Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పోరుబాట పొడవునా సీపీఐ పాదముద్రలు

సోమవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 98వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విస్తృతంగా ఎర్రజెండా రెపరెపలాడడం కొత్త ఆశలు చిగురింప చేస్తోంది. గత అక్టోబర్‌లో విజయవాడలో జరిగిన సీపీఐ 24వ మహాసభ స్ఫూర్తిదాయకంగా జరిగిన నేపథ్యంలో 98వ వ్యవస్థాపక దినోత్సవం ఉత్సాహభరితంగా జరిగింది. సీపీఐ చరిత్ర అంతా ప్రజోద్యమాలతోనూ, త్యాగాలతోనూ సాగింది. స్వాతంత్య్రానికి ఇరవై రెండేళ్లకు ముందు ఏర్పడిన కమ్యూనిస్టుపార్టీ అంతకు ముందుజరిగిన అనేక ఉద్యమాల సంఘటిత రూపమే. విప్లవోద్యమ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సీపీఐ అవతరించింది. తెలంగాణ సాయుధ పోరాటం సీపీఐ చరిత్రలో మహోజ్వల ఘట్టం. ఈ పోరాటంలో సీపీఐ దాదాపు నాలుగు వేలమందిని కోల్పోవలసి వచ్చింది. భూస్వామ్యవ్యవస్థను కూకటివేళ్లతో పెకలించడంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలలో తెలంగాణ సాయుధపోరాటం చరిత్రాత్మకమైంది. ఈ పోరాటంలో భాగంగానే దాదాపు పదిలక్షల ఎకరాలభూమిని పంచగలిగాం. ఈ అనుభవమే దేశంలో భూసంస్కరణలకోసం నిరంతరంపాటు పడడం సీపీఐ దినచర్యలో భాగమైంది. వామపక్షాలకు అధికారం దక్కిన రాష్ట్రాలలో తప్ప మరెక్కడా భూసంస్కరణలు సంపూర్ణంగా అమలు కానేలేదు. అంటే ఈ దిశగా భవిష్యత్తులో పోరాడవలసిన ఆవశ్యకత ఉంది. కమ్యూనిజంవల్ల తమకు పెద్ద ప్రమాదంఉందని స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌ వలసపాలకులు భావించారు. అందుకే కమ్యూనిస్టులమీద కాన్పూర్‌ కుట్రకేసు, మీరట్‌ కుట్రకేసు, కకోరీ కుట్రకేసు లాంటివి మోపి కమ్యూనిస్టుల పోరాటాన్ని మొగ్గలోనే చిదిమేయాలని చూశారు. ఇప్పుడు అధికారంలోఉన్న నరేంద్రమోదీ కమ్యూనిజంవల్ల భారీ ప్రమాదం పొంచిఉందని అంటున్నారంటే దోపిడీవర్గాల గుండెల్లో కమ్యూనిస్టులు ఒణుకు పుట్టించారనే అర్థం. సంఘసంస్కరణోద్యమాల వారసత్వం కూడా కమ్యూనిస్టు పార్టీకి ఉంది. పోరాటాలు కొనసాగించినా, జన చైతన్యానికి పాటుబడ్డా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలలో భాగమైనా కమ్యూనిస్టులు తమముద్రను బలంగా చూపారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పోరాటం భూసంస్కరణలకు దోహదం చేసినట్టే బ్యాంకుల జాతీయకరణలాంటి చర్యలు తీసుకోవడం పాలక వర్గాలకు తప్పలేదు. ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ప్రైవేటురంగానికి అప్పగించాలని చూస్తోంది. ఇది సీపీఐ పోరాటాల ద్వారా సాధించిన విజయాలను తెరమరుగు చేయడమే. అందుకని ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలను నిలవరించడానికి సుధీర్ఘపోరాటం చేయవలసిన ఆవశ్యకత మిగిలేఉంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలలో కమ్యూనిస్టుపార్టీ మహత్తర స్థానానికి చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉత్తమ పార్లమెంటేరియన్లలో సీపీఐ నాయకులైన రావి నారాయణరెడ్డి, హిరేన్‌ ముఖర్జీ, ఎస్‌.ఎ.డాంగే, భూపేశ్‌ గుప్తా, ఇంద్రజిత్‌ గుప్తా, గీతా ముఖర్జీ, సి.కె.చంద్రప్పన్‌ లాంటి వారి పేరు చెప్పిన తరవాతే మరే ప్రతిపక్ష నాయకులపేర్లు ప్రస్తావించవలసిందే. ఈ నాయకులందరూ పండిత్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ లాంటి వారి అభిమానాన్ని చూరగొన్న వారే. భూపేశ్‌గుప్తా అయితే రాజ్యసభ అవతరించిన రోజునుంచి మరణించేదాకా ఆ సభ సభ్యులుగానే ఉన్నారు. బీజేపీ నాయకుడు అటల్‌బిహారీ వాజపేయి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడూ, జనతా ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యసభలోకి అడుగు పెట్టగానే భూపేశ్‌గుప్తా కూర్చునేస్థానం దగ్గరకు వెళ్లి నమస్కరించిన తరవాతే తనస్థానంలో కూర్చునేవారు. సైద్ధాంతికంగా భిన్నధృవానికి చెందినా వాజపేయి చూపిన మర్యాద కమ్యూనిస్టులు పరిరక్షించిన పార్లమెంటరీ రాజకీయాల సంప్రదాయానికి ఆనవాలుగా మిగిలిపోతుంది.
అసలు సీపీఐ అవతరణే దేశంలో చెదురుమదురుగా పనిచేస్తున్న వివిధ కమ్యూనిస్టు బృందాలను సంఘటితం చేయడంవల్లే సాధ్యమైంది. ఉమ్మడిలక్ష్యం ఉన్న బృందాలు, వ్యక్తులు కలిసి నడవాలని నిర్ణయించిన సందర్భమే సీపీఐ అవతరణకు నాంది. జాతీయ పోరాటంలో సీపీఐ నిర్వహించిన పాత్ర నిరుపమానమైంది. జాతీయోద్యమక్రమంలో స్వయంపాలనా వ్యవస్థతో కాంగ్రెస్‌ సంతృప్తిపడుతున్న దశలోనే సంపూర్ణ స్వాతంత్య్రం అన్న నినాదం ఇచ్చింది, సోషలిజమే జనం సమస్యలకు పరిష్కారం అని చాటి చెప్పింది సీపీఐ. జాతీయోద్యమ సమయంలోనే సీపీఐ దేశంలో విప్లవజ్వాలలు రగిలించింది. జాతీయోద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర వల్లే ఆ ఉద్యమానికి చురుకుదనం, స్పష్టమైన దిశానిర్దేశం సాధ్యమైంది. అనేక ప్రభుత్వాలు కమ్యూనిజానికి వ్యతిరేకమైనా అంతో ఇంతో పురోగామివిధానాలు అనుసరించడానికి కమ్యూనిస్టుల సచేతనత్వం, నిరంతర జాగరూకత, పోరాటపటిమే ప్రధాన కారణం. పార్లమెంటులో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఎంతఅన్న కొలమానాన్నిబట్టి వామపక్షాల అస్తిత్వాన్ని అంచనావేయడం పరిపాటి అయింది. చట్టసభల్లో వామపక్షాల, సీపీఐ సంఖ్యాబలమే అస్తిత్వానికి నిదర్శనం కాదు. పార్లమెంటరీ రాజకీయాలు కమ్యూనిస్టులు అనుసరించే పంథాలో ఒక అంశం మాత్రమే. కమ్యూనిస్టు పార్టీల ప్రభావం అవి నడిపే ప్రజాఉద్యమాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఉద్యమాలవల్ల లబ్ధి పొందిన వారందరూ కమ్యూనిస్టులూ కారు, కనీసం మద్దతుదార్లూ కారు. దీనికి ప్రధానమైన కారణం జనం సమస్యల మీద దృష్టి కేంద్రీకరించడానికి, ఉద్యమించడానికే కమ్యూనిస్టులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే కమ్యూనిస్టులు నడుపుతున్న ఉద్యమాలకు జనం అండగా నిలుస్తున్నప్పుడు ఆ మద్దతు చట్టసభల్లో కమ్యూనిస్టుల బలంగా ఎందుకు ప్రతిఫలించడం లేదు అన్న అంశాన్ని లోతుగా పరిశీలించవలసిందే. ధనబలం, కండబలం, అక్రమ పద్ధతులు అనుసరించడంలో కమ్యూనిస్టులు సహజంగానే ఇతర పార్టీలతో పోటీపడలేరు. అసలు పోటీలో ఉన్నవారిలో ఎవరికి ఎక్కువ ఓట్లువస్తే వారే గెలిచినట్టు అన్న విధానాన్ని అనుసరిస్తున్నందువల్ల కూడా కమ్యూనిస్టుల ప్రభావం ఓట్ల పెట్టెల్లో ప్రతిబింబించడం లేదు. ఈ కారణంగానే దామాషా పద్ధతి ప్రవేశ పెట్టాలని సీపీఐ దశాబ్దాలుగా ప్రతిపాదిస్తూనే ఉంది. అప్పుడే గత వైభవాన్ని పునరుద్ధరించడంతోపాటు ద్విగుణీకృతంగా ముందడుగు వేయడంసాధ్యం అవుతుంది. కమ్యూనిజానికి కాలం చెల్లింది అని సంబరపడిపోయే వారికి కొదవ లేదు. కానీ ప్రపంచ పరిణామాలను పరికించిచూస్తే కమ్యూనిజం అవసరం మునుపటికన్నా ఇప్పుడు మరింత ఎక్కువగాఉందని రుజువు అవుతుంది.
లాటిన్‌ అమెరికాలోని పరిణామాలు వామపక్ష రాజకీయాల ప్రాసంగికతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ సానుకూలతని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించవలసిందే. దాదాపు మూడు దశాబ్దాలకు పైబడి మనదేశంలో అమలవుతున్న నయా ఉదారవాద విధానాలు సమాజంలో ఆర్థిక అంతరాలను పెంచుతున్నాయి. సృష్టించిన సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతోంది. కొద్దిమంది సంపద అదే పనిగా పెరుగుతూ ఉంటే ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీచేస్తే తప్ప పూటగడవనివారు 80కోట్లకు పైగా ఉండడం ఓ వైపరీత్యం. దీనిని జనం దృష్టికి తీసుకొచ్చి సమీకరించడం తక్షణావసరం. వర్గస్పృహ ఉండి తీరవలసిందే. మన దేశంలోఉన్న కులవ్యవస్థను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కులం ఈ దేశంలో ఒక వాస్తవికత.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img