Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బీజేపీ, ఆప్‌ వాగ్దానాల జడి

ఇచ్చిన హామీలను, చేసిన వాగ్దానాలను నెరవేర్చే అలవాటు లేని బీజేపీ దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నది. 2014 నుంచి బీజేపీ నాయకత్వంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో వందలాది వాగ్దానాలను మోదీ గుప్పించారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హామీ ఇస్తామని పదేపదే చేసిన వాగ్దానాన్ని తుంగలోతొక్కి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశారు. ఒకవైపు ఉచితాలను పంపిణీ చేస్తూనే ఉచితాలు వద్దంటారు మోదీ. సుదీర్ఘకాలంగా దిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ను పాలిస్తున్న బీజేపీ సకల విషయాలలోనూ వైఫల్యాన్ని మూటకట్టుకుంది. అయినప్పటికీ అనేక మాయోపాయాలు, ఎత్తుగడలు వేసి గెలవడమే ముఖ్యమని బీజేపీ భావిస్తోంది. దేశంలోగానీ, బీజేపీ పాలిత రాష్ట్రాలలోనూ సుపరిపాలన అందించలేని దిల్లీలో సుపరిపాలన అందిస్తానని, ప్రతి ఇంటికి మంచినీటి పంపులు వేయిస్తానని, మురికివాడల్లో నివసించేవారికి ఇళ్లు కట్టిస్తానని, తదితర వాగ్దానాలు చేసింది. దిల్ల్లీలోని అనేక ప్రాంతాల్లో పేదల ఇళ్లను కూల్చివేసి, ప్రత్యేకంగా మైనారిటీవర్గ ప్రజలపై కక్షగట్టి దాడులు చేయించారన్న విమర్శలను ఎదుర్కొన్న బీజేపీ ఇళ్లు కట్టిస్తానని చెప్తే నగర ప్రజలు విశ్వసించే అవకాశాలు తక్కువే. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చాలా అంశాల్లో ప్రజానుకూలపాలన అందిస్తోందని పేరు తెచ్చుకుంది. గత 15ఏళ్లుగా దిల్ల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను పాలిస్తున్న బీజేపీని ఓడిరచి ఆప్‌ గెలవడానికి కేజ్రీవాల్‌ కూడా అనేక వాగ్దానాలు చేశారు. దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం, విద్య విషయాలలో మంచిపేరు తెచ్చుకుంది. వైద్య సేవలు, స్కూలు విద్యను అందించడంలో, మంచి నీరు, విద్యుత్‌ను సబ్సిడీపైన సరఫరా చేస్తూ ప్రజల ఆదరణ పొందింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ, ఆప్‌ మధ్య తీవ్రపోటీ జరగనుంది. ఆప్‌ ఈ సారి పది వాగ్దానాలు చేసింది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలుపొందితే దిల్లీ రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆప్‌ కార్పోరేషన్‌ను కూడా సమర్థంగా పాలించే అవకాశాలుంటాయి.
దిల్లీ నగరం అమితమైన వాయుకాలుష్యంతో తల్లడిల్లుతోంది. కాలుష్యం బారినపడి ప్రజలు అనేకరకాల అనారోగ్యాలకు లోనవుతున్నారు. శీతాకాలం వచ్చిందంటే ప్రజల అవస్థలు వర్ణనాతీతం. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో స్కూళ్లకు సెలవలిస్తున్నారు. నీరు, వాయుకాలుష్యం తగ్గింపు బాధ్యత ప్రధానంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌పైన ఉంటుంది. నగరమంతటా చెత్తా చెదారం గుట్టలుగా ఏర్పడటానికి కార్పొరేషనే కారణం. కాలుష్యం తగ్గింపు బాధ్యతను బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లోనూ తీసుకోదు. ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపైకి నెడుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం సైతం తమాషా చూస్తూ కేవలం కేజ్రివాల్‌నే నిందిస్తుంది.
ఇప్పుడు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు, దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలూ రోజుల తేడాతో నిర్వహించాలని, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు నిర్ణయించాయి. ఎన్నికల షెడ్యూలు సైతం పాలకులకు అనుకూలంగానే విడుదలవుతున్న విషయం దేశ ప్రజలందరికీ తెలిసిందే. కేజ్రివాల్‌ను దిల్లీకీ పరిమితంచేసి గుజరాత్‌పై దృష్టిపెట్టకుండా చేయాలన్నదే బీజేపీ వ్యూహం. అంతేకాదు దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియాపై లిక్కర్‌ స్కామ్‌ కేసు బనాయించడం, కేజ్రివాల్‌ విదేశాల నుంచి నిధులు పొందుతున్నారన్న అభియోగాలనుమోపి వీరిరువురినీ అప్రతిష్టపాలుచేస్తే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలవవచ్చునన్న వ్యూహం బీజేపీది. ఇలాంటి మాయోపాయాలు పన్నడంలో బీజేపీ అగ్రనేతలు మహాదిట్టలు. కార్పొరేషన్‌ వార్డుల సరిహద్దులను నిర్ణయించడంలోనూ బీజేపీ దళితులు, మైనారిటీల ప్రాధాన్యతను తగ్గించడానికి పాలకపార్టీ కుట్రపన్నిందన్న ఆరోపణలకు రుజువులున్నాయని వార్డులను పరిశీలించినవారు చెప్తున్నారు. కశ్మీరులోనూ ఇలాంటి కుట్రపన్నారన్న విషయం దేశమంతటా గగ్గోలెత్తింది. ఇక అవసరమైనంతమంది సంఫ్‌ుపరివార్‌ కార్యకర్తలను సమీకరించడం, అపారంగా నిధులు ఖర్చుచేసి నాయకులను, ఓటర్లను ప్రభావితం చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య.
గతంలో 250 వార్డులుండగా కొత్తగా సరిహద్దులను పాలకపార్టీకి అనుకూలంగా మార్చిన తర్వాత 272 వార్డులయ్యాయి. 42 వార్డులను షెడ్యూల్డు కులాలకు రిజర్వు చేశారు. దళితులు, మస్లింలు కొన్ని వార్డులలో అత్యధికంగా లేకుండా వారిని విభజించడానికే కొత్తగా సరిహద్దులను నిర్ణయించి వార్డులను పెంచారు. 2012 ఎన్నికల్లో 138 వార్డుల్లో గెలిచిన బీజేపీ 2017 నాటికి గెలుపు సంఖ్యను 181కి పెంచుకోగలిగింది. 2017లో ఆప్‌ 49 సీట్లలో గెలుపొంది రెండో స్థానంలో నిలువగా కాంగ్రెస్‌ 31 సీట్లు గెలిచి మూడవ స్థానానికి దిగజారింది. ఆప్‌ గత ఐదేళ్లలో గణనీయంగా తన బలాన్ని పెంచుకుంది.
15ఏళ్ల కాలం పాలించిన బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొనిఉన్న విశ్లేషణల నేపధ్యంలో పాలకపార్టీ కేంద్ర నాయకులు సైతం ఈ ఎన్నికలపై దృష్టి పెట్టారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలవపోతే దాని ప్రభావం 2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైన, 2024 లోక్‌సభ ఎన్నికలపైన, తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని బీజేపీ ఆందోళన చెందుతోంది. దేశ రాజధాని దిల్లీ నగరాన్ని సక్రమంగా పాలించలేని వాళ్లు ఆ రాష్ట్రాన్ని, దేశాన్ని ఎలా పాలించగలరన్న విమర్శలను, దేశ ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. బీజేపీ, ఆప్‌లు విజయం ధీమాతో ఉన్నాయి. ఆప్‌ గెలిస్తే ఆ పార్టీ ప్రభావం విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేజ్రివాల్‌ అధికారానికి వచ్చి తొలినాళ్లలో అనుసరించిన దుందుడుకు పద్ధతిని వదిలిపెట్టి తానూ హిందూత్వవాదినే అని చెప్పి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. హిందువుల ఓట్ల కోసమే బీజేపీ అనుసరిస్తున్న కొన్ని విధానాలనూ కేజ్రీవాల్‌ కూడా అమలు చేస్తున్నారు. ఒకవేళ ఆప్‌ ఓడిపోతే దిల్లీ రాష్ట్రం ప్రభుత్వంపైనే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీజేపీ ప్రచారం చేస్తారు. రెండు పార్టీల్లోనూ బీజేపీలోనే ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది. దిల్లీలో బీజేపీ సాగించిన దమనకాండ పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్య తదితరాలు నగర ప్రజలు గమనించకుండా ఓట్లు వేస్తే, ప్రస్తుత ప్రజాకంటక పాలనే మళ్లీ అవతరిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img