్ని అమలు చేయడానికి పూనుకున్నది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్‌ కౌన్సిలర్లతో ప్రిసైడిరగ్‌ అధికారి ప్రమాణస్వీకారం చేయించడం వివాదానికి దారితీసింది. పైగా సభాధ్యక్ష పదవికి సీనియారిటీని పక్కనబెట్టి, తమ అనుయాయుడ్ని పెట్టుకున్నారు. సహజంగానే దీన్ని ఆప్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆప్‌, బీజేపీ మధ్య వాగ్వాదం తలెత్తడం, ఎన్నిక ప్రక్రియ మూడుసార్లు వాయిదా పడిన ఉదంతం సర్వవిధితమే. ఈ తరుణంలో మేయర్‌ ఎన్నికను బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపిస్తూ ఆప్‌ మేయర్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలువరించి, ప్రజాస్వామ్య విలువలను మరోసారి పరిరక్షించింది. మేయర్‌ ఎన్నికలో నామినేటెడ్‌ సభ్యులు ఓటువేయరాదని తేల్చి చెప్పింది. అంతేగాక, దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంసీడీ) సమావేశానికి 24 గంటల్లో నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశం బుధవారం నిర్వహించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా అనుమతించడంతో తొలి సమావేశంలోనే మేయర్‌ ఎన్నిక నిర్వహించగా ఆప్‌ విజయం సాధించడంతో 15 ఏళ్ల తర్వాత తొలిసారి బీజేపీ నుంచి మేయర్‌ పీఠం చేజారినట్టయింది.
సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత కూడా మోదీషా తమ కుయుక్తులు ఆపలేదు. ఆప్‌ కార్పొరేటర్లకు తాయిలాలు చూపించడం లాంటి చిలక్కొట్టుడు వ్యవహారాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పైగా దిల్లీ నుంచి ఎన్నికైన ఏడుగురు లోక్‌సభ సభ్యులు, ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఒక శాసనసభ సభ్యుడికి ఈ ఎన్నికలో ఓటేసే అధికారం వుంది. ఆ ప్రయత్నమూ బెడిసికొట్టింది. దిల్లీ శాసనసభ స్పీకర్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన 13 మందిని నామినేట్‌చేసే అవకాశం వున్నప్పటికీ, అది అనైతికమని భావించిన ఆప్‌ ఆ పనిచేయలేదు. ముప్పేట దాడులతో ఆమ్‌ ఆద్మీ పార్టీని ఇరుకున పెట్టాలని చూసిన బీజేపీ సంకుచిత బుద్ధికి తాజా ఫలితం ఒక గుణపాఠం. అందుకే దీనిని చెప్పుకోదగ్గ విజయంగానే పరిగణించవచ్చు.
మేయర్‌ షెల్లీ ఒబెరాయ్‌ ఆప్‌లో క్రియాశీల యువ మహిళానేతగా వున్నారు. ఆమె వయస్సు 39 ఏళ్లు. దిల్లీ యూనివర్సిటీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇండియన్‌ కామర్స్‌ అసోసియేషన్‌లో శాశ్వత సభ్యురాలు కూడా. హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఆమె.. ఇగ్నో నుంచి స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో పటేల్‌ నగర్‌ (తూర్పు) వార్డు నుంచి బరిలో దిగి తొలిసారి కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఆమెను ఆప్‌ మేయర్‌ అభ్యర్థిగా బరిలో దించారు. ఆప్‌లో యువనేతలకు కొదవలేదు. తాజా విజయంతో మరో యువ మహిళ అత్యంత కీలకమైన స్థానాన్ని కైవసం చేసుకోగలిగారు.
దిల్లీ మేయర్‌ ఎన్నిక ఫలితం మోదీ సర్కారుకు చెంపపెట్టు లాంటిది. దేశ వ్యాప్తంగా మోదీ అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ విజయం లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు బలాన్నిచ్చింది. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి దీటుగా ప్రత్యామ్నాయ శక్తి అవతరించడానికి గల అవకాశాలకు ఊతమిచ్చినట్లయింది. ప్రజాస్వామిక వాదులు ఆశిస్తున్నట్లుగా భవిష్యత్‌ రాజకీయ సానుకూల పరిణామాలకు ఇదొక మేలిమలుపు కాగలదని ఆశిద్దాం!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img