Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తొందరపాటుకు ఎదురు దెబ్బ

ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటై ఏడేళ్లు దాటినా ఆంధ్రప్రదేశ్‌కు ఇంతవరకు రాజధాని లేకపోవడం వైపరీత్యమే. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తులు సత్యనారాయణ మూర్తి, డి.వి. ఎస్‌.ఎస్‌. సోమయాజులుతో కూడిన బెంచి ఇంతకు ముందు ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే అమరావతిలోనే రాజధాని నిర్మించా లని గురువారం తీర్పు చెప్పడంతో రాజధాని నిర్మాణ కార్యక్రమం మళ్లీ ఊపందుకునే అవకాశం ఉండవచ్చు. ముగ్గురు సభ్యుల హైకోర్టు బెంచి అమరావతే రాజధాని అని తీర్పు చెప్పడంతో ఊరుకోకుండా నెలరోజుల్లోగా ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించి నివాసయోగ్యంగా ప్లాట్లు సిద్ధం చేసి రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన వారికి అందజేయాలని ఆదేశించింది. రాజధాని నిర్మాణం ఆరు నెలల్లోగా పూర్తి కావాలని కూడా నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అమరావతిలో రాజధాని నిర్మాణ ప్రతిపాదనను గాలికి వదిలి, రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సి.ఆర్‌.డి.ఎ.) ను విస్మరించే అధికారం ప్రభుత్వా నికే కాదు శాసనసభకు కూడా లేదని స్పష్టం చేసింది. 2014లో అమరా వతిలో రాజధాని నిర్మించాలన్న ప్రతిపాదనను అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు అభ్యంతరం చెప్పని అప్పటి ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి తాను 2019లో అధికారంలోకి రాగానే మూడు రాజధానులన్న కొత్త రాగం ఎత్తుకున్నారు. రాజధాని నిర్మాణం కోసం అప్పటికే రూ. 15,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ మూడు రాజధానుల ప్రస్తావనవల్ల ఆ ప్రాంతం దిక్కూ దివాణం లేకుండా మిగిలి పోయింది. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణలో భాగంగా 29 గ్రామాలలోని రైతులు 33,371 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం అప్పగించారు. అప్పుడు వారితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భూమిలిచ్చిన వారికి నివాసం కోసం ప్లాట్లు, సకల అభివృద్ధి పనులు పూర్తి చేసిన వాణిజ్య యోగ్యమైన ప్లాట్లు అప్పగించాల్సి ఉంది. కానీ అమరా వతిలో శాసన రాజధాని అంటే శాసనసభ, విశాఖ పట్టణంలో కార్యనిర్వా హక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అని జగన్‌ ప్రకటించినందు వల్ల అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు వదులుకున్న వారి నోట్లో మట్టి కొట్టినట్టయింది. వారి భవిష్యత్తు అంధకారమయమైంది. భూములిచ్చిన వారిలో 93శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. ఏడేళ్లుగా వారి భవిష్యత్తు ఎంత అగమ్య గోచరంగా తయారైందో చెప్పలేం. వారి జీవనాధారానికి భంగం కలిగించే హక్కు ప్రభుత్వానికి లేదని హైకోర్టు కచ్చితంగా చెప్పడం మానవహక్కులు అనుల్లంఘనీయమైనవని చెప్పడమే. రైతులకు జీవనోపాధి లేకుండా పోయింది. మూడు రాజధానుల ప్రతిపాదన తరవాత శాసన రాజధానికి, మంత్రులు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ సిబ్బందికి గృహ వసతికి అవసరమైన భూమిని మినహాయించి మిగిలిన భూమిని రైతులకు తిరిగి ఇచ్చి ఉండేవారేమో. కానీ సుక్షేత్రాలను ప్రభుత్వానికి అప్ప గించిన తరవాత గత ఏడున్నరేళ్ల కాలంలో ఎలాంటి వ్యవసాయ కార్యకలా పాలు అక్కడ జరగడం లేదు. తుప్పలు పెరగడం తప్ప ఏమీ మిగలలేదు. భూమి వెనక్కు ఇచ్చేయాలన్నా ఎవరి భూమి ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో ఉండేదో తేల్చడం కష్ట సాధ్యమే. రాజధాని అమరావతిలోనే కొనసాగాలని 800 రోజులపై నుంచి ఉద్యమం కొనసాగిస్తున్న రైతులకు, ముఖ్యంగా ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తున్న రైతులకు హైకోర్టు తీర్పు ఊరట కలిగించడమే కాదు, వారికి ప్రాణం లేచివచ్చినట్టే. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం సుప్రీంకోర్టు సలహా కూడా తీసుకుని రాష్ట్రపతి ఉత్తర్వు జారీ చేశారు కనక దాన్ని మార్చే అధికారం ప్రభుత్వానికి, చట్టసభకు లేదని హైకోర్టు కరాఖండిగా తెలియజేసింది. రాజధానివిషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం దఖలు పరచిన తరవాత మార్చడానికి వీలు లేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజనచట్టంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. అమరావతి రాజధాని కాదు అని జగన్‌ సర్కారు చెప్పడంతో కనీసం 70మంది కోర్టును ఆశ్రయించారు. ఈ కేసువిచారణ సుదీర్ఘకాలమే సాగింది. మొదటకేసు విచారణను అప్పటి ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి నాయకత్వంలోని బెంచిచేపట్టింది. ఆ తరవాతవచ్చిన ప్రధాన న్యాయమూర్తి అరూప్‌ కుమార్‌ గోస్వామీ హయాంలోనూ ఈ విచారణ కొలిక్కి రాలేదు. చివరకు ప్రస్తుత ప్రధానన్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌మిశ్రా నాయకత్వం లోని బెంచి రాజధాని ఎక్కడుండాలో స్పష్టం చేసింది. హైకోర్టు ఒక చోట, శాసనవిభాగం ఇంకోచోట, పరిపాలనా నిర్వహణ మరో చోట ఉండడానికి వీలు లేదని తేల్చి చెప్పింది.
రాష్ట్ర విభజనకు ముందే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయంలో చర్చోపచర్చలు జరిగాయి. కమిటీలు ఏర్పాటయ్యాయి. రాజ ధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశాన్ని సిఫార్సు చేయడం కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్‌ కమిషన్‌ రాజధాని విషయంలో నిర్దిష్టమైన సూచన చేయకుండానే నివేదిక సమర్పించింది. రెండు మూడు ప్రాంతాలను సూచించింది. కానీ శివరామకృష్ణన్‌ కమిషన్‌ పరిపాలన వికేంద్రీకరణ జరగ వచ్చునని సిఫార్సు చేసింది. కమిషన్‌ నివేదికలోని ఇతర అనేక అంశాలను, అమరావతిలో రాజధాని నిర్మాణం ప్రారంభమైన వాస్తవాన్ని ఖాతరు చేయ కుండా వికేంద్రీకరణకు శివరామకృష్ణన్‌ కమిషన్‌ సిఫారసు చేసింది కనక తన మూడు రాజధానుల ప్రతిపాదన సబబేనని జగన్‌ సర్కార్‌ వాదించింది. మూడు రాజధానుల నిర్మాణం కోసం తమ ప్రభుత్వమే చేసిన రెండు చట్టా లను తానే ఉపసంహరించుకుంది. వీటి స్థానంలో మరింత సమగ్రమైన, మెరుగైన చట్టాలు తీసుకొస్తామని జగన్‌ ప్రభుత్వం చెప్పింది. ఆ పని జర గనూ లేదు. రాజధాని లేదా రాజధానుల నిర్మాణం ముందుకు సాగనూ లేదు. సింగపూర్‌ తరహా రాజధాని నిర్మిస్తామని, హైదరాబాద్‌ కన్నా విస్తా రంగా ఏడు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు ఊరిస్తే దక్షిణాఫ్రికా తరహాలో అసలు రాజధాని అన్న భావననే వికేంద్రీకరించి మూడు రాజధానులు నిర్మిస్తామని జగన్‌ పంతం పూనారు. చంద్రబాబు కన్న కలల ప్రకారమైతే రాజధాని బృహన్‌ ముంబై కన్నా విస్తా రంగా ఉండేదేమో! పరిపాలనా విభాగం ఒక చోట, శాసనసభ మరో చోట, హైకోర్టు ఇంకో చోట ఉండాలనుకోవడం వైపరీత్యం. కశ్మీర్‌కు రాష్ట్ర ప్రతి పత్తి ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి దృష్ట్యా మాములు రోజుల్లో శాసనసభ సమావేశాలు శ్రీనగర్‌లో జరిగితే శీతాకాలంలో జమ్మూలో జరిగేవి. చంద్రబాబుహయాంలో అమరావతిలో రాజధానినిర్మాణం జర గాలనుకున్నప్పుడు లోపాయికారీ లావాదేవీలు (ఇన్సైడర్‌ ట్రేడిరగ్‌) జరిగిం దని జగన్‌ ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో స్థిరాస్తి వ్యాపార దృష్టి ఎప్పుడూ ఉంటుంది. డబ్బున్న ఆసాములు ఎక్కడ లాభసాటి అనిపిస్తే అక్కడ భూములు కొంటారు. హైకోర్టు పరిశీలించింది ఔదార్యంతో భూములిచ్చిన పేదల సంగతేమిటన్న విషయాన్నే ప్రధానంగా పట్టించుకుంది. మునుపటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ప్రతిసారీ తిరగదోడాలనుకుంటే ఎదురుదెబ్బలు తప్పవుమరి! తీసుకున్న నిర్ణయాలను ప్రతిసారీ తిరగదోడా లనుకుంటే ఎదురు దెబ్బలు తప్పవు మరి!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img