Friday, April 19, 2024
Friday, April 19, 2024

భాష పేర చిచ్చు

భాష మానవజాతి సంస్కృతికి ఆనవాలు. ఇతర సాంస్కృతిక అంశాలు ఒక జాతిని నిర్వచించడానికి ఎలా ఉపయోగపడతాయో భాష కూడా అలాగే ఉపకరిస్తుంది. భాషను, సంస్కృతిని అణగ దొక్కితే ఉద్యమాలు చెలరేగడమే కాదు దేశాలే విడిపోయిన ఉదం తాలు మన పొరుగుననే ఉన్నాయి. మన దేశం భిన్న సంస్కృతులకు నిలయం. కనీసం ఆరు వందల భాషలు మాట్లాడే వారున్న వైవిధ్యం మన సొంతం. భిన్న భాషలు మాట్లాడే వారిని ఏకం చేయడం కోసమే కాక దేశమంతా ఒకే భాషలో పరిపాలన సులువుగా సాగడంకోసం జాతీయ భాష ఉండాలన్న ఆలోచన కూడా స్వాతం త్రోద్యమ కాలంలోనే ఉంది. అయితే ప్రాంతీయ భాషలను ప్రోత్సహించా లన్న సదుద్దేశమూ జాతీయోద్యమ నాయకులకు ఉండేది. హిందీకి అధికార భాష ముద్ర వేయాలని గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. తమిళనాడులో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఉద్యమం రక్తసిక్తమైంది. 1949 సెప్టెంబర్‌ 14న రాజ్యాంగ నిర్ణాయక సభలో హిందీ అధికార భాషగా ఉండాలన్న ప్రతిపాదన వచ్చింది. దేశంలో హిందీని అధికార భాషగా చేయాలని రాజేంద్ర సిన్హా అవిశ్రాంత పోరాటం చేశారు. ఆయన జన్మదినం సెప్టెంబర్‌ 14. అందుకోసమే ఆ రోజును హిందీ దినోత్స వంగా జరుపుకుంటున్నాం. ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని హిందీని అందరి మీదా రుద్దడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మరోసారి ప్రయ త్నిస్తున్నారు. మన దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు సంఖ్యాపరంగా ఎక్కువే. నేపాల్‌, గయానా, ట్రినిడాడ్‌, టొబాగో, సురినాం, ఫిజీ, మారి షస్‌లో హిందీ మాట్లాడే వారు ఉన్నారు. అయితే హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించే వారు దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఉన్నారు. హిందీని రుద్దే ప్రయత్నం దేశ ఐక్యతను దెబ్బ తీస్తుంది. దక్షిణాది రాష్ట్రాలకు హిందీతో అంత సాన్నిహిత్యమూ లేదు. మమకారం అంతకన్నా లేదు. హిందీని అధికార భాషగా చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు తెలుగు ప్రాంతాలలో కూడా ప్రత్యేకంగా హిందీ నేర్చుకున్న వారు ఉన్నారు. ఇది ఉద్యోగావకాశాలకోసం అయి ఉంటుంది. అవసరం లేనిదే ఎవరూ ఏ భాషా నేర్చుకోరు. భాషల్లో సుసంపన్నమైనవి ఉండొచ్చు. అంతమాత్రం చేత ఫలానిది గొప్ప భాష అని చెప్పడానికి వీలు లేదు. హిందీ ప్రాంతీయ భాషలకు మిత్ర భాషే తప్ప శత్రు భాష కాదని టీకా టిప్పణీ చేయడానికి కూడా అమిత్‌ షా సాహసించారు. దేశ జనాభాలో 70 శాతం మంది హిందీ అర్థం చేసుకోగలరు. ఎక్కువ మంది ఆ భాష మాట్లాడడమూ నిజమే. ఎక్కువ రాష్ట్రాల్లో ఆ భాష మాట్లాడే వారు ఉన్నప్పుడు ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ హిందీ తెలిసినా, ఒక భాషగా అనేకానేక కారణాలవల్ల దాన్ని నేర్చుకుని, అధ్యయనం చేసే వారు ఉన్నా వారందరూ హిందీని అక్కున చేర్చుకుంటారన్న హామీ ఏమీ లేదు. అసలు హిందీ అన్న మాటే పర్షియన్‌ భాష నుంచి పుట్టింది. అమీర్‌ ఖుస్రో మొట్ట మొదట హిందీ కవిత్వం రాశారంటారు. 1977లో అప్పటి విదేశాంగ మంత్రి అటల్‌ బిహారీ వాజపేయి ఐక్యరాజ్య సమితి సార్వత్రిక సభలో హిందీలో మాట్లాడిన మాటా నిజమే. ఐక్యరాజ్య సమితిలోనే కాదు మన పార్లమెంటులోనూ వివిధ భాషల్లో మాట్లాడే వారు ఉన్నారు. మిగతా భాషలు మాట్లాడే వారు తమ భాష కాని భాషలో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవడానికి తక్షణం అనువదించే సదుపాయం పార్లమెంటులో ఉంది. హిందీ అత్యంత ప్రాచీనమైన భాష అని అమిత్‌ షా దబాయిస్తున్నారు. ప్రాచీన భాష అయితే విశ్వవిద్యాలయాల్లో దాన్ని ఆధునిక భాషల జాబితాలో ఎందుకు చేర్చినట్టు? తెలుగు కూడా ఆధునిక భాషల జాబితాలోనే ఉండేది. తెలుగు వారు పోరాడి ప్రాచీన భాష హోదా సాధించారు. దానివల్ల తెలుగు ఎంత అభివృద్ధి చెందిందో చెప్పడానికి కొలమానాలు ఏమీ లేవు.
1950 జనవరి 26న అమలులోకి వచ్చిన మన రాజ్యాంగం రాయ డానికి వినియోగించిన భాష ఇంగ్లీషు తప్ప హిందీ కాదు. రాజ్యాంగ అధి కారిక అనువాదం హిందీలో కూడా అందుబాటులో ఉంది. కానీ ఏ అంశం గురించి అయినా అనుమానం వచ్చినప్పుడు ఇంగ్లీషు ప్రతే ప్రామాణికం అన్నారు. ఇదంతా జరిగిన 14 ఏళ్లకు గానీ అమిత్‌ షా జన్మించలేదు. కానీ హిందీయే అధికార భాష అంటున్నారు. రాజ్యంగంలోని 343వ అధికరణం హిందీని అధికార భాషగా గుర్తించిన మాటా వాస్తవమే కావచ్చు. హిందీని అధికార భాషగా మార్చడానికి పెట్టుకున్న గడువు పూర్తి అయినప్పటికీ అది సాధ్యం కాలేదు. అందువల్ల అవసరమైనన్నాళ్లూ ఇంగ్లీషు వాడొచ్చునన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలు ప్రధానంగా ఇంగ్లీషులోనే సాగు తాయి. హిందీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ‘‘రోజుకో హిందీ మాట నేర్చుకుందాం’’ అని ఒక బోర్డు మీద ఒక హిందీ మాట రాస్తుంటారు. దీనివల్ల హిందీ ఎంతమంది ఏ మేరకు నేర్చుకున్నారో తెలియదు. హిందీవల్ల ప్రాంతీయ భాషలూ పరిపుష్ట మవుతాయని అమిత్‌ షా చెప్తున్నారు. ప్రతి భాష ఏదో ఒక భాషా కుటుం బానికి చెందింది అయి ఉంటుందనీ, ఇండో ఆర్యన్‌ భాషలకు, ఇండో యూరొపియన్‌ భాషలకు సకల విషయాల్లోను ద్రావిడ భాషకు పొత్తు కుదరదని అమిత్‌ షాకు తెలుస్తుందనుకోవడం పొరపాటే. మతపరమైన చీలికలే కాకుండా భాషా పరంగానూ జనాన్ని చీల్చాలన్న ప్రయత్నం అమిత్‌ షా మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక భాషను ప్రోత్సహించడానికి చేసే ప్రయత్నం ఆ భాష మీద ద్వేషం పెరిగేలా ఉండకూడదు. హిందీని అను సంధాన భాష అనడానికీ అధికార భాష అనడానికీ చాలా తేడా ఉంటుంది. అమిత్‌ షా అధికార భాష అంటున్నారు. ఏ భాష మాట్లాడే వారికి ఆ భాష సుందరమైందే. ఆ సౌందర్యాన్ని ఇతర భాషలు మాట్లాడే వారూ మెచ్చు కోవాలనడం కుదరదు. అది వారికి అనవసరం కూడా కావచ్చు. ఇండియాను హిందియాగా మార్చకండి అని తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్‌ అప్పుడే హెచ్చరించారు. తమిళులు, మల యాళీలు, కన్నడిగులు, తెలుగు వారి మీద హిందీని రుద్దాలని ప్రయత్నించడం తంపులు పెట్టడానికి మాత్రమే ఉపయోగ పడ్తుంది. హిందీతో సంబంధం లేని వారికి హిందీ కచ్చితంగా పరాయి భాషే. హిందీ కాకుండా ఇతర భాషలు మాట్లాడే వారిమీద హిందీ రుద్ది అవమానించే హక్కు అమిత్‌ షాకు లేదు. మోదీ, అమిత్‌ షా ద్వయం తమ స్వరాష్ట్రంలో గుజరాతీ మాట్లాడే వారి చేత హిందీ చేదు గుళిక మింగించ లేరుగా! భాషా దురహంకారం మత దురహంకారానికన్నా తక్కువేమీ కాదు. అయినా మోదీ, అమిత్‌ షా మాతృ భాష హిందీ కాదుగా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img