Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రతిపక్ష ఐక్యతకు సానుకూల సంకేతం

విచ్ఛిన్నకర విధానాలు అనుసరిస్తూ విద్వేషాన్ని నింపుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న విషయంలో రకరకాల ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉందనడంలో సందేహం లేదు. ప్రతిపక్షాలు ఏకం కాకపోతే మొత్తం బీజేపీనే ఎన్నికల యంత్రాంగంగా మలిచిన ప్రధానమంత్రి మోదీని గద్దె దించడం సాధ్యం కాదని కూడా ఈ ప్రతిపక్షాలకు తెలుసు. అయితే ఈ ఐక్యతకు అనేక అడ్డంకులు ఉన్నాయి. ఈ ప్రతిపక్షాలలో దాదాపు అన్ని పార్టీలూ ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. అదే సమయంలో ఈ పార్టీలు తమ రాష్ట్రాలలో ప్రధానంగా కాంగ్రెస్‌ తోనే పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్‌ ఎంత బలహీనంగా కనిపిస్తున్నా దేశవ్యాప్తంగా అస్తిత్వం ఉన్న పార్టీ అదొక్కటే. మిగతా ప్రతిపక్షాలలో బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌, తెలంగాణలో అధికారంలో ఉన్న కె.చంద్రశేఖర రావు (కె.సి.ఆర్‌.)నేతృత్వంలోని భారతీయ రాష్ట్ర సమితి (మునుపు తెలంగాణ రాష్ట్ర సమితి) శాసన సభ ఎన్నికలలో ముఖ్యంగా తలపడేది కాంగ్రెస్‌ తోనే. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ఎంత ఆత్రుతతో ఉన్నా సానుకూలత లేదు. కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ఫ్రంట్‌ పరిస్థితీ అంతే. ఈ పరిస్థితి రెండు సంకట పరిస్థితులకు దారి తీస్తోంది. ఒకటి: కాంగ్రెస్‌ పాత్ర లేకుండా ఏర్పడే ప్రతిపక్ష కూటమికి బీజేపీని ఓడిరచే శక్తి ఉండదు. రెండు: సార్వత్రిక ఎన్నికల కోసం మాత్రమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రాష్ట్రాల దగ్గరకు వచ్చేటప్పటికి కాంగ్రెస్‌తో పోరాడే విధానాన్ని అనుసరిస్తే ఆ రాష్ట్రాలలో ప్రతిపక్ష ఐక్యత ప్రస్తావనే ఉండదు. ప్రజలలో అలాంటి ఐక్యత మీద విశ్వాసమూ ఉండదు. ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ 2024లో మోదీని ఓడిరచడం సాధ్యమైతే పెద్దన్న పాత్ర తమదేనన్న ఆశ కాంగ్రెస్‌ లో స్పష్టంగా కనిపిస్తోంది. 2021 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో జరిగిన పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అపూర్వమైన విజయం సాధించిన నేపథ్యంలో మొట్ట మొదట ప్రతిపక్ష ఐక్యత గురించి మాట్లాడిరది మమతా బెనర్జీనే. ఆమె వివిధ ప్రతిపక్ష నాయకులతో సంప్రతింపులు జరిపారు. ఇప్పటికీ ప్రతిపక్ష ఐక్యత కోసం జరుగుతున్న ప్రయత్నాలలో భాగస్వామి అవుతూనే ఉన్నారు. కానీ ఆమె వ్యతిరేకతల్లా కాంగ్రెస్‌ మీదే. ప్రతిపక్షాల ఐక్యత కోసం గట్టిగా ప్రయత్నం చేసిన మరో నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావ్‌. ఆయన ప్రాంతీయ పార్టీలను కూడగట్టి ఈ ఐక్యత సాధించాలనుకున్నారు. దీనివల్ల ప్రయోజనం లేదని గ్రహించి ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని ఏకంగా భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది ఆఖరుకు జరగవలసి ఉంది. బీజేపీ భవిష్యత్తు ఎలా ఉన్నా ఆ పార్టీనే కె.సి.ఆర్‌. ప్రధాన పోటీదారుగా పరిగణించక తప్పక పోవచ్చు. మరో వేపు ఈ మధ్య కాలంలో మోదీని తూర్పారపట్టడంలో తనంతటి ధీరుడు లేడని అనుకుంటున్న దిల్లీ ముఖ్యమంత్రి ఎక్కడ పోటీ చేసినా కాంగ్రెస్‌ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నంలోనే ఉన్నారు. ఆ మేరకు ఆయనా కాంగ్రెస్‌ ను సహించే స్థితిలో లేరు.
ఇన్ని అవాంతరాల మధ్య 2022 లో బీజేపీతో తెగతెంపులు చేసుకుని వెంటనే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌.జె.డి.)తో కలిసి అధికారంలో కొనసాగుతున్న బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రతిపక్ష ఐక్యత కోసం అందరికన్నా ఎక్కువ పాటు పడ్తున్నారు. నిరంతరం వివిధ పార్టీల నాయకులతో చర్చిస్తున్నారు. కాంగ్రెస్‌ లేని ప్రతిపక్ష కూటమివల్ల ప్రయోజనం లేదని బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు నచ్చచెప్తూనే ఉన్నారు.
తాను ప్రధానమంత్రి పదవికి పోటీ పడడం లేదని, ప్రతిపక్ష కూటమి తరఫున ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి అన్న విషయంలో ప్రస్తుతం చర్చ అనవసరం అంటున్నారు. మోదీని గద్దె దించడానికే ఆయన ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే సోమవారం పట్నాలో ప్రతిపక్షాల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. చాలా ప్రతిపక్షాల నాయకులు ఈ సమావేశానికి అంగీకరించారు. కాంగ్రెస్‌ మాత్రం రెండో శ్రేణి నాయకులనే ఈ సమావేశానికి పంపాలనుకుంది. కానీ రాహుల్‌ గాంధీ ఇటీవలి అమెరికా పర్యటనలో మోదీని ఎంత ఎద్దేవ చేసినా ఆయనను గద్దె దింపాల్సిన అవసరాన్ని, దీనికి ప్రతిపక్షాల సంపూర్ణ ఐక్యత అత్యవసరం అని కూడా చెప్పారు. మోదీ ఎక్కడ ఉపన్యసించినా భయోత్పాతాన్నే రెచ్చగొడ్తాయి. రాహుల్‌ అమెరికా ప్రసంగాలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. భారత్‌ జోడో యాత్రలోనే విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా తాను అనురాగాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నానని చెప్తున్నారు. అమెరికా లోనూ ఇదే మాట చెప్పారు. అంతకు ముందు ఆయన ఇగ్లాండ్‌లో చేసిన ప్రసంగాలలో మోదీని దుయ్యబట్టడానికి, దేశంలో ప్రజాస్వామ్యం అడుగంటుతోందని చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు మాత్రం చిరసంచిత దేశ సంస్కృతిని కాపాడవలసిన అవసరంతో పాటు ప్రతిపక్షాల ఐక్యత ఆవశ్యకతను నొక్కి చెప్తున్నారు. ఎన్నికలు దగ్గర పడ్తున్న కొద్దీ కాంగ్రెస్‌ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 350 లోకసభ స్థానాలకు పోటీ చేయాలనుకుంటోంది. దేశమంతటా అస్తిత్వం ఉన్నప్పటికీ అన్ని స్థానాల్లో పోటీ చేయాలనుకోవడం కాంగ్రెస్‌ అత్యాశే. 250 స్థానాలు కాంగ్రెస్‌కు కేటాయించడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నట్టున్నాయి. రాహుల్‌ వైఖరిలో మార్పు ఉన్నందువల్ల మిగతా కాంగ్రెస్‌ నాయకుల ధోరణి కూడా మారక తప్పదు. ప్రతిపక్ష సమావేశం సిమ్లాలో జరగాలని ఒక దశలో ప్రతిపాదించిన కాంగ్రెస్‌ ఇప్పుడు పట్నాలోనే నిర్వహించడానికి సుముఖంగా ఉంది. అందుకే ఈ సమావేశాన్ని వచ్చే 23వ తేదీకి వాయిదా వేశారు. ఈ సమావేశానికి రాహుల్‌ హాజరవుతా నంటున్నారు. రాహుల్‌ ఉద్దేశంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆయన అమెరికా ప్రసంగాలు విన్న తరవాత అనుమానించవలసిన అవసరమే లేదు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ఆయన ప్రథమ ప్రాధాన్యతగా కనిపిస్తోంది. తన పాత్రకు ఆయన అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఒక్క పట్నా సమావేశంవల్ల ప్రతిపక్ష ఐక్యత సాధ్యం అవుతుందన్న భ్రమ ఎవరికీ ఉండనక్కర్లేదు. బీజేపీకి గురు పీఠం అయిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఊహాత్మక గత కీర్తి మీద ఆధారపడ్తుంది. ప్రస్తుతం ప్రతి పక్షాల లక్ష్యం భవిష్యత్తే అయి ఉండాలి. అది ఎంత అస్పష్టంగా ఉన్నా సరే నితీశ్‌ రాజకీయ పరిణతి, రాహుల్‌ గాంధీలో తక్షణం పదవీ కాంక్ష కనిపించకపోవడం, మిగతా ప్రాంతీయ పార్టీలలో మోదీని గద్దె దించాలన్న దీక్ష కలగలిస్తే ప్రతిపక్ష ఐక్యతే కాదు, మోదీని గద్దె దించడమూ అసాధ్యం కాదు. అయితే ఒక్క కర్నాటక విజయం లక్ష్య శుద్ధిని చెదరనివ్వకూడదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img