Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ధరల పెరుగుదలపై సీపీఐ వీరోచిత పోరాటాలు

ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతున్నప్పటికీ ధరలు సైతం ఉత్పత్తి పెరుగుదలతో పోటీ పడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి కేవలం కరువు కాటకాలు వచ్చినప్పుడో లేదా కరోనా మహమ్మారి సమయంలో మాత్రమే కనిపించింది కాదు. సరఫరాకు, గిరాకీకి మధ్య అంతరం నిరంతరం కొనసాగుతూనే ఉంది. నిరుద్యోగ సమస్య, గౌరవప్రదంగా బతకడానికి అవసరమైన వేతనాలు లేకపోవడంవల్ల సామాన్యుడి జీవనం ఎప్పుడూ కష్టంగానే సాగుతోంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు ఇప్పుడే కాదు గతంలోనూ చేసింది చాలా స్వల్పం. అందువల్ల ప్రజల పక్షాన నిలబడే భారత కమ్యూనిస్టు పార్టీ, ఇతర వామపక్ష పార్టీలు పోరాటం కొనసాగించక తప్పడం లేదు. ఈ పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ ముందు పీఠిననే నిలబడిరది. 1960 లు, 1970ల తొలి దశలోనో అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూనే వచ్చింది. ఈ ఆందోళనల కారణంగానే భారత ఆహార సంస్థ (ఎఫ్‌.సి.ఐ.) ఏర్పాటు చేయక తప్పలేదు. ఇతర వామపక్షాలూ, భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతర పోరాట ఫలితంగానే 1964లో ఆహార సంస్థ ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం చట్టం చేయవలసి వచ్చింది. ఈ చట్టం ఆధారంగానే 1965లో భారత ఆహార సంస్థ ఏర్పడిరది. భారత ఆహార సంస్థ ఏర్పడినప్పటికీ ఆ నిలవల పంపిణీ కోసం, ముఖ్యంగా పేదలకు ఆహార పదార్థాలు అందజేయాలని గట్టిగా కోరింది కమ్యూనిస్టులే. ఈ ఉద్యమాల పర్యవసానంగానే చౌక ధరల దుకాణాలు లేదా రేషన్‌ షాపులు ఏర్పాటు చేయవలసి వచ్చింది. అదే సమయంలో దొంగ నిలవల సమస్య మరో సవాలు విసిరింది. ఆహార పదార్థాలను దాచేయడానికి వ్యతిరేకంగా, చీకటి బజారును నిరోధించడం కోసం కమ్యూనిస్టు పార్టీ అదే పనిగా పోరాడవలసి వచ్చింది. కమ్యూనిస్టు పార్టీ, ఇతర వామపక్షాల ఒత్తిడి కారణంగానే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ వచ్చింది. దొంగ నిలవలు వెలికి తీయడానికి కమ్యూనిస్టు పార్టీ అనేక సందర్భాలలో ఈ నిలవలు వెలికి తీయడానికి దాడులు చేయవలసి వచ్చింది. 1960 నుంచి 1990 మధ్య కమ్యూనిస్టు పార్టీ కనీసం అయిదారుసార్లు చలో దిల్లీ ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమాలలో ప్రతి సారీ రెండు నుంచి మూడు లక్షల జనాన్ని కమ్యూనిస్టు పార్టీ సమీకరించ గలిగింది. అధిక ధరల వ్యతిరేకంగా పోరాడడంతో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారానికీ కమ్యూనిస్టు పార్టీ అనేక సందర్భాలలో ఉద్యమించింది. అధిక ధరల ఉద్యమాలు అనేక రాష్ట్రాలలో జరిగినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ లాంటి రాష్ట్రాలలో ఉధృతమైన ఉద్యమాలు చేసింది. ప్రజల తక్షణ సమస్యలను పట్టించుకుని ఉద్యమాలు లేవదీయడంలో కమ్యూనిస్టు పార్టీ కృషి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కమ్యూనిస్టు పార్టీ కొనసాగించే ఉద్యమాలలో జనం కూడా ఉత్సాహంగా పాల్గొంటూనే ఉన్నారు. అయితే ఇక్కడే ఓ సమస్య ఎదురవుతోంది. ఉద్యమాలలో పాల్గొన్న ప్రజలు ఆ తరవాత కమ్యూనిస్టుపార్టీతో మమేకంకావడంలేదు. ఎన్నికల సమయం లోనూ పోటీలో ఉన్న పార్టీ అభ్యర్థులకు ఓటు వేయడం లేదు.
తమ సమస్యలకు అధికారపార్టీ ప్రభుత్వాలే కారణమనీ, ఆ ప్రభుత్వాలను గద్దె దించితే తప్ప ప్రయోజనం లేదన్న నిశ్చితాభిప్రాయం కూడా ప్రజల్లో లేక పోలేదు. తమ జీవితాన్ని దుర్భరం చేస్తున్న పాలకపక్షాలను ఓడిరచాలన్న సంకల్పంలోనూ తేడా లేదు. తమ సమస్యల మీద తమకు అండగా నిలబడి పోరాటాలకు నాయకత్వం వహించిందీ కమ్యూనిస్టు పార్టీనే అన్న కృతజ్ఞతా భావమూ జనంలో ఉంది. అయితే తాము ఒల్లని ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కమ్యూనిస్టు పార్టీ శక్తి పరిమితం ఐంది అని భావించినప్పుడు అధికార పార్టీని ఓడిరచే శక్తి ఉన్న ఇతర పార్టీలకు ఓటు వేస్తున్నారు. వారి అంచనా అభ్యంతరకరమైంది కాదు. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టు పార్టీయేనన్న భరోసా వారికి ఉండడం లేదు. అందువల్ల పార్టీ మీద ఉన్న సానుకూల అభిప్రాయం ఓట్ల రూపంలోకి కమ్యూనిస్టు పార్టీకి అనుగుణంగా మారడం లేదు. ఇది వాస్తవం. చట్ట సభల్లో ఓట్లు, సీట్లూ సంపాదించడమే కమ్యూనిస్టు పార్టీ పరమ లక్ష్యం కాదు. ఎన్నికలలో పాల్గొనడం కమ్యూనిస్టు పార్టీ కార్యాచరణలో ఒక భాగం మాత్రమే. కమ్యూనిస్టు పార్టీ చట్ట సభల్లో ఉండవలసిన అవసరంఉంది అన్న అభిప్రాయం జనంలో ఉంది. సానుభూతిపరుల్లో ఉంది. ఆఖరి దిక్కు కమ్యూనిస్టు పార్టీయేనన్న అభిప్రాయమూ జనానికి ఉంది. అయినా ప్రజా కంటక అధికారపార్టీని గద్దె దింపడమే అసలు లక్ష్యం అని జనం భావించినప్పుడు ఓడిరచడం మీదే దృష్టి పెడ్తున్నారు. ఆ స్థితిలో తమకు అండగా నిలబడిన కొద్దిపాటి కమ్యూనిస్టులుగెలిచినా ఫలితంఏమిటన్న ప్రజాభిప్రాయమూ అభ్యతరమైందీ కాదు. చట్టసభల బలాన్నే కమ్యూనిస్టుల ఎదుగుదలకు చిహ్నం అనుకుంటు న్నందువల్ల పొరాటాలు నిర్వహించినందువల్ల కమ్యూనిస్టులకు కలిగే ప్రయోజనం లేకపోవడమే అసలు సమస్య. ఈ కారణంగానే కమ్యూనిస్టుల ప్రభావం తగ్గింది అన్న భావన కలుగుతోంది. ఉద్యమాలలో సహకరించిన వారిని తమవేపు తిప్పుకోవడానికి కావలసిన ప్రాతిపదక ఉన్నా ఈ సమస్యను అధిగమించి జనాదరణను పెంచుకొనేందుకు తగిన సాధన సంపత్తి కమ్యూనిస్టులకు లేకపోవడం ఓ విషాదం. అధికారిక పార్టీకి వామపక్షాలే ప్రత్యామ్నాయం అన్న జనాభిప్రాయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తగిన సాధన సంపత్తి లేకపోవడం కనీసం చట్ట సభల్లో ఈ లక్ష్య సాధనకు తమ బలం పెంచుకోవడానికి తగిన వెసులుబాటు కొరవడడం ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పార్టీల కృషి చరిత్రలో పుటల్లోకి ఎక్కడానికి ఉపకరించినా తక్షణ ఎన్నికల ఫలితాల మీద దాని ప్రభావం ఉండకపోవడం పెద్ద సమస్య.
ఈ చిక్కు ముడి విప్పే మార్గం కమ్యూనిస్టులు వెతుక్కోనంత కాలం పరిస్థితిలో ఆశించిన ఫలితాలు సాధించడం నెరవేరని లక్ష్యంగానే మిగిలిపోతుంది. అయినా అధిక ధరల బాధ తీరే దాకా కమ్యూనిస్టు పార్టీ పోరాడకా తప్పదు. ఇది సుదీర్ఘ పోరాటమే. పోరాట ఫలితాలు చట్ట సభల్లో విజయాలు సాధ్యం కావడం లేదన్న నైరాశ్యస్థితినుంచి కమ్యూనిస్టులు బయటపడాలి. ఎన్నికల విజయాలనే ఎదుగుదలకు గీటు రాయిగా పరిగణించ కూడదు అన్న నిర్ధారణ మాత్రమే ఈ సందిగ్ధతకు సమాధానం అన్న స్పష్టమైన అవగాహన ప్రజలకు తెలియజెప్పడానికి మార్గ నిర్దేశంకోసం మరింత పాటు పడక తప్పదు. జనసమీకరణ నిరంతరం కొనసాగవలసిన ప్రక్రియ. అది మాత్రమే అటుజనం సమస్య పరిష్కరించడానికి, ప్రజా సమస్యలు తీర్చడానికి, బలమైన పునాది నిర్మించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం. గతంలో చేసిన పోరాటలనుంచి కమ్యూనిస్టు పార్టీ స్ఫూర్తి పొందాలి. ముందుకు సాగాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img