Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశాభివృద్ధిలో సీపీఐ అద్వితీయ పాత్ర

భారత స్వాతంత్య్ర పోరాటం అనేక రూపాల్లో సాగింది. అనేక ఆలోచనాధోరణులు దానికి దోహదం చేశాయి. జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ నాయకత్వంలో సాగిన పోరాటం నిస్సందేహంగా మహత్తరమైందే. కానీ భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్య్ర పోరాటంలో నిర్వహించిన పాత్ర నిరుపమానమైంది. బ్రిటీష్‌ వలసవాద సంకెళ్లు తెంచుకున్న తరవాత దేశ నిర్మాణం పండిత్‌ నెహ్రూ ముందున్న ప్రధాన కర్తవ్యం. విభిన్న ఆర్థిక విధానాలను ఆయన అధ్యయనం చేశారు. పెట్టుబడిదారీ విధానాన్నిగానీ, సోషలిస్టు విధానాన్నిగానీ సంపూర్ణంగా అనుసరించడానికి ఆనాటి పరిస్థితులు అనువుగా లేవు. అందుకే ఆయన మిశ్రమ ఆర్థిక విధానం అనే కొత్త బాట నిర్దేశించుకున్నారు. నెహ్రూ సోషలిస్టు మార్గాన్ని ఎంతవరకు అనుసరించారు అన్నది చర్చనీయాంశమైతే కావచ్చు కానీ ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలోనూ ప్రభుత్వ రంగానికి అధిక ప్రాధాన్యం ఉండాలని విశ్వసించడమే కాదు అమలు చేశారు కూడా. జాతి నిర్మాణంలో ప్రభుత్వ రంగ పాత్ర గురించి ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీకి నిర్దిష్టమైన ఆలోచనలు ఉన్నాయి. వాటిని అమలు చేయించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ నెహ్రూ హయాంలో నిర్ణాయక పాత్ర పోషించింది. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ రంగానికి బలమైన పునాది పడడంలో కమ్యూనిస్టు పార్టీ తీసుకొచ్చిన ఒత్తిడి సత్వర అభివృద్ధి సాధించడానికీ, పారిశ్రామికీకరణ త్వరితం చేయడానికి నికరంగా తోడ్పడిరది. నెహ్రూ ఎంచుకున్న మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగం వెన్నుముకగా మారడానికి నెహ్రూ చేసిన దోహదానికి ఎంత విలువ ఉందో కమ్యూనిస్టు పార్టీ పెంచిన ఒత్తిడికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యమే ఉంది. ఆర్థిక వ్యవస్థను తీర్చి దిద్దడంలో కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశాలని స్పష్టమైన అవగాహన ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఏయే రంగాలు ప్రభుత్వ రంగంలో ఉండాలో నిర్ణయించుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. అభివృద్ధి పంథా ప్రజాస్వామ్య పద్ధతిలో సాగాలనీ, వికేంద్రీకరణ దానికి ఆయువు పట్టుగా ఉండాలని కమ్యూనిస్టు పార్టీ కచ్చితమైన దృక్పథంతో ఉండేది. అప్పటికి సోవియట్‌ యూనియన్‌ అనుసరిస్తున్న పంచవర్ష ప్రణాళికా వ్యవస్థ నెహ్రూకు స్ఫూర్తినిచ్చింది. వైవిధ్య భరితమే కాకుండా అభివృద్ధి సాధనలోనూ అనేక వ్యత్యాసాలు, బహుళత్వం ఉన్న దేశంలో దేశాభివృద్ధి సజావుగా సాగాలంటే ప్రణాళికా కమిటీ ఉండాలని వామపక్ష భావాలు కలిగిన మేఘనాథ్‌ సాహా నెహ్రూకు నచ్చచెప్పగలిగారు. 1950 మార్చ్‌ 15న ప్రణాళికా సంఘానికి అంకురార్పణ జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళికను అమలు చేయడానికి కావలసిన నిధులు సమకూర్చుకోవడానికి జర్మనీ, బ్రిటన్‌, అమెరికా ను అభ్యర్థించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తరుణంలోనే సోవియట్‌ యూనియన్‌ ముందుకొచ్చి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పడానికి సహాయ పడిరది. బొంబాయి పథకాన్ని అనుసరించకుండా ప్రణాళికా విధానాన్ని అనుసరించేట్టు చేయడం కమ్యూనిస్టుల విజయమే. ప్రభుత్వ ఆర్థిక విధానాలను నిర్ణయించుకోవడంలో నిర్దేశిత విధానం నుంచి దారి తప్పకుండా ఆ సమయంలో సీపీఐ నాయకుడు ఎ.కె.గోపాలన్‌ 1960 దాకా నిరంతరం జాగరూకంగా ఉంటూ అవసరమైనప్పుడల్లా ఒత్తిడి చేస్తూనే వచ్చారు. ఆ తరవాత ఆ బాధ్యతను సీపీఐ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు హిరేన్‌ ముఖర్జీ స్వీకరించారు. ఎస్సో, బర్మాషెల్‌ లాంటి చమురు కంపెనీలను జాతీయం చేయడంలో ఎ.కె.గోపాలన్‌ పాత్ర అద్వితీయమైంది.
శాస్త్ర సాంకేతిక రంగాలకు ఊతం ఇవ్వాలన్న సీపీఐ వాదనను నెహ్రూ సజావుగానే అర్థం చేసుకున్నారు. ఆయనకు ఉన్న శాస్త్రీయ దృక్పథం దీనికి తోడ్పడిరది. అందుకే ఆయన హయాంలోనే అనేక శాస్త్ర పరిశోధనా వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఐ.ఐ.టి.లకు అంకురార్పణ జరిగింది. నిర్దేశిత పద్ధతి ప్రకారం అభివృద్ధి రథం ముందుకు సాగడానికి నిరంతరం లక్ష్య నిర్దేశం చేయడంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. 1956 జనవరి 19న భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌.ఐ.సి.) ఏర్పడడానికి ముందు మన దేశంలో 154 ప్రైవేటు జీవిత బీమా సంస్థలు ఉండేవి. వీటిని జాతీయం చేసి ఎల్‌.ఐ.సి. ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ప్రజలకు రక్షా కవచంగా పని చేయడమే కాకుండా అవసరమైనప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను ఆదుకున్న సందర్భాలూ కొల్లలుగానే ఉన్నాయి. భాక్రానంగల్‌ లాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులతో వ్యవసాయరంగానికి బీజాలు పడినప్పుడూ ముందుకొచ్చిందీ సోవియట్‌ యూనియనే. ఇందిరా గాంధీ హయాంలో సోవియట్‌ యూనియన్‌ తో మన సంబంధాలు బలపడేట్టు చేయడంలోనూ కమ్యూనిస్టు పార్టీ చేసిన కృషి అపారంగానే ఉంది. 1967-68 లో కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఎనిమిది జిల్లాల్లో ప్రభుత్వ పంపిణీ విధానం అమలు చేసింది. 1974 నాటికి అది దేశ వ్యాప్తంగా అమలు కావడానికి కమ్యూనిస్టు పార్టీ ప్రోద్బలమే ప్రధాన కారణం. అణు శక్తిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చునన్న ఆలోచన నెహ్రూ మదిలో మెదిలినప్పుడు హోమీబాబా నాయకత్వంలో అణు ఇంధన కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఆ తరవాత ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించినప్పుడు సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యతను హోమీబాబా మన గోదావరి జిల్లాల బిడ్డ ఎ.ఎస్‌.రావుకు అప్పగించారు. ఆయన హైదరాబాద్‌, హరిద్వార్‌ అందుకు అనువైన ప్రాంతాలని తేల్చారు.
హైదరాబాద్‌లో ఇ.సి.ఐ.ఎల్‌. ఏర్పాటుకు, ఆ తరవాత దాన్ని నిర్వహించి ప్రజలకు అవసరమైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, పరిశ్రమలకు ఉపకరించే పరికరాలు ఉత్పత్తి చేయడంలో అత్యంత నిరాడంబరుడిగా జీవించిన ఎ.ఎస్‌.రావే ప్రధాన కారకుడు. 2008లో ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కమ్మేసినప్పుడు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం మన ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి అనే వారు. ఆ పునాదులు ప్రభుత్వ రంగ సంస్థలే. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఆ పునాదుల్లోని ఒక్కో రాయిని పెకలించి వేసి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఖనిజాల తవ్వకంపై ప్రభుత్వానికి ఉన్న గుత్తాధిపత్యాన్ని చెదరగొట్టారు. తన ఆశ్రితులకు జాతి సంపదను దోచి పెట్టడానికి కంకణం కట్టుకున్న మోదీ రేవు పట్టణాలను, విమానాశ్రయాలను సైతం ప్రైవేటు రంగానికి అప్పగించేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు సంపాదిస్తే దానివల్ల ప్రభుత్వ ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆ డబ్బును ప్రజా ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చు. ప్రభుత్వ రంగాన్ని సంపూర్ణంగా నిర్వీర్యం చేసే పన్నాగాలు జాతి జీవనాడినే దెబ్బ తీస్తున్నాయి. ప్రైవేటు రంగానికి లాభాలు నొల్లుకోవడానికి సదుపాయాలు కల్పించడం మీదే మోదీ పరమ లక్ష్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img