Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జనాగ్రహాన్ని చిదిమేసే చిట్కా

ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఎదురైనా భారతీయ జనతా పార్టీ చింత మళ్లీ అధికారంలోకి రావడం ఎలా అన్న వ్యూహాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగవలసి ఉంది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌ రాష్ట్రాలలో వచ్చే ఫిబ్రవరి-మార్చికల్లా శాసనసభ ఎన్నికలు పూర్తి కావాలి. హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభ గడువు నవంబర్లోనూ, గుజరాత్‌ శాసనసభ గడువు డిసెంబర్‌ లోనూ ముగుస్తుంది. పంజాబ్‌ లో మినహా మిగతా అన్ని రాష్ట్రాలలోనూ బీజేపీయే అధికారంలో ఉంది. మణిపూర్‌లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి. జులైలో రాష్ట్రపతి పదవికి, ఆగస్టులో ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలలో అధికారపార్టీ నిలబెట్టే అభ్యర్థి విజయం సాధించాలన్నా రాష్ట్రాలలో బీజేపీకి తగినంత బలం ఉండాలి. అందువల్ల ఈ ఎన్నికలన్నీ ప్రత్యేకమైనవే. ఉత్తరప్రదేశ్‌ లో యోగీ ఆదిత్యనాథ్‌మీద ఎన్నిఫిర్యాదులున్నా మళ్లీ ఆయన నాయకత్వంలోనే ఎన్నికలు ఎదుర్కోవాలని బీజేపీ నిర్ణయించింది. ఉత్తరాఖండ్‌లో ఇటీవలే ముఖ్యమంత్రిని మార్చారు. గుజరాత్‌లో విజయ్‌ రూపానీ ప్రభుత్వంపై అనేక ఫిర్యాదులున్నాయి. ప్రజలలో ఆయన పాలనపై అసంతృప్తి బాగా ఉంది. కరోనాను ఎదుర్కోవడంలో ఆయన ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. 2017లో జరిగిన ఎన్నికలలోనే బీజేపీ బొటాబొటి మెజారిటీ సంపాదించింది. మొత్తం 182 స్థానాలున్న శాసనసభలో బీజేపీ సాధించింది కేవలం 99 సీట్లే. అంతకు ముందుకన్నా 16 స్థానాలు తగ్గాయి. కాంగ్రెస్‌ కాస్త పుంజుకుని 77 స్థానాలు సంపాదించగలిగింది. 2017లో కాంగ్రెస్‌ 16 స్థానాలు పెంచుకో గలిగింది. రూపానీ ఏలుబడిపై అసంతృప్తి దండిగా ఉన్నందువల్ల బీజేపీ ఆయన చేత రాజీనామా చేయించింది. ఎన్నికలు జరగడానికి దాదాపు మరోఏడాది వ్యవధి ఉన్నందువల్ల రూపానీ స్థానంలో మరొకరిని నియమిస్తే మెరుగైన ఫలితాలు సాధించగలమని బీజేపీ భావిస్తోంది. తాను రాజీనామా చేయడానికి కారణాలు రూపానీ చెప్పకపోయినప్పటికీ అధిష్ఠానం ఆదేశం మేరకే తప్పుకున్నట్టు రూఢ అవుతూనే ఉంది. రూపానీ గవర్నర్‌ ఆచార్య దేవవ్రతకు రాజీనామా సమర్పించడానికి వెళ్లినప్పుడు ఆయనతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నితిన్‌ పటేల్‌ కూడా ఉన్నారు. మరో జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌. సంతోష్‌ కూడా అహమ్మదాబాద్‌ లోనే ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత షా కూడా అక్కడే ఉన్నారు. అయితే ఆయన సొంత పనిమీద అహమ్మదాబాద్‌లో ఉన్నారని అంటున్నా ఆయనకు తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా రూపానీ రాజీనామా చేశారని అనుకోలేం. నవసారి ఎంపీ, గుజరాత్‌ బీజేపీ విభాగం అధ్యక్షుడు సి.ఆర్‌.పాటిల్‌ తో సంతోష్‌ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. విచిత్రం ఏమిటంటే శనివారం రూపానీ రాజీనామా చేయడానికి కొద్ది సేపటి ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్దార్‌ ధాం భవన్‌ ను, సర్దార్‌ ధాం రెండవ దశలో కన్యా ఛాత్రాలయ (బాలికల వసతి గృహాం) ను వీడియో కాన్‌ ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఆ తంతు ముగియగానే రూపానీ రాజీనామా చేశారు. గుజరాత్‌ ప్రధాని మోదీ స్వరాష్ట్రం కనక అక్కడ వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడం ఆయన ప్రతిష్ఠకు సంబంధించిన వ్యవహారం. రూపాని 2017 డిసెంబర్‌లో ప్రమాణస్వీకారం చేసినప్పుడు మోదీ, అమిత్‌ షాతో పాటు మరో అరడజను మంది కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యారు. 2012 ఎన్నికలలో మోదీ నాయకత్వంలో బీజేపీవిజయం సాధించింది. 2014ల్‌ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ విజయంసాధించి మోదీ ప్రధాని అయినప్పుడు ఆనందిబెన్‌ పటేల్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. 2016లో పాటిదార్‌ ఉద్యమం సెగ బీజేపీకి బాగా తగిలింది. అందుకే ఆనంది బెన్‌ ను తొలగించి రూపానీకి కళ్లాలు అప్పగించారు. అంటే 2017 ఎన్నికలు రాకముందే ఆమెస్థానంలో రూపానీని నియమించారు. ఆయన నాయకత్వంలోనే 2017లో బీజేపీ అత్తెసరు మెజారిటీతో అధికారంలోకి రాగలిగింది.
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలలో రూపానీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను తొలగించడానికే ఇప్పుడు ఆయన చేత రాజీనామా చేయించారన్నది వాస్తవం. ‘‘కొత్త నాయకత్వం కింద గుజరాత్‌ అభివృద్ధి కొనసాగాలని, నూతనోత్సాహం, నూతన శక్తితో ముందుకు సాగాలి’’ అని రూపానీ రాజీనామా చేసిన తరవాత చెప్పారు. ‘‘నాకు మోదీ మార్గదర్శకత్వం ఉంది. ఆయన మార్గదర్శకత్వంలోనే గుజరాత్‌ అభివృద్ధి నూతన శిఖరాలకు చేరింది’’ అని కూడా అన్నారు. ఈ మాటలనుబట్టి చూస్తే మోదీ నాయకత్వం సమర్థమైందని, రూపానీ నేతృత్వంలోనే లోపం ఉందని అనుకోవాలి. ఇప్పుడు బీజేపీ రూపానీ స్థానంలో ఎవరిని నియమిస్తుందన్నది ఊహాగానాలకు పరిమితమయ్యే అంశం. బీజేపీ కేంద్ర నాయకత్వం రూపానీ వారసుడిని నియమించవచ్చు. కాదనుకుంటే రాష్ట్రపతి పాలన విధించి డిసెంబర్‌ కన్నా ముందే ఎన్నికలకు రంగం సిద్ధం చేయవచ్చు. ఇటీవల బీజేపీ ముఖ్యమంత్రుల చేత రాజీనామా చేయించడం ఫక్తు కాంగ్రెస్‌ సంస్కృతి దారిలోనే సాగుతోంది. కర్నాటకలో గత జులైలో ఎడియూరప్ప చేత రాజీనామా చేయించారు. ఉత్తరా ఖండ్‌ లో అయితే 2017 నుంచి ఇప్పటి వరకు ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. త్రివేంద్ర రావత్‌ స్థానంలో తీరథ్‌ సింగ్‌ రావత్‌ ను నియమించి ఆయనను కూడా మార్చి పుష్కర్‌ సింగ్‌ ధామీని ప్రతిష్టించారు. అంటే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చారు. ఆరు నెలల కాలంలో బీజేపీ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చడం చూస్తే సవ్యంగా పరిపాలించలేకపోతోందని స్పష్టం అవుతోంది. అంతకంతకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వర్తకులు ఎదుర్కుంటున్న సమస్యలు. పెరుగుతున్న నిరుద్యోగం, పరిశ్రమలు మూతపడడం లాంటి అనేక సమస్యలతో గుజరాత్‌ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కేంద్రం దిల్లీ నుంచి గుజరాత్‌ ప్రభుత్వంపై పెత్తనం చేయడవల్ల ఒరిగిందేమీ లేదని తేలిపోయింది. కరోనా సమయంలో తన ప్రభుత్వ వైఫల్యం కారణంగా రూపానీ రాజీనామా చేసి ఉంటే పరువు నిలబెట్టుకున్నట్టయ్యేది. కానీ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయన చేత రాజీనామా చేయించింది. రూపానీ స్థానంలో ఎవరిని నియమిస్తారనేది చర్చనీయాంశమే. రూపానీ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నితిన్‌ పటేల్‌, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌ సుఖ్‌ మాండవీయ, మరో మంత్రి ఆర్‌.సి.ఫాల్దు, గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్‌. పటేల్‌, బీజేపీ ఉపాధ్యక్షుడు గోవర్ధన్‌ జడాఫియా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న విషయాన్ని పక్కన పెడ్తే కేంద్రం పరోక్షంగా చక్రం తిప్పే దశలో ఎంత మేరకు ఏ కొత్త ముఖ్యమంత్రి అయినా సజావుగా పని చేయగలరన్నది పెద్ద ప్రశ్నే. జనాగ్రహాన్ని అధిగమించడానికి ముఖ్యమంత్రుల మార్పు పరిష్కారం కాదని తెలుసుకునే శక్తి బీజేపీకి ఉంటుందనుకోలేం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img