Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

తీర్పుతో పాటు ఆ వ్యాఖ్యలు ఎందుకు?

అహమదాబాద్‌లో 2008లో జరిగిన వరస బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎ.ఆర్‌.పటేల్‌ 38 మందికి ఉరి శిక్ష విధించారు. ఈ దారుణమైన పేలుళ్లలో 56 మంది మరణించారు. మరో 200 మంది దాకా గాయపడ్డారు. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మొత్తం 49 మందికి మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్‌ కోరినా 11 మంది ఈ పేలుళ్లలో ప్రధాన కుట్రదారులు కారు కనక వారికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తున్నామని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎ.ఆర్‌. పటేల్‌ తెలియజేశారు. వీరు మరణించే దాకా జైలులోనే ఉండవలసి ఉంటుంది. 2002లో గుజరాత్‌లో జరిగిన ముస్లింల ఊచకోతలో వెయ్యి కన్నా ఎక్కువమంది ముస్లింలు మరణించారు కనక దానికి ప్రతీకారంగా గుజరాత్‌ పేలుళ్లకు సిమీకి అనుబంధమైన ఇండియన్‌ ముజహిదీన్‌ అనే తీవ్రవాద సంస్థ పథకం రచించిందన్న ఆరోపణ ఉంది. ఇప్పుడు శిక్షలు పడ్డవారందరూ ఇండియన్‌ ముజాహిదీన్‌కు చెందిన వారే. అహమదాబాద్‌ పేలుళ్లు చాలా ఏహ్యమైన చర్య. ఇలాంటి సంఘటనతో సంబంధం ఉన్న వారికి శిక్ష పడడంలో ఆశ్చర్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఆసుపత్రి, అహమదాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ నడుపుతున్న ఆసుపత్రితో పాటు బస్సులలో ఈ పేలుళ్లు జరిగాయి. రోడ్డు మీద నిలిపిన అనేక వాహనాలు కూడా ధ్వంసం అయినాయి. పేలుళ్లకు బాధ్యులు అనుకున్న వారి మీద భారత శిక్షా స్మృతిలోని 302, 120బి సెక్షన్లతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యు.ఎ.పి.ఎ.) కింద కూడా కేసులు నమోదైనాయి. ఈ కేసు విచారణ పూర్తి అయి శిక్షలు పడడానికి 14 ఏళ్లు పట్టింది. ఈ పేలుళ్లలో మరణించిన వారిలో పసి పిల్లలు, యువత, వయసు మీరిన వారు ఉన్నారు. వీరందరూ వివిధ కులాలకు, మతాలకు చెందిన వారు. దోషులు ఎవరైనా శిక్ష పడవలసిందేనన్న అభిప్రాయం ఉండడంలో తప్పు లేదు. విధ్వంసకాండను సమర్థించవలసిన పని అంతకన్నా లేదు. కానీ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ‘‘శిక్ష పడ్డవారు ప్రశాంతంగా ఉన్న సమాజంలో కల్లోలం సృష్టించారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. వారికి రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన గుజరాత్‌ ప్రభుత్వం మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద గానీ ఎంత మాత్రం గౌరవం లేదు. కొంతమంది అల్లానే విశ్వసిస్తారు తప్ప ప్రభుత్వం మీద న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉండదు’’ అని ఆ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కల్లోలం సృష్టించడాన్ని కచ్చితంగా ఖండిరచవలసిందే. కానీ ప్రశాంతంగా ఉన్న సమాజంలో కల్లోలం సృష్టించారు అని ఆయన ఏ ప్రాతిపదికన అనగలిగారో అంతుబట్టదు. గుజరాత్‌ మారణకాండకు ప్రతీకారంగానే అహమదాబాద్‌ వరస బాంబు పేలుళ్లు జరిగినప్పుడు ‘‘ప్రశాంతంగా ఉన్న సమాజంలో కల్లోలం సృష్టించడం’’ అన్న మాట ఎలా నప్పుతుంది. ప్రభుత్వం మీద, న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉన్న వారిని తీవ్రవాదులని ఎలా అనగలం. ‘‘ఇలాంటివారిని సమాజంలో ఉండనిస్తే అది నరహంతక చిరుత పులిని జనం మధ్యలోకి వదిలినట్టే’’ అని కూడా న్యాయమూర్తి పటేల్‌ అన్నారు. ‘‘ఈ దోషులను ప్రభుత్వం జైలులో పెట్టాల్సిన పని కూడా లేదు. పైగా తమ దేవుడిని తప్ప ఎవరి మీదా విశ్వాసం లేని వారిని జైలులో ఉంచాల్సిన అగత్యం లేదు. శాశ్వతంగా వారిని జైలులో ఉంచడానికి ఏ జైలు లేదు’’ అని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీని ఉద్దేశం హైకోర్టు ఈ మరణ శిక్షలను ధ్రువీకరించవలసి ఉంటుందన్న అంశాన్నీ, ఎవరు ఏ దేవుడినైనా ఆరాధించే హక్కు ఉందని కూడా సదరు న్యాయమూర్తి అంగీకరించడం లేదా? 11 మందికి జీవిత ఖైదు ఎందుకు విధించవలసి వచ్చిందో కూడా న్యాయమూర్తి వివరించారు.
ప్రధాన కుట్రదారులు చేసిన నేరంతో పోలిస్తే వీరి నేరం తక్కువేనని అన్నారు. హత్య చేయడానికి సహకరించడం కూడా దాదాపు హత్యతో సమానమైందేనని ఆ న్యాయమూర్తికి తెలియదను కుందామా. ఆయన దృష్టిలో అదే ఉంటే అఫ్జల్‌ గురుకు, అంతకు ముందు రాజీవ్‌ గాంధీ హత్యకేసులో నిందితులు ఆ హత్యల్లో ప్రత్యక్ష భాగస్వాములు కాకపోయినా మరణ శిక్షే విధించారు కదా. వారు చేసిన నేరం మరణ శిక్ష విధించిన 38 మంది కన్నా తక్కువదని న్యాయమూర్తి భావించారు కాబోలు. అదే అయితే పార్లమెంటు మీద దాడి కేసులో అఫ్జల్‌ గురుకు, రాజీవ్‌ గాంధీ హత్య కేసులో అంతమందికి మరణ శిక్ష ఏ ఆధారంతో విధించి ఉంటారు? అయితే ఈ 11 మందికి వారు మరణించేదాకా జైలులో ఉంచకపోతే అలాంటి నేరాలకే మళ్లీ పాల్పడతారని కూడా న్యాయమూర్తి నిర్ధారణకు వచ్చేశారు. నేరస్థుడిని శిక్షించడంలో రాజ్య వ్యవస్థ పగతోనూ, కసితోనూ వ్యవహరించదు కదా! జైలులో ఉంటే వారు తమను తాము సంస్కరించు కోవడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్న విషయాన్ని న్యాయమూర్తి ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో?
అరుదాతి అరుదైన సందర్భాలలో మాత్రమే మన దేశంలో మరణ శిక్షలు విధిస్తున్నారు. కనక దీన్ని న్యాయమూర్తి అరుదాతి అరుదైన సంఘటన అని భావించడాన్ని అభ్యంతరపెట్టనవసరంలేదు. అయితే అరుదాతి అరుదైన సంఘటన ఏదో సుప్రీంకోర్టు ఇప్పటిదాకా సరైన నిర్వచనం ఇవ్వనే లేదు. ఇంత మందికి ఒకే సారి మరణ శిక్ష విధించిన సందర్భం స్వతంత్ర భారత చరిత్రలో మరొకటి లేదు. అయితే ప్రత్యేక కోర్టు విధించిన మరణ శిక్షలను హైకోర్టు ధ్రువీకరించవలసి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులనుబట్టి చూస్తే హైకోర్టు కూడా ఈ మరణశిక్షలను ఖరారు చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అసలు మరణ దండన విధించడం నాగరిక సమాజంలో సబబేనా అన్న చర్చ మన దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా దశాబ్దాలుగా జరుగుతోంది. హత్యలాంటి హేయమైన చర్యలకు పాల్పడినవారిని శిక్షించడానికి రాజ్యవ్యవస్థ కూడా నేరమంతటి ఏహ్యమైన శిక్షలు విధించాలా అన్న మీమాంస కొనసాగుతూనే ఉంది. 2021 నాటికి 108 దేశాలు మరణ శిక్ష రద్దు చేశాయి. కొన్ని దేశాలు చట్టంలోంచి మరణ శిక్షను తొలగించకపోయినా విధించకుండా ఉంటున్నాయి. అంటే ఆ దేశాలకూ మరణశిక్ష విధించకూడదన్న అభిప్రాయమే ఉంది. మరణశిక్ష చట్టబద్ధమైన చోట కూడా ఆ శిక్ష విధించి తీరాలన్న నిబంధన ఏమీ లేదు. అనేక సందర్భాలలో మన దేశంలో కూడా న్యాయమూర్తులు చట్టం అనుమతించినా ఆ శిక్ష విధించని ఉదంతాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 55 దేశాలలోనే మరణశిక్ష చట్టబద్ధంగా ఉంది. మరణశిక్ష నాగరిక పద్ధతి కాదు అన్న అభిప్రాయానికి ప్రపంచ వ్యాప్తంగా మద్దతు సమకూరు తోంది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎ.ఆర్‌.పటేల్‌ చట్టానికి అనుగుణంగానే మరణశిక్ష విధించి ఉండవచ్చు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలను ఆమోదించడం మాత్రం కష్టమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img