Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మద్దతు ధరను చట్టబద్ధం చేయడానికి జంకెందుకు?

గత శుక్రవారం ప్రధానమంత్రి మోదీ వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించినా ఏడాదిగా దిల్లీ సరిహద్దుల్లో లక్షల సంఖ్యలో నిరంతరం ఉద్యమిస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని విరమించు కోవడానికి అంగీకరించడం లేదు. ప్రధానమంత్రి వివాదాస్పద చట్టాలను వెనక్కు తీసుకుంటామని చేసిన ప్రకటన ఇప్పటివరకు కేవలం హామీనే. పార్లమెంటు ఈ మూడు చట్టాలను రద్దు చేయడానికి మళ్లీ బిల్లులు ప్రతిపాదించి వాటిని పార్లమెంటు చేత ఆమోదింప చేయాలి. ఆ ప్రక్రియ పూర్తి కావడం అంత కష్టం కాకపోవచ్చు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం ఈ తంతు పూర్తి చేయవచ్చు. ఆ ప్రక్రియ పూర్తి అయినా ఉద్యమం నిలిపివేయడానికి రైతులు సుముఖంగా లేరు. వివాదాస్పద చట్టాలతో పాటు రైతులు మరో రెండు అంశాలను లేవనెత్తారు. ఒకటి ప్రభుత్వం ప్రకటిస్తున్న గిట్టుబాటు ధరకు చట్ట బద్ధత కల్పించడం. రెండు అననుకూలమైన విద్యుత్‌ బిల్లును సైతం ఉపసంహరించడం. ఈ రెండు అంశాల మీద మోదీ ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీనికి తోడు ఏడాదిగా జరుగుతున్న ఉద్యమ క్రమంలో వివిధ కారణాలవల్ల 700 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. ప్రధానమంత్రి మోదీ ఈ అంశాన్ని ఉదాహరణ ప్రాయంగానైనా ప్రస్తావించలేదు. 2021లో ఏడు దేశాలలో పర్యటించడానికి మోదీకి తీరిక చిక్కింది కానీ దిల్లీ పొలిమేరల్లోని రైతుల గోడు మాత్రం పట్టలేదు. నరేంద్ర మోదీ జాతిజనులను ఉద్దేశించి ప్రసంగించినన్ని సార్లు ఏ ప్రధానమంత్రీ ప్రసంగించి ఉండరు. ఆయన చెప్పదలచుకున్న ప్రధానమైన అంశాలను జాతినుద్దేశించి చేసే ప్రసంగాల ద్వారానే చెప్తారు. మీడియాను ఎదుర్కోవడానికి మోదీ గత ఏడున్నరేళ్ల కాలంలో ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు. తాను చెప్పే మాట అందరూ వినాలి కానీ తనను ఎవరూ ప్రశ్నించకూడదన్న విచిత్ర స్వభావం ఆయనది. అలాంటప్పుడు మృతుల కుటుంబాల వారిని పరామర్శించి వారిని ఆదుకుంటారని ఆశించలేం. మిగతా సందర్భాలలో సంతాపం తెలియ జేయడానికి ఏమాత్రం ఆలస్యం చేయని ప్రధానమంత్రి రైతుల మరణాలు చూసి చలించలేదు. ఇది ఆయన మంకుపట్టుకు నిదర్శనం. వారి ప్రాణ త్యాగం వృథా కాకూడన్నది రైతుల ఆలోచన. అందుకే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని పట్టుబడ్తున్నారు. ప్రధానమంత్రి సానుకూల ప్రకటన తరవాత కూడా ఆందోళన చేస్తున్న రైతులు లక్నోలో మహా పంచాయత్‌ కొనసాగించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజున 60 ట్రాక్టర్లు, వెయ్యిమంది రైతులు పార్లమెంటుకు చేరుకుంటారని రైతు ఉద్యమ నాయకుల్లో ప్రముఖుడు రాకేశ్‌ తికైత్‌ ప్రకటించారు. రద్దు బిల్లులు పార్లమెంటు ఆమోదించడం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు ఆయన మరో రెండు ముఖ్యమైన అంశాలు కూడా లేవనెత్తారు. లఖింపూర్‌ ఖేరీ సంఘటనకు బాధ్యుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రాను బర్తరఫ్‌ చేయాలని, ప్రాణ త్యాగం చేసిన 700 పైచిలికు రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలంటున్నారు. అజయ్‌ మిశ్రాను వెనకేసుకు రావడానికి కారణం ఆయన కదిలించడానికి వీలు లేనంతటి మహా నాయకుడని కాదు. ఆయనను తొలగిస్తే రైతుల వాదనను అంగీకరించినట్టు అవుతుందన్నది మోదీ భయం కావచ్చు. 2022కల్లా రైతుల ఆదాయం రెండిరతలు చేస్తానన్న మోదీ ప్రతిజ్ఞ చివరకు బూటకపు వాగ్దానంగా మిగలక తప్పదు. దేశంలో నిరుపేదలు 26 కోట్లు ఉన్నారు. వీరిలో వ్యవసాయం మీద ఆధారపడ్డవారు 80 శాతం ఉంటారు. దేశంలోని రైతుల్లో 83 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. వీరి సమస్యలు మోదీకి పట్టవు కానీ ఆ మాత్రం వెసులుబాటు కూడా ఈ నిరుపేదలకు లేకుండా చేయడానికి వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించాలన్నది మోదీ ఆలోచన.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు జంకుతుందో గమనించవలసిందే. చాలా సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం పంట చేతికొచ్చిన తరవాత నెలకో, రెండు నెలలకో కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. చిన్న, సన్నకారు రైతులు నెల, రెండు నెలలపాటు పంటను నిలవ చేయడం సాధ్యం కాదు. అందువల్ల మార్కెట్లో అయినకాడికి అమ్ముకోక తప్పదు. అప్పుడు మద్దతు ధర దక్కే అవకాశం ఉండదు. అందుకే మద్దతుధరకు చట్టబద్ధతఉండాలని రైతులు కోరు తున్నారు. మద్దతు ధరకు ధాన్యం కొనేది జాతీయ వ్యవసాయ సహకార సమాఖ్య (నాఫెడ్‌) లేదా భారత ఆహార సంస్థ ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు మాత్రమే. మన దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలు ఉంటే ఈ రెండు సంస్థల కొనుగోలు కేంద్రాలు కేవలం 7,700 మండీలు మాత్రమే ఉన్నాయి. అందువల్ల అన్ని వేళలా రైతుకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. అందుకే రైతులు దీనికి చట్టబద్ధత కల్పించాలంటున్నారు. ఇప్పటికే మద్దతు ధర ప్రకటించినంత మాత్రాన రైతులకు ప్రయోజనం కలుగుతుందన్న హామీ ఏమీ లేదు. ఎనిమిది శాతం ధాన్యాన్ని మాత్రమే రైతులు మద్దతు ధరకు అమ్ముకోగలుగుతున్నారు. ఎక్కువ మంది చిన్న రైతులు ఉండడమే దీనికి కారణం. వారు చిన్న రైతులే కావచ్చు కాని దిగుబడిలో వారి పాత్ర చిన్నదేం కాదు. మద్దతు ధరకు అమ్మడానికి రైతు రవాణా సదుపాయాలు తానే ఏర్పాటు చేసుకోవాలి. ఇది చిన్న రైతులకు సాధ్యం కాదు. పైగా 400 క్వింటాళ్ల ధాన్యం రవాణా చేయడానికి బక్క రైతు ఏర్పాట్లు చేసుకోలేడు. ఇ-మండీల గురించి ప్రభుత్వం అట్టహాసం చేస్తుంది కాని ఇవి కేవలం ఏడు శాతం రైతులకే ఉపయోగపడ్తున్నాయి. వీటి ద్వారా సేకరించే ధాన్యం పండిన పంటలలో రెండు శాతం మాత్రమే. మద్దతు ధర పెంచాలని, అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని రైతులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ప్రభుత్వం ఈ దిశగా కనీసం ఆలోచించడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనడం రేషన్‌ దుకాణాల ద్వారా ధాన్యం పేదలకు సరఫరా చేయడానికే కనక ఆ అవసరాన్ని మించి ధాన్యం కొనకపోవడం రైతులకు ఇబ్బందికరమే. కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత ఉంటే ఎంతో కొంత మేలు అన్నది రైతుల భావన. మోదీ నిజంగా రైతుల సంక్షేమమే కోరుకునేటట్టయితే మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు భూమి, సాగునీరు సమానంగా పంపిణీ చేయడానికి అనువైన విధానాలు రూపొందించాలి. నేల సారాన్ని పెంపొందించడానికి, సరైన విత్తనాలు అందించడానికీ పాటు పడాలి. మద్దతు ధరకు చట్టబద్ధత కోరడం గొంతెమ్మ కోరిక కాదని గ్రహించాలి. జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడానికే రూ. 4,00,000 కోట్లు ఖర్చవుతున్నాయి. ఇక మద్దతు ధరను చట్టబద్ధం చేస్తే ఆ భారం ఎవరు, ఎలా మోస్తారు అని గునిసే వారెవరూ అన్న దాతల సంక్షేమాన్ని కోరేవారు కారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img