Friday, April 19, 2024
Friday, April 19, 2024

బెంగాల్‌లో బీజేపీ ప్రక్షాళనా పర్వం

పశ్చిమ బెంగాల్‌లో అధికారం దక్కని బాధ బీజేపీని ఇంకా పీడిస్తూనే ఉంది. 200 స్థానాలు సాధిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకున్నప్పటికీ దక్కింది 77 సీట్లే. బెంగాల్‌లో ఎలాగైనా అధికారం సంపాదించాలని ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మొదలుకుని అనేక మంది సీనియర్‌ నాయకులు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాలికి బలపం కట్టు కుని తిరిగి మరీ ప్రచారం చేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తృణమూల్‌ నుంచి, ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి భారీగా ఫిరాయింపులను ప్రోత్సహించారు. హేమాహేమీలు అనుకున్న వారు తృణమూల్‌ని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయ మనుకుని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనుకున్నారు. కానీ ప్రజల నిర్ణయం మరోలా ఉంది. తృణమూల్‌కు మునుపటి కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. బీజేపీకి అధికారం దక్కకపోవచ్చు కానీ 2016తో పోలిస్తే మంచి ఫలితాలే వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికలలో అనూహ్యంగా ఎక్కువ స్థానాలు సంపాదించినందువల్ల ఈ సారి అధికారం తమదేనని బీజేపీ భావించినట్టుంది. ఎన్నికలలో పార్టీ పని తీరును ఏ రాజకీయ పార్టీ అయినా బేరీజు వేసుకుని సమంజసం అనుకున్న దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగమే బెంగాల్‌ బీజేపీ విభాగం అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ను తప్పించి సుకాంత మజుందార్‌కు ఆ బాధ్యతలు అప్ప గించారు. దిలీప్‌ ఘోష్‌ను జాతీయ ఉపాధ్యక్షుడిని చేశారు. తీరా బీజేపీకి అధికారం దక్కకపోయేటప్పటికి పార్టీ ఫిరాయించిన వారిలో చాలా మంది తిరుగుటపాలో తృణమూల్‌లో చేరుతున్నారు. పార్లమెంటులో బీజేపీ సభ్యుడు బాబుల్‌ సుప్రియో తృణమూల్‌లో చేరారు. సుప్రియో అంతకు ముందు మోదీ మంత్రివర్గంలో ఉండేవారు. కానీ శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయ భవిష్యత్తు తృణమూల్‌ లోనే బాగుటుందనుకుని ఆ పార్టీలో చేరిపోయారు. అంతకు ముందు ముగ్గురు బీజేపీ శాసనసభ్యులు – బిస్వజిత్‌ దాస్‌, తన్మయ్‌ ఘోష్‌, సౌమెన్‌ రాయ్‌ తృణమూల్‌లో చేరి పోయారు. బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఘోరమైన వివాదా స్పదమైన వ్యాఖ్యలు చేసి నోరు పారేసు కున్నందువల్లే బీజేపీ అధికారం సంపాదించలేక పోయిందని బాబుల్‌ సుప్రియో తృణమూల్‌ తీర్థం పుచ్చుకున్న తరవాత చెప్పారు. ఒక వేళ బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే సుప్రియో బీజేపీలోనే కొనసాగే వారనడం నిస్సందేహం. అంతకు ముందే తృణమూల్‌ కాంగ్రెస్‌లో వ్యూహకర్త ముకుల్‌ రాయ్‌ 2017లో బీజేపీలో చేరిపోయారు. ఆయన ఇటీవలి శాసనసభ ఎన్నికలలో ఉత్తర కృష్ణనగర్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. అయినా ఆయనా తృణమూల్‌లో ఉంటేనే తన భవిష్యత్తు పదిలంగా ఉంటుందనుకున్నట్టున్నారు. అందుకే జులైలోనే తృణ మూల్‌లో చేరారు. బీజేపీలోకి వెళ్లి భంగపడి మళ్లీ తృణమూల్‌లో చేరాలను కున్నది కొందరైతే మమతా బెనర్జీని ప్రాధేయపడి, క్షమాపణలు వేడుకుని మరీ తృణమూల్‌లో చేరిన వారు ఇంకొందరు. మొన్నటిదాకా బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న దిలీప్‌ ఘోష్‌ నడవడిక మీద ఫిర్యాదులు ఉండవచ్చు. ఆయన నోరు పారేసుకున్నందువల్లే నష్టం జరిగింది అనుకునే వారు ఉండవచ్చు. కానీ జయాపజయాలకు ఒక వ్యక్తే కారణం కాకపోవచ్చు. ఫిరాయింపులను ప్రోత్సహించి అనేకమందిని చేర్చుకున్న బీజేపీ భంగపడ డానికి ప్రధాన కారణం ఫిరాయింపుదార్లకు సిద్ధాంత బలిమి కన్నా అధికార కాంక్షే ప్రధానం కావడం అసలు కారణం. పార్టీ ఫిరాయించినా అధికారం దక్కనందువల్ల అధికారం ఉన్న తృణమూల్‌ పంచన చేరడమే లాభసాటి అనుకుంటున్న వారందరూ తృణమూల్‌ బాట పడ్తున్నారు. ఫిరాయింపులకు సిద్ధాంత ప్రాతిపదిక లేనప్పుడు ఎన్నిసార్లు ఫిరాయించినా తేడా ఏమీ ఉండదు. బెంగాల్‌లో ఇప్పుడు జరుగుతున్నది ఇదే.
దిలీప్‌ ఘోష్‌ను హఠాత్తుగా మార్చినందువల్ల అనేకమంది మదిలో సందేహాలు బయలుదేరాయి. ఆయన పొద్దున పూట వాహ్యాళిక వచ్చి నప్పుడు కూడా పత్రికా రచయితలు మొదలైన వారు ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపించారు. తానేం చేయాలో కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది అని దిలీప్‌ ఘోష్‌ సర్ది చెప్పుకోవలసి వచ్చింది. దిలీప్‌ ఘోష్‌ ఎంపీ కూడా కనక దిల్లీకి పిలిపించి ఆయనకు మరేదైనా బాధ్యత అప్పగించవచ్చు. ‘‘శాసనసభ ఎన్నికల సమయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని ఘోష్‌ అంగీకరించారు. మేం అధికారం సంపాదించాలనుకున్నాం. కానీ సాధ్యం కాలేదు. వచ్చే ఎన్నికల్లో వ్యూహం మారుస్తాం’’ అని ఘోష్‌ చెప్పారు. ఏ మాటకామాట 2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అనూహ్య విజయం సాధించినప్పుడూ ఘోషే బీజేపీ రాష్ట్రవిభాగంఅధ్యక్షుడిగా ఉన్నారు. బెంగాల్‌ బీజేపీ విభాగం అధిపతిగా తన వారసుడిగా ఎవరుంటే బాగుం టుందని ఘోష్‌ను అధినాయకత్వం అడిగిందని ఆయన సుకాంత మజుందార్‌ పేరు సూచించారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. మజుందార్‌ ఉత్తరబెంగాల్‌కు చెందిన వారు. అక్కడ బీజేపీ మంచి ఫలితాలే సాధిం చింది.
పైగా ఆయన ఉదారవాదికింద లెక్క. ఘోష్‌ను సాగనంపడానికి మరోకారణమూ ఉండవచ్చు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ భవానీ పూర్‌ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తారు. ఆమెకు గట్టిపోటీ ఇవ్వాలన్న ఉద్దేశంకూడా ఉండవచ్చు. విచిత్రం ఏమిటంటే భవానీ పూర్‌లో మమతతో తలపడ డానికి బీజేపీ ప్రియాంకా తైబ్రెవాల్‌ను ఎంపిక చేసినప్పుడు ఇటీవలే బాబుల్‌ సుప్రియో ఆమెకు మద్దతు ప్రకటించారు. అందుకే దిలీప్‌ ఘోష్‌ బాబుల్‌ వెళ్లిపోయినంత మాత్రాన నష్టం ఏమీ లేదనీ రాగాలు మార్చడం ఆయనకు అలవాటే అని ఘాటుగానే విమర్శించారు. బాబుల్‌ సుప్రియో గాయకుడు, నటుడు. సుప్రియో రాజకీయ పర్యాటకుడని కూడా ఘోష్‌ దుయ్యబట్టారు. కొద్ది రోజుల కిందటే తాను రాజకీయాలనుంచి తప్పు కుంటానని ప్రకటించిన సుప్రియో అమాంతం శనివారం తృణమూల్‌లోచేరడం ఆశ్చర్యకరమే. అయితే ముందు బీజేపీలో చేరడానికి వరస కట్టిన వారికి కానీ, ఇప్పుడు తిరుగుటపాలో తిరిగి వస్తున్న వారికి కానీ సైద్ధాంతిక పట్టింపులు ఏమీ లేవని తేలిపోతోంది. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీనే సిద్ధాంతాలను పరిగణించ కుండా ఇతర పార్టీల వారిని తమ పార్టీలో చేర్చుకున్నప్పుడు నిర్దిష్ట విధానం ఏదీ కనిపించని తృణమూల్‌కు రాజీనామా చేసినా, చేరినా అధికార కాంక్షతోనే కదా!. సుకాంత్‌ మజుందార్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌. కుదురు నుంచి వచ్చిన వారు కనక ఆయన ప్రవర్తన భిన్నంగా ఉండవచ్చు. జనంతో కలిసి పని చేసే లక్షణం ఉన్న వాడని కూడా అంటారు. ఏమైతేనేమి బెంగాల్‌ బీజేపీలో ప్రక్షాళన మొదలైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img