Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పార్లమెంటుకు అడ్డుతగులుతున్న
అధికార పక్షం

ప్రతిపక్ష సభ్యులు అధికార పక్షానికి సహించని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు, వాయిదా తీర్మానాలకోసం పట్టుబట్టినప్పుడు, ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయడానికి ప్రయత్నించినప్పుడు పార్లమెంటు సమావేశాలకు అంతరాయం కలిగేది. మోదీ హయాంలో ఈ పరిస్థితి తిరగబడిరది. అధికార పక్ష సభ్యులు రగడ లేవదీయడంవల్లే పార్లమెంటు కార్యకలాపాలకు భంగం కలుగుతోంది. బీజేపీకి ఉన్న సంఖ్యాబలం కారణంగా ప్రతిపక్షాల గొంతు వినిపించకుండా పోతోంది. ప్రతిపక్ష నాయకులు తమకు నచ్చని వ్యాఖ్యలు చేస్తే వాటిని టోకున రికార్డుల నుంచి తొలగిస్తున్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమైన మాటలు ఎవరైనా వాడితే వాటిని రికార్డుల నుంచి తొలగించమని స్పీకర్‌ ఆదేశించేవారు. మోదీ హయాంలో పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమైన మాటలనే కాదు ప్రభుత్వ పక్షానికి మింగుడు పడని  వాక్యాలు, పేరాలు  రికార్డులలో లేకుండా పోతున్నాయి. అసలు పార్లమెంటు సమావేశాలు జరిగే సమయమే క్రమంగా కుంచించుకుపోతోంది. ప్రధానమంత్రి పార్లమెంటు సమావేశాల్లో కనిపించడమే మహద్భాగ్యమై పోయింది. సోమవారం ప్రారంభమైన రెండవ విడత బడ్జెట్‌ సమావేశాలు మొదటి రోజు నుంచే గలభా వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. రెండో రోజూ అదే తీరు. పార్లమెంటులో రగడ కొనసాగడానికి అనువైన వాతావరణం ఏర్పడడానికి సాక్షాత్తు ప్రధానమంత్రే కారణం. ఆయన ఆదివారం కర్నాటకలోని హుబ్లీ, ధార్వాడ్‌ సభల్లో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ లండన్‌ లో కూర్చుని భారత్‌ లో ప్రజాస్వామ్యం అడుగంటుతోందని చెప్పడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. అలాంటి వారిని సమర్థించకూడదన్నారు. ఇంకేముంది సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ తరఫు మైలార భటుల్లాంటి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌, అనురాగ్‌ ఠాకూర్‌, పీయూష్‌ గోయల్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌. గిరిరాజ్‌ సింగ్‌, ప్రహ్లాద్‌జోషి లాంటి వారు ఉభయ సభల్లో రాహుల్‌గాంధీ పైన విరుచుకుపడ్డారు. సాధారణంగా మర్యాద తప్పని రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా తిట్ల దండకం ఎత్తుకున్నారు. సాక్షాత్తు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ సభను సజావుగా నిర్వహించడానికి కృషి చేయవలసిన బాధ్యతను గాలికి వదిలేసి రాహుల్‌ గాంధీ మీద ఒంటి కాలి మీద లేచారు. ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌, అనురాగ్‌ శర్మ, గిరిరాజ్‌ సింగ్‌ మర్యాద తప్పి ప్రవర్తించడాన్ని అర్థం చేసుకోవచ్చు. వారికి తమ నోటి మీద అదుపు ఉన్న సందర్భాలు చాలా స్వల్పం. కానీ సీనియర్‌ మంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌, పీయూష్‌ గోయల్‌ కూడా పూనకం వచ్చినట్టు ప్రవర్తించడం విచిత్రంగా ఉంది. పార్లమెంటరీ సంప్రదాయాలపై వారికున్న ఆదరణ ఎంత లేశమాత్రమో రుజువు అయింది. లండన్‌ లో రాహుల్‌ గాంధీ మన దేశంలో ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతోందని, ఇతర ప్రజాస్వామ్య దేశాలు ఈ అంశాన్ని గమనించాలని, లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికే ముప్పు వస్తుందని అనడం బీజేపీ నాయకులు సహించలేకపోతున్నారు. వాస్తవాన్ని అంగీకరించడం మోదీకి, ఆయన అనుయాయులకు ఎన్నడూ అలవాటు లేదు. అయినా ఇంత బరితెగించడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరుగుతున్నాయన్న సందర్భాలలోనూ ప్రతిపక్ష నాయకుల మాటలు అధికార పక్షానికి రుచించకపోతే ప్రతిపక్ష నాయకుల మైకులు మూగ వోతాయి. విధానాల రూపకల్పనకు, ప్రజా సమస్యలకు సంబంధించి వివిధ అంశాలపై చర్చలకు, సంవాదాలకు పార్లమెంటు వేదిక కాకుండా పోయింది. అంతా ఏకపక్షంగానే జరగాలన్న అధికార పక్షం మంకు పట్టు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ఉన్న పక్షం మాట నెగ్గడమేనన్న సంకుచిత భావం అధికారపక్షంలో గూడుకట్టుకు పోయింది. ప్రతిపక్షం మాట కూడా వినడం ప్రజాస్వామ్య మౌలిక లక్షణం అన్న ధ్యాస బీజేపీ నాయకులకు ఏ కోశానా లేదు. లోకసభ స్పీకర్‌, రాజ్యసభ అధ్యక్షుడు ముందు ఏదో ఒక పార్టీకి చెందిన వారై అయి ఉండొచ్చు. కానీ ఒక్క సారి వారు సభాధ్యక్ష స్థానంలోకి వచ్చిన తరవాత సంపూర్ణంగా నిష్పక్షపాతంగా వ్యవహరించడం సంప్రదాయం. కానీ మోదీ హయాంలో అమలులోకి తెస్తున్న దుష్ట సంప్రదాయాలే సంప్రదాయాలుగా చెలామణి అవుతున్న కాని కాలంలో బతుకుతున్నాం. 

ప్రతిపక్ష నాయకులకు పార్లమెంటు వేదిక మీద మాట్లాడే అవకాశం రాను రాను తగ్గిపోతున్నందువల్ల పార్లమెంటు ఆవరణలోనే, పార్లమెంటు భవనం వెలుపల పత్రికా విలేకరులతో తమ గోడు వెళ్లబోసుకోవడం తప్ప మర్గాంతరం లేదు. పార్లమెంటు రాజకీయ కక్ష తీర్చుకునే రచ్చబండగా, చాకిరేవుగా రూపాంతరం చెందినప్పుడు మరో మార్గం ఉంటుందను కోవడంకూడా భ్రమే. లండన్‌లో రాహుల్‌గాంధీ అన్న మాటలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు యాగీ చేస్తున్నారు. దీనికి ప్రతిగా ప్రధాని క్షమాపణ కోరాలన్న వాదనరావడంలో అసహజం ఏమీలేదు. దేశ ప్రజాస్వామ్య దుస్థితిగురించి రాహుల్‌ విదేశీగడ్డ మీద ప్రస్తావించడాన్ని బీజేపీ తప్పుపడ్తోంది. ఇదెక్కడిన్యాయమో ఎంత తరచిచూసినా అంతు పట్టదు. ఇతరదేశాలలో జరుగుతున్న అకృత్యాలను మనదేశంలోనే విమర్శించడం కాకుండా అంతర్జాతీయ వేదికలమీద మన నాయకులు ప్రస్తావించిన ఉదంతాలు బీజేపీకి ఎందుకు కనిపించవో అంతుపట్టదు. పలస్తీనా స్వయంప్రతిపత్తి గురించి ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా మనం దశాబ్దాల తరబడిపోరాడాం. ఈ పోరాటాలు నాలుగుగోడల మధ్య జరిగిన వేంకావు. అంతర్జాతీయ వేదికల మీదే ప్రస్తావించాం. దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష కొనసాగినప్పుడు నెల్సన్‌ మండేలా పోరాటాన్ని సమర్థించాం. విదేశీ గడ్డ మీద మన వ్యవహారాలు లేవనెత్తకూడదంటే మరి ఇతర దేశాల వ్యవహారాలు ప్రస్తావించే హక్కు మనకెక్కడిది అన్న ప్రశ్న బీజేపీ నేతల మెదళ్లకు తోచనేతోచదు. ఇలాంటి వ్యవహారాలు ముఖ్యంగా అంత ర్జాతీయంగా ప్రజాస్వామ్య విధానాలకు అండగా నిల బడడం, జాతి వివక్షను ఎండగట్టడం, సంపన్న, పేద దేశాల మధ్య అంతరాలు తగ్గాలని వాదించడం దశాబ్దాలుగా మన విదేశాంగ విధానానికి గీటురాళ్లుగా ఉన్నాయి. కానీ పలస్తీనా వ్యవహారంలో సాంప్రదాయికంగా మనం అనుసరిస్తున్న విధానాలను మంటగలిపి ఇజ్రాయిల్‌ తో స్నేహం కోసం తహ తహ లాడడం బీజేపీ హయాం ప్రారంభమైన తరవాతే చూస్తున్నాం.
స్వయంగా మోదీ అనేక దేశాలలో పర్యటించి నప్పుడు మునుపటి ప్రభుత్వ విధానాలను విమర్శించడంతో సరిపెట్టు కోకుండా తాను అధికారంలోకి రాకముందు భారతీయులుగా ఎందుకు పుట్టాం అని సిగ్గుపడే పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించడానికి రాహుల్‌ కు వర్తించే సూత్రం వర్తించకపోవడానికి బీజేపీ ఆధిపత్య ధోరణే కారణంగదా. మన దేశంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలు అడుగంటుతున్నాయని రాహుల్‌ అంటే విదేశాలను జోక్యం చేసుకొమ్మని ఆయన కోరారని వక్రీకరణలకు దిగడం బీజేపీ ప్రత్యేకత కాబోలు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌ గాంధీని దేశద్రోహి అని నిందిస్తున్నారు. ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ అయితే రాహుల్‌ను దేశం నుంచే పంపించి వేయాలంటున్నారు. విదేశీ వనితకు పుట్టిన వ్యక్తికి దేశభక్తి ఎక్కడినుంచి వస్తుంది అని నీచస్థాయి మాటలు మాట్లాడుతున్నారు. విదేశీయులు అంత అంటరాని వారైనప్పుడు మోదీ మన దేశ కీర్తిబావుటాను ఎగరేస్తున్నారని ఎలా అనగలుగుతున్నారు. విదేశీయమైన ప్రతిదీ పరిత్యజించదగిందే కావాలిగదా! అసత్యమాడడంలో మోదీ అనుయాయులు ఆయనను మించిపోయేట్టు ఉన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలమీద ప్రస్తుత బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదు. పార్లమెంటు జరగకుండా చేయడం అధికార పార్టీకి విశేషాధికారం అయిపోయినట్టుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img