Friday, April 19, 2024
Friday, April 19, 2024

దూషణ పర్వం

ఎన్నికల ప్రచార సమయంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు పరస్పర దూషణలకు పాల్పడడం మామూలే. కానీ ఈ క్రమంలో తాము వాడే భాష మర్యాదకరంగా ఉండేట్టు చూసుకోవడంలో విఫలం కావడం కచ్చితంగా ప్రతికూల పరిణామమే. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లికార్జున్‌ ఖడ్గే ప్రధానమంత్రి మోదీని రావణుడు అన్నారని గగ్గోలు పెడ్తున్నారు. ఇది మర్యాద అతిక్రమించడమేనని వాదిస్తున్న వారూ ఉన్నారు. కానీ నిజానికి ఖడ్గే ప్రసంగంలో మోదీని రావణుడితో పోల్చారో లేదో వివేచించే వారు కరవయ్యారు. ఖడ్గే ఈ మాట అనడానికి నిర్దిష్ట కారణం ఉందన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. గుజరాత్‌లోనే కాదు, ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా మోదీ ప్రత్యక్షమవుతారు. ఒక్కో రాష్ట్రంలో పదుల కొద్దీ సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌ షోలలో పాల్గొంటారు. గుజరాత్‌ ఎన్నికలతో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పరువు ప్రతిష్ఠలు ఆధారపడి ఉన్నాయి. గుజరాత్‌ వారిద్దరి సొంత రాష్ట్రం. గుజరాత్‌లో 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్న మాట వాస్తవమే. కానీ ఒక్కో దఫా జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే క్రమంగా బీజేపీ విజయం సాధిస్తున్న సీట్ల సంఖ్య తగ్గుతోంది. అందుకని గుజరాత్‌ ఎన్నికల ప్రచారానికి మోదీ ఎక్కువ సమయం కేటాయించారు. ఇంతకు ముందు ఏ ప్రధానమంత్రి ఒకే రాష్ట్రంలో ఎన్నికల సమావేశానికి ఇంత సమయం కేటాయించలేదు. ప్రచార క్రమం పొడవునా ఆయన ఎక్కడ చూసినా తారసపడ్తున్నారు. ఈ నేపథ్యంలోనే రావణుడికి పది తలలు ఉన్నట్టు మోదీకి వంద తలలున్నాయా ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు అని ఖడ్గే అన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి స్థానంలో ఉన్న మోదీ సర్వాంతర్యామిలా కనిపిస్తున్నారు కనక ఖడ్గే రావణుడి పది తలల పోలిక తెచ్చారు. అన్ని చోట్లా మోదీయే కనిపిస్తున్నారు కనక వంద తలలున్నాయా అని ప్రశ్నించారు. ఇది పోలిక చెప్పడమే. ఖడ్గే చెప్పదలచుకున్న విషయాన్ని ఉపమాలంకార సహాయంతో చెప్పే ప్రయత్నంలోనే రావణుడి ప్రస్తావన తీసుకొచ్చారు తప్ప మోదీని ఆయన రావణుడితో పోల్చలేదు. మోదీ రావణుడు అని అనలేదు. రావణుడు అన్న మాటను పట్టుకుని మోదీని రావణుడితో పోల్చారని వ్యాఖ్యానించే వారికి కొరత లేకుండా పోయింది. సకల విషయాలను వక్రీకరించడంలో లేనివి ఉన్నట్టుగా చూపడంలో, శుష్క వాగ్దానాలు చేయడంలో మోదీని మించిన వారు లేరు. ఖడ్గే వ్యాఖ్యలను కూడా మోదీ స్వయంగా వక్రీకరిస్తున్నారు. కాంగ్రెస్‌కు రాముడి మీద భక్తి లేదని, అయోధ్య అంటే వారికి గిట్టదని, రామసేతును వారు నమ్మరని మోదీ అంటున్నారు. ఆది కావ్యంలో వాల్మీకి రాముడి సద్గుణాలను చాలా ప్రతిభావంతంగా చిత్రించారు. సకల సద్గుణ సంపన్నుడిగా చూపారు. వాల్మీకి శ్రీరాముడి పాత్రను చిత్రించిన తీరు రాముడిని దేవుడిని చేసేసింది. ఒక కావ్యంలో ఉన్న కథా నాయకుడిని దేవుడిగా భావించడం అపురూపమే. కావ్య నాయకుడిని వాస్తవికంగా జీవించిన వ్యక్తిగా భావించడమే ఇబ్బంది. అంటే జనం రాముడిని దేవుడిగా భావిస్తున్నారు కనక రాముడి గురించి ఏం మాట్లాడినా నొచ్చుకునేవారు ఉన్నారు. ఖడ్గే రావణుడిని ప్రస్తావించడంలోనూ ఇదే జరిగింది. ఖడ్గే మాటలు బీజేపీ నిందా ప్రచారానికి బాగా తోడ్పడ్డాయి. ఇలాంటి ఏ అవకాశాన్ని మోదీ వదులుకోరు. ప్రధానమంత్రిని రావణుడితో పోలుస్తారా అని మోదీ నిలదీస్తున్నారు. ప్రధానమంత్రిని గౌరవించాలనడాన్ని అభ్యంతర పెట్టలేం. కానీ ఖడ్గే మాటలను సందర్భ శుద్ధి లేకుండా సాగలాగడం విచిత్రంగా ఉంది. ఖడ్గే అన్న మాటలు బీజేపీకి ఎదురుదాడి చేయడానికి అప్పనంగా అంది వచ్చాయి. ఆయన మాటలను వాటంగా మోదీ వక్రీకరించారు. ఎన్నికల సమయంలో పరస్పర ఆరోపణలను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఎవరైనా మోదీ తరవాతే. అందుకే కాంగ్రెస్‌కు రాముడంటే నచ్చదని, రామసేతును నమ్మరని, అయోధ్య అంటే ఇష్టం లేదని మోదీ అనగలిగారు. రాముడి పేరుతో హిందువుల ఓట్లు సంఘటితం చేయడానికే మోదీ ఈ పాట్లు పడ్తున్నారు. ఈ సారి మోదీ, అమిత్‌ షా ద్వయానికి గుజరాత్‌లో ఓడిపోతామన్న భయం పట్టుకుంది. అందుకే ప్రచారానికి మోదీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఖడ్గే మాటలు ఆయనకు బాగా ఉపకరించాయి.
ఖడ్గే ఎలాంటి వారో తనకు తెలుసుననీ అయితే కాంగ్రెస్‌ నాయకులు అంటే సోనియా గాంధీ ఇత్యాదులు ఆయనకు కిర్రెక్కించి పంపినందువల్లే ఆయనను రావణుడితో పోల్చారని, మోదీ ఖడ్గే మాటలను తనకు అనువుగా మలుచుకోగలిగారు. శ్రీరాముడి అస్తిత్వాన్నే ఒప్పని కాంగ్రెస్‌ తనను విమర్శించడానికి మాత్రం రామాయణంలోని రావణుడిని పాత్రను వినియోగించుకుంటోందని వాదించి మోదీ ఈ మొత్తం వ్యవహారాన్ని మతవిశ్వాసాల రొంపిలోకి లాగారు. పార్లమెంటులోనే కాదు ఎన్నికల ప్రచారంలో నాయకుల ప్రసంగాలు మర్యాదకరమైన భాషలోనే ఉండాలనడం తిరుగులేనిదే. కానీ ఇటీవలి కాలంలో ఆ మర్యాదను పాటించడంకన్నా ఉల్లంఘించిన సందర్భాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోనియా గాంధీ గతంలో మోదీని మృత్యు బేహారి అన్నప్పుడూ వివాదం చెలరేగింది. కానీ మోదీ అంతకంతకూ బదులు తీర్చుకున్నారు. సోనియా గాంధీని ఆయన జెర్సీ ఆవు అన్నారు. ఈ మాట వాడిన మోదీ ఒక మహిళను అవమానిస్తున్నానని గ్రహించలేదు. సంఫ్‌ు పరివార్‌ ఆరాధించే గోవును కూడా ఈ రచ్చలోకి లాగారు. కాంగ్రెస్‌ వారు నోరుజారి తనను విమర్శించారనుకున్నా ఆ తరవాత పొరపాటు గ్రహించి క్షమాపణ అయినా చెప్పరు అని మోదీ అంటున్నారు. ఇదే సూత్రం మోదీకీ వర్తిస్తుంది. గుజరాత్‌ మారణకాండకు ఆయన ఏనాడైనా క్షమాపణ చెప్పిన సందర్భం ఉందా? మారణకాండ సమయంలో ముఖ్యమంత్రిగా మోదీ పాత్రను సవాలుచేస్తూ కోర్టుల్లో దాఖలైన కేసులు తేలిపోయి ఉండొచ్చు. కానీ ఆ మారణకాండకు నైతికంగా బాధ్యత తనదేనని మోదీ భావించిన సందర్భమే లేదు. రాజధర్మం విస్మరిస్తున్నారని అప్పటి ప్రధాని సుతిమెత్తగా తప్పుబట్టడాన్ని మోదీ ఖాతరు చేయలేదు. పైగా తొలిదశ పోలింగ్‌ జరగడానికి సరిగ్గా ఒక వారం రోజుల ముందు అమిత్‌ షా 20 ఏళ్ల కింద తాము తగిన గుణపాఠం చెప్పినందువల్ల అప్పటినుంచి గుజరాత్‌లో మతకలహాలే జరగలేదని గొప్పగా చెప్పుకోవడంలోని ఆంతర్యాన్ని గ్రహించని అమాయకులు ఎవరుంటారు? అప్పుడు మోదీ లేదా సంఫ్‌ు పరివార్‌ గుణపాఠం నేర్పింది ఎవరికి అన్న ఆలోచన సవ్యంగా ఆలోచించే వారి మెదళ్లకు తట్టకుండా ఉంటుందా! ఇన్నాళ్లు మారణకాండతో మోదీకి ఎలాంటి సంబంధమూ లేదని వాదించిన వారు ఇప్పుడు గుణపాఠం చెప్పామని ప్రస్తావిస్తుంటే ఆ మారణకాండ వారి పుణ్యమేనని అనుకుంటే ఉలుకుఎందుకో! 27 ఏళ్లుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉన్నందువల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండడం సహజం. ఈ వ్యతిరేకత నుంచి, అసలు సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించడానికే అమిత్‌షా 2022 నాటి మారణకాండను ప్రస్తావించారు. ఖడ్గేను తప్పుబట్టే క్రమంలోనే మళ్లీ మోదీ సర్దార్‌ పటేల్‌ మొదటి ప్రధానమంత్రి కావాల్సింది అన్న పాత వాదనకు మరింత పదును పెట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img