Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మమత సర్కారుకు అవినీతి మకిలి

వ్యక్తిగతంగా కళంకం అంటనంత మాత్రాన రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు అవినీతిపరులు కారు అనుకోవడానికి వీలు లేదు. వ్యక్తిగతంగా నిప్పులాంటి మనుషులు ప్రధాన మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడూ వారు అవినీతిపరులు కాకపోయి నప్పటికీ ఆ ప్రభుత్వాల్లో అవినీతి లేదు అని చెప్పడం సాధ్యం కాదు. బెంగాల్‌ పరిశ్రమల శాఖ మంత్రి పార్థా చటర్జీని, ఆయనకు సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని అరెస్టు చేసిన తరవాత నిరాడంబరమైన జీవితం గడిపే బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా అవినీతికి అతీతం కాదని రుజువైంది. నిజానికి బెంగాల్‌ ప్రభుత్వం మీద ఇదివరకే శారదా చిట్‌ ఫండ్‌ కేసులో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ మంత్రి పార్థా చటర్జీ రూ. 120 కోట్ల కుంభకోణంలో చిక్కుకోవడం బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ సాగిస్తున్న రాజకీయ పోరాటానికి తీవ్ర విఘాతమే కల్పిస్తుంది. ప్రతిపక్షాల ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించిన తరుణంలోనే పార్థా చటర్జీ బండారం బయటపడడం చూస్తే వ్యక్తిగతంగా మమతా బెనర్జీ ఎంత నిప్పులాంటి మనిషి అయినా ఆ మకిలి ఆమెకు కూడా అంటకుండా ఉండదు. బెంగా ల్‌లో బలం పెంచుకోవడానికి ఏ అవకాశాన్ని వదిలిపెట్టని బీజేపీకి పెద్ద ఆయుధం అందించినట్టైంది. పార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను నియమించడానికి, బదిలీలు చేయడానికి దండిగా లంచాలు పట్టాడన్న ఆరోపణ మమతా బెనర్జీ వ్యక్తిగత ప్రతిష్ఠను కూడా కచ్చితంగా దెబ్బ తీస్తుంది. ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు కాకుండా డబ్బు ముట్ట చెప్పిన వారిని నియమించారన్న ఆరోపణ విస్మరించదగిందేమీ కాదు. ఈ వ్యవహారం 2012 నుంచి కొనసాగుతోం దంటున్నారు. అంటే దాదాపు 50,000 మంది ఉపాధ్యాయులను లంచాలు పట్టి నియమించి ఉంటారని ఒక అంచనా. ప్రతిభ గల వారికి అన్యాయం జరగడం ఖండిరచదగిందే కానీ ఈ వ్యవహారం మొత్తం తృణమూల్‌ ప్రభుత్వాన్నే భ్రష్టు పట్టించింది. ఈ కుంభకోణానికి బలైన వారు అయిదు వందల రోజులుగా ఆందోళన చేస్తున్నా మమత ప్రభుత్వం పట్టించుకోక పోవడం అనేక ప్రతికూల ప్రభావాలకు దారి తీయక తప్పదు. అర్హులైన అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టికి తీసుకు రావడానికి 600 ఉత్తరాలు రాసినా ప్రభుత్వం స్పందించకపోవడం క్షమార్హం కాదు. ఒక్కొక్క ఉపాధ్యాయ నియా మకానికి ఏడు నుంచి పది లక్షల రూపాయల లంచం తీసుకున్నారట. అంత డబ్బిచ్చి ఉద్యోగం సంపాదించిన ఉపాధ్యాయులు ఏం చేస్తే తాము ముట్ట జెప్పిన డబ్బు వెనక్కు వస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో అవినీతికి పెద్ద అవకాశమేమీ ఉండదు. ఉన్నా ఉపాధ్యాయులందరికీ ఆ వెసులుబాటు కష్టం. అప్పుడు ఆ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పార్థా చటర్జీ మీద వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలితే విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టి పోతూ ఉంటే మమత ప్రభుత్వం చూసీచూడనట్టు ఉండడం చాలా దారుణం. కోల్‌కతా హైకోర్టుకు అందిన ఫిర్యాదులను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ దర్యాప్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఇలాంటి వ్యవస్థలను రాజకీయ ప్రత్యర్థుల మీద మోదీ ప్రభుత్వం వినియోగించుకుంటోందని చేసే ఆరోపణలకు ఇక ముందు విలువ ఏమైనా ఉంటుందా! ప్రతిపక్షాలు మాత్రం తక్కువ తిన్నాయా అన్న దెప్పిపొడుపులు తప్పవు.
శారద చిట్‌ ఫండ్‌, నారద కుంభకోణాలు ఎదురైనప్పుడు మమతా బెనర్జీ ఈ వ్యవహారాలు తన దృష్టికి రాలేదని వాదించారు. కానీ ఉపాధ్యాయుల నియామకం వ్యవహారంలో ఆమెకు ఆ అవకాశం కూడా లేదు. మచ్చ పడ్డ తృణమూల్‌కు వ్యతిరేకంగా బీజేపీ, సీపీఐఎం ఆందోళన చేస్తున్నాయి. మమత ప్రభుత్వానికి తక్షణం వచ్చిన ప్రమాదం ఏమీ లేకపోయినా కళంకం మాత్రం అంత సులభంగా వదలదు. అయితే గుడ్డిలో మెల్లగా పార్థా చటర్జీని మంత్రివర్గం నుంచే కాక పార్టీ పదవుల నుంచి కూడా తొలగించి మమతా బెనర్జీ నష్టాన్ని పూడ్చడానికి చేసిన ప్రయత్నం ఎంతో కొంత ఉపకరించవచ్చు. ప్రతిపక్షాల నిరసన ప్రదర్శనలను పోలీసులు అనుమతించకపోవడం కూడా మమతా బెనర్జీకి వన్నె తెచ్చే చర్యలేమీ కావు. పార్థా చటర్జీకి సన్నిహితు రాలంటున్న అర్పిత ముఖర్జీ ఇళ్లల్లో కోట్లాది రూపాయల నగదు, కిలోల కొద్ది బంగారం దొరకడం మమత కళ్లముందే ఎంతటి ఘోరాలు జరుగుతున్నాయో చూస్తే దిగ్భ్రాంతి కలుగుతోంది. పార్థా చటర్జీ నిర్వాకం 2023లో జరిగే పంచాయతీ ఎన్నికలు, ఆ తరవాత జరిగే పార్లమెంటు ఎన్నికల్లో తృణమూల్‌ అవకాశాలను దెబ్బ తీయక మానదు. అంటే బీజేపీ బలం పుంజుకోవడానికి అవకాశం ఇచ్చినట్టయింది. తృణమూల్‌ ప్రభుత్వం అవినీతికి అతీతమైంది కాదు అని తేలిపోవడంతో 38 మంది తృణమూల్‌ శాసన సభ్యులు తమను సంప్రదిస్తున్నారని బీజేపీ చెప్పుకుంటోంది. బీజేపీకి అనుకూలమైన సినిమా నటుడు మిథున్‌ చక్రవర్తి 21 మంది తృణమూల్‌ శాసన సభ్యులు తనను సంప్రదిస్తున్నారని అంటున్నారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకుని ఆ ప్రభుత్వాలను పడగొట్టే కౌశలం బీజేపీకి దండిగా ఉంది కనక ఈ మాటలు అసత్యమని చెప్పలేం. శాసనసభ్యులు అంగడి సరుకు అయిపోయిన తరవాత ఏదైనా సాధ్యమే. అందుకు కావలసిన నిధులు బీజేపీ దండిగా సమకూర్చగలదు కనక ఆశ్చర్య పడవలసింది ఏమీ లేదు. మహారాష్ట్రలో శివసేనను చీల్చినట్టే బెంగాల్‌లో తృణమూల్‌ను కూడా చీలుస్తారన్న గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇవి అంత బాహాటంగా లేఫు. తృణమూల్‌ రెండు వర్గాలుగా విడిపోయి ఉందన్నది మాత్రం బహిరంగ రహస్యమే. పార్థా చటర్జీ మీద చర్య తీసుకోవడం ద్వారా అవినీతిని సహించబోమని రుజువు చేయడం మమతా బెనర్జీ లక్ష్యం అయి ఉండవచ్చు. కానీ పార్ఠా చటర్జీ నిర్వహిస్తున్న సకల శాఖలను మమత దగ్గరి బంధువు అభిషేక్‌ బెనర్జీకి అప్పగించడం చూస్తే బంధు ప్రీతిని కూడా దూరంగా ఉంచుకో వాలన్న ఆలోచన మమతకు లేనట్టే ఉంది. అవినీతి కేవలం లంచాలు పట్టడానికి పరిమితమైన వ్యవహారం కాదు. సారథ్యం వహించే వారు అవినీతిపరులు కాకపోవచ్చు. కాని వాళ్ల కళ్లెదుటే జరుగు తున్న అవినీతిని సహించడం కూడా పరోక్షంగా అవినీతిని ప్రోత్సహించి నట్టే. మన్మోహన్‌ సింగ్‌ అవినీతిపరుడు అంటే ఆయన శత్రువులు కూడా నమ్మరు. కానీ రెండోసారి ఆయన నాయకత్వంలో యు.పి.ఎ. అధికారంలోకి వచ్చిన తరవాత వచ్చినన్ని అవినీతి ఆరోపణలు మొత్తం ప్రభుత్వానికే మచ్చ తెచ్చాయి. స్వయంగా అవినీతికి పాల్పడకపోవడం మాత్రమే సమర్థ నాయకత్వానికి చిహ్నం కాదు. తులసివనంలో గంజాయి మొక్కలను తొలగించగల నాయకులే తాము అవినీతిపరులం కాదని గుండెమీద చేయి వేసుకుని చెప్పడం సాధ్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img