Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బాబ్రీ శిథిలాలపై హిందుత్వ సౌధం

మనదేశ చరిత్రలో డిసెంబర్‌ ఆరో తేదీని గుర్తు చేసుకోవ డానికి రెండు సందర్భాలు ఉన్నాయి. మొదటిది 66 ఏళ్ల కింద 1956 డిసెంబర్‌ ఆరున రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డా.బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మరణం. రెండవది 1992 డిసెంబర్‌ ఆరున బాబ్రీ మసీదు విధ్వంసం. ఇది దేశ సెక్యులర్‌ సంస్కృతికి కలిగిన విఘాతానికి చిహ్నం. బాబ్రీ విధ్వంసం రామమందిర నిర్మాణానికి వేసిన తొలి అడుగుగా పరిగణించవచ్చు. బాబ్రీ విధ్వంసంతో 464 ఏళ్లుగా సెక్యులర్‌ సంస్కృతికి చిహ్నంగా ఉన్న విలువైన కట్టడం కుప్ప కూలి పోయింది. ఈ విధ్వంసం జరుగుతున్నప్పుడు రామ జన్మభూమి ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అప్పటి బీజేపీ అధ్యక్షులు లాల్‌ కృష్ణ అడ్వానీ, సీనియర్‌ బీజేపీ నాయకుడు మురళీ మనోహర్‌ జోషి, విశ్వహిందూ పరిషత్‌ నాయకుడు అశోక్‌ సింఘాల్‌, ఇంకా అనేక మంది బీజేపీ నేతలు జరుగుతున్న విధ్వంసాన్ని కళ్లారా చూశారు. ఆ తరవాత ఆ దృశ్యం చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని అడ్వాణీ అన్నారు. ఈ కన్నీళ్లు ఆయన పశ్చాత్తాపానికి సంకేతం అనుకోలేం. ఎందుకంటే బాబ్రీ మసీదు ఉన్న స్థలమే శ్రీరాముడి జన్మస్థలమని, అది హిందువులకే దక్కాలనీ సోమనాథ్‌ నుంచి రథయాత్ర ప్రారంభించిన అడ్వానీ ఆ యాత్ర పొడవునా చెప్పింది రాముడి జన్మస్థలం గురించే. ఆ తరవాత దేశంలో రగలబోయే చిచ్చు గురించి వారు ఊహించలేదు అనుకోవడానికి వీలు లేదు. అయోధ్యనగరం అనేక మతాలవారికి శతాబ్దాలనుంచి పవిత్రమైందే. బౌద్ధులు ఈ నగరం తమకు అత్యంత ప్రాధాన్యం ఉన్నదిగా భావిస్తారు. హిందువులు దాన్ని రామజన్మ భూమి అంటారు. రాముడు అక్కడే పుట్టాడంటారు. ముస్లింల దృష్టిలో అది మొగల్‌ చక్రవర్తి బాబర్‌ ఆజ్ఞ మేరకు నిర్మించిన విశిష్టమైన ప్రార్థనా స్థలం. బాబ్రీ విధ్వంసం బౌద్ధుల, ముస్లింల భావనలను పాతరేసింది. నిజానికి బాబ్రీ విధ్వంసం అనూహ్యంగా జరిగిన ఘటన ఏమీ కాదు. ఏమైనా సరే మసీదును పరిరక్షిస్తామని అప్పటి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు కల్యాణ్‌ సింగ్‌ సుప్రీంకోర్టుకు లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. ఆయన ఆ హామీని నెర్వేర్చుకోకపోవడమే కాదు ఒక చరిత్రాత్మక కట్టడం ఆనవాలు లేకుండా పోయింది. బాబ్రీకి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన కళ్యాణ్‌ ప్రభుత్వం సాయుధ పోలీసు దళాలను, కడకు సైన్యాన్ని కూడా పిలిపించి సిద్ధంగా ఉంచింది. కానీ విధ్వంసం జరిగిన రెండురోజుల దాకా ఆ దళాలను వినియోగించకపోవడం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే ఉద్దేశం సంఫ్‌ు పరివార్‌ నాయకులకు ఏనాడూ లేదు అని చెప్పడానికే సంకేతం. మసీదు విధ్వంసం పూర్తిఅయిన తరవాత అక్కడ ఏర్పాటు చేసిన ఒక గుడారంలో తాత్కాలిక దేవాలయం వెలిసింది. ఆ తరవాత దేశమంతటా అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ముంబయ్‌లో నెలరోజుల పాటు కొనసాగిన మతకలహాలు అంతకుముందు శతాబ్ద కాలంలో ఎప్పుడూ జరగలేదంటారు. బాబ్రీ విధ్వంసం, ఆ తరవాత దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లు అంతర్జాతీయ స్థాయిలో మన ప్రతిష్ఠకు మాయని మచ్చ తెచ్చాయి. బహుళ సంస్కృతులకు నిలయమైన ముంబయ్‌ చరిత్ర మత కలహాలలో చిందిన రక్తపు మడుగులో మాయమై పోయింది. జాతీయ స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ సెక్యులర్‌ పునాదులు కూకటివేళ్లతో సహా పెకిలించినట్టయింది.
హిందువుల తరఫున వకాల్తా పుచ్చుకుని పనిచేసే హిందూమహాసభ లాంటి సంస్థలు, మునుపటి భారతీయ జనసంఫ్‌ు, ఆ తరవాత భారతీయ జనతాపార్టీ లాంటి రాజకీయ పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీకి మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఫ్‌ు (ఆర్‌.ఎస్‌.ఎస్‌.) అస్తిత్వంలోకివచ్చి మరో రెండళ్లయితే వందేళ్లు అవుతుంది. ఈ సంస్థలు, పార్టీలు మెజారిటీ మతస్థుల ఆధిపత్యం కొనసాగాలన్న వికృత ప్రచారానికి తెరతీశాయి. బాబ్రీ విధ్వంసం ఈ ప్రయత్నాలకు ఊపునిచ్చింది. బాబ్రీ మసీదు విధ్వంసంతోనే రాజకీయంగా బీజేపీ దశ తిరిగింది. అంతకుముందు పార్లమెంటులో నామ మాత్రమైన బలం ఉన్న బీజేపీ బాబ్రీ విధ్వంసం తరవాత జాంబవంతుని అంగలతో మెజారిటీ మతస్థుల ఆధిపత్యం దిశగా ప్రయాణిస్తోంది. 2014లో, 2019లో మోదీ నాయకత్వంలో బీజేపీ సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయాలు సాధించడానికి పునాదిగా ఉపయోగపడిరది బాబ్రీ శిథిలాలే. ఆ శిథిలాల మీద నిర్మితమైన బీజేపీ సౌధం దేశ సంస్కృతిని, రాజకీయాలను సమూలంగా మార్చేసింది. హిందూ-ముస్లిం మతాలమధ్య చిచ్చు రగల్చ డానికి జరుగుతున్న ప్రయత్నాలు, ముస్లింలను సకల జీవన రంగాల నుంచి పక్కకు నెట్టేయడానికి అమలవుతున్న ప్రణాళికలు దేశాన్ని కషాయంలో ముంచి తీయడానికి జరుగుతున్న కుటిల యత్నాల్లో భాగమే. ఇదంతా చరిత్రను నిరపేక్షంగా కాకుండా సంఘ పరివార్‌ కాషాయ దృష్టితో చూడడం పెరిగిన ధోరణి ఫలితమే. ఆ మాటకు వస్తే బాబ్రీమసీదు ఉన్న స్థలమే రాముడు జన్మించిన స్థలం అన్న విశ్వాసం 19వ శతాబ్దంలోనే పొట మరించింది. అడ్వాణీ రథయాత్రతో అది విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. సాధారణంగా సెక్యులర్‌ భావాలు ఎక్కువగా ఉండే హిందువులలో ఎక్కువమందిని మతవాదులుగామార్చడంలో అడ్వాణీ కృతకృత్యులయ్యారు. మోదీ కొనసాగిస్తున్న ‘‘హిందుత్వ సౌధం’’ నిర్మాణానికి పునాది వేసింది అడ్వాణీనే. ముస్లింలంటే విద్వషంపెంచే మోదీ రాజకీయాలకు స్ఫూర్తి బాబ్రీ విధ్వంసమే. భారత్‌ కేవలం హిందువులదేనన్న ప్రచారానికి ఊపునిచ్చింది నిస్సందేహంగా ఇదే. ఇస్లాం, ఆ మతాన్ని అనుసరించే వారి జీవితశైలి మనదేశంతో సంబంధంలేనివి అన్న విషబీజాలు నాటడానికి బాబ్రీ శిథిలాలు మేలి మాగాణంలా ఉపకరించాయి. శతాబ్దాలుగా ఈ దేశప్రజలు ఆచరించి చూపిన సహజీవనం ఆ శిథిలాల కింద పడి కనుమరుగై పోయాయి. బాబర్‌ ఈగడ్డమీదే పుట్టినా మొగల్‌ సామ్రాజ్యాధిపతులందరూ విదేశీయులేనన్న విషప్రచారానికి బాబ్రీవిధ్వంసం వాటంగా ఉపయోగ పడిరది. 1949 డిసెంబర్‌ 22 అర్థరాత్రి అంతగా ప్రాచుర్యంలో లేని అభిరందాస్‌ అనే సాధువు కొంతమంది మద్దతు దార్లను వెంట తీసుకుని బాబ్రీమసీదు ఆవరణలో రాముడి విగ్రహాలను ప్రతిష్టించారు. ఇది మెజారిటీ మతస్థుల ఆధిపత్యానికి దారితీస్తుందని నెహ్రూ ఆనాడే ఊహించారు. అప్పుడు అక్కడ హిందువులు పూజలు చేయడానికి న్యాయస్థానం అనుమతించడం ఓ విచిత్రం. 2019లో సుప్రీంకోర్టు బాబ్రీమసీదు ఉన్న స్థలాన్ని హిందువులకు కేటాయించడం మెజారిటీ మతస్థుల ప్రయత్నానికి మరింత బలం చేకూర్చింది. ఇప్పుడు కొనసాగుతున్న విద్వేష ప్రచారానికి మూలాలు సరిగ్గా మూడు దశాబ్దాల కిందే కనిపిస్తాయి. బాబ్రీ విధ్వంసం రేపిన గాయాలను మానకుండా చేయడానికి నిరంతర ప్రయత్నం కొనసాగుతూనే ఉండడం దేశ సంస్కృతికి కళంకమే కాదు, పెద్ద విషాదం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img