Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నీతి ఆయోగ్‌లో అపస్వరాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడం వెనక కారణం ఏమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఇతర రాజకీయ పార్టీల అధీనంలోని ప్రభుత్వాలను మోదీ సర్కారు నిరంతరం వేధిస్తూనే ఉంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలను ఖరారు చేసే ఈ సమావేశాలకు హాజరు కాని ముఖ్యమంత్రులందరూ బీజేపీయేతర పక్షాలకు చెందిన వారే. వీరిలో అందరూ మోదీ ప్రభుత్వాన్ని, ఆయన నాయకత్వంలో కొనసాగుతున్న పరిపాలనా విధానాన్ని ఒకే రీతిలో చూడడం లేదన్నది కూడా సత్యమే. బీజేపీకి, ప్రతిపక్ష పార్టీలకు సమాన దూరం పాటిస్తున్నానని చెప్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కూడా నీతీ ఆయోగ్‌ సమావేశానికి హాజరు కాలేదు. అంటే సాధారణంగా మోదీ సర్కారుకు మద్దతిచ్చే పట్నాయక్‌ గైరు హాజరు కావడం చూస్తే మోదీ సర్కారుతో ఆయనకు ఉన్న విభేదాలు కేవలం రాజకీయమైనవి కావని తేలిపోతోంది. నీతి ఆయోగ్‌ సమావేశంలో తమ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయని తెలిసినా నవీన్‌ పట్నాయక్‌ హాజరు కాకపోవడం వెనక మోదీ ప్రభుత్వ వ్యవహార సరళిపై ఆయనకు అసంతృప్తి ఉందనే. నీతీ ఆయోగ్‌ సమావేశానికి హాజరుకాని ముఖ్యమంత్రులందరూ హాజరు కాకపోవడానికి ఒకే కారణం చూపలేదు. కానీ ఎవరి అభ్యంతరాలు వారికి ఉన్నాయి. అయితే ఈ అభ్యంతరాలను వ్యక్తం చేయడంలో హాజరుకాని ముఖ్యమంత్రుల్లో కొందరు చూపిన కారణాలు సమంజసంగా కనిపించడం లేదు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తాను హాజరు కాకపోవడానికి అనారోగ్యం కారణం అంటున్నారు. అంటే ఆరోగ్యం సహకరిస్తే వచ్చే వారనేగా. అప్పుడు మోదీ సర్కారు పని విధానాన్ని వ్యతిరేకించడం లేదనుకోవాలా? కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ఫ్రంట్‌ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తాను ఎందుకు హాజరు కాలేదో ఏ కారణమూ చెప్ప లేదు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మాత్రం దిల్లీ పరిపాలనా ధికారాలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఆర్డినెన్సే తాను హాజరు కాకపోవడానికి కారణం అని నిర్మోహమాటంగా తెలియజేశారు. మోదీ హయాంలో ఫెడరలిజం హాస్యాస్పదమైన అంశంగా మారిందని కేజ్రీవాల్‌ అంటున్నారు. దిల్లీ సంపూర్ణమైన రాష్ట్రం కాకపోవచ్చు. కానీ అది మిగతా కేంద్ర పాలిత రాష్ట్రాల్లాంటిది కాదు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి ఉన్నట్టుగానే దిల్లీకి శాసనసభ ఉంది. మంత్రివర్గమూ ఉంది. పుదుచ్చేరి ముఖ్యమంత్రికి ఎదురుకాని సమస్యలు దిల్లీ ముఖ్యమంత్రి ఎదుర్కోవలసి వస్తోంది. ఇతర పార్టీల ప్రభుత్వాలను ఖాతరుచేయని విధానం మోదీ సర్కారు ప్రత్యేకత. ఈ నెల 11న సుప్రీంకోర్టు దిల్లీ పరిపాలనా విభాగంపై మంత్రివర్గానికి సంపూర్ణ అధికారం ఉంటుందని తీర్పు ఇచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మోదీ ప్రభుత్వం ఆ తీర్పు అమలు కాకుండా ఆర్డినెన్సు జారీ చేసింది. దీన్నిబట్టి దిల్లీ ప్రభుత్వంపై మోదీ సర్కారు వైఖరి ఏమిటో తేలిపోతోంది. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కాని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు (కె.సి.ఆర్‌.) శనివారం ఈ ఆర్డినెన్సును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఆర్డినెన్సును మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకుంటేనే మర్యాదగా ఉంటుందని లేకపోతే లోకసభ, రాజ్యసభలో ఈ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా కావలసిన మద్దతు కూడగడ్తామని కె.సి.ఆర్‌. నిర్మోహమాటంగానే చెప్పారు. మోదీ పాలన తీరు ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌తో కలిసి ఆయన దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దిల్లీ ప్రభుత్వానికి ఉన్న పాలనాధికారాలను హరించి అభాసుపాలు కావొద్దని కె.సి.ఆర్‌. చేసిన సూచన మోదీ సర్కారు తలకెక్కుతుందన్న ఆత్యాశ అనవసరం.
బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా నీతి ఆయోగ్‌ సమావేశానికి దూరంగానే ఉన్నారు. ఈ సమావేశానికి హాజరు కాని ముఖ్యమంత్రుల వల్ల ఆ రాష్ట్రాల ప్రయోజనాలకే భంగం కలిగిస్తాయని బీజేపీ అధికార ప్రతినిధి రవి శంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించడం కేంద్ర ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం. అసలు నీతి ఆయోగ్‌ సమావేశాలకు రవి శంకర్‌ ప్రసాద్‌కు సంబంధం ఏమిటో అంతుపట్టదు. మోదీని ఇంకెంత కాలం వ్యతిరేకిస్తారు, విమర్శిస్తారు అని రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నిస్తున్నారు. ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంటుంది. మోదీ సర్కారు అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేకత ఎంత వినాశకరమైందో ఆలోచిస్తే భవిష్యత్తు అంధకార బంధురంగా కనిపిస్తుంది. నీతి ఆయోగ్‌ సమావేశం జాతీయ అభివృద్ధి క్రమాన్ని నిర్ణయించే మాట నిజమే. కానీ నీతి ఆయోగ్‌కు నాయకత్వం వహించే వారికి రాజకీయ అభిప్రాయాలతో, విభేదాలకు అతీతంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వెంట తీసుకు పోవలసిన బాధ్యతను విస్మరించలేం. ఈ విషయంలోనే మోదీ సర్కారు చేయవలసిన పనిచేయడం లేదు. సమావేశానికి హాజరుకాని ముఖ్య మంత్రులు అధికారంలో ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయనడం అహంకారానికి పరాకాష్ఠ. కేంద్ర ప్రభుత్వం నిర్వాకంవల్లే ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు శనివారం నాటి సమావేశానికి గైర్హాజరు కావలసి వచ్చింది. బీజేపీయేతర రాజకీయ పక్షాల అవసరాలను తీర్చే బాధ్యత ఉన్న నీతి ఆయోగ్‌ను నిర్వీర్యం చేస్తున్నారు. ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడం అంటే తమ రాష్ట్రాల అభివృద్ధిని బహిష్కరించడ మేనంటున్నారు. అంటే తమ పెత్తనాన్ని ఆమోదించని ఎవరినీ సహించే ఓపిక మోదీ ప్రభుత్వానికి లేనేలేదు. రవిశంకర్‌ ప్రసాద్‌ మాట తీరుచూస్తే మోదీని వ్యతిరేకించే వారెవరినీ ఆమోదించే సహనం ఏకోశానా కనిపించదు. నీతి ఆయోగ్‌ బాధ్యత మొత్తం దేశం అభివృద్ధికి పాటు పడడం. కానీ తమ కార్యకలాపాలకు సమ్మతించని వారిని బెదిరించే ధోరణిలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రణాళికా సంఘం పేరును నీతి ఆయోగ్‌గా మార్చడంలోనే మోదీ వ్యక్తిత్వంలోని ఆధిపత్య ధోరణి వ్యక్తమైంది.
ఈ సమావేశంలో వంద అంశాలను చర్చించారట. నిజమే కావచ్చు. కానీ సకల విషయాలనూ తమ అభిప్రాయానికి అనుగుణంగానే అంతా సాగాలనడం అత్యంత అప్రజాస్వామికం. తమను వ్యతిరేకించే ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలలో అభివృద్ధికి అవకాశం ఉండదు అన్నదే మోదీ సర్కారు నిశ్చితాభిప్రాయం. అయితే దీన్ని కచ్చితంగా వ్యతిరేకించవలసిందే. అభివృద్ధి పంథాలో భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని విని సమన్వయ దృక్పథం ప్రదర్శించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. మోదీ సర్కారులో లేనిదే ఈ విశాల దృక్పథం. దేశాభివృద్ధి ఏ ఒక్క నాయకుడి, లేదా పార్టీ గుత్త సొత్తు కాదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img