Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పుండు మీద కారం చల్లిన నిర్మలా సీతారామన్‌

లఖింపూర్‌ ఖేరీ మారణకాండ జరిగి పది రోజులైన తరవాత బుధవారం రెండు ఉదంతాలు జరిగాయి. ఒకటి: రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రతినిధి వర్గం రాష్ట్రపతి రాం నాథ్‌ కోవింద్‌ను కలిసి లఖింపూర్‌ సంఘటనకు బాధ్యుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమార రత్నం గనక సదరు మంత్రిని బర్తరఫ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. షరా మామూలుగా రాష్ట్రపతి ఈ విషయమై నేను ప్రభుత్వాన్ని సంప్రదిస్తాను అని చెప్పి కాంగ్రెస్‌ ప్రతినిధి వర్గాన్ని పంపించేశారు. మన పాలనా వ్యవస్థ ప్రకారం రాష్ట్రపతి దేశాధినేతే కాని ప్రభుత్వాధినేత కాదు. ఏ చర్య తీసుకోవాలన్నా ప్రభుత్వమే తీసుకోవాలి. ప్రభుత్వ సిఫార్సు లేకుండా రాష్ట్రపతి ఏ నిర్ణయమూ తీసుకోలేరు. రాష్ట్రపతిని కలుసుకుని ఫిర్యాదు చేయడం లాంఛనమే. రెండు: అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం బోస్టన్‌లోని హార్వర్డ్‌ కెన్నెడీ స్కూలులో మాట్లాడుతూ ‘‘లఖింపూర్‌ సంఘటన ఖండిరచదగిందే కానీ ఇలాంటి సంఘటనలు దేశంలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. అప్పుడు ఎందుకు మాట్లాడరు. బీజేపీ అధికారంలో ఉన్నందువల్ల నానా యాగీ చేస్తున్నారు’’ అని పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడారు. ప్రధానమంత్రి, సీనియర్‌ మంత్రులు ఈ ఉదంతంపై పెదవి విప్పడం లేదెందుకు అని అడిగినప్పుడు ఇలాంటివి దేశంలో ఎక్కడో ఓ చోట జరగడం సర్వ సాధారణమే అని సమాధానమిచ్చి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పైగా పది నెలల పైబడి రైతులు దిల్లీ సరిహద్దులో బైఠాయించడాన్ని ప్రస్తావిస్తూ ఈ చట్టాలు చేసే ముందు విస్తృత చర్చలు జరిగాయని కూడా సెలవిచ్చారు. వివాదాస్పదమైన మూడు చట్టాలు లోక సభలో ఏ హడావుడి లేకుండానే ఆమోదించినప్పటికీ రాజ్యసభలోనే నానా యాగీ చేశారు అని నిర్మలా సీతారామన్‌ అక్కసు వెళ్ల బోశారు. రైతులఉద్యమం మీద ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ప్రచారం చేస్తున్న అసత్యాలను నిర్మలా సీతారామన్‌ అమెరికాలో కూడా చెప్పిన అబద్ధం చెప్పినట్టే చెప్పారు. ఆందోళనకారులు ప్రధానంగా ఒక రాష్ట్రానికి (పంజాబ్‌) చెందిన వారనీ హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొంత ప్రాంతానికి మాత్రమే చెందిన వారన్న పాత పల్లవే ఎత్తుకున్నారు. ఈ చట్టాల్లో అభ్యంతరకరమైన ఒక్క అంశం చెప్పమన్నా రైతులు చెప్పలేకపోతున్నారని వితండవాదానికి దిగారు. ఈ మూడు చట్టాలు తమకు విపరీతమైన నష్టం కలగ జేస్తాయని గత ఏడాది సెప్టెంబర్‌లో పార్లమెంటు ఈ చట్టాలను ఆమోదించినప్పటి నుంచి రైతులు చెప్తూనే ఉన్నారు. అయినా నిర్మలా సీతారామన్‌కు రైతుల బాధేమిటో తెలియదట. పైగా ‘‘ఎందుకు ఆందోళన చేస్తున్నారో వారికే తెలియదు’’ అని దెప్పి పొడిచారు. పనిలో పనిగా ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన డా. అమర్త్యసేన్‌ మీద కూడా విరుచుకు పడ్డారు. ‘‘కొంతమంది పండితులు తమ ఇష్టాయిష్టాలద్వారా ప్రభావితులవు తుంటారు. వీరు వాస్తవాల ఆధారంగా మాట్లాడరు’’ అని ఎత్తి పొడిచారు. ‘‘నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్య సేన్‌తో సహా ఆర్థిక శాస్త్ర నిపుణులమైన మేం బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం గదా’’ అని హార్వర్డ్‌ ప్రొఫెసర్‌ లారెన్స్‌ సమ్మర్స్‌ అడిగినప్పుడు నిర్మలా సీతారామన్‌ అమర్త్యసేన్‌ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హయాంలో ఇతరమతాల వారి మీద, ముఖ్యంగా ముస్లింల మీద అసహనం పెరిగింది గదా అన్న వ్యాఖ్యను ప్రస్తావిస్తూ బీజేపీ అధికారంలోలేని రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు జరిగినా మోదీ సర్కారునే విమర్శిస్తారుఅని ఆమె దెప్పిపొడిచారు. ‘‘అభిప్రాయం ఎవరికైనా ఉండొచ్చు కానీ అది వాస్తవాల మీద ఆధారపడిరది అయి ఉండాలి’’ అని అమర్త్య సేన్‌ మీద వ్యంగ్య బాణాలు విసిరారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించే విషయాన్ని ప్రస్తావిస్తూ తగినంత ముందుగా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుందిగా, ఆ ధర గిట్టుబాటు కాకపోతే మరో పంట పండిరచొచ్చుగా అని అవహేళన చేశారు. గిట్టుబాటు ధరకు చట్టప్రతిపత్తి కల్పించాలన్న రైతుల డిమాండుపై మాత్రం కేంద్ర ఆర్థిక మంత్రి దగ్గర సమాధానం లేదు. శాంతి భద్రతలు భారత్‌లో రాష్ట్రాల పరిధిలోని అంశమని కూడా నిర్మలా సీతారామన్‌ గుర్తు చేశారు. కానీ వ్యవసాయం ఉమ్మడిజాబితాలో ఉన్నా వివాదాస్పదచట్టాలు కేంద్రం ఎందుకు తీసుకొచ్చిందోమాత్రం చెప్పలేదు. ఇలాంటి అర్థసత్యాలు అసత్యాలతో సమానమే. నాయకులకు, ప్రభుత్వానికి నైతిక బాధ్యత ఉంటుందిఅన్న వాస్తవం మాత్రం విజ్ఞులైన ఆర్థికమంత్రికి తెలియనట్టే ప్రవర్తించారు.
లఖింపూర్‌ ఖేరీలోని తికోనియాలో ఈ నెల మూడో తేదీన నిరసన తెలియజేస్తున్న రైతుల మీంచి కేంద్ర మంత్రి పుత్ర రత్నం కార్లను పోనిచ్చి పది రోజులు గడిచింది. ఈ సంఘటనలో ఎనిమిది మంది మరణించారు. వీరిలో నలుగురు రైతులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు కార్లతో తొక్కించి చంపేశారు అన్న ఆరోపణ ఉంది. ఈ సంఘటనపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక నమోదైనా, ఆ నివేదికలో అశీష్‌ మిశ్రా పేరున్నా పోలీసులు వారం రోజుల తరవాత కానీ కేంద్ర మంత్రి సుపుత్రుడిని అరెస్టు చేయలేదు. ఎఫ్‌.ఐ.ఆర్‌.లో పేరున్నంత మాత్రాన అరెస్టు చేస్తామా అని హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న అజయ్‌ మిశ్రా ఎదురు ప్రశ్న వేశారు. సొంత కొడుకు మీద ఆరోపణలు వస్తే తండ్రి హోం శాఖ మంత్రిగా ఉంటే ఏ దర్యాప్తు అయినా నిష్పాక్షికంగా జరిగే అవకాశం ఉంటుందా? సుప్రీంకోర్టు కలగ జేసుకుని ఈ ఉదంతంలో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఎందరిని అరెస్టు చేశారు అని నిలదీసే దాకా కేంద్ర ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. అశీష్‌ మిశ్రాను అరెస్టు చేస్తే తప్ప కదిలేది లేదు అని రైతులు భీష్మించారు. ప్రతిపక్షాలన్నీ తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. మొదట్లో అయితే బాధితులను పరామర్శించడానికి ప్రతిపక్షాల వారినెవరినీ అనుమతించనే లేదు. హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా రాజీనామా చేయాలని కూడా రైతులు కోరుతున్నారు. ఎంతటి తీవ్రమైన ఆరోపణలొచ్చినా రాజీనామాలు చేసే అలవాటు మోదీ సర్కారులోని వారికి లేదు. మృతుల కుటుంబాలకు 45 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి పదేసి లక్షలు, కంటి తుడుపుగా న్యాయ విచారణకు మాత్రం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ప్రకటించేసి అమ్మయ్య ఓ పని అయిపోయింది అన్నట్టు చేతులు దులుపు కున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు లేకపోతే ఆదిత్యనాథ్‌ ఈ మాత్రమైనా చలించేవారు కాదేమో!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img