Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పరిశోధన అంటే చెరిపేయడమా?

చరిత్రలో స్థానం లేని వారు ఆ స్థానం కోసం వెంపర్లాడడం సహజం. దానికోసం వారు అనుసరించే పద్ధతులు ఉన్న చరిత్రను విరూపం చేయడం, వక్రీకరించడం. ఆ చరిత్రలో భాగమైన వారి నామరూపాలు లేకుండా చేయడం. పెద్ద గీత పక్కన మరింత పెద్ద గీతను గీయడానికి అవకాశం లేనప్పుడు ఉన్న పెద్ద గీతను కురచన చేయడానికే చరిత్రలో స్థానం లేని వారు ప్రయత్నిస్తుంటారు. భారత జాతీయోద్యమంలో ఏ పాత్ర లేని సంఫ్‌ు పరివార్‌ అనేక పద్ధతుల్లో చరిత్రను చెరిపేయడానికి, వక్రీకరించడానికీ తీవ్రంగా కృషి చేస్తోంది. సంఘ పరివార్‌ వారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మొదట ఆలోచించింది చరిత్ర గ్రంథాలను తమకు అనుకూలంగా తిరగ రాయించడమే. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత కేవలం చరిత్ర గ్రంథాలను తిరగరాయించడంతో ఆగడం లేదు. సకల విధాలా చరిత్రను వక్రీకరించడానికి బాహాటంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఇలాంటి విధ్వంసకర ప్రయత్నాలు కనీసం మూడు జరిగాయి. మొదటిది: 1921 నాటి మోప్లా తిరుగుబాటులో అమరులైన 397మంది పేర్లను మృతవీరుల నిఘంటువు నుంచి తొలగించ డానికి ఏర్పాట్లు చేయడం. రెండవది: అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌ సుందరీకరణ పేరుతో ఆ ప్రాంతంలో రేగినాల్డ్‌ డయ్యర్‌ సేన పేల్చిన తూటలకు బలైన దాదాపు వెయ్యి మంది ప్రాణార్పణకు అపచారం తల పెట్టడం. జలియన్‌ వాలాబాగ్‌ను ఒక స్మృతికేంద్రంగా ఉంచకుండా సుందరీ కరణ పేరుతో విహార కేంద్రంగా మార్చడం. రూపు మారిన జలియన్‌ వాలా బాగ్‌ను శనివారం నాడు ప్రారంభించి చరిత్రను వక్రీకరిస్తున్న వారిలో మోదీ తన పేరు నమోదు చేసుకున్నారు. మూడవది: మోదీకి ఏ పేరెత్తితే ఒళ్లంతా చిటపటలాడుతుందో ఆ పేరును స్వాంతంత్య్ర అమృతోత్సవాల పోస్టర్‌ నుంచి తొలగించడం. నెహ్రూ మీద ఉన్న కసిని మరోసారి ఇలా తీర్చుకున్నారు. మోప్లా తిరుగుబాటులో పాల్గొన్నది ముస్లింలన్న మాట నిజమే. కేరళలోని మలబార్‌ ప్రాంతంలో ముస్లింలైన వ్యవసాయ కార్మికులు ‘‘అన్యాయమైన కౌలుదారీ చట్టాలకు వ్యతిరేకంగా’’ బ్రిటిష్‌ వారి మీద 1921 ఆగస్టు 20న తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు వ్యావసాయిక ఉద్యమం, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం. ఈ తిరుగుబాటులో పాల్గొన్న వారిని కేరళ ప్రభుత్వం 1971లో స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తిం చింది. అయితే తిరుగుబాటు చేసింది ముస్లింలు కనక, ఆ తిరుగుబాటు హిందూ భూస్వాముల మీద కనక ఈ ఉద్యమానికి మతం రంగు పులిమే ప్రయత్నాలు ఇంతకు ముందూ జరిగాయి. ఇప్పుడు ఈ మూడవ కోణాన్ని మరింత కాషాయీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరడుగట్టిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తగా చాలాకాలం ఉండి బీజేపీ నాయకుడైపోయిన రాంమాధవ్‌ మోప్లా తిరుగుబాటులో తాలిబన్‌ బీజాలు ఉన్నాయని వాదించే సాహసం చేశారు. సంఫ్‌ు పరివార్‌ దృష్టి ముస్లిం వ్యతిరేకతే కనక మోప్లా ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన వారి పేర్లను మృత వీరుల చిట్టా నుంచి తొలగించాలనుకుంటున్నారు. ఇది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారిని అవమానించడమే. రక్త తర్పణం చేసిన వారి స్మృతిని తుడిపేయడమే. ఇటీవలే మోప్లా తిరుగుబాటు శతవార్షికోత్సవాలు జరగడం ఈ అంశం మీద దృష్టి కేంద్రీకరించడానికి సంఫ్‌ు పరివార్‌కు అవకాశం ఇచ్చినట్టుంది. ఈ పోరాటం వెనక ఉన్న మూడు కోణాలలో సామ్రాజ్యవాద వ్యతిరేకత, వ్యావసాయిక విప్లవం లాంటి ప్రధానాంశాలను కప్పి పుచ్చి కేవలం హిందువులపై ముస్లింల దాడిగానే మోప్లా తిరుగుబాటును చిత్రించడానికి సంఫ్‌ు పరివార్‌ కంకణం కట్టుకుంది. 1919 ఏప్రిల్‌ 13న రేగినాల్డ్‌ డయ్యర్‌ నాయకత్వంలోని సైనికులు జలియన్‌ వాలా బాగ్‌లో నిరాయుధులైన ప్రజలపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి దాదాపు వెయ్యి మందిని పొట్టన పెట్టుకున్నారు. బ్రిటిష్‌ వారి ఈ కిరాతకాన్ని హేయమైన సంఘటనగా భావిస్తాం. బ్రిటిష్‌ వారు క్షమాపణ చెప్పాలనీ అడిగాం. జలియన్‌వాలా బాగ్‌ను ఇప్పటికీ ఒక స్మృతి కేంద్రంగా భావిస్తాం. కానీ దీనికి మరమ్మతుల పేరిట మోదీ ప్రభుత్వం దీన్ని స్మృతి కేంద్రంగా మిగల్చకుండా సుందరీకరణపేరుతో విహారకేంద్రంగా మలిచింది. ఇది కార్పొరేటీకరణ. మన వారసత్వాన్ని విరూపం చేయడమే. విషణ్న వదనాలతో ప్రాణాలుఅర్పించిన వారికి శ్రద్ధాంజలి ఘటించవలసిన ప్రాంతాన్ని విహారకేంద్రంచేయడం అంటే చరిత్రకుఅపచారం తలపెట్టడమే. స్వతంత్ర పోరాటంతో సంబంధం లేని వారు మాత్రమే ఇలాంటి పని చేయగలరు. ఇక నెహ్రూ పేరెత్తితే చాలు మోదీ సర్కారు గంగవెర్రులెత్తి పోతుంది. అమృతోత్సవాలలో భాగంగా భారత చరిత్ర పరిశోధనా మండలి రూపొందించిన పోస్టర్లో మొదటి ప్రధానమంత్రి ప్రస్తావనే లేదు. జాతీయోద్యమంలో నెహ్రూ తొమ్మిదేళ్లు జైలుశిక్ష అనుభవించారు. నవ భారత నిర్మాణానికి పునాదులు వేశారు. ఇప్పుడు మోదీ సర్కారు తమ ఘనతగా చెప్పుకుంటున్న అనేక సంస్థలు, వ్యవస్థలు నెహ్రూ దూరదృష్టి ఫలితమే. గాంధీని సైతం ఎదిరించి 1929లో స్వయంపాలనాధికారం కాదు పూర్ణ స్వరాజ్‌ కావాలి అని పిలుపు ఇచ్చింది నెహ్రూ. స్వయం సమృద్ధి మోదీలాగా నెహ్రూకు అందమైన ‘‘ఆత్మ నిర్భర్‌’’ నినాదం కాదు. పటిష్ఠ కార్యాచరణ ప్రణాళిక. క్షమాభిక్ష వేడుకుని, బ్రిటిష్‌ ప్రభుత్వానికి స్వాతంత్య్ర పోరాటంలో తానుగానీ, తన అనుచరులుగానీ పాల్గొనబోమని హామీలిచ్చి జైలు నుంచి విడుదలై, హిందుత్వ సిద్ధాంతానికి పునాది వేసిన వీర సావర్కర్‌కుమాత్రం ఈ పోస్టర్‌లో స్థానందక్కింది. అయితే 1857నాటి తిరుగుబాటును ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అని చెప్పింది సావర్కర్‌ అని ఒప్పుకుని తీరవలసిందే. ఆ సావర్కర్‌ వారసులకు తాబేదార్లుగా మారిపోయిన ఐ.సి.హెచ్‌.ఆర్‌. నిర్వాహకుల నిర్వాకం ఎంత ఘోరమైందో! నెహ్రూ మాత్రమే కాదు. రaాన్సీ లక్ష్మీ బాయి, నానా సాహెబ్‌, బేగం హజ్రత్‌, అజీముల్లా ఖాన్‌ దగ్గర నుంచి మొదలుకుని ‘‘స్వరాజ్యం నా జన్మహక్కు’’ అని గర్జించిన బాలగంగాధర తిలక్‌, సరోజినీ నాయుడు, అనిబెసెంట్‌ లాంటి వారికే ఈ పోస్టర్లో చోటు దొరకలేదు. స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న వేలాది మందిని ఒకే పోస్టర్లో చూపించడం సాధ్యం కాదన్నది వాస్తవమే. కానీ రూపకర్తల ప్రాధాన్యమేమిటో అర్థం అవుతోంది. నెహ్రూ పేరు తరవాతి పోస్టర్లలో కనిపిస్తుంది తొందరెందుకు అని ఐ.సి.హెచ్‌.ఆర్‌. డైరెక్టర్‌ ఓంజీ ఉపాధ్యాయ ఊరడిస్తున్నారు. నెహ్రూ ఒక్కడికేం కర్మ అబుల్‌ కలాం ఆజాద్‌, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ లాంటి వారికీ చోటివ్వని ఈ పోస్టర్‌ పనిగట్టుకుని ముస్లింలను పరిహరించిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటప్పుడు నిఖార్సైన సెక్యులర్‌ వాది అయిన నెహ్రూ ఎలా మింగుడుపడతాడు! మోదీ అంటున్న ‘‘దేశం మారిపోతోంది, నూతన భారతం’’ అంటే ఇదేనేమో. ఇది చరిత్రను వక్రీకరించే వారి కొంచెపుతనం కాదు, పరిశోధనముసుగులో చరిత్రను తుడిచిపెట్టడానికి పనిగట్టుకుని పన్నుతున్న కుట్ర.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img