Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

పెగాసస్‌పై దర్యాప్తు కమిషన్‌

పెగాసస్‌ స్పైవేర్‌ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ గ్రూపు రూపొందించిన పెగాసస్‌ స్పైవేర్‌ అనేకమంది రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, అధికారుల ఫోన్లలో చొప్పించి వారిపై నిఘా ఉంచారన్న అభియోగాలపై కేంద్రం దర్యాప్తు చేయించాలన్న డిమాండ్‌పై మోదీ ప్రభుత్వం స్పందించలేదు. దాదాపు ఐదారు రోజులుగా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాలు పెగాసస్‌, మూడు వ్యవసాయ చట్టాలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నా మోదీ మౌనంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇద్దరు సభ్యులతో కూడిన దర్యాప్తు కమిషన్‌ను ప్రకటించారు. కేంద్రం మౌనంవహిస్తున్నప్పుడు కమిషన్‌ఏర్పాటు నిర్ణయాన్ని ఆహ్వానించవలసిందే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ బి లోకూర్‌ నాయకత్వంలో కోల్‌కత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి భట్టాచార్యలతో కూడిన కమిషన్‌ దర్యాప్తు చేసిన ఆరు నెలలకు నివేదికను సమర్పించవలసి ఉంటుంది. మొత్తం 12 అంశాలపై కమిషన్‌ దర్యాప్తు చేయాలి. పెగాసస్‌ జాబితాలో ఇద్దరు కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయని, వీరితో పాటు 50 మంది జర్నలిస్టుల, అధికారుల, న్యాయవాదుల ఫోన్లను హ్యాక్‌ చేసి వారికి తెలియకుండానే సంభాషణలను, వీడియోలను సేకరిస్తున్నారన్న సమాచారాన్ని అనేక మీడియా సంస్థలు వెల్లడిరచిన తర్వాతనే దేశంలోను, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. నిఘా లక్ష్యంగా పెట్టుకున్న జాబితాలో 155మంది ఉన్నారని వారి పేర్లతో సహా ది వైర్‌ బయటపెట్టడం తాజాపరిణామం. ఫ్రాన్సుఅధ్యక్షుడు మాక్రాన్‌ ఫోన్‌నుకూడా హ్యాక్‌ చేశారని తెలియడంతో వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. మోదీ ప్రభుత్వంలో మాత్రం చలనంలేదు. అయితే కేంద్రప్రభుత్వమే పెగాసస్‌ స్పైవేర్‌ను కొనుగోలుచేసి తన ప్రత్యర్థులపైన, తమకు అనుకూలంగా లేని జర్నలిస్టులు, అధికారులు తదితరులపై ప్రయోగించిందన్న విషయాన్ని నమ్ముతున్నారు.
ప్రభుత్వాలకు లేదా వాటి అనుమతి పొందిన సంస్థలకు మాత్రమే స్పైవేర్‌ను విక్రయిస్తామని ఎన్‌ఎస్‌ఒ తెలిపినందున మోదీ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఉంటుందన్న నమ్మికకు బలం చేకూరింది. ఇది తమ పని కాదని మాత్రమే కేంద్ర మంత్రులు చెప్తున్నారు. ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ చేయించాలన్న డిమాండ్‌ పైన మౌనం ఎందుకు?
1952లో చేసిన దర్యాప్తు కమిషన్‌ చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం మమత ప్రకటించిన కమిషన్‌ను రాష్ట్రమంత్రి వర్గం ఆమోదించింది. రాష్ట్ర పరిధిలో హ్యాక్‌ చేసిన ఫోన్లకు సంబంధించిన అంశాల పైనే దర్యాప్తు జరుపుతుంది. ఫోన్ల హ్యాక్‌ వ్యవహారంలో పాత్ర ఎవరిది, ఈ అక్రమ కార్యకలాపాలకు ఎలా పాల్పడుతున్నారు, అసలు ఫోన్ల హ్యాక్‌ జరిగిందా లేదా, ప్రభుత్వంలో ఉన్నవారా లేక ప్రైవేటు సంస్థలు ఈ పని చేశాయా, ఎన్‌ఎస్‌ఒ మాల్‌వేర్‌ను ఉపయోగించారా? లేక మరొక సంస్థ మాల్‌వేర్‌ను ఉపయోగించారా లాంటి 12 అంశాలపై దర్యాప్తు జరుగుతుంది. ఫోన్ల హ్యాకింగ్‌ ఉపయోగించుకొని 2019లో కర్నాటకలో జనతాదళ్‌` కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్న ఆరోపణలున్నాయి. 2017లో మోదీ ఇజ్రాయిల్‌ పర్యటన సందర్భంగా ఎన్‌ఎస్‌ఒ గ్రూపును సంప్రదించారన్న సమాచారాన్ని అంతర్జాతీయ మీడియా తెలిపిందన్న బలమైన వదంతులున్నాయి.
బెంగాల్‌ ప్రభుత్వం దర్యాప్తు కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందులో రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తాయని, పోలీసులు నిరాశ నిస్పృహలకు లోనవుతారని, పోలీసులపై ప్రజలకు నమ్మకం పోతుందని, ప్రజల, జర్నలిస్టుల హక్కులకు విఘాతం కలుగుతుందని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల పట్ల ప్రజలకు విశ్వాసం ఉండదని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు కమిషన్‌ నియమించకపోవడం వల్ల తాము కమిషన్‌ను నియమించవలసి వచ్చిందని నోటిఫికేషన్‌ పేర్కొంది. కమిషన్‌ను ప్రకటించిన తర్వాత మమత దిల్లీలో మంగళవారం పర్యటించారు. ప్రతిపక్షనేతలను ప్రధానమంత్రి మోదీ కలుసుకోవడం పర్యటన లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షాల ఫ్రంట్‌ తరపున ప్రధాన ప్రత్యర్థిగా ఎదగడానికి మమత దర్యాప్తు కమిషన్‌ కీలక అంశమవుతుందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు నిజమే కావచ్చు. మోదీ ప్రభుత్వంపై దేశంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిన నేపథ్యంలో ఎన్నికల్లో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యం పెట్టుకోవడంలో అభ్యంతరమేమీ ఉండవలసిన అవసరం లేదు. కమిషన్‌ ప్రకటనపై మోదీప్రభుత్వం స్పందించలేదు. అయితే కేంద్రం ఏదోఒక చర్యకు పూనుకోవచ్చు. 1952 నాటి చట్టం ప్రకారం కేంద్రం లేదా రాష్ట్రాలు దర్యాప్తు కమిషన్‌ను నియమించవచ్చు. కేంద్రం గనుక ముందుగానే దర్యాప్తు కమిషన్‌ను వేస్తే, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ట్రాలు దర్యాప్తు కమిషన్‌ను వేయడానికి కుదరదు. కేంద్ర ప్రభుత్వం నియమించిన దర్యాప్తు కమిషన్‌ పనిచేస్తున్నంతకాలం రాష్ట్రాలు కమిషన్‌నువేయరాదు. రాష్ట్రం కమిషన్‌ వేసిన తర్వాత అది పని చేస్తున్నంత కాలం కేంద్రం సైతం కమిషన్‌ నియమించడానికి చట్టం అనుమతించదు. ఒకటి, రెండు రాష్ట్రాలు కూడా దర్యాప్తు కమిషన్‌ను వేయవచ్చునని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడితే రాష్ట్రాలు దర్యాప్తు కమిషన్‌ను ప్రకటించవచ్చు. బహుశా ఈ వ్యవహారంలో కేంద్రం పాత్ర ఉందని నమ్ముతున్న వాళ్లలో మమతకూడా ఉండవచ్చు. మమత చర్య రాజకీయంగా కేంద్రానికి గట్టి షాక్‌ అన్న వ్యాఖ్యలు సైతం వచ్చాయి.
దర్యాప్తుకమిషన్‌కు నాయకత్వంవహిస్తున్న లోకూర్‌ నిబద్దత, నిజాయితీ గల న్యాయమూర్తిగా పేరు పొందారు. ప్రజల న్యాయబద్దమైన కోర్కెలపైన సానుకూలత గల వ్యక్తి. గతంలో జస్టీస్‌ దీపక్‌ మిశ్రా తనకు ఇష్టమైన జడ్జిలకు కీలకమైన కేసులను అప్పగిస్తున్నారన్న అంశాన్ని దేశ ప్రజలకు వెల్లడిరచడానికి పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్న నలుగురు జడ్జిలలో లోకూర్‌ ఒకరు. దేశద్రోహ నేరచట్టం, ప్రభుత్వ వ్యతిరేక కార్య కలాపాల చట్టం, జాతీయ భద్రతా చట్టం పైన ఆయన వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తం చేశారు. విచారణ లేకుండా దీర్ఘకాలం ఆరోపణ లెదుర్కొంటున్న నిందితులను జైళ్లలో ఉంచడాన్ని ఆయన వ్యతిరేకించారు. అందువల్ల నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుందని విశ్వసించవచ్చు. పెగాసస్‌ స్పైవేర్‌ నిఘా వ్యవహారంపై దేశ వ్యాప్తంగా మరింతగా చర్చ జరగాలి. ఇందులో దోషి కేంద్రమే అయితే అది దేశ రాజకీయ చిత్రాన్ని సమూలంగా మార్చివేయడానికి వీలు కల్పిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img