Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మండల, కమండల రాజకీయాల కలనేత

దేశ రాజకీయాలలో ఉత్తరప్రదేశ్‌ నిర్వహించే కీలక పాత్ర అందరికీ తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో ఏ పార్టీ విజయం సాధించగలిగితే కేంద్రంలో కూడా ఆ పార్టీకి అవకాశాలు మెరుగవుతాయన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. 23 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌ విశాలమైన రాష్ట్రమే కాదు అక్కడ 80 లోకసభ స్థానాలున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎవరికైనా ఈ రాష్ట్రం ప్రధానమైందే. మన ప్రధాన మంత్రులు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌ వారే కావడం చూస్తే ఆ రాష్ట్రం కేంద్ర రాజకీయాలలోనూ అత్యంత కీలక స్థానంలో ఉంటుంది. 2022 ఆరంభంలో ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉంది. ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్‌ పటిష్ఠంగానే కనిపిస్తున్నప్పటికీ ఆయన భయం ఆయనకు ఉంది. కరోనా మహమ్మారి వ్యాపించినప్పుడు యోగీ ప్రభుత్వ వ్యవహారం సవ్యంగా లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులే ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీతో కూడా యోగీ ఆదిత్యనాథ్‌కు ఎంతో కొంత దూరం పెరిగింది. దాన్నీ ప్రస్తుతానికి సర్దుబాటు చేయగలిగారు. మరో వేపు సమాజ్‌ వాది పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ మళ్లీ అధికారం సంపాదించడానికి సకల ప్రయత్నాలూ చేయడంలో తలమునకలై ఉన్నారు. మాయావతి ఇటీవల అంత క్రియాశీలంగా లేకపోవడంతో దళితులను సమీకరించడానికి అఖిలేశ్‌ కృషి చేస్తున్నారు. భీం ఆర్మీ నాయకుడు చంద్రశేఖర్‌ రావణ్‌ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చెప్పలేం. అయితే ఆయనను సమర్థిస్తున్న వారూ లేకపోలేదు. దళితులలో కొందరినైనా తన వేపు తిప్పుకునే సామర్థ్యం ఆయనకు ఉందన్న వాస్తవాన్ని నిరాకరించలేం. ఈ పరిణామాలన్నీ యోగీ ఆదిత్యనాథ్‌ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఒక దశలో ఎన్నికలకు ముందే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించవచ్చునన్న ఊహాగానాలూ వినిపించాయి. కానీ ఆ తరవాత ఏదో సర్దుబాటు జరిగినట్టు ఉంది. 2017 శాసనసభ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయం కన్నా యోగీ ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రి కావడమే ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది. ఉత్తరప్రదేశ్‌లో ఆదిత్యనాథ్‌ను గద్దె దించాలన్న ఆశ మిగతా పార్టీలన్నింటిలోనూ ఉన్నా ప్రతిపక్షాల మధ్య ఐక్యత పూజ్యం. అఖిలేశ్‌ యాదవ్‌ ఏయే పార్టీలను తన కూటమిలో చేర్చుకోగలరన్నది ఇప్పటికీ ఊహలకు పరిమితమైందే. వాస్తవం ఏమిటంటే ప్రతిపక్షాల అనైక్యత కారణంగా యోగీ ఆదిత్యనాథ్‌ సునాయసంగా విజయం సాధించగలరన్న భరోసా కూడా లేదు.
ఈ పరిస్థితిలో శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడం యోగీ ఆదిత్యనాథ్‌కు ఎంత ముఖ్యమో 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోదీకీ అంతే ప్రధానం. అందువల్ల కొత్త వ్యూహాల వేపు దృష్టి సారిస్తున్నారు. కమండల రాజకీయాలతో బీజేపీ కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాలలోనూ అధికారం చేజిక్కించుకోగలిగింది. ప్రస్తుతం అతి పెద్ద పార్టీగానే కాకుండా అతిసంపన్నపార్టీగా కూడా ఉంది. అయితే డబ్బు సంచులు గుమ్మరించినంత మాత్రాన విజయం చేకూరుతుందన్న ఆశలేదు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అన్న నినాదం దశాబ్దాల తరబడి బీజేపీకి ఓట్లు రాబట్టే మంత్రదండంగా పని చేసింది. సుప్రీంకోర్టు తీర్పు రామమందిర నిర్మాణానికి అనుకూలంగా ఉండడంతో బీజేపీ ప్రచారాస్త్రాలలో ప్రధానమైన రామమందిర నిర్మాణ నినాదం మునుపటంతగా పని చేస్తాయన్న నమ్మకం లేదు. అయితే మతతత్వ రాజకీయాలను బీజేపీ విడనాడుతుందని కాదు. దీనితో పాటు జన సమీకరణకు మరేదో కూడా అవసరం. మండల్‌ రాజకీయాలకు విరుగుడుగా కమండల రాజకీయాలను తెర మీదికి తెచ్చిన బీజేపీ ఇప్పుడు రెండిరటినీ కలగలిపి విజయం మూటగట్టుకోవాలని వ్యూహాలు రూపొందిస్తోంది. అంటే గతంలో మండల్‌ రాజకీయాలకు కమండల రాజకీయాలు చుక్కెదురుగా ఉండేవి. ఇప్పుడు రెండిరటినీ వినియోగించు కోవాలని యోగీ ఆదిత్యనాథ్‌ ప్రయత్నిస్తున్నారు. ఇతర వెనుకబడిన వర్గాల వారి మద్దతు సంపాదించడానికి అనువైన విధానాలు రూపొందిస్తున్నారు. అందుకే రామమందిర నిర్మాణ పనులను మోదీ స్వయంగా సమీక్షిస్తున్నారు. యోగీ ఆదిత్యనాథ్‌ తరచుగా అయోధ్య వెళ్లి నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. అయోధ్యలో అభివృద్ధి పనులమీద కూడా శ్రద్ధ పెడ్తున్నారు. కేవలం మందిర నిర్మాణమే ఓట్లు రాల్చదన్న భయం ఆదిత్యనాథ్‌ను పీడిస్తోంది. వెనుకబడిన తరగతుల వారి మద్దతు సంపాదించడం మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కులాల మద్దతే కాకుండా ఉపకులాల మద్దతు సమీకరించడంలో దిట్ట అయిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మార్గదర్శకత్వంలో వివిధ కులాల దన్ను కోసం నానా యాతన పడ్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణుల సంఖ్య కూడా ఎక్కువ కనక వారినీ విస్మరించకూడదన్న ఉద్దేశంతోనే కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాదకు బీజేపీ తీర్థం ఇచ్చారు. మరో బ్రాహ్మణ ఎంపీకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అప్నా దళ్‌కు చెందిన అనుప్రియా పటేల్‌తో అమిత్‌ షా మంతనాలు జరిపిన తరవాత ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 2017 ఎన్నికలలో కూర్మి, వెనుకబడిన తరగతుల వారి ఓట్లు సంపాదించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల తరవాత తనకు కేంద్ర మంత్రిపదవి, తన భర్తకు ఉత్తరప్రదేశ్‌లో మంత్రిపదవి రావాలని ఆమె ఆశించారు. కానీ బీజేపీ అప్పుడు పట్టించుకోలేదు. నిరాశకు గురైన అనుప్రియ కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీ నాయకులను సంప్రదించడంతో బీజేపీ మేల్కొని ఆమెను ఆదరించక తప్పలేదు. ఇటీవలి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆమె కేంద్ర మంత్రి అయ్యారు. శాసనసభ ఎన్నికలు జరగడానికి కొద్ది నెలల సమయమే ఉన్నప్పటికీ ఆదిత్యనాథ్‌ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. అందు లోనూ కుల సమీకరణలకు ప్రాధ్యాన్యం ఉంటుందని చెప్పనవసరం లేదు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారికి ప్రధాన వాటా దక్కడం బీజేపీ వ్యూహా రచనలో భాగమే. మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌ వెనుకబడిన తరగతుల ప్రతినిధి. అందుకే ఆయన ఆసుపత్రి పాలైన దగ్గర్నుంచి ఇటీవల మరణించే దాకా బీజేపీతో పాటు మోదీ కూడా ఆయన ఆరోగ్యాన్ని గురించి విపరీతమైన శ్రద్ధ కనబర్చారు. ఆయనవల్ల బీజేపీకి రెండు ప్రయోజనాలున్నాయి.
ఒకటి బాబరీ మసీదు విధ్వంసం జరిగినప్పుడు ఆయనే ముఖ్యమంత్రి. అందువల్ల రామ మందిర ఉద్యమంలో ఆయన పాత్రను గుర్తు చేయడంతో పాటు ఆయన ప్రాతినిధ్యం వహించే సామాజిక వర్గాన్నీ పట్టించు కుంటున్నామని నిరూపించడం బీజేపీకి ప్రధానాంశమైంది. బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా తరచుగా లక్నో వెళ్తున్నారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. సీనియర్‌ నాయకులు కూడా లక్నోలో మకాం పెడ్తున్నారు. బీజేపీ కార్యకర్తలకు శిక్షణా శిబిరాలు నిర్వహించి నూతనోత్తేజం కలిగిస్తున్నారు. అధికారం నిలబెట్టుకోవడానికి కమండలాన్నే కాకుండా మండల్‌ను వినియోగించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికలలో విజయం ముందు సిద్ధాంతాలు ఎప్పుడు దిగదుడుపేగా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img