Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రతిపక్ష ఐక్యతే శరణ్యం

పార్లమెంటు సమావేశాలు జులై 19న ప్రారంభమైనప్పటి నుంచి 18 గంటలు మాత్రమే సవ్యంగా నడిచాయి. మిగతా సమయమంతా గందరగోళంతోనే సభను పదే పదే వాయిదా వేయవలసి వచ్చింది. ప్రతిపక్షాల వైఖరి కారణంగా రూ. 133 కోట్ల ప్రజాధనం వృథా అయిందని మోదీ సర్కారు వాపోతోంది. ప్రజా ధనం వృథా కావడంలో నిజం ఉండవచ్చు. కానీ పార్లమెంటు సజావుగా జరగపోవడానికి కూడా అధికారపక్షమే కారణం. పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయమో, విఘాతమో కలగడం మోదీ అధికారంలోకి వచ్చిన తరవాతి పరిణామం మాత్రమే కాదు. ముఖ్యంగా 2జి కుంభకోణం, బొగ్గు కుంభకోణం లాంటివి తలెత్తినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సమావేశాలను తీవ్ర స్థాయిలోనే అడ్డుకుంది. పైగా సుష్మా స్వరాజ్‌ లాంటి సీనియర్‌ పార్లమెంటేరియన్లే పార్లమెంటును సాగనివ్వం అని ప్రతిన బూనారు. మోదీ మొదటి సారి పార్లమెంటులోకి ప్రవేశించినప్పుడు ఆ భవనం మెట్లకు మొక్కడం జనాన్ని ఆకర్షించడానికే తప్ప, పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడానికి కాదని అడుగడుగునా రుజువు అవుతూనే ఉంది. ఏ ప్రజా సమస్యలపైనైనా చర్చకు సిద్ధమేనంటున్న అధికారపక్షం తీరా పెగాసస్‌ అంశాన్ని చర్చించవలసి వచ్చేటప్పటికీ ఆ విషయం తప్ప ఏ అంశాన్ని అయినా చర్చిస్తామంటోంది. పౌరుల మౌలిక హక్కులకు సంబంధించిన వ్యవహారాన్ని చర్చించడానికి పార్లమెంటుకే అవకాశం లేనప్పుడు ఇక దేని మీద చర్చిస్తారు. అధికార పక్షానికి ఉన్న విపరీతమైన మెజారిటీని ఉపయోగించుకుని తమ మాటే చెల్లాలని వాదించడం ఏ లెక్కన చూసినా పార్లమెంటరీ సంప్రదాయం కాదు. కీలక సమస్యలకు జవాబు చెప్పే సత్తా లేనందువల్లే పాలకపక్షం చర్చకు అంగీకరించడం లేదు. ప్రతిపక్షాలున్నది ప్రభుత్వాన్ని నిలదీయడానికే. ఈ పని వీలైనంత మర్యాద పూర్వకంగా జరగాలన్న విషయాన్ని ఎవరైనా అంగీకరించవలసిందే. కాని సభ సక్రమంగా కొనసాగడానికి అనువైన వాతావరణం ఉండేట్టు చూడడం అధికారపక్ష బాధ్యతే. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నదే అందుకు. సభా వ్యవహారాల కమిటీ ఉద్దేశం కూడా చర్చనీయాంశాలను ఖరారు చేయడంతో పాటు పార్లమెంటు నిర్వహణకు దోహదం చేయడమే. కానీ ఈ సంప్రదాయాలను పాటించే లక్షణం మోదీ సర్కారుకు ఏ కోశానా లేదు. ఏడేళ్లుగా రుజువైంది ఇదే. ప్రభుత్వమే పార్లమెంటుకు జవాబుదారుగా ఉండడానికి అంగీకరించనప్పుడు ప్రతిపక్షాలు నిరసన తెలియజేస్తూనే ఉంటాయి. ప్రజాధనం వృథా అవుతూనే ఉంటుంది. కాంగ్రెస్‌ హయాంలో పెట్రోల్‌ ధర స్వల్పంగా పెంచినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు అటల్‌ బిహారీ వాజపేయి పార్లమెంటుకు ఎడ్లబండి మీద వచ్చి నిరసన తెలియజేశారు. మొన్నా మధ్య రాహుల్‌ గాంధీ ట్రాక్టర్‌ మీద వచ్చారు. మంగళవారం ఆయనతో పాటు ప్రతిపక్ష నాయకులు సైకిళ్ల మీద వచ్చారు. ఇవన్నీ ప్రతీకాత్మకమైన నిరసనలే.
పెగాసస్‌ విషయంలోనే కాక కరోనాను కట్టడి చేయడంలో మోదీ ప్రభుత్వ వైఫల్యం, త్వరితగతిన టీకాలు వేయించడానికి తగిన ఏర్పాట్లు చేయకపోవడం ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రతిపక్షాలకు మంచి ముడి సరుకుగా ఉపయోగపడక మానదు. దేశంలోని వాతావరణమే మోదీ, అమిత్‌ షా ద్వయం వ్యవహారాన్ని చీదరించుకుంటోంది. ఈ స్థితిలో ప్రతిపక్షాలు తమపాత్ర నిర్వర్తించక తప్పదు. పెగాసస్‌ అంశంపై విచారణకు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌.బి.లోకూర్‌ నాయకత్వంలో కమిషన్‌ను నియమించడం, ప్రతిపక్షాల ఐక్యత దిశగా ఎన్‌.సి.పి. నాయకుడు శరద్‌ పవార్‌ పావులు కదపడం, ప్రతిపక్షాలు సమైక్యంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని సంకల్పించడం అసాధారణ అంశమేమీ కాదు. పైగా వచ్చే ఏడాది ఏడు శాసన సభలకు ఎన్నికలు జరగవలసి ఉన్న తరుణంలో విఫలమవుతున్న ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రతిపక్షాలు వ్యూహ రచన చేయడంలో అభ్యంతర పెట్టవలసిందేమీ లేదు. ఏ పార్టీకి ఆ పార్టీని విడివిడిగా చూస్తే ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నట్టు కనిపించవచ్చు. కాని సమైక్యంగా ఉంటే మోదీని గద్దె దించడం అసాధ్యం కాదు అని రుజువు అవుతూనే ఉంది. ప్రతిపక్షాల ఐక్యత కోసం ఎవరి స్థాయిలో వారు పని చేస్తున్నారు. కాంగ్రెస్‌ కలిసి రాకపోతే ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలు ఫలించవన్న వాస్తవమూ ఆ పార్టీలు గ్రహిస్తూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు ఒక్కతాటి మీదకు వచ్చిన దాఖలాలైతే లేవు కాని ఆ దిశగా అడుగులు నెమ్మదిగానైనా పడుతూనే ఉన్నాయి. మంగళవారం నాడు రాహుల్‌ గాంధీ ఉదయం ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు 14 ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరు కావడం సానుకూల పరిణామమే. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయిన తరవాత రాహుల్‌ ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సమావేశంలో ఇది రెండవది. ఈ ఐక్యత పార్లమెంటు సమావేశాలకే పరిమితం అయితే ప్రయోజనం లేదు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా చూపించకపోవడంవల్లే 107 గంటల పాటు జరగవలసిన సమావేశాలు 18 గంటలపాటే సమావేశమైనా అధికార పక్షం అనేక బిల్లులను చర్చ లేకుండానే ఆమోదింప చేస్తూనే ఉంది. ఒక్కో బిల్లు మీద చర్చ జరిగిన సమయాన్ని గమనిస్తే పార్లమెంటరీ సంప్రయాలను అధికార పక్షం ఎలా విరూపం చేస్తోందో అర్థం అవుతోంది. కొబ్బరి అభివృద్ధి బిల్లుపై ఒక్కటంటే ఒక్క నిముషం పాటే చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో ఒకే ఒక్క బిల్లుపై 13 నిమిషాల పాటు చర్చకు అవకాశం కలిగింది. ప్రతిపక్షాల వాదన వినకుండా బిల్లులకు ఆమోద ముద్ర వేయించు కోవడమే పార్లమెంటు లక్ష్యం కాదు. కాకూడదు. పార్లమెంటు లోపల కానీ, వెలుపల కానీ ఇతర ప్రతిపక్ష నాయకులతో చర్చించే అలవాటు లేని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇప్పుడైనా చొరవతీసుకోవడం ఆశావహంగానే ఉంది. వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను, 370వ అధికరణం రద్దును మోదీ ప్రభుత్వం దేశప్రజల మీద బలవంతంగా రుద్దినప్పుడు కూడా రాహుల్‌ ఇతర ప్రతిపక్షాలతో కలిసి పోరాడాలని అనుకోలేదు. ఇటీవల బెంగాల్‌ శాసనసభ సమావేశాలలో గవర్నర్‌ జగ్దీప్‌ ధంకర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నది బీజేపీవారే. ఆయన ప్రసంగాన్ని సగంలోనే ముగించి వెళ్లిపోవలసి వచ్చింది. గవర్నర్‌ వాళ్ల మనిషే అయినప్పటకీ బీజేపీ శాసనసభ్యుల ప్రవర్తన చట్టసభల కార్యకలాపాలను భగ్నం చేయడమే ఉద్దేశంగా కనిపిస్తోంది. మోదీ, షా ద్వయం ఆగడాలను అడ్డుకోవడం ప్రతిపక్షాల బాధ్యత. ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిందే. ప్రతిపక్షాల ఐక్యతను కాపాడడానికి కాంగ్రెస్‌ ఏ మేరకు పాటుపడ్తుందన్నది లక్ష వరహాల ప్రశ్న. ప్రతిపక్షాల ఐక్యతలో కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించాలనడం ఎంత ప్రధానమైందో ఇందులో వామపక్షాలకు ప్రాధాన్యత ఉండాలనడం అంతే అవసరం. వామపక్షాలు ప్రస్తుతం బలహీనంగా కనిపించవచ్చు. కానీ ప్రత్యామ్నాయ రాజకీయ సిద్ధాంత ప్రతిపాదనలో వామపక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. వామపక్షాలు లేని ప్రత్యామ్నాయం ఏదైనా సైద్ధాంతిక పునాది లేకుండానే ఉంటుంది. అంతే కాక ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. మరచెంబు మరచెంబు కోసమే కాదన్నట్టు ప్రతిపక్షాల ఐక్యత కేవలం ఐక్యత కోసమే కాకూడదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img