Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

బీజేపీ గెలుపుపై అనుచిత ఉత్సాహం

ఏడు ఈశాన్య రాష్ట్రాలలోని మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించినట్టు ఉధృత ప్రచారం జరుగుతోంది. ఈ రాష్ట్రాలలో ముఖ్యంగా త్రిపురలో బీజేపీ అధికారం నిలబెట్టుకున్న మాట వాస్తవమే కానీ 2018 ఎన్నికలతో పోలిస్తే 11 సీట్లు తక్కువే సాధించింది. 60 స్థానాలున్న త్రిపుర శాసనసభలో మిత్రపక్షాలతో కలిపి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన 33 సీట్లు గెలిచి మెజారిటీ సంపాదించిన మాట నిజమే అయినా గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ బలం 11 సీట్ల మేర కుంగిపోయింది. అయితే త్రిపురలో 2018 కన్నా ముందు సుదీర్ఘకాలం అధికారంలోఉన్న వామపక్షఫ్రంట్‌ ఈసారి కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసినా పెద్ద ప్రయోజనం కనిపించలేదు. వామపక్షాలు, కాంగ్రెస్‌ కలిపి 11 స్థానాలే సంపాదించాయి. ఇంతకు ముందు 16 స్థానాలు ఉండేవి. తిప్ర మోతా అనే ప్రాంతీయ పార్టీ 13 స్థానాలు సంపాదించి తిప్రస గిరిజనులలో తమకు ఉన్న ఆదరణ నిలబెట్టుకుంది. తిప్ర మోతా పార్టీ ఏర్పడి రెండేళ్లే అయినా రెండవ అతి పెద్ద పార్టీగా అవతరించడం స్థానిక పార్టీలకు ఉన్న పలుకుబడికి నిదర్శనం. త్రిపురలో 40 స్థానాలలో గిరిజనేతరులు ఉన్నారు. ఈ గిరిజనేతరుల ఓట్లను సంఘటితం చేయడంలో బీజేపీ సఫలమైంది. నాగాలాండ్‌లో మొత్తం 60 స్థానాలలో బీజేపీ, దాని మిత్రపక్షం ఎన్‌.డి.పి.పి. కలిసి 37 స్థానాలు సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం దక్కించుకున్నాయి. నాగాలాండ్‌లో ఇతర పార్టీలన్నీ కలిపి 16 స్థానాలు సంపాదించడం ప్రత్యేకంగా గమనించదగిన అంశం. బీజేపీ 2018లో ఉన్న 12 స్థానాలను నిలబెట్టుకోగలిగింది. ఎన్‌.డి.పి.పి. మాత్రం 2018లో 17స్థానాలకు పరిమితం అయితే ఈ సారి 25 సీట్లు సంపాదించి ప్రాంతీయపార్టీలకు ఉన్న ప్రాబల్యాన్ని చాటిచెప్పింది. నాగాలాండ్‌లో అథావాలే నాయకత్వం లోని రిపబ్లికన్‌ పార్టీకి రెండుస్థానాలు, రాం విలాస్‌ పాశ్వాన్‌ వర్గానికి చెందిన లోక్‌జనశక్తి పార్టీకి రెండుసీట్లు దక్కాయి. ఈశాన్య రాష్ట్రాలలో ఈ పరిణామం గమనించదగిందే. మేఘాలయలో మొత్తం 59స్థానాలు ఉంటే బీజేపీకి సొంతంగా దక్కింది రెండు సీట్లు మాత్రమే. 1972లో మేఘాలయ శాసనసభకు జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలలో మినహా ఏ పార్టీకీ నిర్దిష్టమైన మెజారిటీ దక్కని సంప్రదాయం ఈసారి కూడా కొనసాగింది. అయితే ముఖ్యమంత్రి కోన్రాడ్‌ కె.సంగ్మా మీద ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన నాయకత్వంలోని ఎన్‌.పి.పి. విజయం సాధించింది. ఈ లెక్కన ఈశాన్యంలోని మూడు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగితే బీజేపీకి దక్కింది త్రిపుర, నాగాలాండ్‌ మాత్రమే. ఈ విజయం సాధించడానికీ బీజేపీ విపరీతంగా శ్రమించవలసి వచ్చింది. నిరంతరం ఎన్నికల ధ్యాసలోనే ఉండడానికి అలవాటుపడ్డ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత ఎనిమిదేళ్ల కాలంలో ఈశాన్య రాష్ట్రాలలో 51సార్లు పర్యటించారు. అంటే ఎంతగా శ్రమించవలసి వచ్చిందో ఊహించవచ్చు. ఆయనకు తోడు మంత్రివర్గంలోని 74 మంది మంత్రులు కలిసి 400 సార్లు ఈశాన్య రాష్ట్రాలచుట్టూ ప్రదక్షిణాలు చేయక తప్పలేదు. ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాలలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 16 ర్యాలీలు నిర్వహించారు. ఒక్క త్రిపురలోనే ఆయన 11 ర్యాలీలలో పాల్గొనవలసి వచ్చింది. 

మూడు శాసనసభ ఎన్నికలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో స్థానానికి, మహారాష్ట్రలో రెండు సీట్లకు ఉపఎన్నికలు నిర్వహిస్తే అందులో మహారాష్ట్రలోని చించ్వాడ్‌ నియోజకవర్గాన్ని మాత్రం బీజేపీ నిలబెట్టుకోగలిగింది. ఆలాగే అరుణాచల్‌ ప్రదేశ్‌లో లుంలా స్థానాన్ని కూడా బీజేపీ అభ్యర్థి పోటీలేకుండా గెలిచారు. జార్ఖండ్‌లోని రాంగఢ్‌ నియోజకవర్గాన్ని ఎ.జె.ఎస్‌.యు. స్వాధీనం చేసుకుంది. తమిళనాడులోని ఈరోడ్‌ (తూర్పు), పశ్చిమ బెంగాల్‌లోని సాగరదిఘి, మహారాష్ట్రలోని కస్బాపేఠ్‌ స్థానాలు కాంగ్రెస్‌కు దక్కాయి. ఇందులో ఇరోడ్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ నిలబెట్టుకోవడంతోపాటు పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ట్రలో ఒక్కో స్థానాన్ని ఇతర పార్టీలనుంచి స్వాధీనం చేసుకోగలిగింది. కాంగ్రెస్‌ మూడు శాసనసభ స్థానాలను దక్కించుకోవడం కాంగ్రెస్‌ నాయకత్వంలోని యు.పిఎ. పుంజుకుంటోందనడానికి నిదర్శనం. మహారాష్ట్ర, జార్ఖండ్‌్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో ప్రతిపక్షాలు నిర్ణాయకమైన విజయాన్ని సాధించి బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ. మీద ఆధిపత్యం సంపాదించాయి. ఖస్బా పేఠ్‌ శాసనసభ స్థానంలో బీజేపీని కాంగ్రెస్‌ ఓడిరచింది. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గం నాయకుడు షిండే బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బీజేపీకి బలమైన కస్బా పేఠ్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ స్వాధీనం చేసుకోవడం విశేషమే. ఈ నియోజకవర్గంలో 2019లో బీజేపీ 50.3 శాతం ఓట్లు సంపాదించి విజయం సాధించింది. అప్పుడు కాంగ్రెస్‌కు దక్కింది 31.52 శాతం ఓట్లే. ఈ సారి ఫలితాలు తిరగబడి కాంగ్రెస్‌ 52.98శాతం ఓట్లు సంపాదిస్తే బీజేపీ 45.09 శాతం ఓట్ల స్థాయికి దిగజారింది. కాంగ్రెస్‌ సాధించిన ఓట్లు 22 శాతం పెరగడం మహారాష్ట్రలో గాలి మారిందన డానికి సంకేతం. ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రధాన కేంద్రం ఉన్న పూణేె జిల్లాలో షిండే ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యతిరేకత కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చింది. చించ్వాడ్‌ శాసనసభ స్థానంలో బీజేపీ గెలిచినప్పటికీ అక్కడా బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా తగ్గి 47.23 శాతానికి పరిమితం అయింది. 2019లో బీజేపీ 54.17 శాతం ఓట్లు సాధిస్తే ఇండిపెండెంట్‌ అభ్యర్థి 40.34 శాతం ఓట్లు సాధించారు. అంటే మహారాష్ట్రలో దొడ్డిదారిన అధికారం సంపాదించిన షిండే, బీజేపీ కూటమి మీద అభిమానం సన్నగిల్లుతోంది. శివసేన చీలిపోయినా షిండే నాయకత్వంలోని శివసేనవర్గం సాధించింది ఏమీలేదు. ఈ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాలలో వస్తున్న మార్పులకు సంకేతం అనుకోవాలి. జార్ఖండ్‌లోని రాంగఢ్‌ శాసనసభ నియోజకవర్గంలో ఎ.జె.ఎస్‌.యు. అభ్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడిరచడం కాంగ్రెస్‌కు విఘాతం కిందే లెక్క. ఎ.జె.ఎస్‌.యు. ప్రస్తుతం బీజేపీకి మిత్రపక్షంగాఉంది. రాంగఢ్‌ ఉపఎన్నిక ఫలితాలు కాంగ్రెస్‌, మహా గట్బంధన్‌ బలహీనతను చాటుతున్నాయి. తమిళనాడులోని ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఈ ఉపఎన్నికలలో అధికారంలోఉన్న డి.ఎం.కె. మద్దతిచ్చింది. స్టాలిన్‌ బలం చెక్కు చెదరలేదనడానికి కాంగ్రెస్‌ విజయం నిదర్శనం. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఇంతకన్నా మహత్తర విజయం సాధించగలమన్న విశ్వాసం స్టాలిన్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బెంగాల్‌లో బలం పెంచుకోవడానికి బీజేపీ ఎంత తాపత్రయపడ్తున్నా ఫలితం కనిపించడంలేదు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని లుంలాలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీవేపే ఉండడం సంప్రదాయం. కనక ఇందులో బీజేపీ ఘనత ఏమీలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img