Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ధరల అస్థిరీకరణ ముప్పు

ద్రవ్యోల్బణం పెరుగుతున్న సూచనలు స్పష్టంగా కనిపి స్తున్నాయి. మే నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.3 శాతంగా నమోదైంది. టోకు ద్రవ్యోల్బణమూ పెరిగిపోతోంది. మరో వైపు చిల్లర మార్కెట్‌లో అన్ని రకాల నిత్యావసరాల వస్తువుల ధరలతో పాటు కూరగాయల రేట్లూ పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం జూన్‌ నెలలో మరింత పెరగవచ్చునని ఆర్థిక, మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు. ఇది ధరల అస్థిరీకరణకు దారి తీసే ప్రమాదం పొంచి ఉంది. ధరల అస్థిరీకరణకు, ద్రవ్యోల్బణానికి అవినాభావ సంబంధం ఉంది. అయినప్పటికీ ఆర్బీఐ ద్రవ్యోల్బణం పెరుగుదల పెద్ద సమస్య కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది మునుముందు ద్రవ్యోల్బణం మరింత పెరిగి, ధరలు వేగం పుంజుకుంటే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా కరోనా మహమ్మారి న పడి విలవిల లాడుతున్న బడుగు జీవుల బతుకులు ఛిద్రమవుతాయి. బడుగులు, సామాన్యులే గాకుండా మధ్య తరగతి ప్రజలూ కరోనా కాలంలో గతంలో ఏనాడు అనుభవించనన్ని కష్టాలు అనుభవించారు. మోదీ అసమర్థ పాలనే తమ కష్టాలకు కారణమని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంధన ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. రోజువారీ పెట్రోలు, డీజిలు ధరలు పెరుగుతున్నప్పటికీ వీటిపై పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కోసమే ప్రాధాన్యం ఇస్తోంది. వినియోగదారుల అవస్థలు పాలకులకు పట్టలేదు. వీటి ధరల పెరుగుదల అన్ని రకాల ఉత్పత్తి వస్తువుల ధరలపైన, రవాణా రంగం పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది అంతిమంగా ప్రజలపై భారాన్ని మోపుతోంది. ఇంధన ధరల పెరుగుదల ఒకవైపు, స్టీలు ధర పెరుగుదల నిర్మణ రంగంపైనా ప్రభావం చూపుతుంది. పత్తి, వంటనూనెలు, రసాయనాల ధరలు సైతం మోత మోగిస్తున్నాయి.
కరోనా రెండోదశ యింకా ముగిసిపోలేదు. మూడో దశ ప్రవేశిస్తుందని సిద్ధపడమని న్యాయ పాలకులు, వైద్య సంబంధ నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయిన ప్రజల వద్ద కొనుగోలు శక్తి పెరగకుండా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం సాధ్యమవుతుందా? అయినప్పటికీ రెండంకెల వృద్ధి రేటు సాధిస్తామని చెప్పుకోవడం విచిత్రం. సంక్షభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకొని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోదీ ప్రభుత్వం వాగ్దానం చేసినట్టుగానే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న హామీ కూడా ఉంది. కరోనా నియంత్రణకు తగినన్ని టీకాలు ఉత్పత్తి చేయించి సకాలంలో అన్ని తరగతుల ప్రజలకు అందించడానికే ఆర్థిక వనరులు లేక చేతులెత్తేసిన మోదీ ప్రభుత్వం ధరల నియంత్రణ తలంపునే వదలేసినట్టు కనిపిస్తోంది. వంటనూనెల ధరల ద్రవ్యోల్బణం 2021 మే నెల నాటికి 30.8శాతం పెరిగింది. వంటనూనెల రిటైల్‌ రేట్లు అపారంగా పెరిగాయి. కరోనాకు ముందు కిలో నూనె పాకెట్‌ రు.80`రు.90 మధ్య ఉండగా ప్రస్తుతం రు.170 దాకా పలుకుతోంది. అలాగే ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం తొమ్మిదేళ్ల నాటి కంటే ఇప్పుడు 11.6 శాతానికి ఎగబాకాయి. ఆరోగ్య రంగ ద్రవ్యోల్బణం కూడా రెండేళ్లలో 8.64 శాతం పెరిగింది. ఇవన్నీ ద్రవ్యోల్బణం పెరగడానికి, ధరలు దరువేయడానికి తద్వారా ధరల అస్థిరీకరణకు దారి తీస్తాయి. ఇక వృద్ధిరేటు 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధిని 7.3 శాతానికి కుదించారు. రిజర్వు బ్యాంకు జీడీపీ వృద్ధిని రిజర్వు బ్యాంకు 12.8 నుండి 10శాతానికి కుదించింది. అనేక అడ్డంకులున్నప్పటికీ రెండంకై వృద్ధి సాధిస్తామని, ధరలను ఆకాశం నుండి కిందకు దించుతామని పాలకులు చేసే ప్రకటనలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రత్యక్షంగా ధరల భారాన్ని చవిచూస్తున్న ప్రజలు మార్కెట్‌లో ధరలు తగ్గితేనే పాలకుల మాట నిజమని నమ్ముతారు.
కనీసం ఇంధన ధరలు తగ్గిస్తే వాటి ప్రభావం రవాణా రంగంపైన, చిల్లర వ్యాపారంలో ధరలపైన చూపుతుంది. నిత్యం వాడుకునే ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం తగ్గి ధరల అస్థిరీకరణకు కళ్లెం పడుతుంది. ఎక్సైజ్‌ సుంకాలు తగ్గించాలని ఆర్థికవేత్తలు, ప్రజా ప్రాతినిధ్య సంస్థలు, ప్రతిపక్షాలు పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను మోదీ ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. పాలకులు తీసుకొనే నిర్ణయాల వెనుక కార్పొరేట్‌ శక్తులు బలంగా పని చేస్తున్నప్పుడు ప్రజలు ఓటు వేయడానికే పరిమితమవుతున్నారు గానీ కనీసం నిరసన వ్యక్తం చేయడం లేదు. రిజర్వు బ్యాంకు సైతం ఎక్సైజ్‌ సుంకాలు తగ్గించడం ద్వారా పెట్రోలు, డీజిలు ధరలను నియంత్రించాలని అనేక మార్లు సూచించినా ఫలితం లేకుండా పోయింది. గత ఏడాది ముడిచమురు దిగుమతిపై ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి పెద్దమొత్తంలో ఆదాయం లభించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలు 3900 కోట్ల లీటర్లు, డీజిలు 8600 కోట్ల లీటర్లు వినియోగించారు. రెండు కలిపి 12500 కోట్ల లీటర్లు అవుతుంది. ఇంత మొత్తం పైన లీటరుకు రూపాయ పన్ను తగ్గించగలిగితే ఆ మొత్తం రు.12500 కోట్లు అవుతుంది. వినియోగదారుడికి అందే ఇంధన ధర మార్కెట్‌లో తగ్గితే ఊరట పొందుతారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం కదిలి ఎక్సైజ్‌ సుంకం తగ్గించి ఊరట కలుగజేస్తుందని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img