Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పారదర్శకతలేని దెవరికి?

బీజేపీ నాయకత్వంలో నరేంద్రమోదీ అధికారం చేపట్టే సమయంలో పారదర్శకత, జవాబుదారీ పాలన అందిస్తానని దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. తొమ్మిదేళ్ల పాలనాకాలంలో చేసిన వాగ్దానాలను అనేకసార్లు ఉల్లంఘించారు. బహుశా పారదర్శకత అనేది మోదీ డిక్షనరీలో లేదని భావించ వలసివస్తుంది. రాజ్యాంగ వ్యవస్థలన్నీ మోదీ కనుస్నల్లోనే పనిచేస్తున్నాయి. న్యాయవ్యవస్థసైతం ప్రభుత్వం చెప్పినట్లు వినవలసిందేనని ఒత్తిడి చేయడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. మోదీకి అత్యంత సన్నిహితంగా ఉండే అదానీ గ్రూపు స్టాక్‌మార్కెట్‌లో తీవ్ర కుంభకోణానికి పాల్పడిరదని అమెరికా ఆర్థిక పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక వెల్లడిరచడంతో దేశ ప్రజలు విభ్రాంతిచెందారు. కుంభకోణాల తర్వాత అదాని ప్రపంచ కుబేరుల్లో రెండవస్థాయి నుంచి 25వ స్థానానికి పడిపోయిందని తాజా అంచనా. షేర్లకొనుగోలు దారులు లక్షల కోట్లు నష్టపోయారు. ఈ ‘అదానీ గేట్‌’ పై పార్లమెంటరీ కమిటీద్వారా దర్యాప్తుకు ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. అనంతరం అదానీ మోసాలపై దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరగా కమిటీని తామే నిర్ణయించి పేర్లను సీల్డు కవరులో సుప్రీంకు అందచేస్తామని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌రిజిజు సుప్రీంకోర్టుకు పారదర్శకత, న్యాయ జవాబుదారీతనం లేదని తీవ్రంగా దాడి చేశారు. ప్రజాజీవనంలో గల పారదర్శకత, నిజాయితీ సుప్రీంలో లోపించాయని పరిధినిమించి వ్యాఖ్యానిం చారు. మంత్రి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడినప్పటికీ చాలా ప్రశాంతంగా ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ ప్రభుత్వం మళ్లీ మాట్లాడేందుకు వీలులేని విధంగా తగిన సమాధానం చెప్పారు. సీల్డు కవరు సంస్కృతిని తిరస్కరిస్తూ తామే దర్యాప్తు ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. పారదర్శకత మోదీ పాలనలో మచ్చుకైనా కనిపిస్తుందా? అయినప్పటికీ సుప్రీంకోర్టుపై తీవ్రంగా ధ్వజమెత్తడం ద్వారా న్యాయవ్యవస్థను కించపరచడం రిజిజుకి అలవాటుగా మారింది. సీల్డు కవరు అంటే అందులో ఏముందో పిటిషన్లు దాఖలు చేసినవారికి ఏ విషయం తెలియకుండా చేయడమే.
ప్రభుత్వం నియమించిన కమిటీ సీల్డు కవరును తీసుకొని దాన్ని సుప్రీంకోర్టు పరిశీలించి అది తమ నిర్ణయంగా ప్రకటిస్తే పారదర్శకత ఉండదని, ప్రజల్లో విశ్వాసం ఉండదని చంద్రచూడ్‌ తగురీతిలో చురకలంటించారు. కోర్టు సమాధానం ప్రభుత్వానికి చెంపపెట్టు అయింది. మంత్రి రిజిజు గతంలోనూ ఇలాగే కోర్టును అవమా నించేరీతిలో మాట్లాడారు. జడ్జిలు ఎన్నికల్లో పాల్గొనరని, ప్రజలు పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చేఅవకాశం ఉందని వ్యాఖ్యా నించారు. కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తాయన్న స్పృహకూడా మంత్రికి లేదని అనుకోవలసివస్తుంది. న్యాయమూర్తుల తీర్పులనుచూసి వారి పనితీరును అంచనా వేస్తారని రిజిజు మాట్లాడి కోర్టును అవమానపరిచారు. ఒక వ్యవస్థ మరో వ్యవస్థలో చొరబడకూడదని రాజ్యాంగం నిర్దేశించింది. అయితే ప్రభుత్వం చేసే తప్పులను న్యాయస్థానాలు ఎత్తిచూపి సరిదిద్దు కోవాలని చెప్పకపోతే ప్రజలకు న్యాయం జరిగేదెలా?
గతంలోనూ సీల్డుకవర్ల సంస్కృతి ఉన్నప్పటికీ ఇలాంటి సందర్భాలు అరుదుగానే ఉన్నాయి. వేళ్ల మీద లెక్కించగలిగినన్ని ఘటనలే ఉన్నాయి. అయితే నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన్పటి నుంచి ఇలాంటి ఘటనలు చాలా తరచుగా జరుగుతున్నాయి. గతంలో కొందరు న్యాయమూర్తులు ఈ పద్ధతిని అనుమతించారు. వారు ఈ పద్ధతిని ప్రోత్సహించకపోయిఉంటే మోదీ ప్రభుత్వం ఈ దుస్సాహసానికి పూనుకొని ఉండదు. పైగా ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు తన చేతిపనిముట్టుగా చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తోంది. దర్యాప్తుసంస్థలు, నియంత్రణ సంస్థల సహాయం తీసుకొనేలాగా దర్యాప్తు కమిటీని నియమిస్తామని ధర్మాసనం చెప్పిన తర్వాతకూడా తాము సూచించిన సభ్యుడొకరిని తీసుకోవాలని కూడా ప్రభుత్వం కోరడం మోదీ ప్రభుత్వ వింతవైఖరికి తార్కాణం. ధర్మాసనం పనితీరును తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం తరఫున సభ్యుడిని కమిటీలోకి తీసుకోవలసిందిగా తాను కోరబోనని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్తూ ప్రభుత్వం ఇందులో ఏదీ దాచబోదన్నారు. అదానీ కుంభకోణం జరిగిన నాటి నుండి ఈ కుబేరుడి మోసాలు బైటపడకుండా చూసేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నించింది. అదానీని కాపాడటం ద్వారా షేర్లు కొని పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ, ప్రభుత్వ బ్యాంకులను నష్టపరిచింది. లక్షలాది ప్రజలను మోసగించింది. అంతర్జా తీయంగా ప్రతిష్ఠ కోల్పోయింది. స్టాక్‌మార్కెట్‌ ఏ విధంగా నష్టపోలేదని నియంత్రణ సెబీ కూడా అదానీని వెనకేసుకు రావడం ఏమిటి? ఇప్పటికీ అదానీ గ్రూపు షేర్లు ఇంకా పతనమవుతూనే ఉన్నాయి. తప్పు ఎవరిదని ప్రజలు తెలుసుకొనే హక్కును సైతం ప్రభుత్వం తిరస్కరిస్తోంది. రాఫెల్‌ విమానాల కొనుగోలులో ప్రభుత్వం ఇసుమంతకూడా పారదర్శ కతను ప్రదర్శించలేదని ప్రజలం దరికీ తెలుసు. యూపీఏ ప్రభుత్వకాలంలో విమానాలను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ దాన్ని తోసివేసి ఈ ప్రభుత్వం ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగ పరచింది. ఇక ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టి ఎంతమాత్రం పారదర్శకంగా లేదు. ఇలా కొనుగోలుచేసే బాండ్లు నల్లధనాన్ని ప్రోత్సహించడం కాదా? వేలకోట్లుపెట్టి కార్పొరేట్లు బడా వాణిజ్యవేత్తలు నల్లధనంతోనే కొనుగోలు చేస్తారు. ఈ డబ్బు లెక్కల్లోకి రాదుగనుక అదినల్లధనమే అవుతుంది. మోదీ నల్లధనం నిర్మూలిస్తానన్న వాగ్దానం ఏమైంది? ఇప్పటికైనా ప్రభుత్వం తనవైఖరిని మార్చుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img