Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పోలీసులకు అనువుగా మారిన న్యాయమూర్తుల వ్యాఖ్యలు

న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలు చేయని సందర్భాలు కొల్లలుగానే ఉంటాయి. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలు చేయక పోవడం కోర్టు ధిక్కారం కిందే లెక్క. అయినా వాటిని బలాదూరుగా ఉల్లంఘించే వారు ఉన్నా న్యాయ స్థానాలు చాలా అరుదుగా తప్ప పట్టించుకోవు. కానీ మతోన్మాదాన్ని వ్యతిరేకించేవారు, మానవ హక్కులకోసం పోరాడే వారు, మోదీని విమర్శించే వారికి వ్యతిరేకంగా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను, చేసిన వ్యాఖ్యలను మాత్రం పరిపాలనా విభాగం, పోలీసులు తక్షణం పట్టించుకుని ఎవరికి వ్యతిరేకంగానైతే కోర్టులు వ్యాఖ్యలు చేశాయో వారి మీద వెతికి వెతికి కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేస్తారు. గుజరాత్‌ మారణ కాండ బాధితుల తరఫున ఇరవై ఏళ్లుగా పోరాడుతున్న న్యాయవాది తీస్తా సెతల్వాడ్‌ను గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేసి తమ స్వామి భక్తి ప్రదర్శించుకున్నారు. 2002 గుజరాత్‌ మారణ కాండ జరిగినప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ మారణకాండను నిరోధించ వలసిన బాధ్యతను నిర్వర్తించక పోగా ముస్లింలకు వ్యతిరేకంగా జనాన్ని రెచ్చ గొట్టే రీతిలో మోదీ మౌనం పాటించారని అప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి. కానీ ఆయన మీద ఈ ఆరోపణలను నిరూపించడం సాధ్యం కాలేదు. కాదు కూడా. అప్పుడు ఆయన గుజరాత్‌కు శక్తిమంతమైన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ప్రధాన మంత్రిగా అంతకన్నా బలవంతుడైన విశ్వ గురువు. అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పడానికి సుప్రీంకోర్టు కూడా సాహసించ గలుగు తుందా? అందుకే తీస్తా సెతల్వాడ్‌ పెట్టుకున్న పిటిషన్‌ను దురుద్దేశంతో కూడినది అని సుప్రీంకోర్టు కొట్టి వేసి మోదీకి మరోసారి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. పైగా సెతల్వాడ్‌ దురుద్దేశంతో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు అని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యే గుజరాత్‌ పోలీసులకు సుగ్రీవాజ్ఞలాగా వినిపించింది. కనిపించింది. తీర్పు వెలువడి రెండు రోజులైనా కాక ముందే తీస్తా సెతల్వాడ్‌ను మరో కేసులో అరెస్టు చేశారు. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడం ఏ పాపం ఎరుగని వారిని జైలుకు పంపే కుట్ర అన్న ‘‘జ్ఞానం’’ పోలీసులకు వెంటనే కల్గింది. సెతల్వాడ్‌ను ముంబైలో ఆమె ఇంట్లోంచి అరెస్టు చేసి అహమదాబాద్‌కు తీసుకెళ్లారు. 2002 గుజరాత్‌ మారణకాండ కొనసాగిన సందర్భంలో కిరాతకంగా హత్యకు గురైన అప్పటి కాంగ్రెస్‌ ఎంపీ ఎహసాన్‌ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ఇరవై ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. గుజరాత్‌ మారణ కాండకోసం జరిగిన కుట్రలో అప్పటి ముఖ్యమంతి మోదీకి భాగస్వామ్యం ఉందని నిరూపించడానికి తీస్తా సెతల్వాడ్‌ కూడా నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. గురువారం సుప్రీంకోర్టు ఈ రెండు పిటిషన్లను తోసి పుచ్చడమే కాకుండా స్వామి భక్తి నిరూపించుకోవడానికి దీక్షబూనిన పోలీసు అధికారులకు అది నిరూపించు కోవడానికి అనువైన వ్యాఖ్యలు కూడా చేసింది. ‘‘గుజరాత్‌లో కొందరు అసంతృప్తి చెందిన అధికారులు, ఇతరులు తాము చేస్తున్న వాదనలు తప్పని తెలిసినా వాటిని పట్టుకుని వేలాడుతూ ప్రజలలో ఉద్వేగాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారిని మూసేయాలి, చట్ట ప్రకారం శిక్షించాలి’’ అని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కేవలం పిటిషన్లు దాఖలు చేసిన జకియా జాఫ్రీ, తీస్తా సెతల్వాడ్‌కు వ్యతిరేకంగా మాత్రమే చేసినవే కావు. జైలులో మగ్గుతున్న సీనియర్‌ పోలీసు అధికారులు సంజీవ్‌ భట్‌, బి.ఆర్‌. శ్రీకుమార్‌ను కూడా న్యాయమూర్తులు దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేసినట్టున్నారు. న్యాయమూర్తి ఆంతర్యం ఏమిటో గ్రహించిన గుజరాత్‌ పోలీసులు వెంటనే సెతల్వాడ్‌ను నిర్బంధించారు.
అహమదాబాద్‌ పోలీసు క్రైం విభాగంలో పోలీసు ఇన్స్పెక్టర్‌గా ఉన్న దర్శన్‌ సింగ్‌ బి. బరాద్‌ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సెతల్వాడ్‌, సంజీవ్‌ భట్‌ మీద ఒక ఎఫ్‌.ఐ.ఆర్‌. దాఖలైంది. ఆ ఎఫ్‌.ఐ.ఆర్‌.లో పేర్కొన్న అంశాలే సుప్రీంకోర్టు తీర్పులో కూడా ప్రతిబింబించాయి. సెతల్వాడ్‌ మీద ఉన్న ఆరోపణలు ఏవీ ఏడేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం శిక్ష పడే అపరాధాలు కావు కనక ఆమెను అరెస్టు చేయడాన్ని న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ నియమం పెట్టింది కూడా సుప్రీంకోర్టే. కానీ సుప్రీంకోర్టు తాజా తీర్పులో చేసిన వ్యాఖ్యలు పోలీసులకు అనువుగా కనిపించాయి కనక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సెతల్వాడ్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు తేలడానికి ఎన్నాళ్లు పడ్తుందో తెలియదు. సెతల్వాడ్‌ ఎన్నాళ్లు జైలులో ఉండవలసి వస్తుందో అంతకన్నా తెలియదు. కానీ అన్నాళ్లూ మోదీని నిలదీసే గళాల్లో ఒక్క గళాన్ని అయినా నొక్కి పెట్టొచ్చుగా! తమను ఇరుకున పెట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న సెతల్వాడ్‌ మీద సుప్రీంకోర్టు అననుకూల వ్యాఖ్యలు చేస్తే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లాంటి వారు ఆనం దించకుండా ఉండరుగా! ఎ.ఎన్‌.ఐ.కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సెతల్వాడ్‌ మీద అమిత్‌ షా నిప్పులు చెరిగారు. ఆమె నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ గుజరాత్‌ కలహాలపై నిరాధారమైన సమాచారం ఇచ్చింది. జకియా జాఫ్రీని రెచ్చగొట్టి పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టేట్టు చేశారు. అందువల్ల ఈ కేసునే సుప్రీంకోర్టు గురువారం కొట్టేసింది అని అమిత్‌ షా సంబరపడి పోయారు. ‘‘నేను తీర్పు చాలా జాగ్రత్తగా చదివాను. ఈ తీర్పులో సెతల్వాడ్‌ పేరు స్పష్టంగా పేర్కొన్నారు. ఆమె నడుపుతున్న స్వచ్ఛంద సంస్థ పేరేమిటో నాకు గుర్తు లేదు కాని కలహాలపై పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చింది’’ అని అమిత్‌ షా ముక్తాయించారు. మరో వేపు గుజరాత్‌ తీవ్రవాద వ్యతిరేక దళం (ఎ.టి.ఎస్‌.) పోలీసులు తన ఇంట్లోకి దూసుకొచ్చి తన మీద దాడి చేశారని, తన న్యాయవాదిని సంప్రదించడానికి కూడా అనుమతించ లేదని సెతల్వాడ్‌ వ్యాఖ్యా నించారు. తన ప్రాణానికి ప్రమాదం ఉందని ఆమె అంటున్నారు. తీవ్రవాద వ్యతిరేక దళానికి ఎవరినైనా అరెస్టు చేయడానికి రుజువులతో పని లేదు. ఆరోపణలున్నా తక్షణం రంగంలోకి దూకుతుంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ‘‘తీస్తా సెతల్వాడ్‌ గత చరిత్రను గమనంలోకి తీసుకోవాలి. ఆమె పైన కక్ష గట్టినట్టు వ్యవహరిస్తున్నారు. జఫియా జాక్రీ మనోభావాలను రెచ్చ గొడ్తున్నారు. నిజానికి జకియా పరిస్థితుల బాధితురాలు’’ అని అన్నారు. అయినా వారు జకియా జాఫ్రీకి చేసిన మేలు ఏమీ లేదు. జకియా జాఫ్రీ, తీస్తా సెతల్వాడ్‌ కేసులను తోసి పుచ్చడానికి సుప్రీం కోర్టుకు ఎన్ని ఆధారాలైనా ఉండవచ్చు. కాని తీర్పు చెప్పే సమయంలో న్యాయ మూర్తులు చేసిన వ్యాఖ్యలు మాత్రం పగబట్టినట్టు వ్యవహరించే పోలీసు లకు అనుకూలంగా ఉన్నాయి. వారి అనాలోచిత చర్యలను ప్రేరేపించేట్టుగా ఉన్నాయి. ఆ సంకేతాలను పోలీసులు సవ్యంగా గ్రహించినందువల్లే సెతల్వాడ్‌ నిర్బంధంలోకి వెళ్లిపోవలసి వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img