Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తడి ఆరుతున్న పచ్చికబయళ్లు

ద్రవ్యోల్బణం, జనం దగ్గర కొనుగోలుశక్తి లేక గిరాకీ మందగించడం, ఉక్రెయిన్‌ యుద్ధం - ఇలా కారణాలు ఎన్ని చెప్పినా ఈ మాటలన్నింటి సారాంశం ఒక్కటే. ‘‘పెట్టుబడిదారీ’’ సంక్షోభం అంతకంతకూ ముదురుతోంది. అమెరికాలోని కార్పొరేట్‌ రంగం తన ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించే క్రమంలో భాగంగా భారీస్థాయిలో ఉద్యోగులను తొలగిస్తోంది. రోడ్డునపడ్డ ఉద్యోగుల సంఖ్య లక్షల్లోఉంది. ఉద్యోగాల్లో కోత పెట్టడం వచ్చే కొద్ది రోజుల్లో మరింత తీవ్రం కావచ్చు. అనుకోకుండా ఉద్యోగం ఊడితే ఆ ఉద్యోగి ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కావడమే కాక మానసిక వ్యథ ఇనుమడిస్తుంది. ఆ ఉద్యోగి కుటుంబం కూడా వికలమై పోతుంది. ఉద్యోగులను తొలగించడం సాంకేతిక రంగంలోనే అధికంగా ఉంది. ప్రతి రోజూ ఏదో ఓ కంపెనీ వందలు, వేల సంఖ్యలో ఉద్యోగులను వదిలించుకుంటోంది. ఉద్యోగులకు ఉద్వాసన చెప్పడం 2022లోనే ప్రారంభం అయింది. కానీ ఈ ఏడాది నూతన సంవత్సర సంబరాల ప్రభావం తగ్గకముందే ఉద్యోగం ఊడిరదన్న కబురు కలవరపరుస్తోంది. 2001లో డాట్‌ కామ్‌ గాలిబుడగ బద్దలైనప్పటికన్నా ఇప్పుడు ఉద్యోగాలు ఊడడం విపరీతంగా పెరిగిపోతోంది. ఖర్చులు తగ్గించుకోవడం కోసం వాల్‌స్ట్రీట్‌లోని అనేక బ్యాంకులు ఉద్యోగులను సాగనంపుతున్నాయి. ఉద్యోగాలు కోల్పోతున్న వారి తప్పేమీ లేకుండానే నిరుద్యోగులుగా రోడ్డెక్కవలసి వస్తోంది. అంటే తిమింగలం లాంటి పెట్టుబడిదారీ వ్యవస్థ అనేక ఉద్యోగాలను మింగేస్తోంది. ఈ ఉద్యోగాలు ఊడగొట్టడం నిత్య వ్యవహారంగా తయారైంది కనక అమెరికాలో ఎన్ని ఉద్యోగాలు ఊడాయి అని కచ్చితంగా లెక్కకట్టడం కష్టమే. 

ఒక అంచనా ప్రకారం 3,12,600 మంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారని అంచనా. ఇందులో సమాచార సాంకేతికరంగంలో పనిచేస్తున్న భారతీయులే 80 వేల మంది దాకా ఉంటారు. వీరిలో ఎక్కువ మంది హెచ్‌.1బి వీసా మీద అమెరికా వెళ్లినవారే. వీరు రెండునెలల్లోగా మరో ఉద్యోగమన్నా చూసుకోవాలి లేదా డబ్బా డవాలు సర్దుకుని స్వదేశానికి బయలు దేరాల్సిందే. కొత్త సంవత్సరంవచ్చి నెలరోజులైనా కాలేదు కాని, 174 కంపెనీలు 56,570 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించేశాయి. దిగ్గజాలనుకుంటున్న మైక్రోసాఫ్ట్‌, మెటా, అమెజాన్‌, ఆల్ఫబెట్‌ లాంటి కంపెనీలే 51,000 మందికి ఉద్వాసన చెప్పాయి. ఆల్ఫబెట్‌ కంపెనీ 12,000 మందిని, మైక్రోసాఫ్ట్‌ 10,000 మందిని, అమెజాన్‌ 18,000 మందిని, సేల్స్‌ఫోర్స్‌ కంపెనీ 7,000 మందిని నిరుద్యోగుల్ని చేసింది. ఉద్యోగులను తగ్గించడం కేవలం బడా సాంకేతిక సంస్థలకే పరిమితం కాలేదు. మీడియా సంస్థలు, వాణిజ్య సంస్థలు అదే దారిలో నడుస్తున్నాయి. మన దేశంలో బాగా పరిచితమైన జొమాటో, ట్విట్టర్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, బైజూస్‌, కార్స్‌24 లాంటి సంస్థలలో వేలాదిమంది నిరుద్యోగ సేనలో చేరారు. గత సంవత్సరం జూన్‌లో మెటా కంపెనీలో ఉత్పత్తి వ్యహారాల ప్రధానాధికారి క్రిస్‌ కాక్స్‌ ఆర్థికవ్యవస్థ మందగిస్తోంది కనక ఉద్యోగులు ఒక్క పొరపాటుకూడా జరగకుండా పనిచేయాలని హెచ్చరించారు. కానీ మెటా ప్రధాన కార్యనిర్వహణాధికారి మార్క్‌ జుకర్‌ బర్గ్‌ మాత్రం ‘‘ఈ కంపెనీలో ఉండకూడని మనుషులు ఉన్నారు’’ అని అసలు ఉద్దేశం బయట పెట్టారు. ఆ తరవాత జుకర్‌బర్గ్‌ సెప్టెంబర్‌లో కొత్త ఉద్యోగుల్ని చేర్చుకోవడం మానేశారు. కంపెనీలో పనిచేసేవారి సంఖ్య తగ్గిస్తామని కూడా చెప్పేశారు. ఈ ఏడాది మెటా కంపెనీ ఎదుగుదలకు అవకాశంఉన్న రంగాలకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సంకల్పించింది. అంటే ఆ కంపెనీలోని మిగతా రంగాలు కుంచించుకుపోక తప్పదు. ఆ కంపెనీ ఈ ఏడాదిలో ఉన్న పరిమాణంలోనైనా ఉండొచ్చు లేదా తగ్గనూ వచ్చు. మెటా కంపెనీ వాటాల ధరలు షేర్‌ మార్కెట్లలో గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతటి తక్కువ ధరకు మాత్రమే అమ్ముడవుతున్నాయి.
మనదేశంలో బాగా ప్రచారంలో ఉన్న ఇంటిదగ్గరకు ఆహారం సరఫరాచేసే జొమాటో కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గించాలనుకుంటోంది. ఖర్చులు తగ్గించుకుంటే తప్ప వ్యాపారం లాభసాటిగా సాగదని ఈ కంపెనీ అంచనా. ఈ కంపెనీలో ప్రస్తుతం 3,800 మంది పనిచేస్తున్నారు. కానీ 3`4 శాతం సిబ్బంది ఉపాధిపై కోత తప్పకపోవచ్చు. 2020లోనే ఈ కంపెనీ 520 మందిని అంటే దాదాపు 13శాతం ఉద్యోగులను తగ్గించేసింది. కాండెనస్ట్‌ అన్నది భారీ మీడియా సంస్థ. ఈ సంస్థ తరఫున వోగ్‌, జిక్యు, వానిటీ ఫేర్‌ లాంట్‌ పత్రికలు వెలువడుతూ ఉంటాయి. ఈ కంపెనీ వోగ్‌ రష్యా అన్న పత్రికను రష్యాలో పంపిణీ చేయడాన్నే నిలిపివేసింది. అక్కడ 90శాతం ఉద్యోగులను వదిలించుకుంది. ఉక్రెయిన్‌ మీద రష్యా దాడిచేసిన తరవాత కాండెనస్ట్‌ రష్యా కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. అనేక పెద్ద కంపెనీలు, సంస్థలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. అందుకే ఉద్యోగులకు ఉద్వాసన చెప్తున్నాయి. ఈ సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి విలయ తాండవం చేసినప్పుడు లాక్‌డౌన్‌ విధించిన తరవాత పరిస్థితిని అనేక కంపెనీలు ఎదుర్కోలేక పోతున్నాయి. మరోవేపు ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుతోంది. సహజంగానే ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులకు కటకటగా ఉంది.
ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నందువల్ల అనేక కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడాన్ని నిలిపివేశాయి. వే ఫేర్‌ కంపెనీ 2022 మే లోనే కొత్త ఉద్యోగులను నియమించడాన్ని 90 రోజుల పాటు నిలిపివేసింది. ట్విట్టర్‌లోనూ కొత్త ఉద్యోగావకాశాలు లేకుండా పోయాయి. పైగా ఎలాన్‌మస్క్‌ ఈ కంపెనీని స్వాధీనం చేసుకున్న తరవాత ట్విట్టర్‌లో పైస్థాయి ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గించేశారు. యాజమాన్యం మారడమే దీనికి కారణం అంటున్నారు. గూగుల్‌కూడా కొత్త ఉద్యోగులకు ద్వారాలు మూసేసింది. 2022 జులై మొదటి వారంలోనే గూగుల్‌ ప్రధాన కార్యనిర్వహణాధికారి సుందర్‌ పిచాయి కొత్త ఉద్యోగాలు ఉండవని తేల్చిచెప్పారు. ఉద్యోగులను తొలగించడానికి, కొత్త ఉద్యోగాలు కల్పించక పోవడానికి వివిధ కంపెనీలు రకరకాల కారణాలు చూపుతున్నాయి. ముంచుకొస్తున్న ఆర్థికమాంద్యం, కరోనా ప్రభావం, కంపెనీల పునర్వ్యవస్థీకరణ ఆలోచనల లాంటి బోలెడు కారణాలు ఉల్లేఖిస్తున్నారు. ఇన్ని కారణాలు చూపినప్పుడు సిబ్బంది అసమర్థత అనడంకూడా ఒక కారణం అయితీరుతుంది కదా! కంపెనీలలో కొత్తగా పెట్టుబడి పెట్టేవారు తగ్గిపోతున్నారు. వీరు లాభాలు పెరిగేలా చూడాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఆర్థికవ్యవస్థ దిగజారుడు ధోరణి గమనిస్తే రాబోయే రోజులు మరింత దుర్భరంగా ఉండక తప్పని పరిస్థితి అనివార్యం అవుతుందనిపిస్తోంది. ఈ కారణాలుఏమైనా పెట్టుబడిదారీవ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న అంతర్నిహితమైన సూత్రమే. ఆశ్చర్యపడడం కూడా అనవసరం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img