Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

బీజేపీకి జాతీయ పతాకంకన్నా హిందుత్వమే ప్రధానం

తమంత దేశభక్తులు ఎవరూ లేరని అనునిత్యం ప్రచారం చేసుకునే బీజేపీ ఆచరణలో మాత్రం హిందుత్వ విధానాలే దేశభక్తి అనుకుంటుంది. స్వాతంత్య్ర పోరాటంలో ఎలాంటి పాత్ర లేని సంఫ్‌ు పరివార్‌ నుంచి అసలైన దేశభక్తిని ఆశించడం వృథా ప్రయాస. ప్రస్తుతం బీజేపీకి తెలిసింది రెండే రెండు. ఒకటి: ఎన్నికలలో విజయం సాధించడానికి చిన్న గడ్డిపరక దొరికినా దాన్ని పట్టుకుని ఎన్నికల సంద్రాన్ని దాటేయడం. రెండు: దేశభక్తి అంటే హిందుత్వ విధానాలన్న రంగు పులమడం. జాతీయ జెండాను గౌరవించే సంస్కారం కూడా సంఫ్‌ు పరివార్‌కు లేదు. పైగా త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా అంగీకరించినప్పుడు కాషాయ జెండానే జాతీయ పతాకంగా ఉండాలని వాదించిన ఘనత సంఫ్‌ు పరివార్‌ ప్రత్యేకత. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, రాజస్థాన్‌ మాజీ గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్‌ మరణించినప్పుడు ఆయన అంత్యక్రియల సమయంలో ఆయన భౌతిక కాయం మీద జాతీయ పతాకం కప్పినట్టే కప్పి దాని మీద బీజేపీ పతాకాన్ని కప్పారు. దీనితో జాతీయ పతాకం సగంమేర కనిపించకుండా పోయింది. రాజకీయ పార్టీల నాయకులు మరణించినప్పుడు ఆయా పార్టీలు ఆ నాయకుడి భౌతిక కాయం మీద తమ పార్టీ జెండా కప్పడం అన్ని పార్టీలలో ఉన్న ఆనవాయితీనే. రాజ్యాంగ పదవులను నిర్వహించిన వారు మరణిస్తే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తే మృతదేహంపై జాతీయ జెండా కప్పుతారు. ఒక వేళ మరణించినది ఒక నిర్దిష్ట పార్టీ నాయకుడైతే, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపవలసి వస్తే ఆ పార్టీ జెండా కప్పడం కూడా కొత్త కాదు. కానీ దాని మీద మళ్లీ జాతీయ పతాకం కప్పుతారు. జాతీయ పతాకం కప్పినప్పుడు అది కొంత భాగం కనిపించకుండా ఏ పార్టీ జెండా కప్పినా అది జాతీయ జెండాను అవమానించినట్టే. ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద జాతీయ పతాకం ఉంటుందా లేదా అన్నది వేరే విషయం. కానీ ఏ సందర్భంలోనైనా పార్టీ పతాకంతో పాటు జాతీయ పతాకం కూడా ఉండవలసిన పరిస్థితి వస్తే జాతీయ పతాకానికే ప్రాధాన్యత ఉంటుంది. అంటే రెండు జెండాలూ ఉన్నప్పుడు జాతీయ జెండానే పార్టీ పతాకంకన్నా ఎత్తులో ఉండాలి. జాతీయ పతాకానికన్నా పార్టీ పతాకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జాతీయ పతాకాన్ని అవమానించడమే కాదు చట్ట రీత్యా నేరం. కల్యాణ్‌ సింగ్‌ మృతదేహం మీద బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా జాతీయ పతాకం సగమే కనిపించేట్టు బీజేపీ జెండా కప్పారు. ఇది అనౌచిత్యం, అపచారం, చట్ట రీత్యా నేరం. జాతీయ పతాకం పూర్తిగా కనిపించకుండా బీజేపీ పతాకాన్ని కల్యాణ్‌ సింగ్‌ మృతదేహం మీద కప్పిన తరవాత బీజేపీ అధ్యక్షుడు నడ్డా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ కూడా శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. వీరెవరికీ ఈ అనౌచిత్యం కనిపించకపోవడం కేవలం ఏమరుపాటున జరిగింది కాదు. అసలు సంఫ్‌ు పరివార్‌ కుదురు అంతటికీ జాతీయ పతాకం మీద ఎన్నడూ గౌరవం లేదు.
దీనికి కారణం ఆర్‌.ఎస్‌.ఎస్‌. మొదటి నుంచీ జాతీయ పతాకాన్ని అంగీకరించనే లేదు. 1947 జులై 17నాటి ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధికార పత్రిక అయిన ఆర్గనైజర్‌ సంపాదకీయంలో కాషాయ జెండా జాతీయ పతాకంగా ఉండాలని వాదించారు. అక్కడితో ఆగలేదు. స్వాతంత్య్రం రావడానికి ఒక్క రోజు ముందు ఆర్గనైజర్‌ పత్రికలో ‘‘అదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన వారు మన చేతిలో త్రివర్ణ పతాకాన్ని పెట్టి ఉండవచ్చు. కానీ హిందువులు ఎప్పుడూ దీన్ని గౌరవించరు. తమదిగా భావించరు. అసలు జెండాలో మూడు రంగులు ఉండడమే అరిష్టం. మూడు రంగుల జెండా ఉండడం దేశంలో మానసికంగా దుష్ప్రభావం చూపుతుంది’’ అని రాసిన ఘనత ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు ఉంది. మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే పొట్టన పెట్టుకున్న తరవాత అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ పటేల్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌. మీద నిషేధం విధించారు. రాజకీయ అవసరాల కోసమో, జాతీయ ఉద్యమంలో తమ వారు ఎవరూ లేని లోటును పూరించు కోవడానికో సంఫ్‌ు పరివార్‌ నానా యాతన పడ్డది. కొంతకాలం భగత్‌ సింగ్‌ను తమవాడిగా చెలామణి చేయడానికి ప్రయత్నించారు. భగత్‌ సింగ్‌ రాసిన ‘‘నేను నాస్తికుడిని ఎందుకయ్యాను’’ అన్న పుస్తకం వెలుగులోకి వచ్చిన తరవాత భగత్‌ సింగ్‌ను భుజాన వేసుకోవడం మానేశారు. మరి కొంతకాలం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వారసత్వాన్ని కబళించడానికి ప్రయత్నించారు. అదీ కుదరలేదు. మోదీ ప్రధానమంత్రి అయిన తరవాత నెహ్రూ బదులు సర్దార్‌ పటేల్‌ తొలి ప్రధాన మంత్రి అయి ఉంటే అన్న ప్రచారం మొదలుపెట్టారు. అత్యంత భారీ స్థాయిలో సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ సర్దార్‌ పటేలే గాంధీ హత్య తరవాత ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను నిషేధించడానికి కారకుడు అన్న వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు.
గాంధీ హత్య తరవాత ఆర్‌.ఎస్‌.ఎస్‌. మీద నిషేధం తొలగించడానికి ప్రధానమైన షరతు ఆ సంస్థ త్రివర్ణ పతాకాన్ని జాతీయ పతాకంగా అంగీకరించాలన్నదే. ఈ విషయం స్పష్టంగా అంగీకరించ వలసిందేనని అప్పటి కేంద్ర హోంశాఖ కార్యదర్శి హెచ్‌.వి.ఆర్‌. అయ్యర్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత ఎం.ఎస్‌. గోల్వాల్కర్‌కు రాసిన లేఖలో అనుమానాలకు తావు లేని రీతిలో పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని అవమానించడంలో సంఫ్‌ు పరివార్‌ కుత్సితం ఎలాంటిదో రుజువు చేయడానికి ఇటీవలి కాలంలోనే అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ముస్లింలపై మూక దాడులు చేసే సందర్భంలో సంఫ్‌ు కార్యకర్తల చేతిలో కాషాయ పతాకాలతో పాటు జాతీయ పతాకమూ ఉంటుంది. ఇంతకన్నా అవమానకరం ఏముంటుంది గనక! మన దేశంలో జాతీయ పతాకం విషయంలో ఓ నిబంధనావళి ఉంది. జాతీయ పతాకాన్ని, భారత రాజ్యాంగాన్ని కించపరచడం చట్ట ప్రకారం నేరం. మూడేళ్ల దాకా జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. జాతీయ పతాకాన్ని చేతబూని ముస్లింలను హతమార్చడం, ‘‘గోలీ మారో సాలోంకో’’ లాంటి నినాదాలు చేయడం సంఫ్‌ు పరివార్‌కు కొత్త కాదు. కుహనా జాతీయవాద ముసుగులో హిందుత్వను జాతీయ వాదంగా, దేశభక్తిగా చెలామణి చేయడంలో సంఫ్‌ు పరివార్‌ ఆరి తేరి పోయింది. విచిత్రం ఏమిటంటే పదే పదే జాతీయ పతాకానికి సంఘ పరివార్‌ నుంచి అవమానాలు ఎదురవుతున్నా, చట్ట రీత్యా నేరమైనా ఒక్క సారి కూడా చర్య తీసుకున్న దాఖలాలు లేవు. మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలపై విద్వేషం నింపడానికి జాతీయ పతాకాన్ని వినియోగించే వారిపై చర్య తీసుకునే అవకాశమే లేకపోవడం దారుణం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img