Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రత్యామ్నాయ అన్వేషణ

ప్రస్తుతం అయిదురాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో, ముఖ్యంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో మొదటి మూడు దశల పోలింగ్‌ సరళి బీజేపీకి వ్యతిరేకంగా ఉండబోతున్న అంచనాలు ఉన్నందువల్ల ప్రాంతీయ పార్టీలలో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఇది ప్రతిపక్షాల ఉమ్మడి ఫ్రంట్‌కు దారి తీస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. బీజేపీ బలహీన పడ్తున్న ఛాయలు మాత్రం ప్రస్ఫుటంగా ఉన్నాయి. బెంగాల్‌ ఎన్నికలలో తృణమూల్‌ కాంగ్రెస్‌ను గద్దె దించడానికి బీజేపీ ఎన్ని ఎత్తులు ఎత్తినా భంగపాటే మిగిలింది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ మునుపటి కన్నా ఎక్కువ స్థానాలు సంపాదించి మోదీకి సవాలుగా తయారైంది. ఆమె కె.సి.ఆర్‌. కన్నా ముందే 2021 డిసెంబర్‌లో ముంబై వెళ్లి శరద్‌పవార్‌ లాంటివారిని సంప్రదించారు. మమతా బెనర్జీ ప్రతిపక్ష ఫ్రంట్‌లో కాంగ్రెస్‌కు స్థానం ఉండకూడదనుకుంటున్నారు. అయితే గోవాలో కనక కాంగ్రెస్‌ అతి పెద్ద పార్టీగా అవతరిస్తే మద్దతు ఇవ్వడానికి ఆమె సిద్ధంగానే ఉన్నారు. ఆం ఆద్మీ పార్టీదీ అదే వైఖరి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కె.సి.ఆర్‌.) ఇటీవల బీజేపీని తూర్పారబడ్తూ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ క్రమంలోనే ఆయన ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు శరద్‌ పవార్‌తో ప్రత్యేకంగా ముంబై వెళ్లి విడివిడిగా సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఎలాగైనా బీజేపీని గద్దె దించడానికి ఫ్రంట్‌ కట్టాలన్న ఆలోచనలు సాగుతున్నాయి. ఉద్ధవ్‌ఠాక్రే, చంద్రశేఖరరావు ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించి ప్రస్తుతం దేశాన్ని నడుపుతున్న తీరును మార్చాల్సిన అవసరాన్ని ఎలుగెత్తిచాటారు. తెలంగాణా ముఖ్యమంత్రి అయితే బీజేపీ మీద ఇటీవల మొదలుపెట్టిన దాడికి మరింత పదునుపెట్టారు. గుణాత్మకమైన మార్పులకు, ప్రత్యామ్నాయ రాజకీయకూటమి ఏర్పాటుకు సమయం ఆసన్న మైందని చెప్పారు. ఉద్ధవ్‌ ఠాక్రే, చంద్రశేఖర రావు ఈ దిశగా కలిసి అడుగు వేయాలన్న సంకల్పాన్ని గట్టిగా, నిర్మొహమాటంగానే ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్నా అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయనీ, అందుకే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమన్న నిర్ధారణకువచ్చారు. శరద్‌పవార్‌ మాత్రం కె.సి.ఆర్‌.ను కలుసుకున్న తరవాత విడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాలు చర్చించలేదనీ దేశ భవిష్యత్తు గురించే మాట్లాడుకున్నామని చెప్పినా ఈ సమావేశాల ఆంతర్యం స్పష్టంగానే కనిపిస్తోంది. కె.సి.ఆర్‌. మరో అడుగు ముందుకువేసి మోదీ శైలిలో బీజేపీ ముక్త్‌ భారత్‌ అవసరం అని తెగేసి చెప్పారు. కె.సి.ఆర్‌. మాత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ నాయకుడు తేజస్వీ యాదవ్‌, జనతా దళ్‌ (సెక్యులర్‌) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడను కూడగట్టడానికి కృషి చేస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాలకు ఒక వేదిక కావాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఇటీవలే పిలుపుఇచ్చారు. అంటే ప్రస్తుతం బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేషనలిస్టు కాంగ్రెస్‌పార్టీ నాయకుడు ఆ మధ్యకాలంలో ఇలాంటి ప్రయత్నమే చేశారు. అయితే మోదీని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా బలమైన నాయకుడు ప్రతిపక్ష నాయకులలోంచి ఎదిగివస్తేనే ప్రత్యామ్నాయ సంకల్పం నెరవేరు తుంది. ఇప్పుడు ఐక్యత కోసం పాటు పడ్తున్న మమతా బెనర్జీకీ, కె.సి.ఆర్‌.కు ఆ స్థానం తమకే దక్కాలన్న ఆశ లేకపోలేదు. తృణమూల్‌ కాంగ్రెస్‌, దిల్లీలో అధికారంలోఉన్న కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆం ఆద్మీపార్టీ జాతీయ స్థాయిలో తమ ఉనికి పెంచుకోవడానికి పంజాబ్‌, గోవారాష్ట్రాలలో బరిలోకి దిగాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోతే ప్రతిపక్షాల ప్రయత్నాలలో మరింత వేగం పుంజుకుంటుంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోకపోయినా ఇప్పుడున్నట్టుగా భారీ స్థానాలు సంపాదించలేక ఏ 230 సీట్లకో పరిమితం అయినా ప్రతిపక్షాలకు ఆశారేఖ మిగిలే ఉంటుంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారం నిలబెట్టుకున్నా లేక ఆం ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షాలకు అనుకూల పరిస్థితే ఉంటుంది. అయితే శాసనసభలకు వివిధ పార్టీలకు దక్కే విజయాలు లోకసభ ఎన్నికల్లో కొనసాగుతాయని చెప్పలేం. 2024లో లోకసభ ఎన్నికలు జరగడానికి ముందు కర్నాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌, తెలంగాణలో 2023లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో వివిధ పక్షాల జయాపజయాల ప్రభావం కూడా ప్రతిపక్షాల ప్రయత్నాల మీద ప్రభావం చూపకతప్పదు. జనం శాసనసభ ఎన్నికలలో, లోకసభ ఎన్నికలలో ఒకే రకంగా వ్యవహరిస్తారని చెప్పలేం.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పరిపాలనపై జనంలో అసంతృప్తి పెరిగినప్పుడల్లా ప్రతిపక్షాలు ఐక్యతారాగం ఎత్తుకోవడం స్వాతంత్య్రానంతరం సరిగ్గా రెండు దశాబ్దాలకే మొదలైంది. స్వాతంత్య్ర పొరాటంలో కాంగ్రెస్‌ నిర్ణాయక పాత్రవల్ల దేశమంతటా కాంగ్రెస్‌ పరిపాలనే కొనసాగింది. నెహ్రూ అధికారంలోకి వచ్చిన కొద్ది ఏళ్లకే ప్రతిపక్షాలలో అసంతృప్తి మొదలైంది. అప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్‌ను ఓడిరచడం ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకీ సాధ్యం కాదని గ్రహించిన సోషలిస్టు నాయకుడు డా. రాం మనోహర్‌ లోహియా ప్రతిపక్షాల ఐక్యత కోసం వ్యూహ రచన చేశారు. ఇది తొమ్మిది ఉత్తరాది రాష్ట్రాలలో 1967లో ఫలించి ఆ రాష్ట్రాలలో సంయుక్త విధాయక్‌ దళ్‌ మంత్రివర్గాలు ఏర్పడ్డాయి. అయితే అవి పూర్తి కాలం నిలదొక్కుకోలేక పోయాయి. ఎమర్జెన్సీ అకృత్యాల నేపథ్యంలో మరోసారి ప్రతిపక్షాలు ఐక్యం అయి 1977లో ఇందిరా గాంధీని గద్దె దించగలిగగాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేక కూటమి ప్రయత్నాలు 1980లలోనూ, 1990లలోను మూడో దఫా ఊపందుకున్నాయి. క్రమంగా ప్రాంతీయ పార్టీలు చాలా రాష్ట్రాలలో బలపడ్డాయి. వాజపేయి నాయకత్వంలో ఎన్‌.డి.ఎ. ప్రభుత్వాలు ఏర్పడ్డా భిన్న పార్టీలు మద్దతిచ్చాయే తప్ప 1977లో లాగా ఒకే పార్టీగా అవతరించలేదు. మిత్రపక్షాల బలంతోనే ఎన్‌.డి.ఎ. నెట్టుకొచ్చింది. 2014లో మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడంతో రెండు పరిణామాలు సంభవించాయి.
ప్రాంతీయ పార్టీలకు కేంద్రంలో పాత్రే లేకుండా పోయింది. కాంగ్రెస్‌ పూర్తిగా బలహీనమవుతూ వచ్చింది. 2019 ఎన్నికలలో బీజేపీకే పూర్తి మెజారిటీ సమకూరింది. ప్రాంతీయ పార్టీలు ఐక్య వేదిక ఏర్పరచడానికి ప్రధాన అడ్డంకి లేకపోలేదు. ఈ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్‌తో పోటీ పడ్తున్నాయి. కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష కూటమికి నాయకత్వం వహిస్తున్న సీపీఎంకు కేరళలో కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా సీపీఎంకు ప్రత్యర్థే. దేశమంతటా అంతోఇంతో అస్తిత్వంఉన్నది కాంగ్రెస్‌కు మాత్రమే. కాంగ్రెస్‌ను మినహాయించి ప్రతిపక్షాల ఐక్యవేదిక ఏర్పాటుచేయడం అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవచ్చు. దీనికి తోడు రాష్ట్రాల స్థాయిలో వివిధ ప్రతిపక్షాల మధ్య అంతర్వైరుధ్యాలు కూడా ఆటంకంగా పరిణమించవచ్చు. ఈ సమస్యలను అధిగమించడానికి బీజేపీని వ్యతిరేకిస్తున్న పక్షాల మధ్య జాతీయ స్థాయిలోనే కాక రాష్ట్రాలలో ఏక శ్రుతి ఉంటే తప్ప ప్రతిపక్షాలు కలిసి ముందుకు సాగడం సాధ్యం కాకపోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img