Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బీజేపీ వ్యతిరేక వేదిక

ఇంతవరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితి(బి.ఆర్‌.ఎస్‌.)గా మార్చిన తరవాత ఖమ్మంలో కె.సి.ఆర్‌. నిర్వహించిన సభలో బీజేపీని వ్యతిరేకించే పక్షాల వేదికగా మలిచే దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ సమావేశానికి కేరళ ముఖ్యమంత్రి పినరాయ్‌ విజయన్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, సమాజ్‌ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా లాంటి అనేక మంది జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకులు హాజర య్యారు. జనతా దళ్‌ (ఎస్‌) నాయకుడు హెచ్‌.డి. కుమారస్వామి కూడా కె.సి.ఆర్‌. ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావలసిన వారే. కానీ ఆయన కర్నాటక అంతా ప్రచార రథ యాత్ర నిర్వహిస్తున్నందువల్ల రాలేక పోయారు. మరో వేపు రాహుల్‌ గాంధీ ప్రారంభించిన భారత్‌ జోడో యాత్ర ఈ నెల 30న కశ్మీర్‌ లో ముగియనుంది. దీనికి కూడా కాంగ్రెస్‌ పార్టీ 21 ప్రతిపక్షాల నాయకులను ఆహ్వానించింది. రాహుల్‌ గాంధీ యాత్ర ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించడానికి ముందుకూడా కొన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులను మినహా చాలా మందిని ఈ యాత్రలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్‌ ఆహ్వా నించింది. కానీ సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ లాంటి వారు రాహుల్‌ ప్రయత్నాలకు మద్దతైతే ప్రకటించారు కానీ భాగస్వాములు కాలేదు. అయితే రాహుల్‌ ఆహ్వానం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుకు లేదు. అలాగే కేజ్రీవాల్‌ నూ కాంగ్రెస్‌ ఆహ్వానించలేదు. టి.ఆర్‌.ఎస్‌.ను జాతీయ పార్టీగా మార్చి బి.ఆర్‌.ఎస్‌. ఏర్పాటు చేయడం వెనక కె.సి.ఆర్‌. లక్ష్యం స్పష్టంగానే కనిపిస్తోంది. అయితే జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత అంటే అందులో కాంగ్రెస్‌ కూడా ఉండాలన్న వాదన బలంగా వినిపిస్తున్న సమయంలో కె.సి.ఆర్‌. బుధవారం ఖమ్మంలో జరిగిన సభకు కాంగ్రెస్‌ ను ఆహ్వానించలేదు. కానీ విశాలమైన రీతిలో దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకమైన ఫ్రంట్‌ నిర్మించడానికి కె.సి.ఆర్‌. ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమై పోయింది. తెలంగాణలో కాంగ్రెస్‌ బి.ఆర్‌.ఎస్‌.ను వ్యతిరేకించే పార్టీ కావడం ఆహ్వానించకపోవడానికి కారణం కావచ్చు. అంటే ప్రతిపక్ష ఐక్యత ప్రతిపాదనలో ఇంతవరకు కనిపించిన ధోరణి కె.సి.ఆర్‌. ప్రణాళికలో లేదు. ప్రతిపక్ష ఐక్యత కోసం భిన్నమైన ప్రయత్నాలు జరిగాయి. బెంగాల్‌ లో ఘన విజయం సాధించిన తరవాత తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఒక ప్రయత్నం చేశారు. అదీ ప్రధానంగా బీజేపీకి వ్యతిరేకమైన ఫ్రంటే అనుకోవచ్చు. ఎందుకంటే బెంగాల్‌ లో కాంగ్రెస్‌, వామపక్షాలు కూడా తృణమూల్‌ ను వ్యతిరేకించేవే. బీజేపీతో తెగ తెంపులు చేసుకున్న తరవాత బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కూడా ప్రతిపక్షాల ఐక్యతకు నడుం బిగించారు. అయితే ఆయన దృష్టిలో ప్రతిపక్షాల ఐక్యత అంటే బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కూడిరది కావడమే కాక కాంగ్రెస్‌ కు తప్పని సరిగా స్థానం ఉండాలని వాదించేది. కె.సి.ఆర్‌. కు మాత్రం ప్రతిపక్షాల ఐక్యత అంటే కేవలం బీజేపీకి వ్యతిరేకమైందే కాదు, కాంగ్రెస్‌ ను మినహాయించేది కూడా. అంటే కేంద్రంలో నరేంద్ర మోదీ పాలనను వ్యతిరేకించే పార్టీలు అనేకం ఉన్నాయి. 2024లో మోదీని గద్దె దించాలన్న సంకల్పం ఈ పార్టీలకు ఉంది. కానీ బీజేపీని సూత్రబద్ధంగా వ్యతిరేకిస్తున్న పార్టీలే కొన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాయి. రాష్ట్రాలలో అధికారంలో ఉన్న వివిధ పార్టీలకు తమ తమ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ నుంచి పెద్ద సవాలు ఎదురవుతోంది కనక ప్రతిపక్ష ఐక్యతా యత్నాలలో భిన్న ఛాయలు కనిపిస్తున్నాయి. 

బుధవారం కె.సి.ఆర్‌. ఏర్పాటు చేసిన ఖమ్మం సభకు హాజరైన ప్రతిపక్ష నాయకులెవరూ రాహుల్‌ ఆహ్వానాన్ని మన్నించలేదు. సమా పనోత్సవానికి హాజరు కావాలన్న కాంగ్రెస్‌ ఆహ్వానాన్ని ఎంతమంది సానుకూలంగా చూస్తారో తెలియదు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాత్రం రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర సమాపనోత్సవానికి, సీపీఐ కార్యదర్శి వర్గ సభ్యుడు వినయ్‌ విశ్వంతో కలిసి హాజరవుతానని ప్రకటించారు. ఈ నిర్ణయం వెనక కచ్చితమైన బీజేపీ వ్యతిరేక వైఖరి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రాహుల్‌ యాత్రను అఖిలేశ్‌, కేజ్రీవాల్‌ మన్నించకపోవడానికి వారికి కాంగ్రెస్‌ మీద ఉన్న విముఖతే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే ఈ ఏడాది త్రిపుర శాసన సభ ఎన్నికలలో సీపీఎం, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ బీజేపీని నిలవరించే ప్రయత్నాల్లో భాగమే. 2019 ఎన్నికలకు ముందు కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం అగ్ర నాయకుడు పినరాయ్‌ విజయన్‌ కూడా బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్‌ ఏర్పడాలన్నారు. అయితే అలాంటిది ఇంతవరకు ఏర్పడనే లేదు. 2024 ఎన్నికలలో మోదీని ఓడిరచడం ప్రతిపక్షాల ఉమ్మడి లక్ష్యం అయినా ఆ పని కాంగ్రెస్‌ తో కలిసి చేయడానికి రాష్ట్రాలలో కాంగ్రెస్‌ తో వైరం ఉన్న పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. స్థానిక పరిస్థితులనుబట్టి 2024 సార్వత్రిక ఎన్నికలలో ఈ కాంగ్రెస్‌ వ్యతిరేకత ఎలా పరిణామం చెందుతుందో ఇప్పుడే చెప్పలేం. బీజేపీని ఓడిరచడానికి భిన్న మార్గాలు ఏర్పడే అవకాశమూ లేకపోలేదు. ప్రతిపక్షాల ఐక్యత కోసం చొరవ చూపుతున్న కె.సి.ఆర్‌., మమతా బెనర్జీకి ప్రతిపక్ష ఐక్యత తమ నాయకత్వం కిందే ఉండాలనీ, అవకాశం వస్తే ప్రధానమంత్రి పదవి తమకే దక్కాలన్న ఆలోచనలు ఉన్నాయి. మనసులో ఏమున్నా నితీశ్‌ వైఖరి మాత్రం స్థూలంగా ప్రతిపక్ష ఐక్యత సాధించడం మీదే ఉంది. ఆయన దృష్టిలో మూడో ఫ్రంట్‌ ఏదీ ఉండకూడదన్న భావనే ఉంది. కానీ కె.సి.ఆర్‌. సమావేశానికి వచ్చిన స్పందన చూస్తే బీజేపీని వ్యతిరేకించే వారిలో రెండు శిబిరాలు ఏర్పడే అవకాశం ఉందేమో అనిపిస్తోంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని మినహాయించి ప్రతిపక్ష ఐక్యత సాధ్యం కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ను మినహాయించి ప్రతిపక్ష ఐక్యత కుదరాలంటే మునుపటి ఇబ్బందే రావొచ్చు. వి.పి.సింగ్‌ ప్రభు త్వాన్ని బీజేపీ సమర్థించింది. చంద్రశేఖర్‌, దేవెగౌడ, ఐ.కె.గుజరాల్‌ ప్రధాన మంత్రులుగా ఉన్నప్పుడు వారికి కాంగ్రెస్‌ మద్దతు దక్కింది. మొత్తం మీద మరి కొంత కాలం గడిస్తే తప్ప స్పష్టమైన చిత్రం కనిపించేట్టు లేదు. బీజేపీని ఓడిరచి తీరాలి అనుకుంటే ఎక్కడికక్కడ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యతిరేకత, ఐక్యత లెక్కలు తేలాల్సిందే. విద్వేష రాజకీయాలను అనుసరిస్తున్న బీజేపీని గద్దె దించి తీరాలన్న లక్ష్యం నెరవేరాలంటే స్థానిక పరిస్థితులను, సమీకరణలను గమనంలో ఉంచుకుని లక్ష్య సాధన మీదే దృష్టి నిలపవలసి వస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img