Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పార్లమెంటులో ప్రతిపక్ష ఐక్యత

మన ప్రజాస్వామ్యం గురించి ఎప్పుడు మాట్లాడినా మనది చాలా పటిష్ఠమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అని, ప్రజస్వామ్య విధానానికి సంబంధించిన వ్యవస్థలన్నీ పదిలంగా ఉన్నాయని అంటూ ఉంటారు. రాజ్య వ్యవస్థలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రధానమైన వేదిక పార్లమెంటు. పార్లమెంటు సమావేశాల నిడివి నానాటికీ తగ్గిపోవడం ఒక సమస్య అయితే సమావేశాలు జరిగిన కాలంలో కూడా పార్లమెంటరీ కార్యకలాపాలు ఏమీ జరగక పోవడం, పదే పదే వాయిదా పడడం, కొన్నిసార్లు అంతమంగా ఒక్కో పార్లమెంటరీ సమావేశకాలంలో ఒక్కరోజైనా ఎలాంటి కార్యకలాపాలు జరగకపోవడం మన ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. తమకు ప్రధానమని తోచిన అంశాలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడం మామూలే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పార్టీల వైఖరి ఇలాగే ఉంటుంది. కానీ ఇందులోనూ బీజేపీ ప్రతిపక్షంలోఉన్నా, అధికారంలో ఉన్నా పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడంలో భిన్నంగా వ్యవహరిస్తోంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభ మైనా కాక ముందే సభ జరగనివ్వం అని బీజేపీ సీనియర్‌ నాయకులు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో సుదీర్ఘ పార్లమెంటరీ అనుభవం ఉన్న సుష్మా స్వరాజ్‌, న్యాయ నిపుణుడు అరుణ్‌ జైట్లీ కూడా ఉండడం విచారకరం అనుకునే వాళ్లం. అప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉండేది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనూ పార్లమెంటు సమావేశాలు సవ్యంగా జరగకుండా చేయడానికి సకల కట్టుదిట్టాలు చేస్తూనే ఉంది. శీతాకాలం సమావేశాలైతే ముందుగా నిర్ణయించిన గడువుకన్నా ముందే వాయిదాపడ్డాయి. ప్రభుత్వ కార్యకలాపాలు ముగిశాయి కనక, ఆమోదించవలసిన బిల్లులు ఆమోదించేశారు కనక పార్లమెంటు సమావేశాలను గడువుకన్నా ముందే ముగించామన్నారు. ప్రతిపక్షం లేవనెత్తదలచిన అంశాలకు అవకాశంఇవ్వని విషయాన్ని మాత్రం అధికారపక్షం మాటమాత్రంగా కూడా ప్రస్తావించలేదు. ప్రతిపక్షాలను నోరెత్తకుండా చేయడం మోదీ ఏలుబడిలో ప్రత్యేకశైలిగా తయారైంది. ఒకవేళ ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చినా ప్రభుత్వ పక్షానికి నచ్చనిమాటలు ప్రస్తావనకు వస్తే వెంటనే మైక్‌ మూగవోతుంది. జనవరి 31వ తేదీన మొదలైన బడ్జెట్‌ సమావేశాలతీరు కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రతిపాదన పెద్ద ఆటంకాలు లేకుండానే సాగిపోయాయి. ఆ తరవాతి నుంచి అదానీ వ్యవహారం చర్చించాలన్న ప్రతిపక్షాల న్యాయమైన డిమాండును షరా మామూలుగా అంగీకరించకపోవడంతో సమావేశాలకు ఆటంకం కలుగుతూనే ఉంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ జరగడం సంప్రదాయం. రాష్ట్రపతి ప్రసంగం అంటే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేయబోయే ఆర్థిక కార్యకలాపాల తబ్సీలు మాత్రమే. ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ చాలా ముఖ్యమైంది. అందులో అనేక అంశాలు చర్చకు వస్తాయి. అదానీ వ్యవహారాన్ని చర్చించాలని పట్టుబట్టడంలో దాదాపు ప్రతిపక్షాలన్నీ ఒకే వైఖరి అనుసరించాయి. ఇంతకు ముందు భిన్నంగా వ్యవహరించిన ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో మాత్రం ఒక్క తాటిపై నడిచాయి. చివరకు సోమవారం ఒక రాజీ సూత్రం దొరికింది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖడ్గే చేంబర్‌లో జరిగిన ప్రతిపక్ష సమావేశానికి 16 పార్టీల నాయకులు హాజరయ్యారు. మొదట ప్రధానమంత్రి మోదీ కనక అదానీ వ్యవహారంపై వివరణ ఇస్తే ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలు ప్రకటించాయి. అదానీ పేక మేడ కూలిపోవడం ఒక వ్యాపార సంస్థ ఎదుర్కుంటున్న ఇబ్బంది మాత్రమే కాదు. అదానీ వ్యాపార సామ్రాజ్యం చాలా విస్తృతమైంది. అదానీ నడుపుతున్న కంపెనీలలో జీవిత బీమా సంస్థ(ఎల్‌.ఐ.సి.) భారీగా వాటాలు కొనడం ద్వారా పెట్టుబడి పెట్టింది. అదానీ కుదేలై పోవడంతో ఎల్‌.ఐ.సి.కి దాదాపు 30,000 కోట్ల రూపాయలు నష్టం కలిగిందంటున్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా అదానీ కంపెనీలకు భారీగా రుణాలిచ్చింది. ఇంకా అనేక బ్యాంకులూ అప్పులిచ్చాయి. ఆ మొత్తం కూడా వేల కోట్లలో ఉంది. హిండెన్‌బర్గ్‌ సంస్థ బయటపెట్టిన బండారంవల్ల అదానీ ఏ మేరకు ఆర్థికంగా నష్టపోయారన్నది విషయాంతరం. కానీ ఎల్‌.ఐ.సి., స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రజాధనంతో నడిచే వ్యవస్థలు. అవి నష్టపోవడం అంటే ప్రజల సొమ్ము గంగ పాలు కావడమే. అందుకే ప్రతిపక్షాలు పార్లమెంటులో అదానీ విషయం చర్చించాలని పట్టుబడ్తున్నాయి. 

అమెరికాలోని హిండెన్‌బర్గ్‌ పరిశోధనా సంస్థ అదానీ వ్యాపార సామ్రాజ్యంలోని లొసుగులను బయటపెట్టే క్రమంలో వెల్లడిరచిన వివరాలు మన ఆర్థిక వ్యవస్థకే ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్న భయం ఆవరించేట్టుగా ఉన్నాయి. ప్రతిపక్షాలు సహజంగా ఈ అంశంపై చర్చజరగాలని పట్టుబట్టడంలో ఆశ్చర్యంలేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జె.పి.సి.) ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఇలా జె.పి.సి. ఏర్పాటు చేయడం కొత్తేమీ కాదు. అందులో ప్రతిపక్షాలవారితో పాటు అధికారపక్ష సభ్యులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. మన పార్లమెంటు చరిత్రలో ఇంతవరకు ఆరు సార్లు జె.పి.సి. ఏర్పాటు చేశారు. దీనివల్ల ఫలితం ఏమిటి, దోషులకు శిక్షలు పడ్డాయా అన్నది వేరే విషయం. అలాంటివేమీ ఎప్పుడూ జరగలేదు. కానీ జె.పి.సి. దర్యాప్తు క్రమంలో అనేక అంశాలు చర్చకు వస్తాయి. అవి ప్రజలకు తెలుస్తూ ఉంటాయి. మోదీ సర్కారుకు ఇష్టం లేనిదే ఇది. మొత్తం మీద జె.పి.సి. ఏర్పాటు చేస్తారా లేదా అన్నది పక్కన పెడ్తే మంగళవారం ప్రధానమంత్రి అదానీ అంశంపై పార్లమెంటులో పెదవి విప్పితే పార్లమెంటు సమావేశాలు కొనసాగడానికి వీలుంటుంది. సాధారణంగా దేశాన్నంతటినీ కలచివేసే ఏ అంశం మీదా నోరు విప్పకపోవడం మోదీ విశిష్ట విధానం. అదానీ కుంభకోణంలో ప్రజాధనం కూడా ఇమిడి ఉంది కనక ఈ విషయం చర్చించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష నాయకులు చర్చకు అవకాశం ఇవ్వాలని కోరుతూ నోటీసులు అంద జేశారు. సభలో నిరాధారమైన ఆరోపణలు చేయకూడదన్న కారణంతో లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా చర్చకు అంగీకరించలేదు. ప్రతిపక్షాలు ఇచ్చిన నోటీసులు సవ్యంగా లేవన్నది రాజ్యసభ అధ్యక్షులు జగ్దీప్‌ ధన్కర్‌ తేల్చిన నిగ్గు. చర్చకు నిరాకరించడానికి సభాపతులకు అధికారం ఉన్నప్పుడు ప్రజా వ్యవహారాలను చర్చించడానికి ఫలానా నిబంధనలు పాటించాలని సూచించే అవకాశం వీరికి ఎందుకు ఉండదో తెలియదు. ప్రతిపక్షాలు ఒక అడుగు వెనక్కు వేయడానికి సిద్ధ పడ్డాయి కనక మోదీ విస్పష్టమైన ప్రకటన చేయడమే సముచితం. పార్లమెంటు వేదిక మీద ప్రతిపక్షాలు ఐక్యంగా వ్యవహరించడం మంచి పరిణామమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img