Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

పొత్తు పొడవాల్సిందే!

ప్రపంచంలో సుదీర్ఘ చరిత్ర గల రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒకటి. కాదనలేని నగ్నసత్యమిది. స్వాతంత్య్రానికి ముందూ, వెనుకా అంటూ ఎన్ని భాష్యాలు చెప్పుకున్నా..లౌకిక, ప్రజాతంత్ర వాదాలకు కట్టుబడివున్న పార్టీల్లో ఇదొకటని ఒప్పుకొని తీరాల్సిందే. కాకపోతే రోజులు మారాయి. మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయి. భారత రాజ్యాంగ పీఠికలో ప్రస్తావించిన ప్రాథమిక అంశాలన్నింటికీ ఏదో ఒక విధంగా ముప్పువాటిల్లే ప్రమాదకర పరిస్థితులు దాపురించిన దరిమిలా..కాంగ్రెస్‌ పార్టీ కూడా పాత చింతకాయ పచ్చడిని నమ్ముకొని తేన్పులు తేన్చకుండా, సరికొత్త రాజకీయ వ్యూహంతో ముందడుగు వేయాల్సిన తరుణం ఆసన్నమైంది. అత్యంత అవశ్యమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ తన 85వ ప్లీనరీ సమావేశాలను రాయ్‌పూర్‌లో జరుపుకుంటున్నది. 1885 నుంచి ఇప్పటివరకు 84 ప్లీనరీలను జరుపుకున్న కాంగ్రెస్‌ ప్రతి సమయంలోనూ మంచోచెడో చారిత్రక నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని త్రోసిపుచ్చలేం. మహాత్మాగాంధీ కాంగ్రెస్‌కు అధ్యక్షుడై, వందేళ్లు పూర్తయిన సందర్భంలో ఈ ప్లీనరీని జరుపుకోవడం సహజంగానే ఓ ప్రత్యేకం.
ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు పొంచివుంది. పార్లమెంటరీ వ్యవస్థలు సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్నాయి. రాజకీయ కార్యకలాపాలు నిఘానీడన జరుపుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కీలకమైన ప్లీనరీ సమావేశాలను కాంగ్రెస్‌ జరుపుకోవడం ముదావహమే. భారత్‌ జోడో యాత్ర విజయాన్ని, పార్టీలో అది నింపిన నూతన ఉత్సాహాన్ని ప్లీనరీ ప్రస్తావించుకోవడమే సందర్భోచితమే. కాకపోతే అదే జోష్‌ను ఆ పార్టీ శ్రేణులు కొనసాగేలా చూడటం కొత్తగా ఎన్నికయ్యే సీడబ్ల్యుసీకి, అధ్యక్షుడు ఖడ్గేకు, గాంధీలకు చాలా ముఖ్యం. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పార్టీ భవిష్యత్‌కు బలమైన పునాది వేసేలా కొన్ని నిర్ణయాలను ప్లీనరీ తీసుకోవడం హర్షదాయకం. ప్రతి కార్యకర్తను ఇది ఉత్తేజపరుస్తుందని, వచ్చే 2024 ఎన్నికల్లో గెలుపును సాధించి పెడుతుందని ఆశించడం తప్పుకాదు. కాకపోతే, మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి, గట్టిగా నిలబడటం ఆ పార్టీకి అత్యంత కీలకాంశం. కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఆ భరోసాతో సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో భావసారూప్యతగల పార్టీలతో జట్టుకట్టే అంశంపైనా ప్లీనరీలో మేధోమథనం సాగించారు. ఇది భవిష్యత్‌ రాజకీయాలకు సానుకూలం అంశమవుతుంది.
కలిసివచ్చే పార్టీలతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజావ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యమని, ఇందుకోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ఇచ్చిన పిలుపు కిందిస్థాయికి చేరాల్సిన ఆవశ్యకత వుంది. థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటైతే బీజేపీకే ప్రయోజనమని, విపక్షం ఏకమైతేనే విజయం సాధ్యమని గుర్తించడం ఇంకో శుభపరిణామం. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరుకు భావసారూప్యతగల లౌకిక పార్టీలను గుర్తించడం, సమీకరించడం ఒక ఎత్తయితే, వాటిని కలుపుకుపోవడం మరో ఎత్తు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈ విషయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించడం కాంగ్రెస్‌ పార్టీకి అవసరం. తృణమూల్‌ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వంటి పార్టీలు తృతీయ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ మార్గం ప్రస్తుత పరిస్థితుల్లో సరైనదని కాదని, బీజేపీకి వ్యతిరేకంగా ఒకేఒక్క లౌకిక, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం అవసరమని, ఇందుకోసం అన్ని పార్టీలు కలసి రావాలని ఇప్పటికే నితీష్‌కుమార్‌ వంటి నేతలు అభిప్రాయపడటం, తాజాగా కాంగ్రెస్‌ కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంతకాదనుకున్నా, ఈ వాదనపై తృణమూల్‌, బీఆర్‌ఎస్‌ల స్పందన తప్పనిసరి. ఎన్నికలకు సమయం లేనందున ప్రత్యామ్నాయమే గత్యంతరమని గుర్తెరగాల్సిన క్షణమిది.
భారత్‌ అమృతోత్సవ వేళ..దేశంలో ఎన్నడూలేని భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో విద్వేషానికి ఆజ్యం పోసేలా, రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా పాలన సాగుతోంది. మైనారిటీలకు, దళితులకు, గిరిజనులకు, మహిళలకు రక్షణ కరువైంది. వారిపై దాడులు పేట్రేగి పోతున్నాయి. బీజేపీ మతోన్మాదాన్ని అణచివేయడానికి, ఆ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఇంతకన్నా మించిన తరుణం ఉండదు. ఇది కాంగ్రెస్‌కే కాదు దేశానికి కూడా సవాళ్లభరితమైన క్లిష్టసమయమని, బీజేపీ, మోదీ ప్రతి వ్యవస్థను స్వాధీనపర్చుకొన్నారని, విద్వేషాన్ని బీజేపీ రెచ్చగొట్టి, దాడులకు తెగబడుతోందని సోనియాగాంధీ వ్యక్తంచేసిన ఆందోళనలో అర్థముంది. మోదీ ప్రభుత్వాన్ని ధైర్యంగా ఎదుర్కొవాలని, వ్యక్తిగత లక్ష్యాలను పక్కకు పెట్టి దేశంకోసం, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయాలని ఆమె ఇచ్చిన పిలుపు కార్యకర్తలకు ఆచరణీయమే. సోనియాగాంధీ 1998లో తొలిసారి పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. 25ఏళ్లు గడిచిపోయాయి. ఈ సమయంలో పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. విజయాలు చూసింది. నైరాశ్య పరిస్థితులనూ అనుభవించింది. 2004లోనూ, ఆ తర్వాత 2009లో విజయం సాధించింది.
అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో యూపీఏ రాణించింది. ముఖ్యంగా ఉపాధి హామీ చట్టం, ఆర్‌టీఐ చట్టం వంటివి గొప్ప విజయాలు. ఇవేవీ మర్చిపోలేనివి. భారత్‌ జోడో యాత్రతో సోనియా శకం ముగిసింది. ఈ విషయాన్ని ప్లీనరీలో ఆమె స్వయంగా చెప్పడం కొత్త తరానికి మార్గం సుగమం చేయడమే. సమర్థ నాయకత్వంలో యువత ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేసి, హుందాతనాన్ని చూపించారు. అయితే తన ఇన్నింగ్స్‌ ముగిసినట్లు సోనియా చేసిన ప్రకటన పార్టీ శ్రేణుల్లో అలజడి సృష్టించింది. ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరమవుతున్నట్లు వారంతా ఆందోళన వ్యక్తం చేయడం ప్లీనరీలో భావోద్వేగాన్ని కలిగించింది. కానీ, పార్టీ అధినేత్రిగా తన ఇన్నింగ్స్‌ ముగిసిందని మాత్రమే సోనియా చెప్పారని, క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కాదని చెపుతూ ఏఐసీసీ చత్తీస్‌గఢ్‌ ఇంచార్జి కుమారి సెల్జా ఈ అలజడిని సరిచేసే ప్రయత్నం చేయడం గమనార్హం.
సోనియాగాంధీ 1998 నుంచి 2017 వరకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రిగా ఉన్నారు. ఆమె తనయుడు రాహుల్‌ గాంధీ ఆ తర్వాత అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 2019లో రాహుల్‌ తప్పుకున్న తర్వాత ఆపద్ధర్మ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగారు. గతేడాది అక్టోబరులో పార్టీ బాధ్యతలను ఖడ్గే స్వీకరించారు. ఏదేమైనా, మతోన్మాద శక్తులను ఎదుర్కొనడమే వీరందరి లక్ష్యం. సేవ, పోరాటం, త్యాగాలు..వీటన్నింటికన్నా ముందు దేశానికి తొలి ప్రాధాన్యత ఇద్దామంటూ ప్లీనరీ నినదించింది. ఈ స్ఫూర్తితో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిని రూపొందించడంలో కాంగ్రెస్‌పార్టీ కీలక పాత్ర పోషించాలన్నది లౌకిక వాదుల ఆకాంక్ష!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img