Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తప్పుదిద్దని సుప్రీం తీర్పు

సద్బుద్ధిగల వారికంటే దుర్బుద్ధి గల వారికే ఎక్కువ తెలివి తేటలు ఉంటాయి కాబోలు. దాదాపు పది పదకొండు నెలలుగా మహారాష్ట్రలో రెండు శివసేన వర్గాల మధ్య కలహంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతోంది. ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్‌ షిండే అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు చేసి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయిపోయారు. షిండే తిరుగుబాటు చేసిన తరవాత అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండా రాజీనామా చేశారు. దానితో షిండే తనకు బీజేపీ మద్దతు ఉందని వాదించి ముఖ్యమంత్రి అయిపోయారు. షిండే తిరుగుబాటు చేసిన తరవాత శివసేన నాయకుడు ఉద్ధవ్‌ వర్గం అనేకమంది షిండే మద్దతుదార్లను శాసన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించింది. అనర్హత విషయం ఇంకా తేలలేదు కానీ ఉద్ధవ్‌ ఠాక్రేను విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని కోరడం, షిండే వర్గం ఉద్ధవ్‌ ఠాక్రేకు మద్దతు ఉపసం హరించకముందే అప్పటి గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోషియారీ విశ్వాస పరీక్షకు ఆదేశించడం, ఉద్ధవ్‌ రాజీనామా చేసిన తరవాత షిండే చేత ప్రమాణం చేయించడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌, న్యాయమూర్తులు ఎం.ఆర్‌.షా, కృష్ణ మురారి, హిమా కోహ్లి, పి.ఎస్‌. నరసిం హ తో కూడిన అయిదుగురు సభ్యులుగల రాజ్యాంగ ధర్మాసనం విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని ఉద్ధవ్‌ ఠాక్రేను ఆదేశించడం చట్ట విరుద్ధం అని ప్రకటించింది. కానీ ఈ తీర్పు వల్ల ఉద్ధవ్‌ ఠాక్రేకు, ఆయన నాయకత్వంలోని శివసేన వర్గానికి ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినందువల్ల ఆయనను మళ్లీ ఆ స్థానంలో ప్రతిష్ఠించే అవకాశం సుప్రీంకోర్టుకు లేదు. సుప్రీంకోర్టు తీర్పు భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలలో గవర్నర్లకు మార్గదర్శకంగా ఉండొచ్చు కానీ పార్టీలు ఫిరాయించి అధికారం సంపాదించే వారిని కట్టడి చేయడానికి ఎంతమాత్రం ఉపకరించదు. అయితే ఈ తీర్పు కారణంగా ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్‌ షిండే శాసనసభ్యుడిగా అనర్హుడు కావడానికి ఇంకా అవకాశం మిగిలే ఉంది. ఈ కేసు తెమలడానికే పది పదకొండు నెలలు పట్టినప్పుడు అనర్హత వ్యవహారం తేలే సరికి 2024లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు సమయం ఆసన్నమవుతుంది. 141 పేజీల సుదీర్ఘమైన తీర్పులో సుప్రీంకోర్టు ప్రధానంగా గవర్నర్‌ పాత్రను అభిశంసించింది. ఆ తరవాత స్పీకర్‌ పాత్ర, పార్టీ ఫిరాయింపుల మీద కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా షిండే వర్గాన్ని ఇరుకున పెట్టగల అనేక ప్రశ్నలు సంధించింది. కానీ అది ఆయనను అక్రమంగా చేపట్టిన ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడానికి తోడ్పడలేదు. సుప్రీంకోర్టు ఈ కేసులో అసలు సమస్యకు నికరమైన పరిష్కారం చూపించి ఉండకపోవచ్చు. కానీ గవర్నర్‌ వ్యవహార సరళిపై తీర్పులో చెప్పిన మాటలు గవర్నర్లు తమ నడవడికను మార్చుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ప్రస్తుత వాతావరణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షానికి వత్తాసు పలికే వారినే గవర్నర్లుగా నియమిస్తున్నందువల్ల అత్యున్నత న్యాయస్థానం హితబోధలను వినిపించుకునే వారిని కాగడా పెట్టి వెతకాల్సిందే. రాజకీయ వ్యవహారాలలో గవర్నర్‌ జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు అనుమానా లకు తావివ్వకుండా చెప్పింది. ఒక రాజకీయ పార్టీలో ఉన్న అసమ్మతిని, అనంగీకారాన్ని ఆ పార్టీ నిబంధనావళి ప్రకారమే పరిష్కరించుకోవాలని కూడా సుప్రీంకోర్టు భావించింది. ఒక రాజకీయ పక్షం ప్రభుత్వాన్ని సమర్థించకపోవడానికి, లేదా ఆ పార్టీలోని కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోవడానికి తేడా ఉంటుంది.
రాజకీయ పార్టీలలో ఉన్న అసమ్మతి, అభిప్రాయ భేదాల ఆధారంగా గవర్నర్‌ విశ్వాస పరీక్షకు ఆదేశించడం కుదరదని కూడా రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. గవర్నర్‌ ఒక రాష్ట్రానికి అలంకారప్రాయమైన అధిపతే అన్న విషయాన్ని సుప్రీంకోర్టు మరో సారి గుర్తుకు చేసింది. అందువల్ల తన అధికార పరిధి ఏమిటో గ్రహించాలని కూడా హితవు చెప్పింది. వివిధ పార్టీల మధ్య, లేదా ఒక పార్టీలో విభేదాలతో గవర్నరుకు నిమిత్తం లేదని కూడా న్యాయమూర్తులు తెలియజేశారు. అందుకే ఉద్ధవ్‌ ఠాక్రే మెజారిటీ కోల్పోయారని గవర్నర్‌ నిర్ధారణకు రావడం తప్పని తేల్చింది. ఉద్దవ్‌ ఠాక్రే నాయకత్వంలోని మహా వికాస్‌ అఘాధీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తాము ఆ కూటమిలో ఉండబోమని చెప్పడం కూడా వారు ప్రభుత్వానికి మద్దతు ఉపసం హరించినట్టు కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అసలు అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు ఎవరూ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నామని అధికారికంగా తెలియజేయనే లేదు. షిండే తిరుగుబాటు ప్రకటించిన నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలవడంతో ఉద్ధవ్‌ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన మద్దతు తనకు ఉందని షిండే చెప్పడంవల్ల గవర్నర్‌ ఆయనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. ఇది మాత్రం సవ్యమైన చర్యగానే సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నారు.
షిండే ప్రభుత్వం ఏర్పాటు చేయడం చట్టబద్ధం కాదన్నది సుప్రీంకోర్టు అంతరార్థం అయినప్పటికీ ఉద్ధవ్‌ స్వచ్ఛందంగా రాజీనామా చేశారు కనక ఇప్పుడు ఏక్‌ నాథ్‌ షిండేను గద్దె దించే అవకాశం కూడా సుప్రీంకోర్టుకు లేకుండా పోయింది. రాజకీయ పార్టీకి, ఆ పార్టీ శాసనసభా పక్షానికి మధ్య ఉన్న తేడా ఏమిటో కూడా న్యాయస్థానం తెలియజేసింది. శాసనసభలో విప్‌ ను నియమించే అధికారం రాజకీయ పార్టీదే తప్ప శాసనసభా పక్షానిది కాదన్న వాస్తవాన్ని కూడా అధికారం మోజులో విస్మరించారు. అదే సమయంలో శాసనసభా కార్యకలాపాల్లో అసంబద్ధతను సమీక్షించే అధికారం తమకు ఉందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టసభ కార్యకలాపాలు రాజ్యాంగ విలువలను కాపాడడంకోసమేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ తీర్పువల్ల అంతిమంగా జరిగేది ఏమిటంటే మాయోపాయంతో అధికారంలోకి వచ్చిన షిండే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. అయితే ఇది సుప్రీంకోర్టు తేల్చిన అంశం ఏమీ కాదు. షిండే అధికారం సంపాదించిన తీరును సుప్రీంకోర్టు సమర్థించలేదు. కానీ విశ్వాస పరీక్ష ఏదుర్కోకుండా ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేసినందువల్ల సుప్రీంకోర్టు చేయగలిగింది ఏమీ లేకుండా పోయింది.
షిండే అధికారంలోకి రావడానికి అప్పటి గవర్నర్‌ కోషియారీ నిర్ణయాలు ఎంత భీకరమైనవి అయినప్పటికీ, షిండే మంత్రివర్గం సంపూర్ణంగా న్యాయబద్ధమైంది అని సుప్రీంకోర్టు నమ్మక పోయినప్పటికీ షిండే అధికారం చేపట్టకముందు ఉన్న పరిస్థితిని పునరుద్ధరించే అవకాశం సుప్రీంకోర్టుకు లేకుండా పోయింది. రాజకీయ పార్టీలు, అధికార దాహంతో ఉన్న వారు రాజ్యాంగ నియమాలను, ప్రజాస్వామ్య సూత్రాలను ఇంత బాహాటంగా ఉల్లంఘిస్తే అత్యున్నత న్యాయస్థానం జరిగిన పొరపాట్ల దిద్దుబాటుకు అవకాశం లేకుండా పోవడం అసలు విషాదం. ఏమైతేనేం షిండేను వెనక ఉండి ప్రోత్సహించిన బీజేపీ పాచిక పారింది. రేపో మాపో షిండే బీజేపీలో చేరడమే తరవాయి. ఇలాంటిపార్టీలను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యమైన బీజేపీకి మాత్రం అపారమైన సంతోషం మిగులుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img