Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నిర్మల వితండవాదం

పార్లమెంటు సమావేశాల వ్యవధి క్రమంగా తగ్గుతున్న దశలో ఈ ఏడాది వర్షాకాల సమావేశాలలో ఇప్పటికే దాదాపు పది రోజులు వ్యర్థమై పోయాయి. కారణాలు ఏమైనా కావచ్చు. నడ్డి విరుస్తున్న ధరల మీద చర్చ జరగాలన్న ప్రతిపక్షాల వాదన ఆచరణ లోకి రావడానికి చాలా సమయమే పట్టింది. పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తున్నారన్న నెపంతో ఉభయ సభల్లోనూ అనేక మంది ప్రతిపక్ష నాయకులను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. సోమ వారం అధికార ప్రతిపక్షాల మధ్య స్థూలమైన ఒప్పందం కుదర డంతో ధరల పెరుగుదలపై చర్చకు అవకాశం వచ్చింది. నిర్మలా సీతారామన్‌ ఆరోగ్యం బాగా లేనందువల్ల కొంతకాలం ఈ విషయమై చర్చే జరగలేదు. తీరా చర్చ జరిగినప్పుడు నిర్మలా సీతారామన్‌ ధరల పెరుగు దలకు ప్రభుత్వ విధానాల లోపం కారణం అని అంగీకరించడానికి నిరాక రించారు. ప్రతిపక్షాలు ధరల విషయమై గణాంకాల ఆధారంగా చర్చించ డానికి బదులు రాజకీయ దృక్కోణంతో చర్చిస్తున్నారు కనక తానూ రాజ కీయ దృష్టితోనే సమాధానం ఇస్తానని చెప్పారు. ఈ మాట చెప్పడంలోనే ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించడానికి ఆర్థిక మంత్రి సిద్ధంగా లేరని అర్థమై పోయింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతున్న స్థితిలో కూడా భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదని నమ్మించడానికి ఆమె ప్రయత్నించారు. ద్రవ్యోల్బణం 7 శాతం కన్నా ఎక్కువగా పెరగకుండా నిలవరించగలిగామని ఆమె చెప్పారు. ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య ఉంటే ఆర్థిక స్థితి పరవాలేదని రిజర్వు బ్యాంక్‌ చెప్తూ ఉంటుంది. ఆ వాదనను పక్కన పెట్టినా ఈ సూచీ 4 శాతం దరిదాపుల్లో ఉంటే ప్రజల మీద అంత ప్రతికూల ప్రభావం ఉండ దన్నది వాస్తవం. కానీ నిజానికి ద్రవ్యోల్బణం 7 శాతానికి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు పెంచే సూచనలే ఎక్కువగా కనిపి స్తున్నాయి. మన దేశంలో నిరుద్యోగుల సంఖ్య గత 48 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని గణాంకాలు ఆందోళన కలిగిస్తుండగా మోదీ ప్రభుత్వం వాటిని చాపకిందకు తోసేసింది. ఆహార పదార్థాల ధరలు విప రీతంగా పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. నిర్మలా సీతారామన్‌ దీనికి సంబంధించిన గణాంకాల గురించి ప్రస్తావించనే లేదు. బీజేపీ సర్కారు ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ యు.పి.ఎ. పాలనలోని లోపాల గురించి మాట్లాడి కాలం వెళ్లబుచ్చే ప్రయత్నమే ప్రధానంగా కనిపిం చింది. యు.పి.ఎ. ఏలుబడిలో వినియోగదారుల ధరల సూచీ, ద్రవ్యోల్బణం ఇంతకన్నా ఎక్కువ ఉన్న మాట వాస్తవమే. కానీ అప్పుడు ప్రజల నిజ వేత నాలు పెరిగాయి. ఉపాధి కల్పనా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు నిజ వేత నాలు తగ్గుతున్నాయి. నిరుద్యోగం తాండవిస్తోంది. నిజవేతనాలు, ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్న స్థితిలో ధరలు పెరగడం మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్టుగా తయారవుతోంది. దీన్ని నిర్మలా సీతారామన్‌ పార్ల మెంటులో మాట్లాడినప్పుడు ఉదాహరణ ప్రాయంగానైనా ఒప్పుకోలేదు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్న మాట వాస్తవమే. కానీ ఆ తర వాత భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని మోదీ సర్కారు చేస్తున్న వాదనలో పస లేదు. 2021-2022లో కేంద్ర గణాంకాల సంస్థ జారీ చేసిన సమాచారాన్ని పరిశీలించినా ప్రతి వ్యక్తి పెట్టగలిగే ఖర్చు తక్కువే ఉంది.
కరోనా కష్టాలు, ద్రవ్యోల్బణ భారం, పేదరికం అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్న దశలో మోదీ ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడానికి ప్రయ త్నించడం అటుంచి పరోక్ష పన్నులు పెంచడం ద్వారా మరింత భారం మోపింది. ఇటీవలే అయిన దాని మీద కాని దాని మీద వస్తు సేవల పన్ను (జి.ఎస్‌.టి.) అడ్డగోలుగా పెంచేసింది. జి.ఎస్‌.టి. లాంటివి పరోక్ష పన్నులు. ఇలాంటి పన్నులు పెరగడంవల్ల అందరి మీదా ప్రతికూల ప్రభావమే ఉంటుంది. దీన్ని నిర్మలా సీతారామన్‌ ససేమిరా అంగీకరించరు. 2008లో ప్రపంచమంతటా ఆర్థిక స్థితి దిగజారినప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి చిదం బరం మన ఆర్థిక వ్యవస్థ మౌలికాంశాలు పటిష్ఠంగానే ఉన్నాయి కనక మన కేమీ ప్రమాదం లేదని పదే పదే చెప్పే వారు. దీని అర్థం ఏమిటంటే ప్రభుత్వ రంగ సంస్థల మీద ఆయనకున్న విశ్వాసం. దీనికి విరుద్ధంగా మోదీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతున్నారు. ఆయన హయాంలో ఉదాహరణ ప్రాయంగానైనా ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఏర్పడలేదు. ఉన్న వాటినే నగదు కింద మార్చడం లాంటి పేర్లతో ప్రైవేటు రంగానికి కట్టబెడ్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు క్రమంగా తగ్గు తున్నప్పుడు ప్రభుత్వానికి ఆదాయం సహజంగానే తగ్గుతుంది. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికే జి.ఎస్‌.టి. లాంటి పరోక్ష పన్నుల బాదుడు ఎక్కువైంది. పైగా నిర్మలా సీతారామన్‌ మరో అసంబద్ధ వాదన లేవదీశారు. అమెరికాలో ద్రవ్యోల్బణం పది శాతం ఉంది చూడండి అంటున్నారు. ఆ మాట నిజమే కానీ అమెరికా సంపన్న దేశం. మనది ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. మన దేశ ఆర్థిక వ్యవస్థ పుట్టే వాడికి అన్న పెరిగే వాడికి తమ్ముడు అన్న స్థితిలోనే ఉంది. మన దేశంలో 55 శాతం మంది రోజు వారీ వేతనం మీద ఆధారపడి ఉన్నారు. నికరమైన వేతనాలు అందుకునే వారు మన దేశంలో 22 నుంచి 23 శాతం మందే ఉన్నారు. అలాంటప్పుడు ద్రవ్యోల్బణం, వినియోగదారుల ధరల సూచీ పెరగడంవల్ల సామాన్యులు కష్టాల పాలు కాక తప్పదు. టోకు ధరల సూచీ 15 శాతం ఉందన్న వాస్తవాన్ని నిర్మలా సీతారామన్‌ ప్రస్తావించనే లేదు. టోకు ధరల సూచీ అధికంగా ఉన్నప్పుడు క్రమంగా అది సామాన్యుడిపైనా ప్రభావం చూపించక తప్పదు. అయితే ఈ ప్రభావం వెంటనే కనిపించక పోవచ్చు. ఆర్థిక వ్యవస్థ కునారిల్లి పోవడానికి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం లాంటి కారణాల చాటున దాక్కోవాలని నిర్మలా సీతారామన్‌ ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాల కారణంగా పెట్టుబడులు తరలి పోతున్నాయన్న కఠిన సత్యాన్నీ ఆర్థిక మంత్రి అంగీకరించరు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడే మన దేశంలో పెట్రోల్‌, డీసెల్‌, గ్యాస్‌ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ముడి చమురు ధరలు పెరిగిన స్థితిలో ఆ ప్రయోజనం ప్రజలకు ఏం మాత్రం కలగలేదు. దీనివల్ల లాభపడిరది ప్రభుత్వ ఖజానా మాత్రమే. మన దేశంలో స్తబ్దత (స్టాగ్‌ ఫ్లేషన్‌) వచ్చే అవకాశమే లేదని నమ్మించడానికి నిర్మలా సీతారామన్‌ ప్రయత్నిస్తున్నారు. మోదీ ప్రభుత్వ అస్తవ్యస్త, ఆశ్రిత పక్షపాత ఆర్థిక విధానాల వల్ల, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో మన వ్యవస్థ ముడివడి ఉన్నందువల్ల ముప్పేట కష్టాలు ముసరక తప్పదు. 2019 నాటి స్థితికి అంటే కరోనా కష్టకాలానికి ముందున్న స్థితికి మన ఆర్థిక వ్యవస్థ చేరుకోవడానికి పుష్కరకాలం పడ్తుందని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ లతో పాటు ఆర్థిక నిపుణులూ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ హెచ్చరికలేవీ ఆర్థిక మంత్రి చెవికెక్కడం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img